జనాంతికం - బుద్దా మురళి

విగ్రహాల కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈరోజుల్లో కూడా అంతటి మహానుభావులు ఉన్నారంటే నమ్మలేం. వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో మోసిన శ్రవణుడి గురించి పురాణాల్లో విన్నాం, తల్లిదండ్రులను దేవతల విగ్రహాలుగా మలిచిన కలియుగ శ్రవణుడిని మీ వీధిలో చూశా..’’
‘‘దేని గురించి ?’’
‘‘మీ ఇంటికి వస్తుంటే మూలమలుపు మీద శ్రావణ్ కుమార్ అనే నేమ్ ప్లేట్ ఉన్న ఇంటిని, ఇంటి ముందున్న విగ్రహాలను చూశాను’’
‘‘బుక్‌పై కవర్‌ను చూసి బుక్‌ను అంచనా వేయవద్దన్నట్టు, ఇంటి ముందు విగ్రహాలను చూసి ఇంటి యజమానిని అంచనా వేయవద్దు’’
‘‘మంచితనాన్ని కూడా మెచ్చుకోలేక పోవడం బాగాలేదోయ్.’’
‘‘శ్రావణ్ ఇంటి విగ్రహాల గురించి నీకు తెలుసా?’’
‘‘విగ్రహాల సైజు ఎంత? వాటి కోసం ఎంత ఖర్చు చేశాడని కాదోయ్. చనిపోయిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి విగ్రహాలను తయారు చేయించాలనే అతని పెద్దమనసును చూసి మెచ్చుకోవాలి’’
‘‘వారి తల్లిదండ్రులు చనిపోయారని నీకెవరు చెప్పారు? నగరంలోని ప్రముఖ వృద్ధాశ్రమంలో విశ్రాంతి తీసుకుంటూ, దేవుడా మమ్మల్ని పైకి ఎప్పుడు తీసుకుపోతావా? అని ఎదురు చూస్తున్నారు’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘అందుకే చెప్పా.. రాజకీయాలతో నాకేం పని అనుకుంటే ఏదీ అర్థం కాదు. రాజకీయాలను దగ్గరి నుంచి పరిశీలించాలి.’’
‘‘రాజకీయాలకు, విగ్రహాలకు సంబంధం ఏమిటి?’’
‘‘దేవుని దయవల్ల నిండా నూరేళ్లు బతికిన కరుణానిధి తన జీవిత కాలమంతా విగ్రహారాధనను వ్యతిరేకించారు. చివరకు ఆయన పోయాక మొన్న చెన్నైలో కుమారుడి నాయకత్వంలో విగ్రహం ఏర్పాటు చేశారు. కూటముల నాయకులు చాలా మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.’’
‘‘ఔను.. ఐతే..?’’
‘‘సర్దార్ పటేల్ విగ్రహం ఏర్పాటుకు ముందు ప్రపంచంలో అత్యంత పెద్ద విగ్రహం ఎవరిదో తెలుసా? బౌద్ధ మతాన్ని స్థాపించిన బుద్ధునిది. విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపిస్తే, ప్రపంచంలోకెల్లా ఎత్తయిన విగ్రహం ఆయనదే కావడం వింతగా లేదు’’
‘‘ఔను! ఐతే?’’
‘‘హఠాత్తుగా పటేల్ భారీ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? స్వాతంత్య్ర పోరాటం కాంగ్రెస్ నేతృత్వంలో జరగడం, దేశభక్తులంతా కాంగ్రెస్ జాబితాలోనే ఉండిపోవడంతో, గాంధీ, నెహ్రూలను పక్కకు పంపి పటేల్‌ను తమ పార్టీలో చేర్పించుకోవడానికి భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. ’’
‘‘నిజంగా ఇది వింతే.. ఐదేళ్ల కోసం ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే వాళ్లు ఏడాది రెండేళ్లు కూడా గెలిపించిన పార్టీలో ఉండకుండా పార్టీ మార్చేస్తున్నారు. కానీ ఆరు దశాబ్దాల క్రితం మరణించిన పటేల్‌ను పార్టీ మార్చి తమ పార్టీలో చేర్చుకోవడం వింతే!. ఈ రోజుల్లో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నో జి మ్మిక్కులు చేస్తారు. విగ్రహాలకు, రాజకీయాలకు, శ్రావణ్ కుమార్ ఇంటి ముందు వాళ్ల అమ్మానాన్నల విగ్రహాలకు సంబంధం ఏమిటి?’’
‘‘ఆకలికి నకనకలాడే వారు ఎంతో మంది ఉండగా, వేల కోట్ల ఖర్చుతో పటేల్ విగ్రహం ఏర్పాటు చేస్తారా? అని తీవ్రంగా విమర్శించారు. నవ్యాంధ్రలో ఎన్టీఆర్ భారీ విగ్రహం నిర్మిస్తున్నారు. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం కలిగినట్టు- అదేదో ఆఫ్రికా దేశం వారికి హఠాత్తుగా గాంధీజీ విగ్రహం చూడగానే జ్ఞానోదయం కలిగి.. గాంధీ మహాత్ముడిలో జాతి వివక్ష కనిపించగా- అతని విగ్రహాన్ని తొలగించారట! ’’
‘‘ఔను మీడియాలో చూశాను.’’
‘‘మరి దీని గురించి ఏమంటావు?’’
‘‘ఆఫ్రికా సంగతి మనకెందుకు కానీ.. ఎన్టీఆర్ విగ్రహం గురించి తెలుసు?’’
‘‘విమర్శలు వచ్చినా విననంత గాఢమైన ప్రేమ ఎన్టీఆర్‌పై ఉందంటావా?’’
‘‘ఆ మాట నేనెక్కడన్నాను. అసలే ఎన్నికల కాలం. తెలంగాణలోనేమో ముందస్తుకు వెళ్లి మళ్లీ కుర్చీపై ధీమాగా కూర్చున్న కేసీఆర్- చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నారు. ఇటు కేసీఆర్ ఇలా చెలరేగిపోతుంటే, అటు బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఆందోళన ఎలా ఉన్నా గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడాలి కదా? ఎన్టీఆర్ అభిమానుల మద్దతు సంపాదించేందుకు విగ్రహానికి భారీ స్కెచ్ వేసినట్టుంది. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే.’’
‘‘ఎన్టీఆర్‌ను గద్దె దించి, మానసిక క్షోభకు గురి చేసి పైకి పోయేట్టు చేసిన వారే విగ్రహం ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా లేదా?’’
‘‘రాజకీయం అన్నాక అన్నీ ఉంటాయి. మరి ఎంతో కాలం నుంచి అధికారంపై కనే్నసి ఉంచితే మధ్యలో చిన్నరాణి వచ్చి అధికారం లాగేసుకునేట్టు ఉంటే ఊరుకుంటారా? పుష్కరాలకు ఏకంగా దేవుడి రూపంలో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తేనే జనం ఆదరించారు. ఇప్పుడు పటేల్ విగ్రహంతో పోటీ పడి ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పే ముంది? పర్యాటక రంగం వృద్ధికీ ఉపయోగపడుతుంది. ’’
‘‘అంతే అంటావా?’’
‘‘అంతే.. నువ్వు శ్రావణ్ కుమార్ తల్లిదండ్రుల విగ్రహాల గురించి తప్ప అన్నీ చెబుతున్నావ్’’
‘‘ సరే చెబుతా.. శ్రావణ్‌కుమార్ తండ్రి బాగా సంపన్నుడు. ఆయన సంపాదన అంతా కష్టార్జితమే. పిల్లలకు అప్పనంగా ఆస్తి ఇస్తే బయటకు పంపిస్తారనే లోకజ్ఞానం ఉన్నోడు. దాంతో శ్రావణుడు బాగా ఆలోచించి తల్లిదండ్రుల విగ్రహాలను తయారు చేయించాడు. బతికుండగానే తమ విగ్రహాలను చేయించిన కుమారుడిని చూసి తల్లిదండ్రుల ఆనందానికి అంతు లేదు..’’
‘‘ఆ తర్వాత?’’
‘‘ఆ తన్మయత్వంలో ఆస్తి మొత్తం కుమారుడికి అప్పగించారు’’
‘‘ఆ?..’’
‘‘ఆస్తి ఇచ్చాక తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో, వారి విగ్రహాలు ఇంటి ముందు.. ఇదే- ఆ ఇంటిముందున్న విగ్రహాల కథ’’
‘‘ఆ..??’’
‘‘విగ్రహాలను చూడగానే- ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో అని పించింది సినారెకు.. అద్భుతమైన శిల్ప సంపదను చూడగానే ఆ మహాకవికి అలా అనిపించడం సహజమే.. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ రాజకీయ విగ్రహాలే. అవసరాల కోసం పుడుతున్న విగ్రహాలే. రాజకీయాలను జాగ్రత్తగా గమనిస్తే, ఏ విగ్రహం వెనుక ఏ వ్యూహం దాగుందో తెలుస్తుంది. శ్రావణుడు రాజకీయాలను బాగా వంటబట్టించుకున్నాడు. ఆస్తి తప్ప రాజకీయాలు తెలియకపోవడంతో అతని తండ్రి శేష జీవితం వృద్ధాశ్రమం పాలైంది.’’
*

buddhamurali2464@gmail.com