జనాంతికం - బుద్దా మురళి

కడుపు రగిలింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కడుపు రగిలిపోతోంది..’’
‘‘నీ కొత్త కవితా సంకలనం పేరా? బాగుందోయ్ టైటిల్. నువ్వు నిజంగా గ్రేట్.. గతవారమే ఓ కవితా సంకలనం విడుదల చేశావ్. ఆ అప్పు ఇంకా తీరకముందే మరో కవిత సంకలనానికి టైటిల్ రెడీ చేశావంటే నువ్వు గ్రేట్..’’
‘‘చెప్పుకుంటూ పోవడమేనా? నా మాట వినవా? ఇదేమన్నా కవితా పఠనం అనుకున్నావా? ఎదుటివాళ్లు వింటున్నారా? లేదా? అని కూడా చూడకుండా చెబుతూనే ఉన్నావు’’
‘‘ఏంటో చెప్పు.. వింటాను’’
‘‘కడుపురగిలిపోతోంది.. నా కవితా సంపుటి కాదు. కానీ నువ్వన్నాక ఆ శీర్షికతో వెంటనే ఓ కవితా సంకలనం ప్రచురించాలనుకుంటున్నాను.’’
‘‘ఆ పని తొందరగా చెయ్! ఇంతకు ముందొకరు కడుపు మండిపోతోంది అంటూ ఓ కవితా సంకలనం విడుదల చేశారు. నువ్వు రగిలిపోతోంది అంటున్నావుకాబట్టి టైటిల్ విషయంలో వివాదం ఉండక పోవచ్చులే! సినిమా టైటిల్స్‌ను రిజిస్టర్ చేయించుకున్నట్టు కవితా సంకలనాల టైటిల్స్ రిజిస్టర్ చేయించుకునే వీలుంటే బాగుండు..’’
‘‘ఇంతకూ కడుపురగిలిపోతున్న కథేమిటో చెప్పనే లేదు..’’
‘‘టైటిల్ దొరికింది.. ఎవరైనా స్పాన్సర్ ఉంటే చూడు గురూ.. కవితా సంపుటి వేద్దాం. ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బట్టల దుకాణాల వాళ్లు స్పాన్సర్ చేస్తున్నారు. మొన్న మా కొలీగ్ ఒకరు కవితా సంకలనం అచ్చు వేస్తే గన్నయ్యగూడెం రియల్ ఎస్టేట్ ఏజెంట్ల సంఘం స్పాన్సర్ చేసింది.’’
‘‘ఇంతకూ నీకు కడుపు రగిలించి, కవితా సంకలనానికి టైటిల్ ప్రసాదించిన ఆ కడుపుమంట కథేమిటో చెప్పనే లేదు..’’
‘‘ముఖేష్ అంబానీ ఆస్తి రూ. 3,80,700 కోట్లకు చేరుకుందట! ఈ వార్త చదవగానే కడపు రగిలిపోయింది. మనమేమో ఇలానే ఉండిపోతాం. ఒక్కోసారి బార్‌కు వెళ్లాలన్నా ఎంత కష్టంగా ఉంటుంది? ఒక్కో నెల చివరి వారం కటకటతో పాత పేపర్లు అమ్మి బారుకెళ్లి బీరుతో సంతృప్తి పడాల్సి వస్తోంది. అంబానీకేమో ఏటేటా వేల కోట్ల ఆస్తి పెరిగిపోతోంది. కడుపు మండిపోదా మరి? ఇందుకేనా స్వాతంత్య్రం, ఇందుకేనా ప్రజాస్వామ్యం?’’
‘‘నీ ఆవేశం గురించి తరువాత తీరిగ్గా ఆలోచిద్దాం. మార్గం దొరక్కపోదు. ఔను.. ముఖేష్ అంబానీ 80 అంతస్తుల భవనంలోకి మనకు దారి తెలియదు కానీ. మనకు లోకల్‌గా రిలయన్స్ రిటైల్ షాపులు ఉన్నాయి కదా? రిలయన్స్ ప్రెష్- కూరగాయల ఔట్ లెట్ కాకపోతే రిలయన్స్ చెప్పుల దుకాణం వాడినైనా స్పాన్సర్ చేయమందాం కవితా సంకలనం ప్రచురణకు..’’
‘‘ఆ ప్రయత్నాలు అన్నీ ఎప్పుడో అయిపోయాయి. పోయిన వారం కవితా సంకలనానికి మా కాలనీ రిలయన్స్ ప్రెష్ మేనేజర్‌ను అడిగాను. ప్రతినెలా అక్కడికే వెళతాం కదా? నాకు బాగా క్లోజ్. నిర్ణయాలన్నీ నోయిడా నుంచే జరుగుతాయి. విరాళాలు ముంబయిలో, మీడియా ప్రకటనలు సూరత్‌లో విడుదలవుతాయి. ఇక్కడ లోకల్‌గా ఎలాంటి స్పాన్సర్‌షిప్‌కు అవకాశం లేదని తెగేసి చెప్పాడు.’’
‘‘వాడెవడో నరుూమ్ అనే గ్యాంగ్‌స్టర్ ఆమధ్య ఎన్‌కౌంటర్‌లో పోయాడు కదా? వాడు నరరూప రాక్షసుడే ఐనా ఇలాంటి వాటికి బాగానే స్పానర్ చేసేవాడట! పాపం వాడు పోయాడు.. అయినా చచ్చిన బర్రె ముంతడు పాలిస్తుండేదన్నట్టు... ఆ సంగతులన్నీ ఇప్పుడెందుకులే... ఎటూ మార్గం కనిపించడం లేదు. నీ సొంత డబ్బుతోనే కవితా సంకలనం వేయించాల్సిందే.’’
‘‘అంతకుముందు అప్పు చేసి మరీ కవితా సంకలనాలు వేశా కానీ ... ఇప్పుడెందుకో ఆ గుండుబాస్- డబ్బులు ఊరికే రావు అని చేస్తున్న ప్రకటనను నిమిషానికోసారి గుప్పించిన తరువాత.. ఎందుకో ఖర్చుకు మనసు రావడం లేదు. ’’
‘‘కక్కొచ్చినా కవిత్వం వచ్చినా ఆగదంటారు. ముహూర్త బలం ఉంటే నీ కొత్త కవితా సంకలనం బయటికి వస్తుందిలే! దాని గురించి తరువాత ఆలోచిద్దాం. ఇప్పుడు మన దేశానికి విదేశీ పర్యాటకులు ఎవరూ రారట కదా?’’
‘‘ఎవరు చెప్పారు?’’
‘‘అదేదో థామస్ కుక్ అంట- 187 ఏళ్ల బ్రిటీష్ టూరిజం సంస్థ తాజాగా మూత పడిందట! యూరప్ యాత్రీకులు దీని ద్వారానే ఇండియాకు వచ్చేవారట! వీళ్ల రాకతో గోవా కళకళలాడేదట! ఇక గోవా కళ తప్పినట్టే అని మీడియాలో వార్త వచ్చిందిలే!’’
‘‘మీ ఇంటి పక్క కిరాణా షాపు ఎత్తేసిన తరువాత మీ ఇంట్లో అన్నం వండుతున్నారా? మీకు పప్పులు దొరుకుతున్నాయా?’’
‘‘అదేం ప్రశ్నరా? సుబ్బారావు కిరాణా కొట్టు కాకపోతే అప్పారావు దుకాణం.. అదీ కాకపోతే చమన్‌లాల్ దుకాణాలు అన్ని చోట్లా ఉండేవే కదా? షాపుమూత పడితే అన్నం వండుకోవడం ఆపేస్తామా?’’
‘‘ఇదీ అంతేరా..! థామస్ కుక్ మూతపడితే రాబర్ట్ కుక్ వస్తాడు. వెనకటికెవరో ముసలమ్మ తన కోడి కూయక పోతే తెల్లవారదని అనుకుని రాత్రికి రాత్రి ఊరు విడిచి పోయిందట! ఆ ముసలవ్వ కోడి కాకపోతే ఇంకో పడుచవ్వ కోడి కూస్తుంది.. ఏ కోడీ కూయకపోయినా తెల్లవారకుండా ఆగదు కదా? ఇదీ అంతే.. గోవా కళకళలాడుతుంది. యూరప్ దేశాల పర్యాటకులు వస్తారు. మహా ఐతే కొత్త సంస్థకు అలవాటు పడేందుకు ఒకటి రెండు నెలలు పట్టొచ్చు’’
‘‘యూరప్ సంగతి ఎలా ఉన్నా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను చూస్తే జాలేసింది. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.. భారత్ మార్కెట్‌కు విలువ ఇస్తున్నారు కానీ మా దేశాన్ని పట్టించుకోరా? అని ఎంత ఆవేదనగా చెబుతున్నాడో’’
‘‘నిజమేరా! మనం కాలేజీలో చదివినపుడు కాలేజీ రౌడీని చూసి అంతా భయపడేవాళ్లం. ఎవరినైనా కొట్టాలంటే వాడిని ఆశ్రయించేవాళ్లం. కానీ ఆ రౌడీ అంటే మనకెవరికీ గౌరవం ఉండేది కాదు. కాలేజీ చదువు అయ్యాక మనమంతా ఉద్యోగాల్లో స్థిరపడితే ఆ రౌడీగాడు మాత్రం అటు చదువు పూర్తి చేయలేక ఇటు జీవితంలో స్థిరపడలేక దయనీయంగా బతుకుతున్నాడు. ఒకప్పుడు కాలేజీ మొత్తాన్ని హడలెత్తించాడు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితీ అంతే..’’
‘‘ఔను- ప్రపంచంలో ఏ దేశంలో ఉగ్రదాడి జరిగిందన్నా దాని వెనుక పాక్ ఉంటుంది. మనవి ఐటీ ఎగుమతులు అయితే, ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఇతర దేశాలకు ఏదో ఒకటి ఎగుమతి చేసేది. పాకిస్తాన్ మాత్రం మానవ బాంబులను ఆవిష్కరించి ప్రపంచమంతా సరఫరా చేసింది. ఒకప్పుడు పాక్ ఉగ్రవాదుల పేరు వింటేనే ప్రపంచం వణికింది. ఇప్పుడు పాకిస్తాన్ దేహీ అంటూ ప్రపంచం అంతా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు’’
‘‘జ్ఞానం గురించి ఆలోచించిన దేశాలకు జ్ఞానం దక్కింది. సంపదపై దృష్టి సారించిన దేశాలు సంపద దక్కింది. ఉగ్రవాదానే్న ఊపిరిగా పీల్చిన దేశానికి చివరకు ఉగ్రవాదమే మిగిలింది. అందుకే.. చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నారు. ’’
‘‘బాగా చెప్పావు.. ముఖేష్‌కు లక్షల కోట్లు, నీకు కవితా సంకలనాలు దక్కినట్టు’’
*

buddhamurali2464@gmail.com