క్రైమ్ కథ

ఇంటి దొంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్లింగర్ లేండ్ ఆఫీస్‌లోని మా సిబ్బంది అందరికీ మా కొత్త బ్రాంచ్ మేనేజర్ని పరిచయం చేశాడు. ఆయన పేరు ఎడ్గర్ విల్సన్. ఐతే విల్సన్‌కి ఆపరేషన్స్ విభాగంలో తప్ప ఫైనాన్స్ విభాగంలో అనుభవం లేదు. గత ఇరవై ఏళ్లుగా నేను ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్నాను.
స్లింగర్ లేండ్ నన్ను మాత్రమే విల్సన్‌కి పేరు చెప్పి పరిచయం చేశాడు.
‘ఇతనికి ఫైనాన్స్ శాఖలో ఇరవై ఏళ్ల అనుభవం ఉంది. ఈ బ్రాంచ్‌లో నెంబర్ టు మేన్. ఇతని పేరు ఆరెన్’
విల్సన్ నన్ను పరిశీలనగా చూశాడు.
‘లెవిస్ రిటైరయ్యాక మిమ్మల్ని పోస్ట్ చేసేదాకా ఈ ఆరు నెలలు ఆరెనే ఈ బ్రాంచ్ వ్యవహారాలు చూస్తున్నాడు’ స్లింగర్ లేండ్ చెప్పాడు.
‘ఆరెన్! నీతో నేను మళ్లీ మాట్లాడతాను’ విల్సన్ చిన్నగా నవ్వి చెప్పాడు.
అనేక కళ్లు నా వంకే చూడటం నేను గమనించక పోలేదు.
‘ఆరెన్! నిన్ను బ్రాంచ్ మేనేజర్‌గా రికమెండ్ చేశాను. అయితే వృద్ధులు కాక యువకుడైతే మంచిదని హెడ్డ్ఫాస్ విల్సన్‌ని పంపింది’ స్లింగర్ లేండ్ తర్వాత నాతో రహస్యంగా చెప్పాడు.
వెంటనే నాకు శాలీ గుర్తొచ్చింది. కంప్యూటర్ ఆపరేటర్స్ ఇద్దరిలో తక్కువ వయసు గల శాలీ స్కర్ట్ పొడవు ఎక్కువ ఉంటే బావుంటుందని ఓసారి సలహా ఇచ్చాను. ఆఫీస్ ఫోన్‌ని వ్యక్తిగత విషయాలకి ఉపయోగించకూడదని కూడా కోప్పడ్డాను. బహుశా ఇలాంటివి ఈ తరం వాళ్లు పట్టించుకోరేమో!
విల్సన్ ఛార్జ్ తీసుకున్న మూడో వారం శాలీని తన పర్సనల్ సెక్రటరీగా తీసుకుని జీతం ఎక్కువ చేశాడు. ఆమెకన్నా అనుభవస్థులు ఉన్నారని నేను విల్సన్‌తో చెప్తే అతను కొట్టి పారేశాడు.
మర్నాడు నా టేబుల్ దగ్గర ఆగి అడిగాడు.
‘ఆరెన్! నువ్వు ఎందుకు పేమెంట్ ఓచర్లని నీ అంతట నువ్వే పాస్ చేస్తున్నావు? బ్రాంచ్ మేనేజర్‌గా అది నా బాధ్యత కదా?’
‘సాంకేతికంగా చూస్తే అవును. కానీ పాత బ్రాంచ్ మేనేజర్ ఈ పనిని నాకే అప్పగించాడు. మీరు కూడా అలాగే చేస్తారని భావించాను’ చెప్పాను.
‘గత వారం ఎన్ని ఓచర్స్‌ని పాస్ చేసావు?’ ప్రశ్నించాడు.
‘ఇరవై లేదా ముప్పై ఉండచ్చు. సరిగ్గా గుర్తు లేదు’
‘సరే. ఇక నించి ఆఫీస్‌లో నియమాల ప్రకారం పని చేద్దాం. ఇక నించి శాలీ వాటిని ప్రతీ శుక్రవారం నాకు పంపుతుంది. నేను వాటిని పాస్ చేసాకే చెల్లింపులు జరగాలి’ విల్సన్ అధికారయుతంగా చెప్పాడు.
‘అలా ఐతే చెల్లింపులు ఆలస్యం అవుతాయి’
‘కావచ్చు. కానీ అందువల్ల బ్రాంచ్‌లో ఏం జరుగుతోందో నాకు అర్థవౌతుంది’
‘మీరు ఎలా అంటే అలాగే’
శాలీకి ఆ ఏర్పాటు గురించి సూచనలు ఇచ్చాను. సోమవారం ఉదయం విల్సన్ నన్ను తన గదిలోకి పిలిచాడు. పేమెంట్ ఓచర్స్ అన్నీ ఆయన బల్ల మీద పరిచి కనపడ్డాయి.
‘ఆరెన్! ఈ ఓచర్స్ అన్నీ ‘అనేబుల్ టు ప్రాసెస్’ అనే రబ్బర్ స్టాంప్‌తో ఎందుకు ఉన్నాయి?’ అడిగాడు.
ఆ అవసరం లేకపోయినా నేను వాటిని అందుకుని పరిశీలించి జవాబు చెప్పాను.
‘వీటిని తయారుచేసిన అసిస్టెంట్ అకౌంటెంట్ ఖర్చుకి చెందిన సరైన అకౌంట్ నెంబర్ రాయకపోవడం వల్ల. తరచూ ఆమె నంబర్లని మర్చిపోతూంటుంది’
‘అలాంటప్పుడు ఓచర్స్ నా దగ్గరికి రాబోయే ముందు అకౌంట్ నంబర్లు రాయాలని ఆమెకి నువ్వు ఎందుకు గుర్తు చేయలేదు? వాటిని నా దగ్గరికి పంపబోయే ముందు అకౌంట్ నెంబర్లని ఎందుకు చెక్ చేయలేదు?’ విల్సన్ ప్రశ్నించాడు.

‘ఈ ఓచర్లని మీరే పాస్ చేస్తానన్నారు కాబట్టి అవి మీకు సరాసరి అందాయి’
‘ఆరెన్! ఓచర్స్ మీద అకౌంట్ నెంబర్లు తప్పనిసరిగా ఉండాలన్న సంగతి నీకు తెలుసు కానీ నాకు తెలీదు. నా పనిని నువ్వు తేలిక చేయాలి కానీ ఇలా అడ్డుపుల్లలు వేయకూడదు. చాలా విషయాల్లో నువ్వు ఇలాగే ప్రవర్తిస్తున్నావని గమనించాను’ విల్సన్ కోపంగా చెప్పాడు.
‘అది నిజం కాదు’ అభ్యంతరం చెప్పాను.
‘సారీ. కానీ అది నిజం అని నమ్మడానికి తగిన కారణాలు నాకు ఉన్నాయి’
‘ఐతే మీ మనసుని మార్చే మాటలు చెప్పి కూడా ప్రయోజనం లేదు. పని విషయంలో కష్టం ఒక్క మీకే కాదు. గత ఆరు నెలలుగా బ్రాంచ్ అకౌంటెంట్, బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగాలని నేనే చేస్తున్నాను. బదులుగా నాకేమీ రాలేదు. బోనస్ కానీ, శాలరీ ఇంక్రిమెంట్ కానీ ఇవ్వలేదు’
‘అది నిర్ణయించాల్సింది హెడ్డ్ఫాస్ వాళ్లు’
‘కానీ వాళ్లకి ఆ విషయం ఎవరైనా గుర్తు చేయాలి’
నిజానికి నేను బ్రాంచ్ మేనేజర్ పోస్ట్‌కి ఆశపడి కష్టపడ్డాను.
‘కానీ నీకో విషయం తెలీదు. ఆరు నెలలు ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ని పోస్ట్ చేయకపోవడానికి కారణం, నీకు ఓ అవకాశం ఇవ్వడానికే. కానీ నువ్వు పని విషయంలో ఫెయిలయ్యావు. కాబట్టి నేను రికమెండ్ చేసినా బోనస్ ఇస్తారనుకోను. రికమెండ్ కూడా చేయను. నిజానికి నేను రికమెండ్ చేసేది నువ్వు త్వరగా రిటైరైతే మంచిదని. దాని గురించి నువ్వు ఆలోచిస్తే మంచిది’
‘ఎస్ సర్’ సమాధానం చెప్పాను.
* * *
నా సమర్థతని పరీక్షించడానికే బ్రాంచ్ మేనేజర్‌ని పంపలేదు అన్న మాట నేను నమ్మలేదు. కంపెనీ నించి నాకు రావాల్సింది అడ్డుకునే వాదన అది అని నాకు అనిపించింది. శాలీ కొన్ని ఓచర్స్ తెచ్చి నాకిచ్చి చెప్పింది.
‘మిస్టర్ విల్సన్ వీటి మీద అకౌంట్ నెంబర్లు వేయమన్నారు. తర్వాత వాటిని నాకు ఇవ్వండి. ఇక నించి ఓచర్ల మీద అకౌంట్ నెంబర్ల విషయంలో మీదే బాధ్యత అని కూడా చెప్పమన్నారు’
‘సరే శాలీ’ చిన్నగా నిట్టూర్చి చెప్పాను.
నేను కొన్ని ఓచర్స్ మీద అకౌంట్ నెంబర్లని వేశాక, నా దృష్టి పాస్డ్ అన్న లైన్ కిందున్న విల్సన్ ఇనీషియల్స్ మీద పడింది. కొన్ని వేల సార్లు ఇఎన్‌డబ్ల్యు అనే ఇనీషియల్‌ని పెట్టడంవల్ల ఆ అక్షరాలు గుర్తించలేనంతగా ఉందా సంతకం. అతను మా బ్రాంచ్‌కి వచ్చాక అనేక వందల సార్లు ఆ సంతకా న్ని చూశాను. ఐతే నాకు ఇంతదాకా దాన్ని తేలిగ్గా కాపీ చేయచ్చు అన్న ఆలోచన కలగలేదు.
ఓచర్లని పక్కకి తోసి ఓ కాగితం తీసి ప్రయత్నించసాగాను. కొద్ది నిమిషాల్లో దాదాపుగా విల్సన్ లాగా సంతకం చేయగలిగాను. ఆ కాగితాలని మడిచి చెత్త బుట్టలో పడేశాను. నా మనసులో రూపుదిద్దుకున్న పథకం వల్ల నేను బాకీలన్నీ తీర్చచ్చని భావించాను.
నేను అందుకు సిద్ధమైనప్పుడే!
ఓచర్స్ పనిని పూర్తి చేసి, వాటిని తీసుకెళ్లి శాలీకి ఇచ్చాను. ఆమె వాటిని చూడకుండానే కవర్‌లో పెట్టి అతికించి పైన ఆ ఓచర్లు ఏ వారానికి చెందినవో రాసింది.
‘ఇక నించి ఓచర్స్ నీ దగ్గరికి రాగానే నాకు పంపు. అకౌంట్ నెంబర్లు ఉన్నాయో లేదో తనిఖీ చేశాక నీకు పంపుతాను. మిస్టర్ విల్సన్ వాటిని పాస్ చేశాక మళ్లీ నాకు పంపు’ కోరాను.
‘ఆయన పాస్ చేశాక కూడానా?’ ఆమె నా వంక ఆసక్తిగా చూస్తూ అడిగింది.
నేను తల ఊపాను. నేను సమాధానం చెప్పడం కష్టమైన ఆ ప్రశ్నని ఊహించాను.
‘ఓచర్స్ విషయంలో బ్రాంచ్ అకౌంటెంట్‌గా బాధ్యత నాది. వాటిని మరోసారి చెక్ చేయాలి’
శాలీ నా వంక చూసిన చూపులో కొద్దిగా అనుమానం కనిపించింది.
‘సరే’ అంగీకరించింది.
ఓచర్స్‌ని నా పేరుతో రాయడం, చెక్స్ రావడానికి మా ఇంటి అడ్రస్ రాయడం ప్రమాదకరం. అందుకని ఆ సోమవారం లంచ్ ఎగ్గొట్టి ‘అక్మే జనరల్ సప్లై కంపెనీ’ అనే దొంగ కంపెనీని స్థాపించే పనిలో పడ్డాను. ఆ కంపెనీ పేరు మీద పోస్ట్ఫాస్ బాక్స్‌ని, బేంక్ అకౌంట్‌ని తెరిచాను. బేంక్ బ్రాంచ్ సిబ్బందికి నేను వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి నన్ను వ్యక్తిగతంగా ప్రశ్నించకుండా ఆ అకౌంట్ తెరిచారు. ఇక చెక్‌ని డిపాజిట్ చేసి, అది క్రెడిట్ అయ్యాక ఆ డబ్బుని డ్రా చేయడమే.
సిబ్బంది వారి కార్డ్ ఫైల్‌లోని నా నమూనా సంతకాన్ని, చెక్ మీద సంతకంతో వెరిఫై చేస్తారు అంతే. ఆ రోజు ఇంటికి వెళ్లేప్పుడు కొన్ని కంపెనీ ఖాళీ ఓచర్ ఫారాలని న్యూస్ పేపర్లో చుట్టి తీసుకెళ్లాను.
ఆ రాత్రి మరి కొంతసేపు విల్సన్ సంతకాన్ని ప్రాక్టీస్ చేశాక మా ఇంట్లోని పాత పోర్టబుల్ టైప్‌రైటర్ని ఉపయోగించి ఓ ఓచర్ ఫారం మీద 197.50 డాలర్లకి ఓచర్ని టైప్ చేశాను. అది ఎవరికీ అనుమానం రానంత చిన్న మొత్తం. కొద్ది క్షణాలు సందేహించాక అప్రూవ్డ్ లైన్ మీద విల్సన్ సంతకాన్ని చేశాను. విల్సన్ సంతకాన్ని పక్కన పెట్టుకుని పరిశీలించాక ఎవరూ తేడాని గుర్తించరనే నమ్మకం కలిగింది.
* * *
తర్వాతి శుక్రవారం విల్సన్ పాస్ చేసిన ఓచర్స్‌ని తెచ్చి శాలీ నా బల్ల మీద ఉంచింది. ఆమె నాతో మాట్లాడకపోయినా, ఆమె తీరు చూస్తే నన్ను ఛాందస ఉద్యోగిగా భావిస్తోందని అనిపించింది. వాటిని పరిశీలిస్తున్నట్లు నటిస్తూ వాటి మధ్యలో దొంగ ఓచర్ని ఉంచి శాలీకి ఇచ్చి చెప్పాను.
‘అంతా సవ్యంగా ఉంది’
‘సరే’ చెప్పి శాలీ వాటిని నిర్లక్ష్యంగా బల్ల మీద పడేసింది. తర్వాత వాటిని సీల్ చేసిన కవర్లో తెచ్చిచ్చింది.
తర్వాతి వారం పోస్ట్ బాక్స్‌కి మా ఆఫీస్ నించి అక్మే జనరల్ సప్లైస్ పేర 197.50 డాలర్లకి చెక్ వచ్చింది. దాన్ని డిపాజిట్ చేసి ఆ డబ్బు డ్రా చేసుకున్నాను.
నా పథకం ఇలాంటి చెక్కులు అప్పులు తీరే దాకానే పొందాలని. కానీ ఈ పథకం సక్రమంగా సాగుతూండటంతో నేను దీన్ని కొనసాగించడం మూర్ఖత్వమే.
* * *
కొన్ని వారాల తర్వాత విల్సన్ నన్ను తన ఆఫీస్ గదిలోకి పిలిచి కొన్ని ఓచర్స్‌ని చూపించి అడిగాడు.
‘ఆరెన్! ఇలాంటి పని చేయడానికి నీకు దెయ్యం పట్టిందా? శాలీ నీ దగ్గరికి పంపించే వాటికన్నా ఎక్కువ ఓచర్స్ వస్తున్నాయని గమనించకపోయి ఉంటే ఆడిటర్స్ దీన్ని పట్టుకునేవారు కదా? నీ అనుభవం నేపథ్యంలో అకస్మాత్తుగా మన బ్రాంచ్ ఖర్చులు పెరగడాన్ని ఆడిటర్స్ గమనిస్తారని నువ్వు ఊహించలేదా?’
నిర్ఘాంతపోయిన నేను జవాబు చెప్పలేకపోయాను.
‘ఇనే్నళ్లుగా నువ్వు కంపెనీకి చేసిన సేవ దృష్ట్యా నువ్వు దొంగిలించిన డబ్బు వెనక్కి ఇవ్వడానికి వారం రోజులు గడువు ఇస్తున్నాను. అలా చేస్తే హెడ్డ్ఫాస్ వారు నీ మీద కేసు పెట్టకుండా చూస్తాను’

‘్థంక్ యూ’ ఎర్రబడ్డ మొహంతో లేచి నిలబడ్డాను.
‘ఇంక నువ్వు ఆఫీస్‌లో ఉండే ప్రశే్న లేదు. నువ్వు సెలవులో ఉన్నావని సిబ్బందికి చెప్తాను. శాలీకి నీ డ్రాయర్ తాళం చెవులు ఇచ్చి వెళ్లు’ కఠినంగా చెప్పాడు.
‘మీరు నమ్మకపోయినా నిజం బాస్‌కి చెప్పక తప్పని పరిస్థితి’ శాలీ చెప్పింది.
‘నిజమే. నీకు వేరే ఛాయిస్ లేదు’
కానీ ఆమె ఓచర్లు లెక్కపెట్టేంత తెలివి గలది అని నేను అనుకోలేదు.
‘నాకు వారం గడువుంది. ఈలోగా ఏదైనా చేయచ్చు’ అని అనుకున్నాను.
* * *
వారంలో అంత డబ్బుని నేను సంపాదించలేక పోయాను. గడువు రాత్రి విల్సన్ ఇంటికి వెళ్లి డోర్ బజర్‌ని నొక్కాను. తలుపు తెరుచుకున్నా కూడా డోర్ బెల్ పాట వినిపిస్తూనే ఉంది.
‘ఎందుకొచ్చావు?’ విల్సన్ కఠినంగా చూస్తూ ప్రశ్నించాడు.
‘మీతో మాట్లాడాలి. కానీ ఆఫీస్‌లో కుదరదని ఇక్కడికి వచ్చాను’
అతను సందేహిస్తే, నా మొహం మీదే తలుపు మూస్తాడని అనిపించింది.
‘సరే’ పక్కకి తప్పుకున్నాడు.
ఇంట్లో ఫైర్ ప్లేస్‌లో మంట మండుతూండటంతో వెచ్చగా ఉంది.
‘సారీ నా భార్య తన చెల్లెలి ఇంటికి వెళ్లింది. నీకు ఆతిథ్యం ఇవ్వలేను. ఎందుకు వచ్చావో చెప్పు’ అడిగాడు.
టీపాయ్ మీద రెండు గ్లాసుల్లో మద్యం నాకు కనిపించింది. ఒక దాని అంచు మీద లిప్‌స్టిక్ మరకలు కనిపించాయి. అతని ఇంట్లో ఓ యువతి ఉందని, ఆమె అతని భార్య కాదని గ్రహించాను.
‘నాకు పనుంది. ఏం మాట్లాడాలి?’ అసహనంగా అడిగాడు.
‘డబ్బు సంపాదించడానికి నాకు ఇంకో వారం గడువు కావాలి’
‘కుదరదు. ఇప్పుడు సంపాదించలేనిది, ఇంకో వారంలో ఏం సంపాదించగలవు?’
‘నాకు కొంత ఆస్తి ఉంది. దాన్ని కొనదల్చిన వ్యక్తి వచ్చే వారం కానీ డబ్బు ఇవ్వలేనన్నాడు’ అబద్ధమాడాను.
విల్సన్ ఇంట్లోని యువతి ఎవరో తెలుసుకుంటే బ్లాక్‌మెయిల్ చేయచ్చని, దాంతో అతను వెనక్కి తగ్గుతాడని అనుకున్నాను.
‘ఆస్తి అమ్మితే ఎంత వస్తుంది?’
‘ఆరు వేల డాలర్లు. దొంగ ఓచర్ల డబ్బుని ఇవ్వగా ఇంకా కొంత మిగులుతుంది’
‘ఆరు వేల డాలర్లు నువ్వు దొంగిలించిన డబ్బుతో పదో వంతు కూడా కాదు’
‘అది నిజం కాదు. అక్మే ఓచర్స్‌ని కూడితే మూడు వేల డాలర్ల చిల్లర మాత్రమే’ నేను నిరసనగా చెప్పాను.
‘కూడాను. నువ్వు చెప్పింది కరెక్టే. కానీ కాల్వర్ట్ అసోసియేట్స్, జెఫర్సన్ లీడ్స్, ఇంకా నువ్వు స్థాపించిన దొంగ కంపెనీల ఓచర్లన్నీ కూడితే మొత్తం డెబ్బై ఐదు వేల డాలర్ల పైనే వస్తుంది’
‘లేదు. ఆ మిగతా కంపెనీల గురించి నాకు తెలీదు’ చెప్పాను.
‘ఆరెన్! నీ మాటని ఎవరైనా నమ్ముతారంటావా?’ విల్సన్ ప్రశ్నించాడు.
‘నమ్మరు. నమ్మరని మీకూ తెలుసు. మై గాడ్! ఇప్పుడు అర్థమైంది. నేను దొంగిలించింది మూడు వేలు మాత్రమే. ఆ మిగిలింది మీరు దొంగిలించి నా మీద ఆ నిందని వేస్తున్నారు. వారం గడువు ఇవ్వడానికి కారణం నేను పారిపోతానని. ఆ తర్వాత మీరు ఏ కథ చెప్పినా నమ్ముతారు. కానీ మీ పథకం ఫలించదు. నేను అందరికీ నిజం చెప్తాను’
‘చాలింక. నా మీద నింద వేసి నువ్వు ఏం సాధిస్తావో నాకు అర్థం కావడంలేదు. ఓ లాయర్‌ని కుదుర్చుకోమని నీకు నా సలహా’
తర్వాత విల్సన్ సిగార్‌ని అంటించుకుని అగ్గిపుల్లని ఫైర్ ప్లేస్‌లోని నిప్పులోకి విసరేసి చెప్పాడు.
‘నీ గతీ ఆ అగ్గిపుల్ల లాంటిదే’
నాలో కోపం తన్నుకు వచ్చింది. టీపాయ్ మీది బరువైన గ్లాస్ ఏష్‌ట్రేని అందుకుని అతని తల మీద బాదాను. అతను నేల మీదకి ఒరిగిపోయి కదల్లేదు. నేను చేసిన పనికి నిర్ఘాంతపోయాను. తర్వాత వంగి అతని గుండె కొట్టుకుంటోందా లేదా అని పరీక్షించాను. కొట్టుకోవడం లేదు. నేను అతన్ని చంపానని తెలియగానే అక్కడి నించి పారిపోయాను.
నా అపార్ట్‌మెంట్‌కి చేరుకున్నాక గానీ నా బుర్ర పని చేయడం ఆరంభించలేదు. విల్సన్ ఇంట్లో ఇంకా ఆ యువతి ఉండి ఉంటే బహుశా నన్ను చూసే ఉంటుంది. నా సంభాషణని బట్టి నేనెవరో గ్రహించి పోలీసులకి ఫిర్యాదు చేసి ఉండచ్చు. నేను మందుల డబ్బా తెరిచి స్లీపింగ్ పిల్స్ సీసా మూత తెరిచి రెండు నోట్లో వేసుకుని మంచినీళ్లు తాగి పడుకున్నాను.
* * *
మర్నాడు ఉదయం ఫోన్ మోగడంతో నాకు మెలకువ వచ్చింది. పోలీసుల నించి అనుకున్నా కాని స్లింగర్ లేండ్ నించి.
‘ఆరెన్! ఓ ఘోరం జరిగింది. నువ్వు వెంటనే ఆఫీస్‌కి రా. నీ సెలవు రద్దయింది. విల్సన్ మరణించాడు. అది ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తూ జరిగిన మరణమా అని పోలీసులు నిర్ణయించలేకపోయారు. అతని హాల్లోకి ఎందుకనో గేస్ ప్రవేశించింది. అతను అగ్గిపుల్ల వెలిగించి ఉంటాడు. పెద్ద పేలుడు సంభవించింది. ఏం జరిగిందో బహుశా ఎప్పటికీ తెలుసుకోలేం’
‘అయ్యో!’ చెప్పాను.
‘ఇది నీకు త్వరలో తెలుస్తుంది ఆరెన్. కాబట్టి ఇప్పుడే చెప్తాను. విల్సన్ దొంగ కంపెనీ ఓచర్స్‌ని ప్లాన్ చేశాడు. హెడ్డ్ఫాస్ ఆడిటర్స్‌ని పంపబోతోందని అతనికి తెలుసు. తను పట్టుబడతాడని బహుశా ఆత్మహత్య చేసుకుని ఉంటాడు’
నా కాళ్లు వణికాయి. నిన్న రాత్రి మొత్తం స్లీపింగ్ పిల్స్ మింగాలన్న నా ప్రయత్నం గుర్తొచ్చింది.
* * *
రెండు రోజుల దాకా సిబ్బంది అంతా విల్సన్ గురించే మాట్లాడుకుంటూ సరిగ్గా పని చేయలేదు. మూడో రోజు స్లింగర్ లేండ్ నన్ను హెడ్ క్వార్టర్స్‌కి పిలిపించాడు.
‘ఆరెన! నువ్వు సమర్థతతో గొప్ప మేనేజర్‌వి ఎప్పటికీ కాలేవు. కనీసం నువ్వు నిజాయితీగల మనిషివి. కాబట్టి బ్రాంచ్ మేనేజర్‌గా హెడ్డ్ఫాస్ నిన్ను నియమించాలని అనుకుంటోంది’
‘్థంక్స్’ నా మొహంలోని విభ్రాంతి సహజమైంది.
అగ్నిప్రమాదం జరిగి సాక్ష్యాధారాలన్నీ కాలిపోవడం ఓ అదృష్టమైతే, దొంగ ఓచర్స్ గురించి నేను స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం రావడం ఇంకో అదృష్టం.
కానీ విల్సన్ గర్ల్‌ఫ్రెండ్ పోలీసులకి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఆమె వివాహితురాలై ఉంటుంది. తన పరువు ముఖ్యం అనుకోవచ్చు. కారణం ఏదైనా అందువల్ల ప్రపంచం నాకు అందమైన ప్రదేశంగా మారింది. మరోసారి దొంగ ఓచర్లని సృష్టించదల్చుకోలేదు. సరైన పాఠం నేర్చుకున్నాను.
నేను టై కట్టుకుంటూండగా డోర్ బెల్ మోగింది. తలుపు తెరిస్తే ఎదురుగా శాలీ. నవ్వుతూ ఆఫీస్ తాళం చెవులు ఇచ్చి చెప్పింది.
‘కంగ్రాట్యులేషన్స్’
‘్థంక్స్’
‘ఆరెన్! ఆ రాత్రి అతని శవాన్ని అలా వదిలేసి నువ్వు చాలా మూర్ఖంగా ప్రవర్తించావు’
‘విల్సన్ ఇంట్లో ఉన్న స్ర్తి నువ్వే అన్నమాట!’
‘అవును. నేనే అవడం నీ అదృష్టం. నేను అక్కడ ఉండి ఆ అగ్ని ప్రమాదాన్ని సృష్టించకపోతే, నువ్వు ఈపాటికి జైలులో ఉండేదానివి’ నవ్వుతూ చెప్పింది.
‘దేనికి?’ ప్రశ్నించాను.
‘ఆ మిగిలిన దొంగ ఓచర్స్‌ని సృష్టించింది విల్సన్ కాదు. నేనే. నువ్వు చేస్తున్న దొంగ పని తెలుసుకోడానికి నాకు మూడు వారాలు పట్టింది. నువ్వేం చేస్తున్నావో అది నేనూ చేయగలను అనుకున్నాను. నీకన్నా నాకే భద్రత ఎక్కువ. అది బయటపడితే నా వేలుని నీ వంక చూపించగలను. కానీ మిగిలిన దొంగ ఓచర్స్ నీవి కావని నువ్వు రుజువు చేయలేవు. విల్సన్ మరణించటంతో పాపం ఆ నింద అతని మీద పడింది. అతని సంతకం తేలిగ్గా ఫోర్జరీ చేసేలా ఉండడం అతని దురదృష్టం’
నేను ఆశ్చర్యంగా చూస్తూంటే శాలీ చెప్పింది.
‘నువ్వు బ్రాంచ్ మేనేజర్‌వి కాబట్టి ఇద్దరం కలిసి నెలకి ఆరు వేల డాలర్స్‌కి దొంగ ఓటర్లని సృష్టిస్తే ఆడిటర్స్‌కి అనుమానం రాదు’

(రాబర్ట్ ఎడ్వర్డ్ ఎకెల్స్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి