జనాంతికం - బుద్దా మురళి

అవినీతి ‘మాయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కెవ్వు కేక’
‘ఏమయిందోయ్ అలా అరిచావు. సెలవురోజు ఇష్టం వచ్చినంత సేపు పడుకొందాం అనుకుంటే నీ కేకతో భయపెట్టావు’.
‘మీ నిద్ర తెల్లారినట్టే వుంది. మీరేమో బారెడు పొద్దెక్కేదాకా పడుకున్నారు. నావంట పనిలో నేనున్నాను. ఈలోపు దేశంలో ఎమర్జెన్సీ విధించారు.’
‘నువ్వు అరచిన కేకనుంచే ఇంకా తేరుకోలేదు. మరో కేకనా? దేశంలో ఎమర్జెన్సీ విధించడం ఏమిటి? ఫేస్‌బుక్, వాట్సప్, సినిమాల్లో నిముషాల్లో తీర్పులు ఇచ్చేసినట్టు దేశంలో అలా నిముషాల్లో ఎమర్జెన్సీ విధించడం సాధ్యం కాదు. దానికి పెద్ద తతంగం వుంటుంది. ఆ కాలంలోనే అంత తతంగం నడిచింది. ఈ కాలంలో అది మరీ కష్టం. ట్రాఫిక్‌జామ్ అయినా, ఆర్టీసీ బస్సు ఆలస్యం అయినా ఎమర్జెన్సీని తలపిస్తోంది అని ఏవో విమర్శలు చేయడం మామూలే. అది విని దేశంలో నిజంగా ఎమర్జెన్సీ విధించారని అనుకుంటున్నావు.’
‘ఏడ్చినట్టే వుంది మీ వివరణ. నేను మరీ అంత అమాయకురాలిని అనుకుంటున్నావా? ఇంటికి ఆలస్యంగా వచ్చి సిట్టింగ్ వేసి మీరు కథలు చెప్పడం మొదలుపెట్టగానే 90 లాగించారా? 180నా? అని క్షణంలో చెప్పేయగలను.’
‘మరి ఎమర్జెన్సీ విధించారని అంత అమాయకంగా ఎలా అడిగావు?’
‘ఎమర్జెన్సీలో వార్తాపత్రికల్లో ఎడిటోరియల్ పేజీ ఏమీ లేకుండా తెల్లగా వుండేది గుర్తుందా’
‘లేకేం ఎమర్జెన్సీపై పత్రికలు అలా నిరసన తెలిపేవి. సంపాదకీయం ప్లేస్‌ను ఖాళీగా వదిలేసి చెప్పాల్సింది చెప్పకుండానే చెప్పేవారు.’
‘కదా? ఇదిగో ఈ పేపర్లు చూడండి. పేపర్‌లో ప్రతి పేజీలోనూ రంధ్రాలే. అంటే దేశంలో ఎమర్జెన్సీపై ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు అనేకదా?’
‘మనం లేవక ముందే పేపర్‌ను ఎవరో గిట్టని వాళ్లు కత్తిరించారేమో’
‘పేపర్ అడుక్కొని చదవడం మనవాళ్ల సహజ లక్షణం. పేపర్ మొత్తం మనకన్నా ముందే మన పక్కింటివాళ్లు తీసుకెళ్లి చదివి చీలికలు పేలికలు అయ్యాక తెచ్చి ఇవ్వడం మామూలే. కానీ ఇలా పేపర్ మధ్యలో కత్తిరించి ఇవ్వడం మన సంప్రదాయం కానే కాదు.’
‘అంటే ఎమర్జెన్సీ విధించారని నువ్వు ఫిక్స్ అయిపోయావా?’
‘మీ నాన్నకు గుండెపోటు వస్తుందనే భయం, మీ అమ్మకు బిపి పెరుగుతుందని. నాకు స్ట్రెస్ అని, మీకు జీవితంపై విరక్తి పుడుతుందని, పిల్లల చదువు పాడవుతుందని టీవీ కనెక్షన్ పీకేయించారు. టీవీ చూసినా తెలిసేది ఏమైందో?’
‘అంతా నేనే చేసానని నిష్ఠూరంగా మాట్లాడతావేం. మొత్తం కుటుంబాన్ని ప్రమాదాల బారినుంచి కాపాడేందుకే కదా! టీవీ గొంతు శాశ్వతంగా నొక్కేశాం. ఇప్పుడు నాదే తప్పన్నట్టు మాట్లాడుతావు.’
‘అయ్యో అపార్ధం చేసుకోకండి. అదేదో నెగిటివ్ హోమియోపతి వాళ్లు మొత్తం ఫ్యామిలీలకు రోగం నయం చేసినట్టు మీరు టీవీ కట్టేసి మన ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడారు.
‘అప్పటికే చిన్నాడు ఎవరెవరి కుటుంబమో బతుకు బస్టాండ్ టీవీషోలో కనిపిస్తున్నారు. మనమెప్పుడు కనిపిస్తామమ్మా అని అడిగాడు.
అది చితికిన కుటుంబాలను రోడ్డున పడేసే ప్రోగ్రాంరా బాబూ అని చెప్పినా వినలేదు. అయితే మనమూ రోడ్డున పడదామని ఒకటే గోల. టీవీ కనెక్షన్ కట్ చేయించి మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. మా ఆందరి ఆరోగ్యాన్ని కాపాడారు. కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఫెవికాల్‌తో అతుక్కుపోయినట్టు చేసారు. నేను మిమ్ములను ఎందుకు తప్పుపడతాను. ఈ ఒక్క విషయంలో మా ఆయన బంగారం అంటాను.’
‘పోనీలే న్యూస్‌పేపర్ రంధ్రాలకు రంధ్రానే్వషణ ఎందుకు వదిలేయ్. ఎమర్జెన్సీ మాత్రం విధించలేదు. అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. చీమ చిటుక్కుమనకముందే వాట్సప్‌లో సమాచారం స్వైరవిహారం చేస్తుంది. అలాంటిది దేశాన్ని ఎమర్జెన్సీ కుట్టేస్తే వౌనంగా ఉంటారా?’
‘దీని సంగతేంటో అంతు తేల్చేంతవరకు నిద్రపోను. ఎందుకైనా మంచిది మీరు ఆఫీసుకు వెళ్లాక ఆఫీస్ బాయ్‌ని అడిగి తెలుసుకోండి. అర్ధరాత్రి ఎమర్జెన్సీ ఏమైనా విధించారో.’
‘అత్యంత విశ్వసనీయ సమాచారం అంటే ఆఫీస్‌బాయ్‌లు చెప్పేదే అని నీకెంత నమ్మకం డియర్. సరేలే నేను అడుగుతాను. కానీ నువ్వు ఆందోళన పడకు. రంధ్రానే్వషణ వదిలేయ్.’
‘కెవ్వు కేక’
‘మళ్లీ ఏమైంది డియర్’
‘ఈరోజు కూడా న్యూస్‌పేపర్‌లో ప్రతిపేజీలో పెద్ద పెద్ద రంధ్రాలున్నాయి. ఇవి ఎవరో కావాలనే కత్తిరించారు. తమాషాగా ఉందా? వీళ్ల సంగతి తేలుస్తాను.’
‘వదిలేయ్ డియర్ వాళ్ల పాపాన వాళ్లే పోతారు. 12 పేజీల న్యూస్ పేపర్‌లో ఓ పదివార్తలు చదవకపోతే వచ్చే నష్టమేమీ లేదు.’
* * * *
‘ఏమండీ మీరు మీరేనా? మా ఆయన శ్రీరాముడు అని గొప్పగా చెప్పుకుంటే మీరు గోడదూకే గోపీ అని తేలింది. పేపర్‌కు కన్నం వేస్తున్నది ఎవరో తేల్చుకోవాలని అర్ధరాత్రినుంచి గుమ్మం పక్కన నక్కి కూర్చున్నాను. గోడ దూకుతూ కనిపించిన మిమ్ములను చూస్తాను అనుకోలేదు. నా నమ్మకాన్ని వమ్ము చేసారు. అందమైన భార్య వుండగా గోడ దూకాల్సిన ఖర్మ మీకెందుకు? హే భగవాన్ ఈ సీన్ చూడకముందే నా ప్రాణాలు తీసుకెళ్లాల్సింది. నన్ను ఇంకా ఎందుకు బతికించావు భగవాన్.’
‘ఆపు శకుంతలా! ఆపు...’
‘ఓరి దేవుడో మా ఆయన నా పేరు కూడా మరిచిపోయి అదెవరో శకుంతల పేరు స్మరిస్తున్నాడు.’
‘ఏయ్ ఆపు. అదేదో రేడియో ప్రకటన బాగా గుర్తుండిపోయి ఆపు శకుంతలా ఆపు అనే డైలాగు చెప్పాను కానీ ఏ మొగుడికైనా భార్యపేరు పలికి ఆపు అనే ధైర్యం ఉంటుందా? ఈ కలికాలంలో?’
‘చెప్పండి.. ఎంతకాలంనుంచి జరుగుతోంది ఈ వ్యవహారం?’
‘కాలాన్ని ఎవరు లెక్కిస్తారు శకుంతల. సారీ రాధ. నా అంచనా మనిషి నాగరికుడిగా ఎదిగినప్పటినుంచి ఈ అనాగరికత మొదలైందని అనుకుంటా?’
‘డొంక తిరుగుడుగా మాట్లాడకండి. ఈ వ్యవహారం ఎప్పటినుంచి. పెళ్లికి ముందునుంచా? నేను పుట్టింటికి వెళ్లినప్పటినుంచా?’
‘ఏం మాట్లాడుతున్నావ్. వేల సంవత్సరాల నుంచి వుందని నేను చెబుతుంటే నువ్వేమో క్రీ.శ, క్రీపూ అన్నట్టు కాలాన్ని మన పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అని విభజిస్తున్నావు’
‘మీరు దేని గురించి మాట్లాడుతున్నారు?’
‘అవినీతి గురించి. మరి నువ్వేమనుకున్నావు?’
‘అసలీ అర్ధరాత్రి గొడవేంటి?’
‘అపార్ధం చేసుకోకు రాధ. పత్రికలో ఏ రోజు చూసినా ఉద్యోగులపై దాడి వందల కోట్ల ఆస్తి పట్టుపడింది అనే వార్తలే కనిపిస్తున్నాయి. మొన్న ఓ మున్సిపాల్టీ అధికారి ఇంట్లో ఎసిబికి గుట్టల కొద్దీ బంగారం, వజ్రాలు దొరికాయి. మున్సిపాల్టీలో పేరుకు పోయిన చెత్తకుప్పలను తలదనే్నంత ఎత్తులో ఆ మున్సిపల్ అధికారి ఇంట్లో నగల గుట్ట పేరుకుపోయిందట! మనమేమో ఉన్న ఒక్క నల్లపూస తాడు పిల్లల చదువుకోసం అమ్మేశాం. ఆ గుట్టల బంగారం వార్తలు చదివి పనికిరాని చవట అని నువ్వెక్కడ తిడతావో, పిల్లల ముందు పరువుపోతుందని అలాంటి వార్తలు నీకంట పడకుండా నేనే పేపర్ కట్‌చేస్తున్నాను రాధా! నన్ను క్షమించు రాధా క్షమించు.’
‘ఏమండీ బాధపడకండి. 2017లో కూడా 1977 నాటి అక్కినేని డైలాగుల్లా అంత దీనంగా చెబుతున్నారంటే మీ క్షోభను అర్ధం చేసుకోగలను. దేవుడు అందరికీ ఒకేరకమైన తెలివితేటలు ఇవ్వడు. ఈ జన్మకు మనకు ఇంతే అనుకుందాం. అయినా అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టు పేపర్‌కు రంధ్రాలు చేయడం ఎందుకు?’
‘అవినీతిపై పోరాడి అధికారంలోకి వచ్చిన వారు ఉన్నారు. నిరంతరం అవినీతి నిర్మూలన గురించి ఉపన్యాసాలు ఇచ్చే అవినీతిపరులు వున్నారు. మనిషి అవినీతిలో ఎంత రాటుతేలిపోతే నైతిక విలువల గురించి అంత ఎక్కువ మాట్లాడే దశకు చేరుకున్నారు.
మున్సిపాల్టీ అధికారి ఇంట్లో 500 కోట్ల ఆస్తి, ఓ పోలీసు అధికారి ఆస్తి 300 కోట్లు, ఆ శాఖ ఈ శాఖ అని లేదు, 20:20 మ్యాచ్‌లో రన్స్‌లా వీళ్ల ఆస్తుల చిట్టా కనిపిస్తోంది. వాళ్లు అన్ని వందల కోట్లు ఎలా పోగుచేసారు. వ్యవస్థకు హఠాత్తుగా దివ్య దృష్టి వచ్చి పట్టుకుందా? అన్నీ అనుమానాలే. సంపాదన ఎలా సాధ్యం అనేది అనుమానమే. ఎలాదొరికిపోతున్నారన్నది అనుమానమే. ఓ ఉద్యోగి అరవై కోట్లు పోగుచేసుకోవడానికి వీలుగా వున్న బలహీనమైన వ్యవస్థనా మనది. తలచుకుంటే భయం వేస్తుంది. ఇవన్నీ తలచుకుని ఆందోళనతో బిపి, సుగర్, గుండెపోటు వస్తుందేమో! మహామహులే అవినీతిని నిర్మూలించలేకపోయారు. కానీ నేను నీ ముందు అసమర్ధునిగా నిలవాల్సిన అవసరం లేకుండా అవినీతిని నిర్మూలించే ప్లాన్ వేసాను.’
‘ఏం ప్లాన్?’
‘అవినీతిని నిర్మూలించలేం కానీ అవినీతిని మాయం చేయగలం. ఎసిబి దాడుల్లో పట్టుపడిన అవినీతిపరుల ఆస్తుల గుట్టల వార్తలను పేపర్‌లో కనిపించకుండా మాయం చేయడం ద్వారా అవినీతిమయ సమాజంనుంచి అవినీతిని మాయం చేయాలని నిర్ణయించుకున్నాను. నా ఆరోగ్యం నాకు ముఖ్యం.’

-బుద్దా మురళి buddhamurali2464@gmail.com