జనాంతికం - బుద్దా మురళి

దావూద్-మీడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దావూద్ ఇబ్రహీం ఇప్పుడేం చేస్తున్నాడంటావ్?’’
‘‘ఏంటోయ్.. నీకు సడన్‌గా అతనిపైకి మనసు పోయింది?’’
‘‘టీవీలో వార్తలు వింటుంటే సడన్‌గా ఎందుకో గుర్తుకువచ్చాడు. పాపం.. ఎక్కడున్నాడో? ఎలా ఉన్నాడో??’’
‘‘ఎక్కడుండడం ఏమిటి? పాకిస్తాన్‌లోనే ఉన్నాడు, అందరికీ తెలిసిందే. కానీ ఎలా ఉన్నాడో తెలియదు. అప్పుడెప్పుడో- తడిబట్టల్లో మందాకిని మన దేశాన్ని ఒక ఊపు ఊపినపుడు.. దావూద్, మందాకినిల ఫొటోలు చూశాం. ఆ తరువాత రోగాల పాలయ్యాడని, ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడనే వార్తలు తప్ప దావూద్ లేటెస్ట్ ఫొటోలేమీ బయటకు రాలేదు. అది సరే.. దావూద్ ఇప్పుడెందుకు గుర్తుకువచ్చాడు? అది చెప్పడం లేదు. బహుశా మందాకిని కూడా దావూద్‌ను ఎప్పుడో మర్చిపోయి వుంటుంది. నీకు గుర్తుకువచ్చాడంటే ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది, ఏంటో చెప్పు?’’
‘‘ఏమీ లేదు. టీవీలో వార్తలు చూస్తుంటే గుర్తుకువచ్చాడు. ఆయనెవరో టీవీలో పెద్ద ఉద్యోగి అట! చానల్ వాళ్ళు 90 శాతం వాటాను ఎవరికో అమ్ముకున్నారు. ఆ చానల్‌లో ఈయన ఓ పెద్ద ఉద్యోగి.. ఠాట్.. అలా ఎలా అమ్ముతారు..? నేనొప్పుకోనని అతను గోలపెడుతూ చేస్తున్న వాదన భలేగా ఉంది’’.
‘‘వెనకటికి ఒకావిడ పుట్టింటికి వెళతానని చెప్పగా- మొగుడు సరే అంటే- అలా ఎలా పంపిస్తారని పక్కింటాయన గోల చేశాడని మనకో మోటు సామెత ఉంది కదా! ఈ వ్యవహారం అలాగే ఉన్నట్టు ఉంది’’.
‘‘మీడియా ఒకవైపు, మాఫియా ఒకవైపు వుంది. మీరంతా నా వెనకాల ఉండి పోరాడండి అని ఆ ఉద్యోగి పిలుపు ఇవ్వడం చూసి హఠాత్తుగా దావూద్ గుర్తుకువచ్చాడు’’.
‘‘అదే... ఎందుకు?’’
‘‘ఎంతైనా జన్మభూమి మీద ప్రేముంటుంది కదా? అంతిమ దశలో తనకు జన్మభూమికి రావాలని దావూద్‌కు అనిపించి వచ్చాడు అనుకో.. కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇదే మీడియాను ఉపయోగించుకొంటే, అంటే యుద్ధాలు లేని దేశాల కోసం ప్రపంచ శాంతి కోసం మీరంతా నాకు మద్దతు ఇవ్వండని పిలుపు ఇస్తే, యుద్ధకాంక్షతో ఉన్న దేశాల పీచమణచుదాం రండి.. కదలిరండి.. ప్రపంచశాంతి కోసం మీరంతా నా వెంట రండి’’ అని ఆవేశంగా పిలుపు ఇస్తే’’
‘‘ఇందులో తప్పేముందోయ్? యుద్ధం వద్దు- శాంతి ముద్దు అని పిలుపు ఇస్తే స్వాగతించాలి కానీ వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది?’’
‘‘చూశావా? ఇక్కడ మాట్లాడుకొంటున్నది మనిద్దరమే. దావూద్ శాంతి నినాదంతో ముందుకు వస్తే అనగానే- మన ఇద్దరిలో ఒకరి మద్దతు లభించింది. అంటే 50 శాతం ప్రజల మద్దతు ఉందన్నమాట. ఒక్క దావూదే కాదు చివరకు లాడెన్ సైతం శాంతి పేరుతో బయటకు వస్తే ప్రపంచ మేధావుల మద్దతు లభించి ఉండేది. మీడియాను మాఫియాగా మార్చిన వారే ‘మీడియా మాఫియా’ అంటూ గొప్పగా నినాదాలు ఇస్తున్నారు. అలాగే లాడెన్ శాంతి నినాదం ఇస్తే సక్సెస్ అయ్యేవాడు’’.
‘‘ఈ సంగతి నీకన్నాముందు అమెరికా వాడికి బాగా తెలుసు. అందుకే లాడెన్ ఎక్కడున్నాడో తెలియగానే, చాకుల్లాంటి బృందాన్ని పంపి నోరు మూసి సముద్ర గర్భంలో దాచిపెట్టారు’’.
‘‘నిజమే! లాడెన్ లేడు కానీ దావూద్ ఇంకా ఉన్నాడు కదా? ఓ పార్టీ పెట్టి దేశాల మధ్య యుద్ధాలు వద్దు, శాంతి ముద్దు అంటే ఎలా ఉంటుంది?’’
‘‘మరి.. దావూద్ చేసిన అకృత్యాల సంగతేమిటి? బాంబు దాడులతో ఎంతోమంది ప్రాణాలు తీశాడు కదా! వారి సంగతేమిటి? ఆనాటి బాధితుల కుటుంబాలకు ఏం చెబుతారు?’’
‘‘దావూద్ శాంతి అంటూ ముందుకు వస్తే స్వాగతించాలి కానీ నేరాలు- ఘోరాలు అంటూ అతను చేసిన అకృత్యాలు బయటపెట్టడం న్యాయమా?’’
‘‘ఏం జరుగుతుందో తెలియదు కానీ, నువ్వు మేధావివి అని నేను గ్యారంటీ ముద్ర వేసి ఇవ్వగలను. నేను చాలా సెమినార్లకు వెళ్ళాను. మేధావులు మాత్రమే ఇలా మాట్లాడుతారు.’’
‘‘ఆ చానల్ వ్యవహారంపై దేశ భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉందని నా అభిప్రాయం’’.
‘‘ఎలా?’’
‘‘ఎంతటి నేరగాడైనా శాంతి మంత్రం జపించగానే పాత నేరాలను వదిలేయాలనే నిర్ణయానికి వచ్చారనుకో, ప్రపంచంలో ఇంతకుమించిన సంస్కరణలు ఉండవు. జైలులోవున్న ఖైదీలు కూడా జై శాంతి, జై విప్లవం, జై పోరాటం అంటూ నినాదాలు చేస్తే, చచ్చినట్టు వారిని వదిలేయాల్సిందే’’.
‘‘ఇంతకూ ఆ చానల్ ఉద్యోగి చేసిన తప్పులపై విచారణ జరుగుతుందా? లేక అతని పోరాటానికి సమస్త ప్రపంచం అండగా ఉంటుందా?’’
‘‘ఏమో.. నాకేం తెలుసు? ఒక్క నినాదంతో చేసిన తప్పులన్నీ మాఫీ అయితే త్వరలోనే దావూద్ దేశంలో అడుగుపెడతాడు అని చెప్పగలను’’.
*

buddhamurali2464@gmail.com