జనాంతికం - బుద్దా మురళి

జైజై.. ఫేక్‌న్యూస్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమోయ్.. మీ అన్నయ్య వచ్చాడు.. కాస్త టీ తీసుకురా!’’
‘‘చక్కెర కాస్త ఎక్కువేసి తీసుకురా చె ల్లెమ్మా.. ‘హోదా’ కోసం నా వంతు ఉద్యమం ఇదే. షుగర్ ఉన్నా ఎక్కువ చక్కెర వేసుకుని టీ తాగడం ద్వారా కేంద్రానికి నిరసన తెలుపుతున్నా..’’
‘‘ఇదేదో బాగుందిరోయ్! నిరసనలో భాగంగా సాయంత్రానికి బదులు, ఉదయమే బార్‌కు వెళదామా?’’
‘‘నిరసన ఉద్యమాలు మీ మగాళ్లకేనా? ఆడాళ్లం కూడా వస్తాం. ఏమంటారు అన్నయ్య గారూ.. వదిన ఇంటి దగ్గరే ఉంది కదా?’’
‘‘ఏదో సరదాగా అన్నాను లేవోయ్.. నిజంగా వెళ్లేంత ధైర్యం ఉందా నాకు.. ఐనా ఇదేంటోయ్.. ఇంటర్వెల్ నుంచి సినిమాకు వెళ్లడం, వంద మీటర్ల పాదయాత్ర, పెరుగుకు బదులు మజ్జిగతో అన్నం తినడం, రెగ్యులర్‌గా వెళ్లే బాబాయ్ హోటల్‌కు బదులు అబ్బాయ్ హోటల్‌లో చట్నీ లేకుండా ఇడ్లీ తినడం ఉద్యమమేనా?’’
‘‘ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో అడిగితే జవహర్ లాల్ నెహ్రూ గురించి, స్వాతంత్య్ర పోరాటం గురించి ప్రధాని చెబితే తప్పు లేదు కానీ పప్పు లేకుండా సాంబార్‌తో వడలు తింటూ ఉద్యమిస్తే తప్పా? ఉద్యమం జాతీయ స్థాయి మీడియాను ఆకర్శించడానికి ఆలూ రహిత సమోసాలు తింటూ ఉద్యమిస్తాం’’
‘‘ప్రధాని అంటే గుర్తుకు వచ్చింది. నీకో రహస్యం తెలుసా? బలూచిస్తాన్‌ను ఇండియాలో కలిపేయడానికి 1947లో అక్కడి రాజు ఒప్పందం చేసుకున్న తరువాత కూడా నెహ్రూ వద్దని తిరస్కరించాడు తెలుసా?’’
‘‘నిజమా..?’’
‘‘అంతేకాదు.. నేపాల్ కూడా ఇండియాలో కలిసి పోతాం అంటే నెహ్రూనే వద్దన్నాడు. శ్రీలంకనూ అలానే తిరస్కరించాడు.. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే 1950లో ఇండియాకు ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం ఇస్తామని ఆఫర్ ఇస్తే నెహ్రూ వద్దన్నాడు. 1955లో రష్యా ఇలానే ఆఫర్ ఇచ్చినా నెహ్రూ ససేమిరా అన్నాడు.’’
‘‘ఎందుకు వద్దన్నాడు..? కొంపదీసి మోదీ ప్రధాని అయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడవుతాడని- దశాబ్దాల క్రితమే ఊహించి అన్నింటికీ నెహ్రూ వద్దని మోకాలడ్డాడా ఏంటి?’’
‘‘కాదు.. అసలు నెహ్రూ ఈ దేశస్థుడు కాడు. ఇరాన్‌కు చెందిన వాడు.. అందుకే వద్దన్నాడు.’’
‘‘నిజమే కానీ ఇంత ఆశ్చర్యకరమైన విషయాలు ఏ మీడియాలో రాలేదేంటి? అన్ని పార్టీలకూ మీడియా ఉంది కదా? ఎందుకు రాలేదంటావు. ఐనా ఇవన్నీ నీకెలా తెలిశాయి?’’
‘‘అందుకే చెప్పాను వాట్సాప్‌ను రెగ్యులర్‌గా చూడాలని. ఇలాంటి అద్భుతమైన రహస్యాలు ప్రచురించే ధైర్యం మీడియాకు లేదు. వాట్సాప్‌లో పెడతారు. మా వాట్సాప్ గ్రూప్‌లో చేరు.. నీకూ తెలుస్తాయి విశ్వ రహస్యాలు ఎన్నో’’
‘‘నాన్నోయ్ .. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ అంటే ఎవరు నాన్నా?’’
‘‘ఏరా! లక్షల ఫీజు కట్టి నిన్ను కార్పొరేట్ స్కూల్స్‌లో చేర్పించింది ఇందుకేనా? ఇంకా ఎక్కువగా టైం లేదు. ఇంకో ఆరేళ్లయితే ఐఐటి ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలి. టెస్ట్‌కు సిద్ధం కాకుండా టైం వృథా చేస్తున్నావు. ఆరేళ్లంటే ఇలా చూస్తుండగానే వచ్చేస్తుంది. గదిలోకెళ్లి చదువుకో.. ఐనా గాంధీ, నెహ్రూ ఈ పేర్లు నీకెవరు చెప్పార్రా? రేపు మీ స్కూల్‌కు వచ్చి ప్రిన్సిపాల్‌ను- లక్షల్లో ఫీజు చెల్లిస్తే మీరు చెప్పే చదువు ఇదేనా? అని నిలదీస్తాను.. కడిగేస్తాను.’’
‘‘స్కూల్‌లో చెప్పలేదు నాన్నా! టైం వేస్ట్ అని మా టెక్నో స్కూల్‌లో స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటివి కూడా జరపరు. మా ఫ్రెండ్ టింకూ వాళ్ల నాన్న ఫోన్‌లోని ఆశ్చర్యకరమైన వార్తలు మా అందిరికీ ఫార్వర్డ్ చేశాడు. టింకూ వాళ్ల నాన్న అదేదో పార్టీ ప్రచారం వాట్సాప్ వార్తలు తయారు చేస్తాడు. ఈ వార్తలు మార్కెట్‌లోకి విడుదల కాక ముందే టింకూ మాకు చూపిస్తాడు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా ప్రాక్టిస్ చేసేప్పుడు బ్రిటీష్ వాళ్లు కొన్ని కేసులు ఇచ్చారట! ఆ కృతజ్ఞతతో గాంధీజీ మా దేశానికి స్వాతంత్య్రం వద్దే వద్దు మీ ఇష్టం ఉన్నన్ని రోజులు పాలించుకోండి అని రాసిచ్చాడట! సాక్షి సంతకం నెహ్రూ చేశాడట! ‘కమలం’ పార్టీ వారు ఈ ఘోరాన్ని చూడలేక పోరాటం చేసి స్వాతంత్య్రం తీసుకువచ్చారట! మళ్లీ ఇప్పుడు బ్రిటీష్ వారికే దేశాన్ని అప్పగించే కుట్ర జరుగుతుందట! ఇవన్నీ మాకు వాట్సాప్‌లో వచ్చాయి. అంతేకాదు నాన్నోయ్.. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత బ్రీటిష్ సామ్రాజ్యాన్ని ఇండియాలో కలిపేయాలని ఆ దేశ ప్రజలంతా కోరితే.. బ్రిటన్ రాణి అంటే ఉన్న అభిమానంతో నెహ్రూ- ‘మీ దేశాన్ని మీరే పాలించుకోండి మాకు వద్దు’ అన్నాడట! నెహ్రూ చాలా తప్పు చేశాడు కదా నాన్నా.. బ్రిటన్‌ను మన దేశంలో కలిపేస్తే పాస్‌పోర్ట్, వీసా కోసం ఇబ్బంది పడేవాళ్లం కాదు. మీరు చెప్పుకునే వా ట్సాప్ వార్తలన్నీ పాతవి నాన్నా.. టింకూ మాకు కొత్త కొత్త వార్తలు జనానికి చేరకముందే చెబుతాడు. ’’
‘‘ఔన్రా.. ట్రంప్‌కు పాలించడం రావడం లేదు. మీ ‘చినబాబు’ను మా దేశానికి పంపించండి అని అమెరికా ప్రజలు ఏడుస్తూ వేడుకుంటున్నారట! అమెరికా కన్నా సొంత రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అని చినబాబును పంపడం లేదట! ’’
‘‘ఏమండీ.. ఇవన్నీ నిజమేనా? ’’
‘‘పిచ్చి పార్వతీ.. ఇంతోటి దానికే ఇలా షాకైతే ఎలా? నీకు వడ్డాణం చేయిస్తాను, బంగారు గాజులు చేయిస్తానని పెళ్లప్పుడు మాటిచ్చి ఇప్పటి వరకు ఎందుకు చేయించలేదో తెలుసా? ’’
‘‘డబ్బు లేక..’’
‘‘డబ్బు లేక కాదు.. నెహ్రూ వద్దన్నాడు.. లేకపోతే ఎప్పుడో చేయించేవాణ్ణి. అప్పుడు పక్కనే ఉన్న మహాత్మా గాంధీ కూడా అభ్యంతరం చెప్పలేదు.’’
‘‘గాంధీ ఐతేనేం, నెహ్రూ ఐతే నేం.. మగాళ్లంతా ఇంతే.. భార్యకు బంగారు నగలు చేయించాలంటే వద్దనేవాళ్లే’’
‘‘ఇవన్నీ వింటుంటే పిచ్చెక్కేట్టుగా ఉంది.. ఏది వ్యంగ్యమో, ఏది నిజమో అర్థం కావడం లేదు.’’
‘‘ఐదేళ్ల పాలనలో సాధించినవి చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నవాళ్లు ఇదిగో మేం ఇవి సాధించాం తిరిగి అవకాశం ఇవ్వండి అని అడుగుతారు. చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడే.. ఎవరి స్థాయిలో వాళ్లు తాంతియా తోపేదే తప్పంతా అని ఫేక్ న్యూస్‌పై ఆధారపడతారు.’’
*