జనాంతికం - బుద్దా మురళి

అంతా కాకతాళీయం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తిరుపతయ్య తన కుమార్తెకు ఎక్కడెక్కడో పెళ్లి సంబంధాలు చూశారు. యాధృచ్చికంగా సినిమా హాలులో కలిసిన కాలేజీ క్లాస్‌మెట్ అందరికీ నచ్చడంతో ఆ సంబంధమే ఖాయం చేశారు. ఎవరికి ఎక్కడ రాసి పెట్టి ఉంటే అక్కడ అవుతుంది’’
‘‘ఆ కుర్రాడు అదే సమయానికి అక్కడికి రావడం, ఒకే కాలేజీ, కలిసి చదువుకున్నారు. ఎప్పటి నుంచో పరిచయాలు, అప్పుడే యాధృచ్చికంగా కలవడం ఆశ్చర్యం. కానీ బయట మాత్రం- చివరకు ప్రేమించిన అబ్బాయితో పెళ్లికి ఒప్పుకున్నారంటూ ఒకటే గుసగుసలు.’’
‘‘లోకులు పలు కాకులు.. పట్టించుకోవద్దు’’
‘‘నిజమే.. యాధృచ్చికంగా ఎన్ని జరగడం లేదు. నిన్నటికి నిన్న తమిళనాడులో శశికళ పట్ట్భాషేకానికి సిద్ధం అవుతున్న సమయంలో రెండు దశాబ్దాల కాలం నాటి పాత కేసు చెక్కపెట్టె లోంచి బయటకు పరిగెత్తుకు రావడం. వెంటనే సుప్రీం కోర్టు తీర్పు. శశికళ జైలు పాలు కావడం అంతా యాధృచ్చికంగానే. పన్నీరు సెల్వం మాట్లాడగలడు అని చాలా మందికి తెలియదు అలాంటి సెల్వం మాట్లాడడమే కాకుండా తిరుగుబాటు చేయడం అంతా దైవ నిర్ణయం.. కొన్ని ఇలా జరిగిపోతుంటాయి అంతే..’’
‘‘అవును... గిట్టని వాళ్లు తెరవెనుక మోదీ గారి హస్తం ఉందంటారు’’
‘‘పెద్దమనిషిని ఊరకే అలా ఆడిపోసుకుంటున్నారు. పెద్దనోట్ల రద్దుతో ఎంత నల్లధనం బయటపడిందో లెక్క పెట్టడంలోనే ఆయన తలమునకలై ఉన్నారు. పన్నీరు తిరుగుబాటుతో ఆయనకేం సంబంధం ?’’
‘‘వెయ్యి రూపాయల చిల్లర లెక్కపెట్టడమే మనకు కష్టం. ఇన్ని కోట్ల మంది ఉన్నదేశంలో నల్లధనాన్ని ఒక్క వ్యక్తి లెక్క పెట్టడం అంటే మాటలా? ప్రధానమంత్రి కావచ్చు కానీ- ఆయనా మనిషే కదా? మనలానే రెండు చేతులే ఉంటాయి కదా? ఎందుకు అర్ధం చేసుకోరు’’
‘‘యాధృచ్చికంగా అని ఎంత మనుసుకు నచ్చ చెప్పుకున్నా మళ్లీ ఎందుకో నాకే అనుమానం వస్తోంది? అన్నీ ఒకేసారి వరుసగా ఎలా జరుగుతాయి? అనే డౌట్ వస్తుంది. ఇదంతా ప్లాన్‌గా చేసిందా? యాధృచ్చికమా? ఏది నిజం?’’
‘‘బాలకృష్ణ తెలుసు కదా?’’
‘‘బాలకృష్ణ తెలియని తెలుగువాడుంటాడా? తొడ కొడితే అగ్ని పర్వతాలు పేలిపోతాయి, కొండలు కరిగి పోతాయి. గాలి నిలిచిపోతుంది?’’
‘‘కదా..? ముందుకు వచ్చే రైలును కంటి చూపుతో వెనక్కి పోయేట్టు చేసేంత అత్యంత శక్తివంతమైన హీరో ఆయన. ఇంట్లో ఎదురుగా ఉన్న ఇద్దరిని తుపాకితో కాల్చారు. తూటాలు శరీరంలో దిగాయి. తూటాలను ఆస్పత్రిలో డాక్టర్లు తొలగించారు. కోర్టు విచారణలో తూటాలు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయో తెలియదని ఏకగ్రీవంగా అంతా చెప్పారు. పౌరాణిక సినిమాల్లో ఆకాశం నుంచి పూల వర్షం కురిసినట్టు చూపిస్తే అంతా అభూత కల్పన అంటారు. కలికాలంలో ఆకాశం నుంచి తూటాలు వచ్చాయనే నమ్మకంతో బాలకృష్ణ నిర్దోషిగా బయటపడ్డాడు. మరి దీనే్నమంటారు? బాలకృష్ణ ఇంట్లో చర్చల్లో ఘర్షణ.. అదే సమయంలో ఆకాశం నుంచి తూటాలు పడడం, తీర్పు తరువాత వారు తీసిన సినిమాలో బాలకృష్ణ నటించడం అంతా యాధృచ్చికం అంటే నమ్మడం లేదా? ఇదీ అంతే.’’
‘‘సుదూరంలో ఉన్న శత్రువును కూడా కళ్లు మూసుకొని తూటాతో హీరో పేల్చేస్తాడు.. ఇది సినిమా. ఎదురుగా ఉన్న వారిని కూడా సరిగా పేల్చలేరు. ఇది నిజం. ఆకాశం నుంచి తూటాలు వచ్చి పడ్డాయి.. ఇది తీర్పు. ఇంకోటి చెప్పాలా? ఎమ్మెల్సీని కొనేందుకు ఓ ఎమ్మెల్యే 50 లక్షలతో వచ్చి పట్టుపడ్డాడు. సినిమా షూటింగ్ అంత స్పష్టంగా కెమెరాతో సినిమా తీశారు. కేసు బయటకు రాగానే యాధృచ్చికంగా బిగ్‌బాస్ మకాం మార్చారు. కేసు గప్‌చుప్ . అంతా యాధృచ్చికం. ’’
‘‘ఇంతకూ తమిళనాడులో జరిగింది యాధృచ్చికం కాదా? శశికళ అవినీతి పరురాలు కాదా? ’’
‘‘మూడు దశాబ్దాల నుంచి అధికారానికి దగ్గరగా రాజకీయాల్లో ఉన్న ఆమె అవినీతి గాలి సోకకుండా ఉండడం సాధ్యమా? అవకాశం లేని వాళ్లు తప్ప- మనుషులు అవినీతికి దూరంగా ఉండడం సాధ్యం కాదు.’’
‘‘మొన్నో ఫ్రెండ్ గవర్నమెంట్ ఆఫీసులో కంప్యూటర్లు చూపించి ఆఫీసులో ఇవే ఫవర్‌ఫుల్, అవినీతికి దూరంగా ఉండేవి అన్నాడు’’
‘‘అంటే రాజకీయాల్లో అంతా అవినీతి పరులేనా?’’
‘‘నెలకు జీతం రూపాయితో ఏళ్లపాటు పార్టీని వైభవోపేతంగా నడిపి, ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి, కోట్ల రూపాయలు గడించిన వాళ్లు కూడా ఉన్నారు.’’
‘‘అవినీతి ఉందంటావా? లేదంటావా? ’’
‘‘గాలి ఉందంటే- చూపించమంటే చూపిస్తావా? గాలి లేకపోతే నువ్వు బతుకుతావా? ఇప్పుడు చెప్పు అవినీతి ఉందా? లేదా? ’’
‘‘శశికళ అవినీతి పరురాలే అంటావు, అమె జైలుకు వెళ్లడం, పన్నీర్ సెల్వం తిరుగుబాటు అన్నీ యాధృచ్చికమే అంటే అనుమానం అంటావు.. ఇంతకూ ఏమంటావు చెప్పు ’’
‘‘అన్ని వ్యవస్థల్లో అవినీతి పరులే అని చెప్పలేను కానీ మనుషుల ప్రమేయం ఉన్న చోట, అధికారం ఉన్న చోట అవినీతి ఉంటుంది. వడ్ల గింజలో బియ్యపు గింజలా ఎక్కడో ఒకరో ఇద్దరూ అవినీతిలో సాంకేతిక నైపుణ్యం లేక వెనకబడిన వారు ఉంటారు. అలాంటి వాళ్లు ఇలా పట్టుపడి జైలుకు వెళతారు. నైపుణ్యం ఉన్న వాళ్లు పట్టుపడరు. ’’
‘‘అంటే- అంతా అవినీతి పరులే అంటావు?’’
‘‘అలా నేను అనలేదు’’
‘‘నువ్వు చెబుతుంటే అర్థం అవుతున్నట్టే ఉంటుంది, మళ్లీ అనుమానం వస్తోంది’’
‘‘ఇంతకూ వ్యవస్థల మీద నీ అభిప్రాయం ఏంటి? ’’
‘‘మనుషులు ఉండే అన్ని వ్యవస్థలపైన నాకు ఒకే విధమైన అభిప్రాయం. వారి వారి హోదాలు, అధికారాలు, స్థానాలు వేరువేరు కావచ్చు కానీ అన్ని వ్యవస్థలూ ఒకటే. అన్ని వ్యవస్థలు నీతి నిజాయితీలతో గుబాళిస్తున్నాయి.’’
‘తమిళనాడులో ఏం జరుగుతుంది అంటావ్’’
‘‘శశికళ జైలుకు వెళితే ఎంచక్కా సిఎం పీఠంపై కూర్చునే అవకాశం ఉన్న సెల్వంను రెంటికీ చెడ్డ రేవడిని చేశారు. మోదీ దయతలిచి రాజకీయ ఉపాధి కల్పిస్తే సరి.. లేదంటే యాధృచ్చికంగా జరిగిన సంఘటనలన్నింటి గూర్చి సెల్వం యాధృచ్చికంగా బయట పెట్టవచ్చు. ’’
‘‘తమిళ యాధృచ్చికం తెలుగునాట జరగవచ్చా?’’
‘‘ఒకానొక నేతను జైలుకు పంపితే- ప్రస్తుత ‘మిత్రుడు’ మరింత శక్తిమంతం అవుతాడు.. కానీ, మోదీకి అది లాభసాటి వ్యాపారం కాదు. అలాంటి తప్పు ఎప్పుడూ చేయడు. ఎవరికి మెజారిటీ వస్తే వారికే స్నేహహస్తం అందిస్తాడు యాధృచ్చికంగా..’’
*

- బుద్దా మురళి