జనాంతికం - బుద్దా మురళి

జై.. జై.. శ్రీరాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘జై శ్రీరాం! రావోయ్ రా!మనకు కొత్తేమో కానీ ఉత్తరాది వాళ్లు ఎక్కువగా ఇలానే పలకరించుకుంటారు...’’
‘‘సెల్‌ఫోన్లు లేని కాలంలో జై శ్రీరాం అంటూ కాగితం పైన రాసిన తరువాతనే ఉత్తరం రాసేవారు. షాపుల్లో ఖాతాలైనా, పరీక్షల్లో విద్యార్థులైనా జై శ్రీరాం అని రాసిన తరువాతనే మిగతా విషయాలు రాసేవారు. ఇప్పుడా ఉత్తరాలు లేవు, ఆ రాతలు లేవు. స్మార్ట్ఫోన్ అన్నింటినీ మింగేసింది.’’
‘‘నిజమే.. మనం ఆ అలవాటు మానేసినా శ్రీరాముడు మాత్రం మనల్ని ఆదుకుంటూనే ఉన్నాడు’’
‘‘మనల్ని అనకు- ఒక రాజకీయ పార్టీని అను..’’
‘‘అంతేలే! ఎవరైతేనేం? అంతా మనుషులే కదా? అందులోనూ దేశంలో అధికారంలోకి వచ్చిన వాళ్లు. పైగా పూర్తి మెజారిటీ..’’
‘‘ఆ రోజుల్లో ఉత్తరాలు రాసేప్పుడు, పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు రాసేప్పుడు పైన జై శ్రీరాం అని రాస్తే కొందరు నవ్వుకునే వారు. కానీ అలా రాసిన వారు మాత్రం శ్రీరాముడు తమను కాపాడుతాడని నమ్మేవారు.’’
‘‘చూస్తుంటే జై శ్రీరాం నినాదం బెంగాల్‌లో రామభక్తులను బాగానే ఆదుకునేట్టు ఉంది’’
‘‘ఎలా?’’
‘‘మమతక్క జై శ్రీరాం అనే నినాదం వింటేనే అగ్గిమీద గుగ్గిలం అవుతోందట! ఇంకేం.. రాజకీయ ప్రత్యర్థులకు కావలసింది ఇదే కదా? ఇప్పుడక్కడ ఆమెను వ్యతిరేకిస్తున్న వాళ్లంతా జై శ్రీరాం అని నినాదాలు చేస్తున్నారు. పోస్ట్‌కార్డు ఉద్యమం సాగుతోంది. స్మార్ట్ఫోన్ల కాలంలో కార్డులు రాసేవారెవరుంటారని అనుకుంటాం.. కానీ ఇప్పుడు దేశంలో కార్డులకు కొరత ఏర్పడింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి లక్షల మంది కార్డులు కొని జై శ్రీరాం అని నినాదం రాసి మమతక్కకు పంపిస్తున్నారు.’’
‘‘ఆ కార్డుల గుట్టలు బెంగాల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి’’
‘‘రామకోటి రాస్తే పుణ్యం వస్తుందని పెద్దవారు రాస్తుంటారు’’
‘‘ఔను- అందాల రాముడు సినిమాలో హీరో తల్లి అలా రాస్తుంది కదూ’’
‘‘ఔను- అది బాపు సినిమా.. ఆయనకు దేవుళ్లపై నమ్మకం లేకపోయినా శ్రీరాముడిపై గొప్ప నమ్మకం. సినిమాల్లో శ్రీరాముడు బాపును చల్లగా చూశాడు. ఆయన కూడా శ్రీరాముడ్ని అందాల రాముడిగా కొలిచాడు.’’
‘‘రామకోటి రాసిన వారికి పుణ్యం దక్కినట్టు జై శ్రీరాం అని నినదిస్తున్న బెంగాల్ నేతలకు పుణ్యం దక్కుతుందా? ’’
‘‘నాయకులకు పుణ్యమా?’’
‘‘అదే లేవోయ్- రాజకీయాల్లో పుణ్యం అంటే అధికారం అని అర్థం’’
‘‘ఏమో చూస్తుంటే అలానే అనిపిస్తోంది. మొన్న పార్లమెంటు ఎన్నికల్లో ఆ పుణ్యమేదో బాగానే దక్కింది. అక్కడ రామభక్తి ఎంతగా వ్యాపించింది అంటే దేవుడు లేడు ఉన్నదల్లా ఎర్ర దేవుడు ఒక్కడే అని దశాబ్దాల పాటు ప్రచారం చేసిన ఎర్రపార్టీల వాళ్లు కూడా ఈసారి మమతక్క దూకుడు తగ్గించాలని జై శ్రీరాం పార్టీని ఆదరించారట! ’’
‘‘వాలిని తానెలాగూ ఎదరించలేనని అనుకున్న సుగ్రీవుడు శ్రీరాముడ్ని ఆశ్రయించి విజయం సాధించినట్టు. తమ ఓటమికి తామెలాగూ ప్రతీకారం తీర్చుకోలేమనే నిర్ణయానికి వచ్చిన ఎర్రన్నలు మమతక్క ఓటమి కోసం జై శ్రీరాం అంటున్నారన్న మాట! ’’
‘‘అదేం పోలికోయ్!’’
‘‘రాజకీయాల్లో పోలికలదేముంది? విజయం ముఖ్యం. మేం విజయం సాధించక పోయినా, మమ్మల్ని చిత్తుగా ఓడించిన వారిని ఎదుర్కొనేందుకు ఆగర్భశత్రువులతోనైనా చేతులు కలపడమే కదా? రాజకీయం అంటే’’
‘‘నిజమే- నువ్వంటే గుర్తుకు వచ్చింది. రాజకీయ పార్టీలకు ఒక్కో సిద్ధాంతం ఉంటుంది. పాటించినా, పాటించక పోయినా సిద్ధాంతం అంటూ ఉంటుంది. ప్రపంచంలో మరే పార్టీకి లేని విధంగా ఒక రాజకీయ పక్షాన్ని వ్యతిరేకించడమే మా సిద్ధాంతం అని ఒక ప్రాంతీయ పార్టీ ప్రకటించింది’’
‘‘అర్థమైందిలే! తెదేపాను స్థాపించినప్పుడు కాంగ్రెస్‌ను వ్యతిరేకించడమే మా సిద్ధాంతం అని ప్రకటించిన ఎన్టీఆర్‌ను గుర్తు చేయదలుచుకున్నావా? చిత్రం కదూ! అలాంటి రెండు పార్టీలు జత కట్టాయి. ప్రజలు తిరస్కరించారనుకో- అది వేరే విషయం’’
‘‘నేనేం చెప్పాలనుకున్నానో చెప్పక ముందే నువ్వు చెప్పేశావ్ కాబట్టి. నేనా విషయంలో ఏమీ చెప్పను’’
‘‘దశాబ్దాల పాటు బెంగాల్‌లో పాతుకుపోయిన మమతక్క అంత సిల్లీగా జై శ్రీరాం అంటే మండిపడడం ఎందుకు?’’
‘‘సినిమాల్లో ఎంతోమంది విలన్లను చిత్తు చేసిన ఎన్టీఆర్ రాజకీయాల్లో చివరి దశలో అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారు? అంత అమాయకంగా ఎలా నమ్మారని ప్రశ్నిస్తే ఏం చెబుతాం? అంతా కాలమహిమ’’
‘‘స్కూల్ పిల్లాడికి కూడా ఈ టెక్నిక్ తెలుసు. పంతుళ్లకు నిక్‌నేమ్ పెట్టి వేధిస్తుంటారు. ’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘చూడోయ్- జై శ్రీరాం అంటే నువ్వు మండిపడుతున్నావ్! అంటే నీ ప్రత్యర్థి నిన్ను మరింతగా ఉడికించడానికి అదే మాట పదే పదే అంటుంటారు. ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీలో తెలంగాణ అనే మాట మాట్లాడవద్దని స్పీకర్ చెబితే ఏమైంది? చివరకు తెలంగాణ అసెంబ్లీగా మారిపోయింది.’’
‘‘మరేం చేయాలి?’’
‘‘మమతలా మాత్రం చేయవద్దు. జై శ్రీరాం అని ప్రత్యర్థులు ఒకసారి అంటే ఆమె జై జై శ్రీరాం అని రెండుసార్లు గట్టిగా అంటే ప్రత్యర్థులకు ఆయుధమే దక్కేది కాదు.’’
‘‘ఆయనెవరో- ప్రశాంత్ కిశోర్ అనే ఎన్నికల మాంత్రికుడు మమతక్కకు కన్సల్టెంట్‌గా వెళ్లాడట కదా? ఆయనకీ ఐడియా రాలేదంటావా? ఆంధ్రప్రదేశ్‌లో తన ఐడియాలతో విజయం సాధించేట్టు చేసిన వాడు కదా’’
‘‘గెలిచాక ప్రతిఒక్కరూ నాదే వ్యూహం అంటారు. దాందేముంది కానీ..’’
‘‘ ఆంధ్రప్రదేశ్‌లో విజయానికి కారణం ఎవరంటావు? జగనా?’’
‘‘జగన్ కన్నా బాబే ఎక్కువ కారణం అని అనిపిస్తోంది. అధికారంలో ఉన్నవారి తప్పులు, ప్రజా వ్యతిరేకత, ఆ తరువాతనే జగనైనా, ఇంకెవరైనా కారణం’’
‘‘ఇంతకూ ఏమంటావు?’’
‘‘శివుడిని భోళాశంకరుడు అంటారు కదా? నాకైతే శ్రీరాముడే భోళా అనిపిస్తోంది’’
‘‘ఎందుకు?’’
‘‘ఆలయం కట్టకపోయినా జై శ్రీరాం అంటే చాలని సంతృప్తి చెంది అధికారం అప్పగించాడు.. అందుకు..’’
*

buddhamurali2464@gmail.com