జనాంతికం - బుద్దా మురళి

కళాకారుల ప్రజాసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖద్దరులోకి మారిన గద్దర్‌పై నీ విశే్లషణ..?’’
‘‘ప్రజాస్వామిక విజయం. అతని జీవితమే అతని సందేశం’’
‘‘నేనిక్కడ మాట్లాడుతుంటే- నువ్వేంటి స్మార్ట్ఫోన్‌లో తన్మయంతో వింటున్నావ్?’’
‘‘నువ్వూ వినరా...!’’
‘ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివీ, జాతి నెపమున సూతసుతునికిందు నిలువ అర్హత లేదందువా?.
హా..! ఎంత మాట.. ఎంత మాట..!
ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఏ యందువా?’
‘‘గద్దర్‌ను ఖద్దర్ దుస్తుల్లో ఊహించుకొంటేనే చిత్రంగా అనిపిస్తోంది. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని, ఓటు వేయవద్దని దశాబ్దాల పాటు పాటలు పాడిన గద్దర్ ఇప్పుడు ఓటు కోసం పాపం..ఇంటింటికి వెళితే ...’’
‘నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది? మట్టికుండలో పుట్టితివి కదా హా..హా.. నీది ఏ కులము?
ఇంత ఏల..?
అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివ సముద్రల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా? ఈయనదే కులము?
మా వంశమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశీ పుత్రుడు కాడా?’
‘‘గద్దర్ గురించి మాట్లాడేందుకు భయమని సూటిగా చెప్పొచ్చు కదా?’’
‘‘పాతికేళ్ల క్రితమే ఓపెన్ గ్రౌండ్‌లోకి వచ్చిన వారిపై మాట్లాడేందుకు భయమెందుకు?’’
‘‘నేను గద్దర్ అంటుంటే నువ్వు ఎన్టీఆర్ దానవీరశూర కర్ణ సినిమా డైలాగులు వింటున్నావ్?’’
‘‘బోలెడు సమయం ఉంది.. అన్నీ మాట్లాడుకుందాం. 40 ఏళ్ల క్రితం వచ్చిన దానవీర శూరకర్ణ డైలాగులు ఇప్పటికీ అద్భుతం. వందేళ్ల తెలుగు సినిమాలో టాప్ టెన్ డైలాగులు అని ఎవరైనా రికార్డు చేస్తే ఈ డైలాగులు మొదటి స్థానంలో నిలుస్తాయి. ’’
‘‘కాదని ఎవరన్నా అన్నారా? ’’
‘‘60 ఏళ్ల వయసు రాగానే హీరోగా అవకాశాలు ఉండవని తెలిసి ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసినప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారని ఆయనను ఎవరైనా నిలదీశారా?’’
‘‘లేదు.. నిలదీయలేదు.. ’’
‘‘మరి గద్దర్ రాజకీయాల్లోకి వస్తే ఎందుకు వ్యతిరేకించాలి?’’
‘‘ఏదీ సూటిగా చెప్పవా?’’
‘విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కిర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా?
సందర్భావసరములను బట్టి క్షేత్ర, బీజ ప్రాధాన్యములతో మా కురువంశము ఏనాడో కుల హీనమైనది. కాగా నేడు కులము.. కులము.. అని వ్యర్థ వాదనమెందులకు?’
‘‘అబ్బా నీతో చస్తున్నానురా! వింటే ఆ డైలాగులు విను.. లేదంటే రాజకీయాల గురించి మాట్లాడుదాం. ’’
‘‘సరే ముందు ఈ డైలాగుల గురించి మాట్లాడుకుందాం. తరువాత నువ్వడిగినట్టు గద్దర్ పరిణామ క్రమం గురించి. కులానికి వ్యతిరేకంగా తెలుగు నాట ఇంత శక్తివంతమైన పాపులర్ రచన మరోటి చూపించగలవా?’’
‘‘నిజమేరా..! ఎంతో మంది మహాకవులు, రచయితలు కుల నిర్మూలనపైన, కులానికి వ్యతిరేకంగా ఎంతో సాహిత్యాన్ని సృష్టించి ఉంటారు కానీ దాన వీర శూరకర్ణలోని ఈ ఎన్టీఆర్ డైలాగులు వెళ్లినంత బలంగా ఎవరి రచన వెళ్లలేదు.’’
‘‘అవి రాసింది ఎన్టీఆర్ కాదు కొండవీటి వెంకటకవి..’’
‘‘కావచ్చు.. కానీ జనంలోకి వెళ్లింది ఎన్టీఆర్ పేరుతోనే. అక్కడ ఎన్టీఆర్ లేకపోతే ఆ మాటలు ఏదో ఓ పుస్తకంలో గ్రంథాలయంలో ఉండేవి.. జనం మదిలోకి దూసుకు వెళ్లేవి కాదు.’’
‘‘నిజమే నువ్వన్నట్టు అవి ఎన్టీఆర్ డైలాగులే అయతే...’’
‘‘ఎంతటి కులాభిమానులకైనా కులం మీద విరక్తి కలిగేంత అద్భుతంగా ఆ డైలాగులు చెప్పిన ఎన్టీఆర్ తన పనె్నండు మంది సంతానానికి సొంత కులం వారితోనే పెళ్ళిళ్లు చేశారు. చివరకు తాను 72 ఏళ్ల ప్రాయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నది కూడా సొంత సామాజిక వర్గం మహిళనే’’
‘‘అది వారి పర్సనల్ విషయం.. దానికీ దీనికీ సంబంధం ఏమిటి?’’
‘‘అంతే అంటావా? ఆ డైలాగులు విన్న చాలా మంది ఇక కులం అంతరించి పోయినట్టే అనుకున్నారు. కులాంతర వివాహాల వివాదం వచ్చినప్పుడల్లా ఈ డైలాగులు వినిపిస్తారు. ఐతే ఇప్పుడు చెప్పు.. గద్దర్ రాజకీయ ప్రవేశంపై నీ అభ్యంతరం ఏమిటి?’’
‘‘తన పాట వల్ల పదివేల మంది అడవి బాట పట్టారని ఇంటలిజెన్స్ రిపోర్ట్‌ను ఆయనే చాలా సార్లు చెప్పుకొచ్చారు. అందులో ఎంతోమంది ఎన్‌కౌంటర్‌లో చనిపోయి తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారు. ఆయన మాత్రం తన కుమారుడికి టికెట్ కోసం కాంగ్రెస్‌కు ప్రచారం చేయడం తప్పు కాదా? ’’
‘‘మీ డైలాగులు విని మేం కులాన్ని చీదరించుకుంటే మీరేంటి సార్ ఇంట్లో ఉన్న డజను మంది పిల్లలకు సొంత సామాజిక వర్గంలోనే పెళ్లిళ్లు చేశారు. మీరు సైతం వృద్ధాప్యంలో- సొంత సామాజిక వర్గంలోనే పెళ్లి చేసుకున్నారని ఎన్టీఆర్‌ను ఎప్పుడన్నా అడిగారా? అది ఎన్టీఆర్ పర్సనల్ ఐతే ఇది గద్దర్ పర్సనల్. సినిమా హిట్టయి నాలుగు డబ్బులు రావాలని సినిమా కోసం చక్కగా డైలాగులు చెప్పడం వరకే ఎన్టీఆర్ పని. విప్లవం గురించి పాట పాడడం గద్దర్ పని. దాన్ని నమ్మి అడవి బాట పడితే లాభనష్టాలకు నీదే బాధ్యత. ’’
‘‘ఎన్టీఆర్, గద్దర్ జనం మీద ప్రభావం చూపిన గొప్ప కళాకారులే. 60 ఏళ్లలో ఇక సినిమాల్లో హీరో చాన్స్‌లు రావని తెలిసి అప్పటి వరకు తనకున్న ఇమేజ్‌ను ఉపయోగించుకోవడానికి రాజకీయాలను ఎన్టీఆర్ ఆశ్రయించారు. సరిగ్గా గద్దర్ సైతం తనకున్న క్రేజీని రాజకీయాల్లో ఉపయోగించుకోవాలనే ఆలోచనను ఎందుకు తప్పు పట్టాలి? ఎన్టీఆర్‌ను జనం ఆదరించారు. అదే ఆలోచనతో వచ్చిన చిరంజీవిని తిరస్కరించారు. గద్దర్‌ను ఆదరించాలా? తిరస్కరించాలా? అనేది ప్రజల ఇష్టం. తుపాకీ చేత పట్టి అడవి బాట పట్టి, ఓటు వేయవద్దనే ప్రచారంతో గడగడలాడించిన గద్దర్ సైతం ఇంటింటికీ వెళ్లి ఓటు వేయమని ప్రజలను కోరడం ప్రజాస్వామ్య విజయం కాదా? ఎలక్షన్ కమిషన్ వాళ్లు ఓటు వేయమని ప్రజలకు ప్రచారం చేసేందుకు గద్దర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగించుకోవాలి. ’’
‘‘మరి జీవిత సందేశం అన్నావు.. అదేముంది?’’
‘‘నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయానికి నువ్వే బాధ్యత వహించాలి. ఎవరో చెప్పారని అడవిబాట పడతావా? జనారణ్యంలో విజేతగా నిలవాలా? అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. మేధావుల మాట విని అడవి బాట పడితే విప్లవం రాదు.. జీవితం అర్ధాంతరంగానే ముగుస్తుంది. ఇదే ఆయన జీవిత సందేశం. ’’

-- బుద్దా మురళి buddhamurali2464@gmail.com