జనాంతికం - బుద్దా మురళి

మేధావుల మూఢ నమ్మకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అంతా మాయ, భ్రమ, మోసం, దగా, కుట్ర..’’
‘‘ఏంటోయ్.. తెలుగు సినిమాల టైటిల్స్ చదువుతున్నావా?’’
‘‘కాదు .. ఒక తమ్ముడు నవలోకం అడ్రెస్ వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్లి, మూడు దశాబ్దాల తరువాత తాను వెతికే అడ్రెస్ తప్పు అని గ్రహించి తిరిగి వచ్చి మీడియా ముందు చెప్పిన ఆణిముత్యాలు..’’
‘‘మేధావిలా అర్థం కాకుండా మాట్లాడ్డం మానవా? అర్థం అయ్యేట్టు చెప్పవచ్చు కదా?’’
‘‘ననే్నమన్నా భరిస్తా కానీ.. మేధావి అని తిడితే సహించేది లేదు. మానవ హక్కుల కమిషన్‌కు వెళతా..’’
‘‘ఫ్రెండ్‌షిప్ కొద్దీ అన్నా.. వదిలేయ్.. ఇంతకూ విషయం ఏందో చెప్పు?’’
‘‘మనిషి జీవితంలో బాల్యం అద్భుతమైంది అంటారు. బాధ్యతలు ఉండవు, సంతోషమే సంతోషం.. చిన్న చిన్న వాటికీ సంతోషించొచ్చు. ’’
‘‘ఇంకెక్కడి బాల్యం? విద్యా వ్యాపారం కార్పొటీకరణ చెందాక ఇంకా బాల్యం బతికే ఉందనుకుంటున్నావా? బండెడు పుస్తకాలు మోస్తూ యూ కేజీలోనే పోటీని తట్టుకోలేక పిల్లలు పిచ్చోళ్లవుతున్నారు. కడుపులో ఉండగానే మంచి కోచింగ్ సెంటర్‌లో సీటు కోసం కలలు కంటున్నారు. బాల్యాన్ని ఎప్పుడో కాకెత్తుకెళ్లింది. ’’
‘‘ఇప్పుడు చర్చ బాల్యం గురించి కాదు. బాల్యం అద్భుతమైందని అంటారు కానీ నేను మాత్రం ఆ తరువాత జీవితమే అద్భుతమైందని అంటా.. 20 ఏళ్ల నుంచి దాదాపు 50 ఏళ్ల వరకే అసలైన జీవితం..’’
‘‘అనుకో.. అది నీ ఇష్టం.. ఐతే?’’
‘‘హైదరాబాద్‌లో నువ్వు ఎప్పుడైనా అడ్రెస్ కోసం వెతికావా?’’
‘‘ఓసారి ఓల్డ్‌సిటీలో ఓ అడ్రెస్ కోసం వెతికితే ఆకతాయి కుర్రాడు తప్పుడు దారి చూపించి రెండు, మూడు గంటల పాటు తిరిగేట్టు చేశాడు. వాడి పీక పిసికేయాలన్నంత కోసం వచ్చింది. ఆ రోజుల్లో హైదరాబాద్‌లో అడ్రస్ పట్టుకోవాలంటే నరకమే అనుకో. ఇప్పుడంటే గూగుల్ మ్యాప్‌తో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. ఔను.. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నేనే పెట్టానని చెప్పుకున్నారు.. కానీ హైదరాబాద్‌ను గూగుల్ మ్యాప్‌లో నేనే పెట్టానని ఎవరూ చెప్పుకోరేంటి?’’
‘‘తప్పుడు అడ్రెస్ చెబితే మూడు గంటలు వృథా అయితేనే నీకు వాడి పీక పిసికేయాలనిపించింది. మరి ఒక అడ్రెస్ వెతుక్కుంటూ మూడు దశాబ్దాల పాటు తిరిగితే ఏమనాలి?’’
‘‘నీకేమన్నా పిచ్చా? ఎంత అమాయకుడైనా ఒక అడ్రెస్ కోసం మూడు దశాబ్దాల పాటు వెతుకుతాడా? మహా ఐతే రెండు మూడు గంటల పాటు వెతికినా కనిపించక పోతే దారిలో కనిపించిన వారిని అడుగుతారు. తాము వెళుతున్నది సరైన దారేనా? అని ఆలోచిస్తారు. అంతేకానీ ఎవరైనా మూడు దశాబ్దాల పాటు దారి సరైనదేనా కాదా? అని ఆలోచించకుండా వెళతారా?’’
‘‘నువ్వు చెబుతున్నది సా మాన్యుల సంగతి, నేను చెబుతున్నది మేధావుల సంగతి. సామాన్యుల జీవితం సామాన్యంగానే ఉంటుంది. రెం డు,మూడు గంటల్లోనే వా ళ్లు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. మేధావులు దేన్నైనా మూడు దశాబ్దాల తరువాతే సమీక్షించుకుంటారు.’’
‘‘నిజమా? నేను నన్మలేకపోతున్నా..’’
‘‘తెలంగాణ సాయుధ పోరాటం తెలుసు కదా?’’
‘‘ప్రపంచానికంతా తెలుసు’’
‘‘సాయుధ పోరాటంలో నిజాం సైన్యం, కాశీం రజ్వీ మూకల చేతిలో మరణించిన వారి కన్నా భారత సైన్యం చేతిలో మరణించిన వారి సంఖ్య ఎక్కువ తెలుసా?’’
‘‘ఐతే- దానికి, దీనికి సంబంధం ఏమిటి?’’
‘‘సాయుధ పోరాటం చివరి దశలో తెలంగాణ రైతాంగం ఆయుధాలు చేపట్టి భారత సైన్యంతో పోరాడుతున్నప్పుడు ఉద్యమ నాయకులు రష్యా వెళ్లి స్టాలిన్‌ను కలిశారు. ఉద్యమం కొనసాగించాలా? వద్దా? అని అడిగేందుకు.’’
‘‘ఈ సంగతి అప్పుడు అనధికారికంగా, ఈ మధ్య రష్యా అధికారికంగానే వెల్లడించింది.’’
‘‘ఆనాటి కమ్యూనిస్టు యోధులు స్టాలిన్‌ను కలిసి చర్చిస్తే, ఆయన ఏమీ చెప్పకుండా ఇండియా మ్యాప్ తెప్పించి- ఇండియా మధ్యలో ఉన్న ప్రాంతంలో జనం తిరుగుబాటు చేస్తే ఎలా విముక్తి చేస్తారని ప్రశ్నించే సరికి మన వాళ్లు ఔను నిజమే కదా? అనుకున్నారు. ’’
‘‘మ్యాప్‌ను చూసి ఉంటే, పాపం దాదాపు ఐదువేల మంది రైతుల ప్రాణాలు పోయేవి కాదు.’’
‘‘దారి తప్పిన తమ్ముడికి, దీనికి సంబంధం ఏమిటో చెప్పనే లేదు’’
‘‘అక్కడికే వస్తున్నాను. మహానాయకులు కలలు కనడంలో తప్పు లేదు. కాస్త ప్రాక్టికల్‌గా ఉండాలి. అడవినే ప్రపంచం అనుకుని నవలోకం అడ్రెస్ వెతుక్కుంటూ వెళితే మూడు దశాబ్దాలైనా అడవి చుట్టూ తిరిగాల్సి వస్తుంది. ఒక అడవి నుంచి మరో అడవిలోకి ప్రవేశిస్తారేమో కానీ నవలోకంలోకి ప్రవేశించరు.’’
‘‘నిజమే.. కానీ..’’
‘‘మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైన 20 నుంచి 50 ఏళ్ల వయసును అడవికి అర్పించి, దారి తప్పామని గ్రహించి బయటకు వచ్చి సభ్య సమాజానికి వాళ్లేం సందేశం ఇస్తున్నట్టు? ’’
’’మనిషన్నాక నమ్మకాలు ఉంటాయి.. ’’
‘‘నమ్మకాలు ఉంటాయి. తప్పనడం లేదు. అదేదో దేశంలో దేవుడిని నమ్ముతూ భూగర్భంలో కొంతకాలం ఉంటే దేవుడు కనిపిస్తాడని కొన్ని వేల మంది అక్కడే ప్రాణాలు వదిలారు. అడవిలో నవలోకం కనిపిస్తుందని చెబితే కొన్ని వేల మంది తమ జీవితాలను పణంగా పెట్టారు.’’
‘‘నమ్మకాలు నిజమే.. కానీ రెండు నమ్మకాలకు తేడా లేదా?’’
‘‘ఒకటి మేధావుల నమ్మకం, మరోటి మూఢ భక్తి నమ్మకం.’’
‘‘ఐతే ఏమంటావ్?’’
‘‘మూడు దశాబ్దాల జీవితం కోల్పోయాక నీకు పునరావాస స్కీమ్ వర్తిస్తుందేమో, నగదు లభిస్తుందేమో కానీ మళ్లీ జీవితం లభించదు’’
‘‘అంటే అన్యాయాలను సహిస్తూ ఉండాలా?’’
‘‘అస్సలు సహించకూడదు. అడవుల్లో కాదు మనుషుల మధ్య ఉండి పోరాడాలి. ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. మేధావుల మూఢ నమ్మకాలు, అమాయకుల మూఢనమ్మకాలు ఒకే నాణానికి రెండు రూపాలు. మూఢ నమ్మకం ఏదైనా మంచిది కాదు. ఏం చేయాలి? ఏం చేస్తే ఏం జరుగుతుంది? మనం ఏం చేయగలం అనే ఆలోచన ఉండాలి.’’ *

buddhamurali2464@gmail.com