జనాంతికం - బుద్దా మురళి

ఎన్నికల అంఛనా.. ఓషో కథ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలికాలం కలిబుద్ధులు.. ఈ కలియుగాంతానికి కాలం దగ్గరపడినట్టనిపిస్తోంది.. పెద్దలంటే గౌరవం లేదు.. ఎవరిని ఎవరూ ఖాతరు చేయరు.. ఏదో ఒక రోజు ఈ లోకం పాపంలో పడి మునిగిపోతుందనిపిస్తుంది..’’
‘‘ఏరా.. మీ అబ్బాయితో గొడవ జరిగిందా?’’
‘‘ఔను.. నీకెలా తెలుసు?’’
‘‘ఊహించాను..’’
‘‘రోడ్డు మీదకు వెళ్లిన మనిషి తిరిగి ఇంటికి వస్తాడనే నమ్మకం కలగడం లేదు. మన రోడ్ల మీద మొక్కజొన్న కంకులు అమ్మినట్టుగా అమెరికాలో గన్‌లు అమ్ముతున్నారు. వాటితో పేల్చుకుని చావకుండా ఇంకేం చేస్తారు? సంపద వచ్చి పడిందని కళ్లు నెత్తికెక్కితే ఇలానే ఉంటుంది.’’
‘‘ఏరా.. మీ అబ్బాయికి అమెరికా యూనివర్సిటీలో సీటు ఇక రానట్టేనా? ’’
‘‘అవేవో ఐలెట్ పరీక్షల్లో మంచి మార్కులు రావాలట.. వాడు మూడు సార్లు రాస్తే 36వేల రూపాయల చేతి చమురు వదిలింది కానీ వాడికి మార్కులు రాలేదు. మనల్ని మోసం చేసి ఇలా డబ్బులు గుంజే ఐడియానే కానీ- ఆ ట్రంప్ మన పిల్లలకు చదువుకునే అవకాశం ఇచ్చేట్టు లేడు.’’
‘‘అంతే కావచ్చు’’
‘‘అది సరే.. నేను మాట్లాడిన దానికి, నువ్వు ప్రశ్నించిన దానికి అస్సలు సంబంధం లేదు. నేను అమెరికాలో ఆయుధాల దాడుల గురించి మాట్లాడితే నువ్వు మా అబ్బాయికి అమెరికాలో సీటు రాలేదా? అని అడిగావు. ఎలా ఊహించావు. ఆశ్చర్యంగా ఉందిరా! టెలీపతినో భిక్షపతినో ఏదో అంటారు కదా? అలాంటి విద్య ఏమైనా నేర్చుకున్నావా?’’
‘‘కాదులే..’’
‘‘ఎన్నికల వాతావరణం వేడెక్కింది. డబ్బులు మంచినీళ్లలా ఖర్చుపెడుతున్నారు. పోయే కాలం .. విలువలు లేవు.. నమ్మకాలు లేవు. ఇంతకూ ఎవరు గెలుస్తారంటావ్?’’
‘‘గతంలో ఎన్నికలంటే రిగ్గింగ్‌లు, మద్యం ప్రవహించడం, బూతులు, దాడులు అబ్బో.. నానా బీభత్సంగా ఉండేది. అవేమీ లేకుండా ప్రశాంతంగా ఉంది ఇప్పటి వాతావరణం. ’’
‘‘నీకలానే అనిపిస్తుందిలే! ఫలితాలు ఎలా ఉంటాయనుకుంటున్నావ్’’
‘‘నీకో కథ చెబుతా.. మనం చర్చ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నింటికి నీకీ కథలో సమాధానం దొరుకుంది. కథ నాది కాదు ఓషో రజనీష్ చెప్పింది’’
‘‘సరే చెప్పు..’’
‘‘ఒక హరిదాసు రామకథను చెబుతున్నాడు. శ్రీరాముని కథ చెప్పేప్పుడు హనుమంతుడు కూడా అక్కడికి వచ్చి కూర్చుంటాడని మన వాళ్ల నమ్మకం. రావణాసురుడు సీతమ్మను అపహరించి అశోకవనంలో ఉంచాడు. ఆ సమయంలో అశోకవనంలో చుట్టూ పూలు ఉన్నాయి. ఆ పూలు తెల్లగా మెరిసిపోతున్నాయి అని హరిదాసు కథ చెబుతుండగానే హనుతమంతుడు వచ్చి ఆ పూలు తెల్లగా లేవు, ఎరుపుదనంతో మండిపోతున్నాయని అంటాడు. హరిదాసు హనుమంతుడిని చూసి ఇంతకూ నువ్వెవరు అని ప్రశ్నిస్తే- నేను హనుమంతుడినని అంటాడు. కావ చ్చు.. కానీ అక్కడ తెల్లపూలే ఉన్నాయని హరిదాసు వాదిస్తాడు. సరే- శ్రీరాముడినే కలి సి తేల్చుకుందాం అని ఇద్దరూ వెళతారు. హరిదాసు తెల్ల పూలు అన్నారు కాబట్టి ఆ పూలు తెల్లవే అని శ్రీరాముడు చెబుతాడు. హనుమంతునికి కోపం వచ్చి అశోకవనంలో సీతమ్మ ఉన్నప్పుడు అక్కడ శ్రీరాముడు లేడు, కథ చెబుతున్న హరిదాసు లేడు. ఉన్నది సీతమ్మ, నేను మాత్రమే మీరంతా అబద్ధం చెబుతున్నారంటూ మండిపడతాడు. సీతమ్మనే అడుగుదామని ఆమెను పిలుస్తారు. వివాదం గురించి చెప్పిన హనుమంతుడు అశోకవనంలో పూలు ఎలా ఉండేవని అడుగుతారు. హరిదాసు అబద్ధం ఆడడు కాబట్టి ఆయన చెప్పిందే నిజం ఆ సమయంలో అశోక వనంలో పూలు తెల్లగా ఉండేవని సీతమ్మ చెబుతుంది. హనుమంతుడు ఆశ్చర్యపోయి హరిదాసు, శ్రీరాముడు, సీతమ్మ కలసి అబద్ధం చెబుతున్నారు.. మీరంతా కలిసి ఏదో కుట్ర పన్నుతున్నారు.. నేను స్వయంగా చూశాను ఆరోజు అశోకవనంలో పూలు ఎర్రగా ఉన్నాయి.. కానీ మీరంతా తెల్లగా ఉన్నాయంటున్నారని విస్తుపోతాడు. శ్రీరాముడు నవ్వి- నువ్వు చెప్పింది సరైనదే, హరిదాసు చెబుతున్నది సరైనదే. రావణుడు సీతమ్మను అశోకవనంలో ఉంచినప్పుడు ఆగ్రహంతో ఉన్న నీకు అశోకవనంలోని పూలన్నీ ఎర్రగా కనిపించాయి. రామకథ చెబుతున్న హరిదాసు ప్రశాంతంగా ఉన్నాడు అందుకే అతనికి పూలు తెల్లగా కనిపించాయి అని శ్రీరాముడు చెప్పాడు’’
‘‘ ఓషో చెప్పిన ఈ రామకథకు, ఎన్నికల వాతావరణానికి, నా సమస్యకు సబంధం ఏముంది?’’
‘‘ఎన్నికలకు, నీ సమస్యకే కాదు.. సమస్త మానవాళి అభిప్రాయాలకు, దేశ రాజకీయాలకు సంబంధం ఉంది కాబట్టే చెప్పాను’’
‘‘అదే.. ఏంటా సంబంధం?’’
‘‘నీకు ఒపిక ఉంటే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండొచ్చు, సమాజం ఎలా ఉంది? అంటూ నీకు తోచిన ప్రశ్నలు అడిగి చూడు.’’
‘‘అడిగితే?’’
‘‘పది మందిని అడిగి చూడు. ఆ పది మంది ఒకే సమాధానం చెప్పరు. భిన్నమైన అభిప్రాయాలు చెబుతారు. ఒకే ఎన్నికల గురించి, ఒకే సమాజం గురించి ప్రశ్నించినప్పుడు భిన్నాభిప్రాయాలు వస్తాయి’’
‘‘కావచ్చు.. ఓషో రజనీష్ చెప్పిన శ్రీరాముని కథకు, మన చర్చకు, నువ్వు చెబుతున్న దానికి సంబంధం ఏంటో చెప్పు’’
‘‘సంబంధం ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. సీత వనవాసంలో ఉన్నప్పుడు చెట్టు కింద పూలు నిజానికి తెల్లరంగులోనే ఉన్నాయి. హనుమంతుడు ఆ సమయంలో రావణుడిపై ఆగ్రహంతో ఉండడం వల్ల ఎరుపు రంగులో కనిపించాయి. కథ చెబుతున్న హరిదాసు ప్రసన్నవదనంతో ఉండడం వల్ల తెల్లగా కనిపించాయి. ప్రపంచాన్ని మనం మన కళ్లతో చూస్తాం అంటే ఆ సమయంలో మన ఆలోచనలు ఎలా ఉంటే మనకు ప్రపంచం అలా కనిపిస్తుంది. నీ పిల్లలు నీ మాట వినకపోతే ప్రపంచమంతా అలానే ఉందనిపిస్తుంది. ’’
‘‘అదా కథ.. అంటే ఈ ఎన్నికల్లో ఎవరు గెలవాలి? ఎవరు ఓడాలి? అని మనం అనుకుంటున్నామో ఫలితాలు అలానే వస్తాయని అనిపిస్తుంది కదూ?’’
‘‘ఔను...’’
‘‘అంటే సర్వేలు, అభిప్రాయాలు అన్నీ అబద్ధమేనా?’’
‘‘కాదు.. మనం ఉన్న స్థితి నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తే నిజం అర్థం అవుతుంది. అలా ఆలోచించే సామర్థ్యం మనకు ఉందా? లేక గుంపులో గోవిందయ్యలా ఆలోచిస్తున్నామా? అనేది మనం చెప్పిన ఫలితం, వాస్తవ ఫలితం బట్టి తేలుతుంది’’ *

-- buddhamurali2464@gmail.com