జనాంతికం - బుద్దా మురళి

అవిశ్వాసం- రైతుబజారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమండోయ్ రైతుబజారుకు వెళ్లి కూరగాయలు తీసుకురండి! మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానమట! ప్రభుత్వం పడిపోయేట్టుంది. తొందరగా వెళ్లండి’’
‘‘కాసేపుప్రశాంతంగా పేపరు చదువుకోనివ్వవా?’’
‘‘అంటే మీ ఉద్దేశం- నాకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. మీరు బయటకు వెళ్లిన తరువాత డైలీ సీరియల్స్ చూస్తూ గడిపేస్తాను అనుకుంటున్నారా? న్యూస్ చానల్స్ నేనూ చూస్తాను. అష్టదిగ్బంధంలో మోదీ, పని చేసిన బాబు వ్యూహం అంటూ మెజారిటీ చానల్స్‌లో చూపిస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ నిర్ణయమే కదా?? ’’
‘‘మెజారిటీ ఎంపీల నిర్ణయం అంతే కానీ మెజారిటీ చానల్స్ నిర్ణయం కాదు. అన్ని పార్టీలకు చానల్స్ ఉన్నాయి. అంత మాత్రాన చానల్స్ నిర్ణయం పార్టీల నిర్ణయం కాదు. ప్రజలు, చానల్స్, ఎంపీలు వేరు వేరు.’’
‘‘ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అందుకే ప్రజలు ఈ దేశానికి మిలటరీ పాలనే బెస్ట్ అంటున్నారు. గతంలో మెజారిటీ తెలుగు చానల్స్ వ్యతిరేకించినా రాష్ట్ర విభజన చేశారు. ఉండవల్లి బాబాయ్ ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. ఇది అప్రజాస్వామికం అని ఎవరైనా పట్టించుకుంటేనా? మెజారిటీ చానల్స్ నిర్ణయాన్ని అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు అవిశ్వాసంలో కూడా పట్టించుకోరా? అసెంబ్లీ మహా అయితే ఏడాదికి 50 రోజులు నడుస్తుంది. పార్లమెంటు వంద రోజులు నడుస్తుందేమో . మరి చానల్స్ రోజుకు 24 గంటల పాటు నిరంతరాయంగా నడుస్తూనే ఉంటాయి కదా? 24 గంటలు నడిచే చానల్స్ కన్నా ఏడాదిలో కొన్ని రోజుల పాటు నడిచే చట్టసభలే ఎక్కువా? మెజారిటీకి ప్రజాస్వామ్యంలో విలువ లేదా? ’’
‘‘నీతో వాదించడం నావల్ల కాదు కానీ మోదీ ప్రభుత్వం పడిపోయినా, పాతుకుపోయినా మన రైతుబజార్‌లో కూరగాయల ధరలపై ప్రభావం పడదు.’’
‘‘సరే నమ్ముతా కానీ , ఈ వార్త చూడండి బాబు అవిశ్వాస తీర్మానంతో పడిపోయిన స్టాక్ మార్కెట్ అనే వార్త చదివారా? మరిప్పుడేమంటారు.’’
‘‘మార్కెట్ పడిపోయినందుకు ఏదో కారణం రాయాలి. వాళ్ల బాధలు వాళ్లవి. నిన్న అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తే మార్కెట్ పడిపోయిందని రాశారు కదా? ఇదిగో నెట్‌లో చూడు- ఈ రోజు స్టాక్ ఇండెక్స్ ఎగబాకింది. అవిశ్వాస తీర్మానం వల్ల మార్కెట్‌లో సెంటిమెంట్ బలపడిందంటావా? దీనికేమంటావు’’
‘‘మరి మీరే చెప్పారు కదా? ప్రపంచ కుగ్రామంగా మారింది. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా ఇతరులపై ప్రభావం ఉంటుంది. అమెరికా, చైనాలు పరస్పరం ఆర్థిక ఆంక్షలు విధించుకుంటే ఇక్కడ టమాటా ధర పెరిగింది. అమెరికాలో ట్రంప్ గెలిస్తే సత్రపల్లి పిన్నత్త రెండో కూతురి వీసా రద్దయిందా? లేదా? ’’
‘‘కొన్ని విషయాల్లో సంబంధం ఉంటుంది. కొన్ని విషయాల్లో ఉండదు’’
‘‘అంతేలెండి.. మీ బంధువులు ఇంటికి వచ్చినా, వాళ్లకేమన్నా సమస్య వచ్చినా స్పందిస్తారు. అదే మా అమ్మ తరఫువాళ్లు వస్తే నేను ఎలాంటి సిఫారసు చేయను అంటారు. ఇదీ అంతే! మనుషులేమన్నా దేశాల కన్నా అతీతులా?’’
‘‘అది వేరు.. ఇది వేరు’’
‘‘మనకు నచ్చితే రెండూ ఒకటే, నచ్చక పోతే వేరువేరు.. అంతే కదా? ఇప్పుడు రెండు రాష్ట్రాలను తిరిగి అతకబెడితే మీకు పెన్షన్ వస్తుందా? రాదా? వస్తే ఎవరిస్తారు. ఇవ్వకపోతే ఎవరినడగాలి?’’
‘‘అవిశ్వాస తీర్మానానికి, పెన్షన్‌కు సంబంధం ఏంటోయ్ తెలియకుండా మాట్లాడకు’’
‘‘తెలియంది నాకు కాదు మీకే.. ఉండవల్లి అరుణ్‌కుమార్ బాబాయ్ కన్నా మీకెక్కువ తెలుసా? నేను టీవీలో వినలేదు అనుకోకండి. విభజన సరిగా జరగలేదు. ఈ విషయాన్ని పార్లమెంటులో నిరూపించాలని ఉండవల్లి ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాడు. బాబును కూడా కలిసొచ్చాడు. ఇద్దరి మేధస్సులు కలిశాయి. అంటే రెండు ముక్కలను అతక బెట్టడం ఖాయం. ఉండవల్లి వీడియోలు నేను అన్నీ చూశాను.’’
‘‘సరే.. నీకేమర్థమైందో చెప్పు?’’
‘‘పార్లమెంటులో కొందరు నిల్చున్నారు. కొందరు కూర్చున్నారు. బాబాయ్ ఏదో రూల్స్ చెప్పాడు. సభ ఆర్డర్‌లో లేదు కాబట్టి తీసుకున్న నిర్ణయాలు చెల్లవు అని. నిర్ణయం చెల్లనప్పుడు విడిపోయిన రెండు రాష్ట్రాలను తిరిగి అతక బెడతారు కదా? ’’
‘‘బాబాయ్ చెప్పినట్టు జరిగితే నన్ను మించిన అదృష్టవంతుడు ఉండడు. ఇంత కాలానికైనా నాకు స్వేచ్ఛ లభిస్తుంది. ’’
‘‘ఎలా?’’
‘‘్ఫ్లష్‌బ్యాక్‌లోకి వెళ్లి నలభై ఏళ్ల క్రితం జరిగిన మన పెళ్లిన గుర్తు చేసుకో! మంగళసూత్రం కట్టెప్పుడు మీ చీరాల పిన్నికొడుకు తుమ్మాడు. తుమ్మిన పెళ్లి చెల్లుతుందా? అంతేనా.. ఆరోజు పెళ్లి భోజనంలో సాంబరులో ఉప్పు సరిగా వేయలేదు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీళ్ల పాలు ఇచ్చారు. మీ తమ్ముడు నాకు కనీస మర్యాద చేయలేదు. ఇవన్నీ పోనీయ్ అని సర్దు కోవచ్చు. తలంబ్రాలకు సబ్సిడీ బియ్యం ఉపయోగించారు. ఆ బియ్యం తినడానికే కానీ చట్ట ప్రకారం తలంబ్రాలకు ఉపయోగించరాదు. ఈ విషయాన్ని కోర్టులో నిరూపిస్తే నాకు నీ నుంచి విముక్తి ఖాయం. అందుకే ఉండవల్లి బాబాయ్ రాష్ట్ర విభజన కేసులో విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’
‘‘అంటే మోదీపై ఆవిశ్వాస తీర్మానం నెగ్గితే మనం విడిపోవాల్సి వస్తుందా?’’
‘‘అవును.. కానీ అది నా ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది’’
‘‘సరే ఇప్పుడు అవిశ్వాసం ఏమవుతుందంటారు?’’
‘‘ఏమవుతుంది? బాహుబలి తరువాత ఏమైంది? బాహుబలి-2 వచ్చింది. మహేశ్‌బాబు ఒక్కడు తరువాత అర్జున్, అతడు, పోకిరీ వచ్చాయి. ఇప్పుడు ఇంకో సినిమా వస్తుంది. శ్రీరెడ్డి ఎపిసోడ్‌ను టీవీల్లో చూసి భూ కంపం ఖాయం అనుకున్నాం. వారం రోజుల తరువాత మరో కథ. వారిద్దరినీ నగర బహిష్కరణ చేస్తే హైదరాబాద్ ఇమేజ్ ప్రమాదంలో పడిందని ఒకరు, ప్రపంచానికి చివరి రోజులు దాపురించాయని కొందరు మేధావులు ఆవేదన చెందారు. తరువాత వారిద్దరూ ఇష్టపడ్డారు. మన ముందుకు మరో ఎపిసోడ్ వస్తుంది. అంతకు మించి ఏమీ కాదు’’
‘‘అదేంటండి.. మరీ టీవీల్లో ఆ బ్రేకింగ్ సౌండ్‌లు’’
‘‘చానల్స్‌కు మసాలా? నేతలకు ఎన్నికల ప్రచారం. ఏదీ పడిపోదు. దేన్నీ అతక బెట్టరు. మనకు కాసింత కాలక్షేపం. ఇంతకు మించి ఏమీ కాదు’’
*

-- buddhamurali2464@gmail.com