జనాంతికం - బుద్దా మురళి

కాళేశ్వరం రోజులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పె ళ్లికి వెళ్లడం, రావడం కూడా ఐపోయిందా? మా రోజుల్లో ఐతే పెళ్లంటే వారం రోజులు జరిగేది. నెలముందే ఇళ్లంతా బంధువులతో సందడిగా ఉండేది. అబ్బో.. ఆ మర్యాదలు, ఏర్పాట్లు, హడావుడి.. వాటితో పోలిస్తే ఇవి కూడా పెళ్లిళ్లా? అనిపిస్తుంది. ఒకరోజులోనే పెళ్లి ముగిసిపోతోంది. అరగంటలో హాలంతా ఖాళీ.. అటెండెన్స్ కోసం కనిపించినట్టు వచ్చి మాయమవుతున్నారు. ఆ రోజుల్లో ఊళ్లో పెళ్లంటే గ్రామంలో ఎవరింట్లోనూ వంట ఉండేది కాదు.. ఊరంతా పెళ్లి వారింట్లోనే..’’
‘‘ప్రజలకు ఇప్పుడంత తీరిక ఎక్కడిది?’’
‘‘ఔనులే.. హోటల్‌కు వెళ్లడం అంటే మా కాలంలో నామోషీగా భావించే వాళ్లం, ఈ రోజుల్లో పెళ్లి, శోభనం అన్నీ హోటల్‌లోనే. కలికాలం.. పిదప కాలం’’
‘‘కాలాన్ని బట్టి మనమూ మారాలి. మా కాలంలో అంటూ- మీ కాలం గురించి నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు. మరి మీకన్నా మీ తాతల కాలంలో ఇంకా ఎక్కువ చాదస్తాలు ఉండేవి.. వాటినేమంటావ్? కాశీకి వెళ్లిన వాళ్లు, కాటికి వెళ్లిన వాళ్లు ఒకటే అనేవారు. కాశీకి వెళ్లి మళ్లీ ప్రాణాలతో తిరిగి వస్తారో రారో అనుకునే వారు. ఎంతో మంది ప్రయాణంలోనే మరణించేవారు. మరి మీ కాలానికి వచ్చేసరిగా బస్సులపై ఎక్కడికైనా వెళ్లే సౌకర్యం లభించింది. ఇప్పుడంటే నెలకోసారి అమెరికా వెళ్లే వాళ్లు కూడా ఉన్నారు. అంతమాత్రాన నీ కన్నా ముందు వారి కాలం చెడ్డదని, నీ తరువాతి వారి కాలం చెడ్డదని, నీ కాలం మాత్రమే గొప్పది అనుకుంటే ఎలా? ’’
‘‘నువ్వెన్నయినా చెప్పు.. మా కాలమే వేరు..’’
‘‘అలా ఐతే- ఆదిమానవుల కాలంలో ఇంకా గొప్పగా ఉండేదట! అంత కన్నా లక్షల సంవత్సరాల ముందు భూమిపై డైనోసార్లు పరిగెత్తేవట! ఆ రోజులే వేరు. ఇప్పుడా కాలం మళ్లీ రమ్మన్నా రాదు. డైనోసార్ల అవశేషాలను వెతుక్కోవడమే తప్ప ఈ కాలంలో వాటిని చూడలేం కదా?’’
‘‘చర్చ దారి మళ్లేట్టు ఉంది. మనం చూడని కాలం గురించి మనకెందుకు వివాదం కానీ... ఈ మధ్య టీజీ వెంకటేశ్ ఎక్కడా కనిపించడం లేదు.. ఏమైంది?’’
‘‘తెదేపా రాజ్యసభ సభ్యులు ఐదుగురు భాజపాలో చేరుతున్నారని, వారిలో టీజీ వెంకటేశ్ కూడా ఉన్నాడని వార్తలొచ్చాయి కదా.. ఎందుకలా ఇంత హఠాత్తుగా నీకాయన గుర్తుకొచ్చాడు?’’
‘‘తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని పిలిచారు కదా? వారితో పాటు టీజీ వెంకటేశ్‌ను కూడా పిలవాల్సింది..’’
‘‘ఆయనె్నందుకు పిలవాలి?’’
‘‘నీకు గుర్తుందా? తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన పేరు మార్మోగిపోయేది.. తెలంగాణ రాష్ట్రం సాకారం అయినప్పుడు ఆయనో చాలెంజ్ చేశాడు.. తెలంగాణ ఏర్పడిన ఆరునెలల్లోనే ఆ ప్రాంత ప్రజల్లో ఉద్యమం వస్తుంది. మేం బతకలేం.. మళ్లీ ఆంధ్రలో కలిపేయండని తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తారని జోస్యం చెప్పాడు’’
‘‘తెలంగాణ రాష్ట్రం రానే రాదని, రాజకీయ నాయకులతో పాటు, తెలుగుదేశం ఆస్థాన జ్యోతిష్కుడు శ్రీనివాస గార్గెయతో పాటు ఇండిపెండెంట్ జోస్యులు, డిపెండెంట్ జోస్యులు చాలామంది జోస్యం చెప్పారు. పాపం- ఆయనొక్కడే గుర్తున్నాడా?’’
‘‘అంతా తెలంగాణ ఏర్పడక ముందు జోస్యం చెప్పారు, టీజీ మాత్రం తెలంగాణ ఏర్పడిన తరువాత ఆంధ్రలో కలిపేయమని ఉద్యమం వస్తుందని జోస్యం చెప్పాడు. అందుకే బాగా గుర్తుండి పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆయన రాకపోయినా, ఆయన ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని టీవీలోనైనా చూడాలని కోరుకుంటున్నా..’’
‘‘తెలంగాణ ఏర్పడిన ఆరునెలల్లో ఆ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తారని జోస్యం చెప్పిన ఆయన ఆంధ్రలో తెదేపా ఓడిపోయిన నెల రోజులు కాకముందే భాజపా వైపు చూడడం ఎవరూ చెప్పని జోస్యం కదూ!’’
‘‘నిజంగా తెదేపా ఎంపీలు పార్టీని వీడుతున్నారా? తెదేపా అధినాయకులే వారిని వ్యూహాత్మకంగా భాజపాలోకి పంపుతున్నారా?’’
‘‘నీ అనుమానం అర్థమైంది లే! కిందపడినా మాదే పైచేయి అనుకునే వాళ్ల ప్రచారం ఎలా ఉన్నా, ఏ నాయకుడూ తన అనుచరులను బయటకు పంపి తనను తాను బలహీనపరుచుకోడు’’
‘‘ఎత్తులో ఉన్న తెలంగాణకు దిగువన ప్రవహించే గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం గురించి చర్చ మొదలు పెట్టి, ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి కప్పగంతుల వద్దకు తీసుకు వచ్చావు’’
‘‘కాళేశ్వరానికి అంత వ్యయం అవసరమా?’’
‘‘ఆధునిక టెక్నాలజీ ఐతే అంత అవసరం లేదు’’
‘‘ఇప్పుడు సరిగ్గా పాయింట్‌కు వచ్చావు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించ లేదని ఒప్పుకుంటున్నావు కదా? ఆధునిక టెక్నాలజీతో ఎంతలో పూర్తయ్యేది?’’
‘‘ఒక కంప్యూటర్,గ్రాఫిక్ డిజైనర్ ఉంటే చాలు..’’
‘‘అర్థం కాలేదు.. ఈరోజుల్లో గ్రాఫిక్స్‌తో ప్రపంచ స్థాయి రాజధానులను- చైనా, జపాన్, సింగపూర్‌లను తలదనే్న రాజధాని డిజైన్‌లను నిమిషాల్లో గ్రాఫిక్స్‌లో తయారు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూడా అదే విధంగా గ్రాఫిక్స్‌తో కారుచౌకగా తయారు చేయవచ్చు. ’’
‘‘వ్యంగ్యమా?’’
‘‘వ్యంగ్యం కాదు నిజం. అమీర్‌పేట సెంటర్‌కు వెళితే కాలుకో పదిమంది చేతికో పదిమంది గ్రాఫిక్స్ డిజైనర్లు దొరుకుతారు. గ్రాఫిక్స్ డిజైన్ ప్రాజెక్టులు అందంగా కనిపిస్తాయి కానీ, పొలాలకు నీళ్లు రావు.. అదే వాటితో సమస్య.. అందుకే వాటి జోలికి వెళ్లకుండా నిజమైన ప్రాజెక్టు కట్టారు’’
‘‘ఐనా అదేంటోయ్.. మా కాలంలో ప్రాజెక్టులంటే కనీసం 20- 30 ఏళ్ల పాటు కట్టేవారు. మరీ మూడేళ్లలో ప్రాజెక్టు కట్టడం అన్యాయం కదూ’’
‘‘కొన్ని ప్రాజెక్టులు కాగితాల మీదనే దశాబ్దాల పాటు కాపురం చేసేవి. కానీ ఇప్పుడు రోజులు మారాయి. అప్పుడెప్పుడో ఒకాయన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు దేవాదుల ప్రాజెక్టు శంకుస్థాపనకు హెలికాప్టర్‌లో పూజారిని తీసుకు వెళ్లాడు. ఐనా జనం నమ్మలేదు’’
‘‘ఇప్పుడు రోజులు మారాయి. ఇవి కాళేశ్వరం రోజులు.. కాగితాల మీద ప్రాజెక్టులు కనిపించే రోజులు కావు.’’
‘‘ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో ఎవరైనా గట్టిగా తుమ్మారనుకో.. నిలిపివేస్తారా?’’
‘‘నిలిపివేయరు.. ప్రాజెక్టులో తోసేస్తారు.’’
*

buddhamurali2464@gmail.com