జనాంతికం - బుద్దా మురళి

ఫ్రజాస్వామ్యం-వజ్రాయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇదంతా రాజకీయం. నిజంగా ప్రేముంటే ఎప్పుడో చేయాలి. ఎన్నికలు వస్తున్నాయి కదా? ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది.’’
‘‘దేని గురించి నీ ఉపన్యాసం?’’
‘‘ఉపన్యాసం కాదు.. వాస్తవం’’
‘‘అదే దేని గురించి?’’
‘‘ఇంక దేని గురించి.. పది శాతం కోటా గురించి’’
‘‘ఓ అదా.. నువ్వు అచ్చం జర్నలిస్టులానే మాట్లాడుతున్నావురా!’’
‘‘జర్నలిస్టులా మాట్లాడడం ఏమిటి? నేను జర్నలిస్టునే. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. 30 ఏళ్ల నుంచి వర్కింగ్ జర్నలిస్టుగా పని చేస్తున్న నన్ను పట్టుకుని జర్నలిస్టులా మాట్లాడుతున్నావ్ అంటావేంటి?’’
‘‘వర్కింగ్ జర్నలిస్టు అంటే..? ఔను.. ఆ మధ్య ఎవరో ఇండిపెండెంట్ జర్నలిస్టు అని చెప్పుకున్నాడు. ఇండిపెండెంట్ కాని జర్నలిస్టు, వర్క్ చేయని జర్నలిస్టులు కూడా ఉంటారా?’’
‘‘ఇప్పుడు వాటి గురించి ఎందుకు కానీ... పదిశాతం కోటా చర్చను పక్కదారి పట్టిస్తున్నావ్’’
‘‘నువ్వు అచ్చం మనిషిలానే మాట్లాడుతున్నావురా!’’
‘‘జర్నలిస్టులా మాట్లాడుతున్నాను అన్నావు, ఇప్పుడేమో మనిషిలా మాట్లాడుతున్నావు అంటున్నావు.. నీకేమైంది?’’
‘‘పదిశాతం కోటా గురించి మొదట నువ్వేమన్నావు. ఇది రాజకీయ నిర్ణయం అన్నావు కదా? ’’
‘‘ఔను- ఐతే..’’
‘‘నువ్వు జర్నలిస్టులా మాట్లాడుతున్నావు, మనిషిలా మాట్లాడుతున్నావు అంటే ఎలా ఉంటుందో? పదిశాతం కోటాను రాజకీయ నిర్ణయం అనడం అలానే ఉంటుంది.’’
‘‘ఆ..?’’
‘‘ప్రధానమంత్రి అంటే శంకరమఠంలో పూజారి అనుకున్నావా? రామకృష్ణ మఠంలో స్వామీజీ అనుకున్నావా? ’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘ప్రధానమంత్రి అనేది రాజకీయ పదవి. ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ నాయకుడు. రాజకీయ నేతలు రాజకీయ నిర్ణయాలు తీసుకోక పోతే గ్రాఫిక్స్ డిజైనర్‌గా పని చేయాలా? సినిమాల్లో నటించాలా?’’
‘‘నేనడిగిందేమిటి? నువ్వు చెబుతున్నదేమిటి?’’
‘‘చెప్పడం మరిచా.. రాజకీయ నేతలు గ్రాఫిక్స్ తయారు చేయించేది కూడా రాజకీయంలో భాగంగానే. వారు ఏం చేసినా రాజకీయాల్లో భాగంగానే చేస్తారు. సినిమాలు కూడా రాజకీయాల్లో భాగంగానే తీస్తారు. బయోపిక్‌లు కూడా రాజకీయంలో భాగమే. అదేం కొత్త కాదు. 1982లో ప్రాంతీయ పార్టీ పుట్టక ముందు సినిమాల్లో డైలాగులన్నీ పేదల ఆకలి తీర్చేవే. సినిమా ఆయుధం ఏ ఒక్కరికో పరిమితం కాదు. అనుకూల సినిమాలే కాదు వ్యతిరేక సినిమాలు కూడా వచ్చాయి. సూ పర్‌స్టార్ కృష్ణతో పాటు చాలా మందే తీశారు. మనకు ఇష్టం ఉన్నా లేకున్నా నేతలు రాజకీయమే చేస్తారు. ఐటీ ఉద్యోగులు సాఫ్ట్‌వేర్ పనుల్లో బిజీగా ఉంటారు. మనకే కాదు.. రాజకీయ నేతలకూ ఒక్కో సారి వారు చేసే పనులు వారికే నచ్చక పోవచ్చు, తమకు నచ్చినా నచ్చక పోయినా రాజకీయ కోణంలోనే చేస్తారు. ’’
‘‘తప్పు కదూ..’’
‘‘నేతలు రాజకీయం చేయకపోతే తప్పు.. కానీ చేస్తే తప్పెలా అవుతుంది?’’
‘‘ఎన్నికల కోసం సమాజాన్ని వర్గాల వారీగా చీలుస్తారా?’’
‘‘సామాజిక వర్గం అంటే ఏంటిరా?’’
‘‘కులం అని వాడేందుకు మొహమాటం అడ్డొచ్చి తెలుగు మీడియా సామాజిక వర్గం అనే పదాన్ని కనిపెట్టింది.’’
‘‘చూశావా? ఇందులో కూడా రాజకీయం ఉంది. సమాజంలో ఏం జరుగుతుందో రాసి ప్రజలకు చెప్పాల్సిన మీడియా కూడా రాజకీయం చేస్తున్నప్పుడు నేతలు మాత్రం రాజకీయం చేయవద్దు అనడమే రాజకీయం. ’’
‘‘పదిశాతం కోటాపై ఇంతకూ నీ అభిప్రాయం?’’
‘‘మోదీ బలమైన ఆయుధాన్ని ప్రయోగించాడు’’
‘‘నేనూ అదే చెబుతున్నా.. ఎన్నికల ముందు తప్పు కదా?’’
‘‘నువ్వు పరీక్షల కోసం రాత్రింబవళ్లు చదివేవాడివి కదా? రెండు గంటల పరీక్షలో అవన్నీ రాసేందుకే కదా? ఆ తంటాలన్నీ’’
‘‘ఔను..’’
‘‘ఇది కూడా అంతేరా! ఐదేళ్లకోరోజు జరిగే పరీక్షల కోసమే నేతలు ఐదేళ్ల పాటు ఎత్తులు, పై ఎత్తులతో రాజకీయం చేస్తారు. ఎన్నికల యుద్ధంలో గెలుపు కోసం ఆయుధాలన్నీ ప్రయోగిస్తారు. నేను ప్రిపేర్ కాలేదు.. నేను ఆదమరిచి ఉన్నప్పుడు అంత పెద్ద ఆయుధం ప్రయోగిస్తావా? ఇది అన్యాయం అంటే కుదరదు! ప్రజాస్వామ్యం అంటేనే నిరంతర యుద్ధం. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు ఎప్పుడు మొదలయ్యాయ? ఎప్పుడు ముగిశాయని చెప్పడానికి తేదీలుంటాయి. ప్రజాస్వామ్య యుద్ధానికి తేదీలు ఉండవు. ప్రజాస్వామ్యంలో కనిపించీ కనిపించకుండా నిరంతరం యుద్ధం సాగుతుంది. ఐదేళ్లకోసారి ఫలితాలు ప్రకటిస్తారు. అంతే.’’
‘‘పదిశాతం కోటాతో ఫలితాలెలా ఉండొచ్చు’’
‘‘ఫలితాలెలా ఉన్నా యుద్ధం అన్నాక ఆయుధాలన్నీ ఉపయోగిస్తారు.’’
‘‘నువ్వెంతయినా సమర్ధించు. రాజకీయ కోణంలో కోటాలను వాడుకోవడం అన్యాయం. ఈ రాజకీయ రిజర్వేషన్లు ఇంకెంత కాలం ఉండొచ్చు’’
‘‘ప్రజలు ఉన్నంత వరకు, ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు’’
‘‘మహాకవి గురజాడ అప్పారావు ఎప్పుడో చెప్పారు- దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్.. అని. ప్రజలున్నంత కాలం ప్రజాస్వామ్యం, రాజకీయాలు, ఎన్నికలు ఉంటాయి. ఇవి ఉన్నంతవరకూ కోటాలూ ఉంటాయి.
‘‘కోటాలతో మార్పు వస్తుందా? ఎంత కాలం పట్టొచ్చు’’
‘‘రాజ్యాంగాన్ని రాసిన వాళ్లు పదేళ్లు అనుకున్నారు. వారి అంచనాలకే అందనిది మన అంచనాలకు అందుతుందా? ’’
‘‘అంటే- కోటాలు శాశ్వతమా?’’
‘‘ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు’’
‘‘అంటే ఎంత కాలం?’’
‘‘ప్రజాస్వామ్యం ఎంత కాలం ఉంటుందో అంత కాలం’’
‘‘సూటిగా చెప్పలేవా?’’
‘‘దీని సంగతికేం కానీ... మోదీ అంబులపొదిలో ఇంకెన్ని ఆయుధాలు ఉన్నాయో ఆలోచించు.’’ *

buddhamurali2464@gmail.com