జనాంతికం - బుద్దా మురళి

కుక్కలొస్తున్నాయ్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏమైంది..? అలా ఉలిక్కిపడి లేచి పిచ్చిచూపులు చూస్తున్నారు? గ్యాస్ సిలిండర్‌కు వంద రూపాయలు పెంచగానే అలా వెర్రిచూపులు చూడాలా? అచ్చే దిన్ అంటే ఈ మాత్రం భరించాలి తప్పదు’’
‘‘్ధరలు తగ్గితే పిచ్చిచూపులు చూస్తానేమో కానీ, బడ్జెట్ రోజు సిగరెట్ల ధర, రోజూ పప్పుల ధర, వారానికోసారి పెట్రోల్ ధర పెరిగితే ఆశ్చర్యపోయేంత పిచ్చోన్ని కాను.’’
‘‘మరి ఆ ఉలికిపాటు ఎందుకు?’’
‘‘కలలో కుక్కలు వస్తే అరిష్టమా? ’’
‘‘ఎవరికి నీకా? కుక్కలకా? ’’
‘‘అసలే గుండె దడగా ఉంది.. జోకులు వేస్తే నవ్వే స్థితిలో లేను. పిచ్చి పిచ్చి కలలు వచ్చాయి? ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. తెల్లవారు జామున వచ్చిన కలలు నిజం అవుతాయని అంటారు.. అందుకే నా భయం’’
‘‘సమయానికి గరికపాటి వారి ప్రవనచనాలు కూడా రావడం లేదు. ఆయనేమైనా చెప్పి ఉండేవారేమో? పేరును బట్టి ఫలితం ఉండొచ్చు. రావెల, దివాకర్ లాంటి పేర్లు ఉంటే కుక్కే కామధేనువు అవుతుంది. మన లాంటి వారికే కుక్కే ప్రాణాపాయం కావచ్చు ఇంతకూ మీ కలేంటో?’’
‘‘ఒకదానికొకటి సంబంధం లేకుండా పిచ్చిపిచ్చిగా కల వచ్చింది?’’
‘‘అర్ధరాత్రి వరకు న్యూస్ చానల్స్ చూస్తూ అలానే నిద్రలోకి జారుకుంటారు. బారెడు పొద్దెక్కిన తరువాత టీవిల్లో చర్చలను అలానే కలత నిద్రలో వింటారు. పిచ్చికలలు కంటూ లేచాక పిచ్చిమాటలు కాకుంటే ఇంకేం వస్తాయి?’’
‘‘ఇదిగో.. నేనేదో అడిగానని, నీ కోపం కూడా కలిపి చెప్పకు. తెలియక పోతే తెలియదను. మేధావులకు తెలియదు అనే పదం పలకడం రాదు. ఈ జాబితాలో నువ్వూ చేరుతున్నావా? ’’
‘‘మాటలు మర్యాదగా రానివ్వండి.. ఏమైనా అనండి కానీ మేధావి అంటే ఊరుకునేది లేదు’’
‘‘సర్లేవోయ్.. ఏదో చమత్కరించాను. భార్య మీద ఆ మాత్రం జోకులేసే అధికారం లేదా?’’
‘‘సరే.. ఇంతకూ ఏం కల వచ్చింది?’’
‘‘నీకో సంగతి తెలుసా? రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు పడడం వెనుక ఆశ్చర్యకరమైన విషయం ఉంది తెలుసా? నిజానికి అక్కడ అణుబాంబు వేయాలనేది అమెరికా ప్లాన్ కాదు. యుద్ధవిమానానికి కుక్క అడ్డు రావడం వల్ల ఎక్కడో వేయాలనుకున్న బాం బులు హిరొషిమా,నాగసాకిల్లో అణుబాంబులు పడ్డాయి’’
‘‘నిజమా..? రావెల కుమార రత్నం అమ్మాయి చేయి పట్టుకోవడానికి రోడ్డుపై అడ్డదిడ్డంగా పరిగెత్తిన కుక్కే కారణం, దివాకరుని బస్సు పడిపోయి పదిమంది చనిపోతే కుక్కే కారణం అని తెలుసు.. కానీ ఆకాశంలో కూడా కుక్కలుంటాయా? ’’
‘‘నువ్వు మరీ ఇలా అడిగితే నేనేం చెప్పాలి? నాకు కలలో కనిపించింది. చెప్పాను.. విమానంలోనే కుక్క అడ్డం వచ్చిందో లేక విమానానికి కుక్క అడ్డం వచ్చిందో అంత కరెక్ట్‌గా గుర్తు లేదు. కల కదా? ’’
‘‘సరే.. మీ కల మొత్తం చెప్పండి?’’
‘‘అమెరికాలో మన పిల్లలు ట్రంప్‌ను నిలదీశారు. ఔను.. మన పిల్లలు అమెరికాకు ఎప్పుడు వెళ్లారు?’’
‘‘ఆ.. మన పిల్లలు అమెరికాలో ట్రంప్‌కు బుద్ధి చెప్పారా? తుమ్మక ముందే ఊడిపోయే ప్రైవేటు ఉద్యోగం. పిల్లలను అమెరికా పంపేంత సీన్ మీకు లేదు, వెళ్లేంత సీన్ వాళ్లకు లేదు.. పనికి మాలిన కలలు. రెండు నెలల నుంచి సినిమాకు తీసుకెళ్లమని అడిగితే దిక్కు లేదు. పిల్లలు అమెరికాలోనట!’’
‘‘అబ్బా.. ఉండవే? ట్రంప్ అమెరికన్లకు ఇండియాలో ఆశ్రయం ఇవ్వాలని వేడుకుంటూ ఉత్తరం రాసినట్టు కలొచ్చింది’’
‘‘దీనికి ఉలికిపడడం ఎందుకు? ఏమో నిజం కావచ్చు. నేతల్లో నైతిక విలువలు, మన పాలకుల నోట్లో నిజాలు, గుంతలు లేని రోడ్లు, సమయానికి వచ్చే రైళ్లు, లంచాలు తీసుకోని ప్రభుత్వ ఆఫీసులు, గ్రహాంతర వాసులు, కాశ్మీర్ సమస్య పరిష్కారం, పాకిస్తాన్‌లో శాంతి, యోగా శిబిరాల్లో తాలిబన్లు, అమరావతికి దావోస్, మోత్కుపల్లికి గవర్నర్ పదవి.. ఏమో నిజం కావచ్చు.. ఎవరు చెప్పొచ్చారు?’’
‘‘ఇదిగో కల వచ్చింది.. నాకు నువ్వు చెబుతున్నవి ఎప్పటికీ జరగని కలలు’’
‘‘మిమ్మల్ని అంతగా భయపెట్టిన కలేంటో చెప్పండి.’’
‘‘ఒక్క క్షణం ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా విను. ఒకేసారి ఊర్లో ఉన్న కుక్కలన్నీ మనపైకి దాడి చేసి జీవితమంతా కష్టపడి కట్టుకున్న ఇంటిని స్వాధీనం చేసుకుని మనను బయటకు పంపిస్తే ఎలా ఉంటుంది? ఆలోచించు’’
‘‘ఇదేం కల? ఇళ్లు, స్థలాలు, చివరకు శ్మశాన వాటికలైనా మనుషులు ఆక్రమిస్తారు కానీ- ఇదేం వింతండీ.. కుక్కలు ఆక్రమించుకోవడం ఏంటి? ’’
‘‘అదేనే- అడవిలో, గ్రామాల్లో, నగరంలో ఉన్న జంతువులన్నీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమావేశం జరిపాయి. తమ మనోభావాలను దెబ్బతీసిన మనుషులపై యుద్ధానికి సిద్ధం అయినట్టు కలొచ్చింది.
ప్రధానమంత్రిని ఓ నాయకుడు విమర్శిస్తే ఆయనేమో ‘ఔను.. నేను గాడిదనే నమ్మిన బంటును’ అంటూ మనల్ని కించపరుస్తున్నాడు. మనిషివా? పశువ్వా? అని ఒకరు, నీకన్నా కుక్కలు నయం అని ఒకరు, ఎక్కడ ఏం జరిగినా కుక్క అడ్డం వచ్చిందని మరొకరు.. ఇలా మనుషులు హీనంగా మన పేరును వాడుకుంటూ మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు.. అని జంతువులన్నీ సమావేశంలో మనుషులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. అంతు చూడాలని నిర్ణయించుకున్నాయి. కుక్క, నక్క, గాడిద కూడా ఆవేశంతో ఊగిపోయి అల్ప మానవులను మాతో పోల్చడం ఏమిటని ఊగిపోతున్నాయి. ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నది మనుషులే కానీ జంతువులు కాదు. లంచం తీసుకునే ఒక్క కుక్కనైనా చూపించండి అంటూ కుక్కలు. మా తెరువు వస్తే వెనక కాళ్లతో తంతాం కానీ మేమేమన్నా తడిగొంతుతో ప్రాణాలు తీసే మనుషులమా? అని గాడిదలు. చీమ నుంచి ఏనుగు వరకు మనం అంతా ప్రకృతి ధర్మం ప్రకారం నడుచుకుంటాం. సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు ఒక్కరూ నిజాయితీగా ఉండరు.. అలాంటి వారితో మన జంతువులను పోల్చడమా? అని గండు చీమ ఆవేదనగా పలికింది. మనుషులు తమ మనోభావాలు దెబ్బతీశారని, మనుషులపై దాడికి మూకుమ్మడిగా వస్తున్నట్టు కల వచ్చింది. ప్రతి గల్లీ మాకు తెలుసు అని కుక్కలు ముందు పరిగెత్తుకొస్తూ దారి చూపుతుంటే వాటి వెనుక సమస్త జంతుజాలం వస్తోన్నట్టు కలొచ్చింది. తెల్లవారు జామున వచ్చిన కల నిజమవుతుందంటారు కదా?’’
‘‘నిజం అయితే బాగుండు!’’
*

- బుద్దా మురళి