జనాంతికం - బుద్దా మురళి

అందరిదీ నటనే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ రోజుల్లో మంచికి స్థానం లేదు..’’
‘‘ఈ టైటిల్‌తో మూడు దశాబ్దాల క్రితమే సినిమా వచ్చింది. సరిత మొదటి సినిమా అది. అయితే విడుదలైన మొదటి రోజు రెండో ఆటకే సినిమా ఎత్తేశారు. ఆమె కూడా ఈ సినిమా పేరు చెప్పదు. మరోచరిత్రనే తన మొదటి సినిమా అంటుంది. టైటల్ బాగానే ఉంది కానీ.. కథ లేక నడవలేదు. ఇంకో టైటిల్ ఏదైనా వెతుక్కో..’’
‘‘సినిమా టైటిల్ కాదు. నేను లోకం తీరు గురించి చెబుతున్నా.. మంచికి స్థానం లేదు’’
‘‘ఏమైంది?’’
‘‘అందమైన అమ్మాయి.. ఫేస్‌బుక్‌లో ఫొటో చూడగానే వావ్ అని స్పందించాను.. వంట చేస్తున్నట్టు ఫొటో పెడితే... మీరు చాలా గ్రేటండీ అని కామెంట్ చేశాను. వాళ్ల అన్న కొడుకట.. గట్టిగా అరుస్తూ- వాడి ఫొటో చూస్తేనే చిరాకేసింది. అయినప్పటికీ వాడు క్యూట్ అంటూ కామెంట్ చేశా..’’
‘‘కామన్.. నువ్వింకా నయం.. జలుబు అంటూ ముక్కు చీదుతున్న ఫొటో పెట్టినా.. క్యూట్ అని కామెంట్ చేస్తారు’’
‘‘ఎక్కడిదో కొట్టుకొచ్చిన కవితను పోస్ట్ చేస్తే... వావ్! మీదెంత సున్నిత మనస్తత్వం.. ‘బావ కవిత్వం’లో కృష్ణశాస్ర్తీని మించిపోయారని అన్నాను. మా బావ పేరు కృష్ణశాస్ర్తీ కాదు. మేం శాస్త్రులం కాదు అని తిరిగి కామెంట్ చేసింది. వాటే జోక్ అంటూ పడిపడి నవ్వాను. రవీంద్రనాథ్ ఠాగూర్ తరువాత సాహిత్యంలో నోబెల్ బహుమతి మన దేశంలో ఎవరికీ దక్కక పోవడం అన్యాయం. మీ కవిత్వం ఆ స్థాయిలో ఉంది అన్నాను’’
‘‘నీది జియో కనెక్షనే కదా?’’
‘‘ఔను!’’
‘‘ఐతే ఓకే.. పోయేదేముందోయ్ .. సాహిత్యంలో నోబెల్ ఇవ్వదగిన కవిత్వం కన్నా గొప్పగా ఉందని కామెంట్ చేయవచ్చు. తప్పేమీ లేదు. పుణ్యానికి వచ్చిన అక్షరాలే కదా? జియో వాడు అక్షరానికో రేటు ప్రకటిస్తే ఆలోచించాలి కానీ అప్పటి వరకు తప్పేమీ లేదు’’
‘‘తలనొప్పితో ఆన్‌లైన్‌లోకి రావడం లేదని అంది.. ఏమైంది బంగారం..? నేనున్నాను కదారా! ఎక్కడికి రావాలి చెప్పు అన్నాను.’’
‘‘అడ్రస్ కనుక్కొని నువ్వే వెళ్లి ఓదార్చావా?’’
‘‘ప్రయత్నించాను. అడ్రస్ చెప్పలేదు. కానీ ఫోన్ నెంబర్ ఇచ్చింది’’
‘‘నీకది చాలు కదా? అడ్రస్ కనుక్కొని ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టి ఉంటావు’’
‘‘్ఫన్ నెంబర్లు మార్చుకున్నాం. తెల్లవారగానే హాయ్ బేబీ.. అంటూ పలకరించాను. అయినా కృతజ్ఞత లేదు. ఈ రోజుల్లో మనుషులను అస్సలు నమ్మలేం..’’
‘‘ఏమైందో చెప్పు?’’
‘‘అంత కష్టపడి మనసు దోచుకున్నాను.’’
‘‘ఆ తరువాత?’’
‘‘ఆమె కోసం ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో ఆరునెలలు నేను పడిన కష్టాన్ని పట్టించుకోవడం లేదు కానీ. వర్షం కురిసిన రాత్రి .. ఇప్పుడు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తోంది.. ఇదేమన్నా న్యాయంగా ఉందా? మనుషులకు ఇంత కూడా కృతజ్ఞత లేదు. చింపిరి జుట్టు ఫొటోకు కూడా లైకులు పెట్టాడనే కృతజ్ఞత లేకుండా..’’
‘‘ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు’’
‘‘ఆ మాత్రం కృతజ్ఞత లేని ఫేస్‌బుక్ పాడులోకంలో నేను ఉండలేను అని ప్రకటించి.. అకౌంట్ క్లోజ్ చేశా.. ఆ తర్వాత నా ఫోన్ నెంబర్ మార్చుకున్నాను’’
‘‘నిజమే- పాడులోకమే కానీ.. ఆ పాడులోకంలోకి ప్రవేశించేందుకు నువ్వు మారుపేరుతో ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి ఉంటావులే! పాడు లోకాన్ని అంత ఈజీగా వదలలేం’’
‘‘ఇవి ఎప్పుడూ ఉండేవే కానీ... అదేంటి రా.. పల్నాటిపులి అలా ఆత్మహత్య చేసుకున్నాడు.. మరీ దీన్ని ఇరుపక్షాలూ అంతలా రాజకీయం చేస్తున్నారు.’’
‘‘చూడోయ్- నువ్వన్న ఫేస్‌బుక్ పాడులోకం, రాజకీయ లోకం రెండూ ఒకలాంటివే! ఈ రెండింటిలోనూ నీతులు ఎక్కువగా వినిపిస్తారు. చాలా తక్కువగా ఆచరిస్తారు.’’
‘‘ఎంత రాజకీయమైనా శవాలను కూడా వదలరా? శవాలపై రాజకీయం చేస్తారా?’’
‘‘పిచ్చోడా! శవాలపై రాజకీయం కాదు. చివరకు శవం కూడా రాజకీయం చేస్తుంది. రాజకీయం అంతే! అదో మాయా ప్రపంచం.. ఒకసారి అందులోకి ప్రవేశించావంటే- చావు, పెళ్లి అనే తేడా లేదు- ప్రతీదీ రాజకీయం చేయాల్సిందే!’’
‘‘ఉగ్రవాదుల కన్నా అన్యాయంగా పాలిస్తున్నారు. రెండు లక్షల రూపాయల కుంభకోణానికే కేసులు పెడతారా? అని ఆయనెవరో హృదయ విదారకంగా ప్రశ్నిస్తున్నాడు. మంచితనానికి ఇవి రోజులు కావు అంటున్నారు. క్రైం స్టోరీ టైప్‌లో బ్యాక్ గ్రౌండ్‌లో మ్యూజిక్ కూడా..
‘‘నాకు కడుపునొప్పి వస్తే ప్రపంచం అంతా కడుపునొప్పితో విల విల లాడుతోంది. నా ఉద్యోగం ఊడితే ప్రపంచం రోడ్డున పడింది. ప్రజలు నన్ను అధికారం నుంచి దించేస్తే- ఇపుడు అధికారంలో ఉన్నవారిని టెర్రరిస్టులంటూ తిడుతూ బాధపడడం మామూలే. ఓట్ల వేటలో ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తుంటారు. ఈ వ్యాపారానే్న రాజకీయం అంటారు.’’
‘‘మరి టీవీల్లో?’’
‘‘సినిమా అన్నాక ప్రచారం అవసరం కదా? మా సినిమా ఆహో- ఓహో- సాహో అని ప్రచారం చేసుకుంటేనే కదా? జనం చూసేది. అలాగే మిగతా సినిమాలు తుస్సు అని కూడా ప్రచారం చేయాలి’’
‘‘రాజకీయాలు ఇంతగా చెడిపోయాయి కాబట్టే బాబాలను జనం నమ్ముతున్నారు’’
‘‘మొన్నో స్వామిగారు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవి నాకు వడ్లగింజతో సమానం అని అద్భుతంగా భక్తులకు ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ ఉపన్యాస ప్రభావం అందరికన్నా ఎక్కువగా ఆ స్వామి కారు డ్రైవర్‌పై పడింది..’’
‘‘ఎలా?’’
‘‘డ్రైవర్ వాళ్ల ఊరెళ్లి వడ్లగింజల బస్తా తీసుకొచ్చి స్వామీజీకి ఇచ్చి.. మీకు సీఎం, పీఎం పోస్టులు కూడా వడ్లగింజలతో సమానం కదా? నేను ఏకంగా ఓ వడ్లగింజల బస్తాని ఇస్తున్నాను. ఇవి తీసుకుని ఇంత కాలం నేను నడిపిన మీ కారును నాకు ఇచ్చేయండి స్వామీ అని వేడుకున్నాడు’’
‘‘మరి కారు ఇచ్చాడా?’’
‘‘వీడు నా పీఠానికే ఎసరు పెట్టేట్టు ఉన్నాడని డ్రైవర్‌ను మార్చి... కొత్త డ్రైవర్‌ను తెచ్చుకున్నాడు.’’
‘‘నిజంగా ఆ స్వామి పరిపూర్ణ స్వరూపుడే.. ఎంత ముందుచూపు..? చూస్తుంటే సర్వం రాజకీయ మయం అవుతోంది. సినిమా వాళ్లు, రాజకీయ నేతలు, స్వాములు, మీడియా వాళ్లు.. అంతా నటించడమే తప్ప ఒక్కరు కూడా నిజం చెప్పరు’’
‘‘వాళ్లేనా?... మన మేమన్నా ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లో నిజాలు చెబుతున్నామా? అన్నీ మనం పాటించని నీతులే కదా చెప్పేది.. పాత్రోచిత నటన అన్నట్టు. లోకానికి తగ్గట్టు నటించాలి తప్పదు’’
*

buddhamurali2464@gmail.com