జనాంతికం - బుద్దా మురళి

ఇదే జీవితం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏరా.. మీవాడు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడట కదా? ఎందుకలా?’’
‘‘వాడు ఇంట్లోనే ఉన్నాడు.. పిలుస్తాను.. నువ్వే అడుగు వాణ్ణి’’
‘‘ఏంటో చెప్పండంకుల్..’’
‘‘పరీక్షల్లో ఫెయిల్ అయ్యావట! ఏంటీ కథ?’’
‘‘అంకుల్.. నేను ప్రశ్నించడానికి పుట్టాను. నేను ప్రశ్నిస్తా.. అంతే కానీ ఒకరి ప్రశ్నలకు సమాధానం చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మీకు తెలుసు కదా అంకుల్.. నేను చిన్నప్పటి నుంచే మేధావిని. ప్రశ్నించే వారంటేనే పాలకులకు పడదు. ఆ కోపంతో నన్ను ఫెయిల్ చేశారు’’
‘‘నాకు నిజంగా అర్థం కాలేదు బాబూ.. అర్థం అయ్యేట్టు చెప్పు’’
‘‘పరీక్షలంటే ఏముంటాయ్ అంకుల్..? కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానం రాయాలి, మనం రాసిన సమాధానాలు చూసి టీచర్లు మార్కులు వేస్తారు. అంతే కదా? అంకుల్’’
‘‘ఔను.. అంతే’’
‘‘అదే నాకు నచ్చదంకుల్! ప్రశ్నించే వాళ్లంటే పాలకులకు అస్సలు నచ్చదు. అందుకే వాళ్లు తెలివిగా ఈ పరీక్షల విధానం తయారు చేశారు. ప్రజలకు ప్రశ్నించే అవకాశం లేకుండా, ప్రశ్నలకు సమాధానాలు చెప్పే చాన్స్ మాత్రమే ఇచ్చారు. ఈ పరీక్షల విధానం నాకు అస్సలు నచ్చలేదు అంకుల్. టీచర్లు ప్రశ్నిస్తే విద్యార్థులు సమాధానాలు రాసే విధానం పోవాలి. విద్యార్థులు ప్రశ్నిస్తే టీచర్లు సమాధానం చెప్పే నూతన విధానం రావాలి. ఈ నూతన విధానానికి నాందిగా ఈసారి పరీక్షల్లో నేను ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాయకుండా, నేనే ఎన్నో ప్రశ్నలు రాశాను. వాటికి సమాధానం ఇవ్వలేక టీచర్లు నాకు మార్కులు వేయలేదు. నేను ప్రశ్ని స్తా.. సమాధానం చెప్పను. నేను ఫెయిల్ కావడం కాదు అంకుల్. నేను పెట్టిన పరీక్షల్లో టీచర్లే ఫె యిల్ అయ్యారు’’
‘‘ఇలా నీకు ఎప్పటి నుంచి అనిపిస్తోంది బాబూ?’’
‘‘అంకుల్.. మీ వెటకారం నాకు అర్థం కాలేదు అనుకోకండి. ప్రశ్నించే గొంతును మీరు దెబ్బతీయాలని చూస్తున్నారు..’’
‘‘అయ్యో.. ఏదో తెలుసుకుందామని బాబూ!’’
‘‘చూడండి అంకుల్.. ప్రపంచ ప్రఖ్యాత శాస్తవ్రేత్తలందరూ సమాధానాలు రాసి మేధావులు కాలేదు. ప్రశ్నించడంతోనే మేధావులయ్యారు. యాపిల్ పండు చెట్టు నుంచి కింద పడడం ప్రపంచంలో చాలామంది చూశారు. కానీ అది చెట్టు నుంచి కిందకు ఎందుకు పడుతుందనే ప్రశ్న వేసుకున్న వాడే భూమికి ఆకర్షణ శక్తి ఉందని గ్రహించి మేధావి అయ్యాడు.’’
‘‘ఔను బాబూ.. నువ్వు చెబుతుంటే గుర్తుకు వచ్చింది. వాట్సాప్‌లో పొద్దునే్న అద్భుతమైన సమాచారం ఒకటి మిత్రుడు పంపాడు. జీరోను ఎలా కనిపెట్టారో చెప్పాడు. ఒక రోజు ఆర్యభట్టు తన మిత్రుల్లో- భార్యలకు భయపడని వారు ఎంత మంది ఉంటారా? అని లెక్కపెట్టడం ప్రారంభించి జీరోను ఆవిష్కరించాడట! భార్యలకు భయపడే వారి సంఖ్యను లెక్కిస్తూ రామానుజం ఇన్ఫినిటీ (అపరిమితత్వం)ని ఆవిష్కరించారట. నువ్వు కూడా సమాధానాలు రాయకుండా ఏదో ఒకనాడు ఏదో ఒకటి కనిపెడతావు అనిపిస్తోంది బాబూ!’’
‘‘అమెరికా వెళ్లి ఐఏఎస్ చదివి, అమెరికా అధ్యక్షుణ్ణి అవుతాను అంకుల్’’
‘‘ట్రంప్ కన్నా నువ్వే బెటర్ అని ప్రపంచం నీకు స్వాగతం పలుకుతుంది బాబూ!’’
‘‘అమెరికా అధ్యక్షుణ్ణి అయినా తెలుగు నేలను వదలను అంకుల్. ఇక్కడి నుంచే అమెరికాను పాలిస్తాను’’
‘‘ఎలా?’’
‘‘ముందే చెప్పాను కదా? అంకుల్ నాకు సమాధానాలు చెప్పడం చిరాకు.. జవాబులు కూడా ప్రశ్నలుగానే చెబుతాను’’
‘‘ఏదీ.. ఒకటి చెప్పు’’
‘‘సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అని మీరు చిన్నప్పుడు చదువుకున్నారు కదా? అప్పుడెప్పుడో మూడు వందల ఏళ్ల క్రితం టెక్నాలజీ, ట్రాన్స్‌పోర్ట్ ఏమీ లేని కాలంలోనే ఎక్కడో ఉన్న ఇంగ్లాండ్ నుంచి ప్రపంచాన్ని పాలించారు. అరచేతిలోని సెల్‌ఫోన్‌లోనే ప్రపంచం ఇమిడిపోయే ఈ కాలంలో తెలుగునేలపై నుంచి అమెరికాను పాలించలేమా?’’
‘‘నీ ఆశయం గొప్పగా ఉంది. బాణం పుల్లలతో అర్జునుడు స్వర్గానికి నిచ్చెన వేసినట్టు నువ్వు తెలుగు నేల నుంచి అమెరికాలోని వైట్‌హౌస్‌కు పాగా వేస్తానంటే వద్దని నేనేందుకనాలి?’’
‘‘మీరు వద్దన్నా నేను వినను అంకుల్. ఎవరేం చెప్పినా వినను, ఎవరేం చెప్పినా చేయను, ప్రశ్నిస్తాను. నా ప్రశ్నకు సమాధానం ఉందా? లేదా? జవాబు ఇస్తున్నారా? లేదా? అనేది నాకు అనవసరం.. నేను ప్రశ్నిస్తూనే పోతాను. ననె్నవరూ ఆపలేరు.’’
‘‘ఒక రకంగా మీ అమ్మానాన్నలు అదృష్టవంతులు బాబూ! నీ కన్నా మూడు నాలుగు తరాల ముందు వాళ్లు ప్రశ్నిస్తామంటూ అడవుల్లోకి వెళ్లి మూడు దశాబ్దాల తరువాత తిరిగొచ్చి మేమేందుకలా వెళ్లామో మాకే తెలియదన్నారు. విలువైన జీవితం కరిగిపోయిందని ఎవరూ ప్రశ్నించక ముందే సమాధానం చెప్పారు. ’’
‘‘అర్థం కాలేదు అంకుల్’’
‘‘మీ అమ్మ పిలుస్తున్నట్టుగా ఉంది. ఏంటో తెలుసుకో బాబూ’’
‘‘ఏరా! షాప్‌కెళ్లి చక్కెర, పాల ప్యాకెట్, పాలకూర, కొత్తిమీర తీసుకు రా! టిఫిన్ చేయాలి’’
‘‘పో.. అమ్మా! నీకేం తెలియదు. నేను తెలుగునేలపై నుంచి వైట్‌హౌస్‌ను శాసించాలని చూస్తుంటే నువ్వేమో పాలకూర కట్టలు తెమ్మంటావు’’
‘‘చూడు బాబూ.. నీకు చెప్పేంత పెద్దవాడిని కాదు- కానీ నీతో ఉన్న చనువుకొద్దీ చిన్నమాట చెప్పాలా?’’
‘‘చెప్పండంకుల్..’’
‘‘అమెరికాలో ట్రంప్ ఉన్నా, నువ్వున్నా, ఎవరున్నా తేడా ఉండదు కానీ పాలకూర తేకపోతే అన్నంలోకి కూర ఉండదు. పాలప్యాకెట్ తేకపోతే టీ ఉండదు.’’
‘‘అంటే ?’’
‘‘ప్రశ్నించు.. వద్దనడం లేదు. ముందు పాలకూర కట్టలు తే’’
‘‘ఒక సీక్రెట్ చెప్పాలా? అంకుల్’’
‘‘చెప్పు’’
‘‘నాకసలే బద్దకం అంకుల్. ఉదయమే లేచి పాలప్యాకెట్లు, కూరగాయలు తేవడం అంటే- తలుచుకుంటేనే భయంగా ఉంది’’
‘‘మరి నీకేమిష్టం? బారెడు పొద్దెక్కేంత వరకు పడుకోవడం, ఖర్చులకు నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం, ప్రశ్నించడం..’’
‘‘బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం, పని చేయడం కష్టం.. కానీ అందరూ ప్రశ్నించే వారే ఐతే పని చేసేవారెవరు?’’
‘‘స్విగ్గీతో భోజనం, బిగ్‌బాస్కెట్‌లో కూరగాయలు, ఇంటిముందు కర్రీ పాయింట్స్.. ఏదైనా ఒక్క ఫోన్‌కాల్‌తో ఇంటికి వచ్చేస్తుంటే...ప్రశ్నించడం కన్నా ఇంకేం కావాలి?
*

buddhamurali2464@gmail.com