జనాంతికం - బుద్దా మురళి

మహా కథకుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వచ్చేనెల నా కథల సంపుటి విడుదల, నువ్వు తప్పకుండా రావాలి?’’
‘‘అదేంటోయ్.. నువ్వు కథలు చెబుతావని అందరికీ తెలుసు కానీ కథలు రాస్తావని తెలియదు’’
‘‘నేను కథలు రాశానని ఎప్పుడు చెప్పాను? మా ఆవిడ రాసింది. ఈ విషయం నాకు వారం క్రితమే తెలిసింది’’
‘‘మరి.. నా కథల పుస్తకం విడుదల అన్నావు?’’
‘‘ఔను- నా కథలే’’
‘‘మీ ఆవిడ రాసిందన్నావు?’’
‘‘ఔను మా ఆవిడే రాసింది’’
‘‘తిక్కగా మాట్లాడకు.. విషయం చెప్పు?’’
‘‘కథలు నావే, రాసింది మా ఆవిడ!’’
‘‘సరిగా చెప్పు?’’
‘‘మనం పార్టీ చేసుకుని ఇంటికి వెళ్లాక మా ఆవిడ ఏమీ అనడం లేదు, నేను చెప్పింది వింటోందని ఓసారి చెప్పాను గుర్తుందా?’’
‘‘గుర్తుంది.. బాపు కార్టూన్‌లో చూపినట్టు- తాగి ఇంటికొస్తే అప్పడాల కర్రతో కొడతారనేది అబద్ధం.. అలా ఏమీ ఉండదు. చెప్పింది బుద్ధిగా వింటారని నువ్వు కూడా చెప్పావు. ’’
‘‘అప్పుడు అర్థం కాలేదు, తరువాత తెలిసింది. నిజానికి నేను అలా రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడల్లా ఆవిడ ముఖం సంతోషంతో వెలిగిపోయేది. ఎందుకు ఆలస్యం అయిందో చెప్పండని ముద్దుగా అడిగేది.’’
‘‘ఐతే..?’’
‘‘ఆలస్యానికి నేను చెప్పిన కారణాలను రికార్డు చేసుకునేది. వాటిని కథలుగా రాసేది. అలా రాసిన వాటిలో కొన్ని అణిముత్యాల్లాంటి కథలను ఎంపిక చేసి కథా సంకలం విడుదల చేస్తోంది. రాసింది ఆమే అయినా అవి నేను చెప్పిన కథలు కదా!’’
‘‘కథలిలా కూడా రాస్తారా?’’
‘‘చూడోయ్.. ఇప్పుడు కాలం మారింది. అప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ప్రతిదీ ఇంట్లో పెద్ద వాళ్లను చూసి తరువాతి తరం నేర్చుకునేది. ఇప్పటి వారికి ఆ అవకాశం లేదు. ఇప్పుడు కుటుంబం అంటే భార్యా భర్త.. కొన్ని కుటుంబాల్లో భార్యదో కుటుంబం, భర్తదో కుటుంబం. ఇద్దరు కలిసి ఉంటే అదే ఉమ్మడి కుటుంబం అన్నట్టుగా మారింది. ఈ కాలం వారికి ఎలా తినాలి? ఎలా వండాలి? అన్నీ పుస్తకాలతోనో, యూ ట్యూబ్‌తోనో నేర్పాల్సిందే!’’
‘‘నీ అబద్ధాలు కథల పుస్తకంగా వేయడం అన్యాయమోయ్’’
‘‘నీకింకా అర్థం కాలేదు. ఆ పుస్తకం జీవిత పాఠాలు నేర్పే అద్భుత గ్రంథం. ఇప్పటి కుర్ర దంపతులకు అస్సలు తెలివి లేదోయ్. ఆఫీసు నుంచి ఆలస్యం ఎందుకైందంటే- చెప్పడానికి వారికి కథలోస్తే కదా? దాంతో కాపురాలు కూలిపోతున్నాయి. నా కథల పుస్తకం మార్కెట్‌లోకి వచ్చాక, ఆలస్యం ఎందుకైందో కథలు చెప్పవచ్చు. కాపురం నిలబడుతుంది. భార్య సంతోషపడుతుంది. సమాజానికి మనం ఇంత కన్నా చేసే మేలేముంటుంది?’’
‘‘మరి- ఆ పుస్తకం ఆడవారు కొంటే?’’
‘‘మహామహా దర్శకులే కాపీ కథలతో సినిమాలు తీసి సూపర్ హిట్ చేస్తుంటే ఒరిజనల్ కథ ఎవరిదో తెలియదు. తెలిసినా చేసేదేమీ లేదు. అలాంటిదో బడుగు భర్త చెప్పే కాపీ కథలను భార్యలు పట్టుకుంటారనుకోను’’
‘‘నీ కథల పుస్తకం వచ్చినప్పుడు చూద్దాం కానీ, ఇంతకూ తొలి కథ ఎవరిదై ఉంటుంది?’’
‘‘ఇలాంటి కథల పుస్తకంలో తొలిది మాత్రం మా దంపతులదే అవుతుంది’’
‘‘నీ సంగతి వదిలేసి చెప్పమన్నాను కదా? నారదుడే తొలి జర్నలిస్టు అంటారు కదా? వారెవరో నారదుడి పేరుతో జర్నలిస్టులకు అవార్డు కూడా ఇస్తారు. నారదుడు తొలి జర్నలిస్టు అనుకుంటే తొలి కథకుడు ఎవరై ఉంటారు?’’
‘‘తొలి జర్నలిస్టే తొలి కథా రచయిత అని నా అభిప్రాయం. అటువి ఇటూ.. ఇటువి అటూ చెప్పే నారదుడు కొంత మసాలా దట్టించి చెప్పేవాడు. కాబట్టి అతనే తొలి కథా రచయిత అని నమ్మి తీరాలి’’
‘‘నారదుడిది పరిశోధనాత్మక జర్నలిజం అవుతుందేమో కానీ అతను చెప్పినవి కథలు కావు’’
‘‘అన్నీ వేదాల్లో ఉన్నాయంటే విమర్శిస్తారు కానీ నిజానికి కథలు వేదాల్లో ఉన్నాయి కాబట్టి తొలి కథా రచయిత వేదాలు రచించిన వారే అంటాను’’
‘‘నాకు మహాభారతంలో దీనికి సమాధానం కనిపిస్తోంది. శ్రీకృష్ణుడు తొలి కథారచయిత అని ఒప్పుకొని తీరాలి’’
‘‘పదహారువేల మంది గోపికల మనసు దోచాడంటే అల్లాటప్పా వాడి వల్ల అవుతుందా? ఒక్కొక్కరికి ఒక కథ చెప్పినా 16వేల కథలవుతాయి. ఒక్కక్కరికి ఓ పది కథలైనా చెప్పి ఉంటాడు కదా? ఆలోచించు.. ఇప్పటి వరకు వచ్చిన అద్భుత కథలన్నిటి కన్నా వీటి సంఖ్య ఎక్కువే అవుతుంది. ఆ కథలు సేకరించగలిగితే శ్రీకృష్ణుడివి బోలెడు కథా సంకలనాలు తయారవుతాయి.’’
‘‘తొలి కథా రచయిత ఎవరో మనమో నిర్ణయానికి రాలేకపోయినా, వేదాలు, పురాణాల్లోని కథలు చూస్తుంటే ప్రపంచానికి అద్భుతమైన కథలు అందించింది మాత్రం మన దేశమే అనిపిస్తోంది.’’
‘‘కథలు లేకపోతే జీవితం ఎంత నిస్సారంగా ఉండేదో కదా? ఐనా ఈ రోజుల్లో ప్రతివాడూ కథలు చెప్పేవాడే కానీ కథలు చదివే వారెవరున్నారని?’’
‘‘తొలి కథా రచయిత ఎవరో తెలియదు. కానీ అద్భుతమైన కథా రచయిత ఎవరో చెప్పాలా?’’
‘‘ఏ భాషలో.. ఏ దేశంలో?’’
‘‘ఒక భాష, ఒక దేశం అని కాదు విశ్వవ్యాప్తం అనుకో?’’
‘‘అంతటి గొప్ప కథా రచయితనా? ఎవరు వారు?’’
‘‘మధ్యతరగతి కుటుంబరావులను మించిన కథా రచయితలు ఉంటారా? అటు పేదవాడు కాదు, ఇటు సంపన్నుడు కాదు. రెండింటికి మధ్య జీవితం. త్రిశంకు స్వర్గంలో జీవనం. అటు సంతృప్తి కాదు, ఇటు అసంతృప్తి కాదు మధ్య తరగతి జీవితం. ఎన్ని కష్టాలున్నా పిల్లలకు హీరోలా కనిపించాలి. భార్యా విధేయుడిగా ఉండాలి, బంధువుల ముందు భార్యపై పెత్తనం చెలాయిస్తున్నట్టు నటించాలి. భార్యా పిల్లలను సంతృప్తి పరచలేక ఏవో కథలు చెప్పాలి. తల్లిదండ్రులకు మరో కథ చెప్పాలి. బంధువులకు, ఆఫీసులో బాస్‌కు ప్రతి ఒక్కరికీ కథలు చెప్పాలి. చివరకు తన మనసుకు తాను కథలు చెప్పుకుంటూ తానేమిటో మరిచిపోయి కథల్లోనే బతికేయాలి. మధ్యతరగతి జీవికి మించిన కథా రచయిత ఇంకెవరు?’’
*

buddhamurali2464@gmail.com