అక్షర

ప్రవచన యాగంగా అశ్వమేధపర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైమిని భారతం- ప్రవచనం;
ప్రవచనకర్త: కుప్పా వెంకట కృష్ణమూర్తి;
పుటలు: 672; వెల: రూ.350 ;
ప్రతులకు: ఎమెస్కో బుక్స్, 1-2-7 బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్,
దోమల్‌గూడా, హైదరాబాద్- 500 029
సాహితి ప్రచురణలు, 29-13-53,
కాళేశ్వరరావురోడ్, సూర్యారావుపేట,
విజయవాడ-2, ఆంధ్రప్రదేశ్

కవిత్వం కళాత్మకం. ప్రసంగం ప్రతిభాధారితం. సంస్కృతంలో జైమిని మహర్షి కృష్ణ భక్తితత్త్వశక్తి ప్రధానాంశంగా భారతాన్ని కవిత్వీకరించి వ్రాశాడు. పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు అందులో కవిత్వపు పాలు కొంచెం పెంచి తెనిగించాడు. దానిని ఒక మంచి ధారావాహిక ప్రసంగ కార్యక్రమంగా తనకున్న ప్రతిభతో కుప్పా వెంకట కృష్ణమూర్తిగారు 2008వ సంవత్సరంలో ఈటీవీ ద్వారా అందరికీ అందించారు.
ఆ ప్రసంగాల పరంపర మొత్తం ‘జైమిని భారతం-ప్రవచనం’ అనే పుస్తక రూపం దాల్చింది ఇటీవల.
జైమిని రచించిన మొత్తం భారతంలో కేవలం ఒక్క అశ్వమేధ పర్వమే మనకు లభిస్తోంది. దానికే ‘పిల్లలమఱ్ఱి’ అనువాదము, కుప్పావారి ప్రవచనము రూపందుకున్నాయి.
జైమిని మహాముని వ్యాసమహర్షికి సమకాలికుడేకాక శిష్యుడు కూడా. వ్యాసులవారు కారణాంతరాలవల్ల చెప్పలేకపోయిన కొన్ని భారత ఘట్టాలను మనం చెబుదాము అనుకున్నాడు జైమిని. ఎందుకంటే ఆ సన్నివేశాలను ప్రత్యక్షంగా చూసినవాళ్ళలో జైమిని కూడా ఒకడు.
కురుక్షేత్ర యుద్ధానంతరం జరిగిన ధర్మజుని అశ్వమేధ యాగ సందర్భంగా అర్జునుడు నీలధ్వజ, హంస ధ్వజ, బభ్రువాహన, వీరవర్మ, చంద్రహాసాదులతో భీకర సంగ్రామంచేసి యజ్ఞ పరిసమాప్తి గావించటం అనే సుదీర్ఘ గాథను 132 ప్రసంగాలుగా ఒక యజ్ఞంలాగా నిర్వహించటంలో కుప్పా వెంకట కృష్ణమూర్తిగారు కృతకృత్యులైనారు.
భారతంలో కృష్ణుడు అనగానే అందరి ఎదలోనూ కదలాడే రూపం ఒక రాజకీయ చతురుడుగా, ఒక వ్యూహకర్తగా, ఒక రాగమయ మూర్తిగా- ఇత్యాదిగా మాత్రమే. కానీ జైమిని దర్శించిన కృష్ణునిలోని పరాత్పర తత్త్వము, చంద్రహాసాది ధీరోదాత్తులలో నిండి నిబిడీకృతమైన జీవాత్మ- పరమాత్మల ఐక్యతా తపనలు మాత్రమే ప్రధాన అంశాలుగా పాఠకుని హృదిలో అనిర్వచనీయమైన కదలికలు కలిగిస్తాయి- జైమిని భారతం చదివితే.
ఈ రకమైన ఉదాత్త అనుభూతి పూర్వక ప్రతిస్పందనలు కలిగించటంలో కుప్పా వెంకట కృష్ణమూర్తిగారు సఫలులైనారు.
ఈ పుస్తకానికి ప్రాణం రచయిత యొక్క సరళాతిసరళ వాగ్ధోరణి. ఎక్కడా కూడా ఏదో పురాణమో, గహనాతి గహనమైన తాత్త్విక ప్రసంగమో, తలకు దిమ్మెక్కించే కవిత్వమో వింటున్నట్టుండదు. బహుపురాణ తత్త్వవేత్త అయిన ఒక సమీప బంధువు మనతో కమ్మని ముచ్చట్లు చెప్తున్నంత హాయిగా ఉంటుంది.
ముఖ్యంగా గంభీరమైన, రసస్ఫోరకమైన భక్త-వీర గాథలు చెబుతూనే రచయిత అక్కడక్కడ పోహళించే లలిత హాస్య చమత్కారాల నుడికారాలు, కాకువులు పాఠకుడిని ఆకట్టుకుంటాయి.
ఒక ఉదాహరణ:
ధర్మరాజుకు అశ్వమేధ యాగం కోసం ఒక మేలిమి గుణాల గుఱ్ఱం కావలసి వచ్చింది. అది యవనాశ్వడు అనే రాజుయొక్క రాజ్యంలో అతని అధీనంలో ఉంది. దాన్ని ఎలాగో సంపాదిద్దామని భీముడు, కర్ణ సుతుడైన వృషకేతుడు, ఘటోత్కచుని కొడుకైన మేఘవర్ణుడు కలసి బయల్దేరిపోయి యవనాశ్వుని నగరానికి ఆనుకొని ఉన్న కొండమీద నిల్చొని ఉంటారు. ఆ రాజుయొక్క చతురంగ బలాలు అక్కడ విన్యాసాలు చేయటానికి వస్తాయి. వాటిలో వీళ్ళకు కావలసిన ప్రత్యేకమైన మేలిమి గుణాల గుఱ్ఱం ఎక్కడుందో కనిపించదు. అప్పుడు భీముడు ‘‘నేను వెళ్ళి ఆ పటాలంమీద పడతాను. నా వెనక మీరిద్దరూ అండగా ఉండండి. ఎలాగోలా గుఱ్ఱాన్ని గుర్తించి మనం పట్టుకొని ఈ కొండ దాటేశామంటే ఇక వాళ్ళు మనల్ని పట్టుకోలేరు’’ అంటాడు. ఈ మాట విని వృషకేతు మేఘవర్ణులిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు.
‘‘ఈ ఏర్పాటంతా చూస్తుంటే ఇదంతా ఏదో బందిపోటు వ్యవహారంలా ఉంది’’ అంటారు కుప్పావారు ఒక ముక్తాయింపు వాఖ్యతో- ఒక తటస్థునిగా.
శత్రుసీమల ఆనుపానులు తెలుసుకోవటం అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. అదే గూఢచర్యం అంటే. దీనినే ఆధునిక రక్షణ శాఖా కార్యక్రమాల పరిభాషలో ‘రికనాయిజెన్స్ సర్వే’ అంటారు. యవనాశ్వుడి రాజ్యంలో ధర్మరాజు యొక్క పరివారం ఇదే ‘సర్వే’ను సాగించటం జైమిని భారతంలో చాలా ఉత్కంఠ భరితంగా వర్ణితం.
నెయ్యాన్ని గాని, గౌరవ పురస్కారాలను పరస్పరం అందించుకునే సందర్భాలలో గాని ఇరుపక్షాల అధినాయకులు, రాణులు ఎవరికివారు సమాన హోదాలవారు పాలుపంచుకోవటాల లాంటి సంప్రదాయ గౌరవ పద్ధతులు (ప్రొటోకాల్స్) మొదలైన వాటికి జైమిని భారతంలోని చాలా ఉదాహరణలు ముచ్చట గొల్పుతాయి.
యవనాశ్వుడు- ధర్మరాజు సేనల మధ్య జరిగిన యుద్ధంలో యవనాశ్వుడు ఓటమినంగీకరించి, అశ్వమేధానికి అవసరమైన విశిష్ట గుణాల గుఱ్ఱంతో సహా ధర్మరాజుకు లొంగిపోతాడు. అంతకుముందు కురుక్షేత్ర యుద్ధకాలంలో అతడు తటస్థంగా ఉండినవాడు. ఇప్పటి యజ్ఞానికి ఆధ్వర్యం వహించాల్సిన కృష్ణుడిని, కృష్ణ కుటుంబ, పరివారాలను ఆహ్వానించటానికి తన వాళ్ళతో యవనాశ్వదంపతులను కూడా పంపిస్తాడు ధర్మరాజు. ‘‘దీనిలోని కిటుకు ఏమిటంటే యవనాశ్వ దంపతులకు గౌరవం ఇచ్చినట్లూ అవుతుంది, వాళ్ళనుగూడా బంధువులుగా కలుపుకున్నట్టూ అవుతుంది. దాంతోపాటు వాళ్ళు మాచేత ఓడింపబడ్డారు, ఇప్పుడు మా పక్షాన ఉన్నారు అని అందరికీ నాజూకుగా ప్రదర్శన చేసినట్టూ అవుతుంది. ఇలా రెండు రకాలుగా పనికొస్తుంది కనుకే ధర్మరాజు మంచి రాజనీతిజ్ఞతతో వాళ్ళను గూడా కృష్ణుడికి స్వాగతం చెప్పడానికి పంపించాడు’’ అంటారు కుప్పావారు 132వ పుటలో. ఇలా ఇంకా చాలాచోట్ల రాజనీతి సంబంధ అంశాలను చక్కగా వింగడించి చూపారు.
జైమిని విరచిత సంస్కృత శ్లోకానికి గాని, పిల్లలమఱ్ఱి వాని పద్యానికి గాని ఇందులో కనిపించే తాత్పర్యాలు చాలా సరళ సుందరంగా ఉంటాయి. అందుచేత పఠనం చాలా సాఫీగా సాగిపోతుంది.
ఉదాహరణ:
‘‘వినుతానేక విభూషణాభినవమై, శే్వతాతపత్రద్యుతుల్
తనపై వెనె్నలఁజల్లఁజామర శిరోదంచన్మరున్మంజరీ
జనితానందమునన్మనంబలరనుత్సాహంబునన్ సార్వ భౌ
ముని చందబుననేఁగుదెంచె వినుతాంభోజాకరక్రీడకున్ (49వ పుట).
సరస్సులో క్రీడించేందుకోసం ఆ అశ్వరాజం ఒక చక్రవర్తిలాగా వచ్చింది. దానికి కొంతమంది ఒక తెల్ల గొడుగుపట్టారు. కొంతమంది చామరాలు వీజనం చేస్తున్నారు. కొంతమంది మంగళవాద్య ఘోషలు చేస్తున్నారు. కొంతమంది జయజయ ధ్వానాలు చేస్తున్నారు. దానికి అనేక విధాలుగా అలంకారాలు చేశారు. ధ్రువకాలు (తాటియాకు బిళ్ళ పట్టీలు) కట్టారు. గంటలు కట్టారు’. ఇది సగటు పాఠకునికి కావలసిన తాత్పర్యపు అందము-చందము; తీరు-తెన్ను. ఈ పద్యం శే్లషాలంకార శోభితం కూడా.
కొన్ని విశిష్ట సంఖ్యల, పదాల రహస్యార్థాలు కనిపిస్తాయి ఈ పుస్తకంలో.
ఉదాహరణ: మహాభారతేతిహాసానికి వ్యాసుడు ‘జయం’ అనే పేరు కూడా పెట్టుకున్నాడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం జయ అంటే 18 సంఖ్య. వ్యాసుని పురాణాలు 18. ఉప పురాణాలు 18. భారతయుద్ధం జరిగింది 18 రోజులు. ఉభయ సైన్యాలు మొత్తం కలిపి 18 అక్షౌహిణులు. భారతంలోని పర్వాల సంఖ్య 18. భారతదేశంలో శక్తిపీఠాలు 18. ఇలా 18 అనేది ‘జయం’.
ఎన్నో ధర్మసూక్ష్మాలకు పలు వేదసూక్తుల ఊతం తీసుకున్నారు రచయిత. అయితే గీతాశ్లోకాలను కూడా ఉపయోగించుకున్నారు చాలాచోట్ల. చివరకు భగవద్గీతకంటే మూడువందల యేండ్ల పూర్వీకుడైన చంద్రహాసుని వృత్తాంతంలోని సంభాషణల సందర్భంలో కూడా గీతావాక్యాల ఊతం సముచితమేనా అనే ప్రశ్నకు తన సమాధానంగా ‘‘తత్త్వం అనేది కేవలం భగవద్గీతతో పుట్టలా. ఉపనిషత్తులలో చెప్పింది అదే. అనేక సందర్భాలలో మహర్షులు ఉపదేశం చేసిందీ అదే. అనేక తత్త్వశాస్త్ర గ్రంథాలలో ఉన్నదీ అదే. అదే చంద్రహాసునికిగూడా సంక్రమించింది అని మనం గమనించుకోవాలి’’అంటూ తన క్రోడీకరణలకు ఒక సమన్వయం చెప్పారు కుప్పావారు. అదీ సమంజసంగానే ఉన్నది. ఎలాగంటే ‘సర్వమ్ ఖల్విదం బ్రహ్మ’ (ఈ జగత్తు యావత్తూ బ్రహ్మం అనే ఒకే ఒక చైతన్యశక్తి స్వరూపమేకదా!) అనేదే అన్ని ఉపనిషత్తుల సారాంశం కనుక.
‘దివ్య రథులు’, ‘స్వాహా’, ‘అక్షయ తూణీర విద్య’ వంటి ఎన్నో అప్పటి సాంకేతిక పరిభాషికా పదాలకు చక్కని వివరణ కనిపిస్తుంది ఈ గ్రంథంలో.
తటాక నిర్మాణం, కావ్యరచనం మొదలైన సప్త సంతానాలు అవే పురుషార్థసాధక క్రియలకు ఈ కాలానికి తగిన బహుళార్థకత్వాన్ని సమర్థనీయంగా వివరించారు రచయిత 83, 84వ పుటలలో.
విశ్వనాథవారి ‘గోపికా గీతం’ గ్రంథానికి స్ఫూర్తిబీజాలు భీముని ద్వారకానగర జన సందర్శన ఘట్టంలో ఉన్నట్టు అనిపిస్తుంది అన్న 103వ పుటలోని కుప్పావారి వాక్యం ఒక ఎమ్.్ఫల్.కు కావలసిన ముడిసరుకు (స్టడీ మెటీరియల్)ను సమకూరుస్తుంది (‘్భముని ద్వారకాయాత్ర’ శీర్షిక).
మహాభక్తుడైన చంద్రహాసుని వృత్తాంత ఘట్టంలో జైమిని మునీంద్రుడు వసంతర్తువును చాలా శృంగారమయంగా వర్ణించాడు. అంతవర్ణనాచేసి చివరలో ఒక్క మాటతో అద్భుతమైన గంభీర భావపు మలుపు (ట్విస్ట్) ఇస్తాడు ‘ఆ శృంగార పురుషుడైన వసంతర్తువు విలాసమంతా కూడా చంద్రహాసుడికి ఒక శ్రీహరి చరిత్ర లాగా కనిపిస్తోందిట’అంటూ. పాఠకుని ఫీలింగ్ మొత్తాన్ని ఒక అధి భౌతిక దృష్టి (ళఆ్ఘఔ్దకఒజషఒ)కి మరల్చుతాడు. ఇలా అధ్యయనం చేయాలి జైమిని భారతాన్ని అంటారు కృష్ణమూర్తి.
పిల్లలమఱ్ఱి అనువాదంలోని కొన్ని మంచి పద్యాలను గూడా ఉదహరించారు ఇందులో.
అయితే 55, 56, 58, 59, 112వ పుటలోని ఉదాహృత పద్యాలలో అచ్చుతప్పులు దొర్లాయి. అందువల్ల వాటిల్లో గణ భంగాలు కనిపిస్తాయి. అర్థం కొంత నిరర్థకం అవుతుంది. 70వ పుటలో ‘శక్తివంత’అని ఉన్నది (శక్తిమంత అనాలికదా!)-ఇలాటి కొన్ని డి.టి.పి. తప్పులను దిద్దుకున్నట్టు కనిపించదు. ప్రమాదోధీమతామపి.
ఈ జైమిని భారత ప్రవచన గ్రంథం ఒక సుదీర్ఘ ప్రసంగ యజ్ఞానికి ఉత్తర రూపం.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం