జనాంతికం - బుద్దా మురళి

నిమ్మకాయ.. మానవ బాంబు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అసలు మనం ఎక్కడికి పోతున్నాం? చంద్రమండలంపై కాలనీలు నిర్మిం చే ఆలోచనలు ఒకవైపు సాగుతుంటే, మరోవైపు ఇంతగా ఎలా మారిపోతున్నామో ఆలోచిస్తే బాధగా ఉంది. మనలాంటి మేధావులం దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇంతకాలానికైనా నువ్వు కూడా నా దారిలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఏనాటికైనా ప్రపంచమంతా మా దారిలోకే వస్తుంది.’’
‘‘నేను నీ దారిలోకి రావడం ఏంటి? నువ్వు మీ అమ్మానాన్నల మీద ఆధారపడి బతుకుతావు. నేను చక్కగా ఉద్యోగం చేస్తున్నాను. ఈ వయసులో కూడా పాకెట్ మనీ కోసం, బైక్‌లో పెట్రోల్ కోసం అమ్మానాన్నల ముందు చేయి చాచడం ఎంత సిగ్గు చేటు! అవసరం ఐతే కూలిపని చేస్తా కానీ నీ దారిలోకి వచ్చి అమ్మానాన్నల ముందు చేయి చాచే పరిస్థితి తెచ్చుకోను. ఉన్న ఉద్యోగం ఊడితే మరో ఉద్యోగం వెతుక్కుంటాను. అమెరికాలో పద్దెనిమిదేళ్లయితే ఇంట్లో ఉండనివ్వరట! ఎవరి బతుకు వాళ్లు బతకాలి. మనమేమో నడివయసులో కూడా విప్లవం అంటూ మాట్లాడుతూ పాకెట్ మనీకి తల్లిదండ్రులను వేధిస్తాం.’’
‘‘అనుకున్నాను. నువ్వు కూడా ఏదో ఒకనాడు అమెరికా తొత్తుగా మారుతావని. అమ్మానాన్నలు పాకెట్ మనీ ఇవ్వకపోయినా ఫర్వాలేదు. వారాసిగూడ ‘డైమండ్ పాయింట్’లో వన్‌బై టీ తాగేందుకు జేబులో డబ్బులు లేకపోయినా ఫర్వాలేదు. మన వాళ్లలో ఎవరో ఒకరి మీద వాలిపోతా.. కానీ నేను అమెరికాకు తొత్తుగా మారే ప్రసక్తే లేదు. ట్రంప్‌ను క్షమించే ప్రసక్తే లేదు’’
‘‘ఔనురా! మొన్న మీ ఇంటి ముందు నుంచి ఓ పెద్ద కారు వెళ్లడం చూశాను. ట్రంప్ నిన్ను బతిమాలేందుకు వచ్చాడా? ఎవరిదా ఆ కారు? అని ఇన్ని రోజులు ఆలోచించాను. ట్రంప్‌దా?’’
‘‘ట్రంప్‌కు మా ఇంటికి వచ్చేంత ధైర్యమా? ఎవరెన్ని చెప్పినా నేను వినే రకం కాదని తెలుసు కాబట్టి ట్రంప్ రానే రాడు. పైగా నువ్వు అబద్ధం చెబుతున్నావని నాకు తెలుసు. మా గల్లీలోకి ఆటోనే రాదు. ఇక కారెలా వస్తుంది? అందులోనూ ట్రంప్ కారు ఎలా వస్తుంది?’’
‘‘ఔనురా! ఆ గల్లీలో ఇంకెంత కాలం ఉంటారు. ట్రంప్‌పై నీ వ్యతిరేకత ఏదో ఒక రోజు ఆయన దృష్టిలో పడకపోదు. నిన్ను బతిమిలాడేందుకు ఆయన రాకపోడు. పెద్దకారు వెళ్లే వీధిలోకి మారొచ్చు కదా?’’
‘‘గల్లీలోని ఇంటికే అద్దె కట్టలేక నాన్న తంటాలు పడుతున్నాడు. అది సాధ్యం కాదులే!’’
‘‘ఏరా! మీ ఇద్దరికీ పనీపాటా లేదా? గోరటి వెంకన్న గల్లీ చిన్నది.. అనే పాటను గుర్తుకు తెచ్చే గల్లీ జీవితంలో ఉంటూ అమెరికా అధ్యక్షుడి కారు మీ ఇంటికి రావడం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకూ మీరు దేని గురించి చర్చ ప్రారంభించి.. ఎక్కడికి వెళ్లారు?’’
‘‘నిజమే మరిచేపోయాం. ఈ కాలంలో కూడా అలాంటి ఆలోచనల్లో ఉన్నందుకు బాధ గురించి కదా? మనం చర్చ మొదలు పెట్టింది.’’
‘‘నిజమే కానీ ఆ సంగతి ఏంటి? ఈ కాలంలో కూడా మనిషిని మనిషిగా చూడకుండా మానవ బాంబులుగా మారుతూ పొరుగు దేశం మీద దాడులు జరిపే తీవ్రవాదం గురించే కదా? ఆ తీవ్రవాదుల చెడిపోయిన మెదడు గురించే కదా నువ్వు బాధపడుతున్నది?’’
‘‘కాదు..కానే కాదు’’
‘‘తమ కడుపున పుట్టిన పిల్లలను కుక్కలు, పందులు కూడా ప్రేమిస్తాయి కదా? మరి వారు ఎంత అమానుషంగా తమ పిల్లలు మానవ బాంబులుగా మారి మనుషుల మధ్య పేలిపోవడాన్ని తల్లిదండ్రులు ఎలా అంగీకరిస్తారో తలుచుకుంటేనే ఓళ్లు జలదరిస్తోంది. ఎంత పేదరికం అయితే మాత్రం మానవ బాంబులుగా మారేందుకు ఎలా అంగీకరిస్తారో? కష్టపడి బతకాలి. ప్రపంచంలో ఎంతమంది పేదవాళ్లు లేరు. వారంతా బాంబులుగా మారుతున్నారా?’’
‘‘ఎహే.. ఆపేయ్.. నేను ఆవేదన చెందుతున్నది మానవ బాంబుల గురించి కాదు..’’
‘‘మరి?’’
‘‘పత్రికలు చూడవా?’’
‘‘చూడను’’
‘‘రక్షణ మంత్రి ఫ్రాన్స్ వెళ్లాడు కదా?’’
‘‘వెళ్లి ఉండొచ్చు... వెళితే నాకేంటి?’’
‘‘రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నాడు’’
‘‘కొంటే కొన్నాడు. దేశం అన్నాక సైన్యం ఉంటుంది. సైన్యం అన్నాక ఆయుధాలు అవసరం. అవసరం అన్నాక ఆయుధాలు అమ్మే దేశాలుంటాయి. కొనే దేశాలుంటాయి. ఐతే..’’
‘‘రాఫెల్ యుద్ధ విమానాలను కొన్నాడు.. అదే తప్పంటే యుద్ధ విమానాలకు దసరా రోజున పూజ చేశాడు. సర్లే పోనీయ్ అనుకుంటే... విమానాల టైర్ల కింద లేత నిమ్మకాయలు పెట్టాడు’’
‘‘ఆ నిమ్మకాయలు, కర్కశ యుద్ధ విమానాల టైర్ల కింద ఎంతగా నలిగిపోయాయో అని ఆవేదన చెంతున్నావా? అప్పుడెప్పుడో పూవుల సుకుమారాన్ని చూసి కృష్టశాస్ర్తీ కవిత్వం రాశాడు. నువ్వు యుద్ధ విమానాల టైర్ల కింద నలిగిపోయిన నిమ్మకాయల సుకమారంపై కవిత్వం రాయవోయ్ మంచి పేరొస్తుంది. అన్ని పత్రికల్లో మనకు తెలిసిన వాళ్లున్నారు. మంచి సమీక్షలు వచ్చేట్టు చూస్తాను. నాదీ బాధ్యత. ఒకటి రెండు పత్రికల్లో మన వాళ్లే సాహిత్యం పేజీల ఇన్‌చార్జ్‌లున్నారు. ఫుల్‌పేజీ సమీక్ష వచ్చేట్టు చేస్తా’’
‘‘చెప్పేది పూర్తిగా విను. కవిత్వం రాస్తాను లే! అది వేరే సంగతి కానీ నేను బాధపడుతున్నది దాని కోసం కాదు. ఈ కాలంలో కూడా యుద్ధ విమానాలకు నిమ్మకాయలతో దిష్టి తీయడం అంటే మనం ఎంత వెనకబడి ఉన్నాం? అనే బాధ కలుగుతోంది.’’
‘‘అన్ని దేశాల్లోనూ ఇలాంటి నమ్మకాలు ఉంటాయి. విమాన చక్రాలు నిమ్మకాయల మీద నుంచి వెళ్లినంత మాత్రాన విమానానికి వచ్చిన నష్టం లేదు. నిమ్మకాయలకేం కష్టం కాదు. మధ్యలో నీకెందుకోయ్! ఆ దేశం, ఈ దేశం అని కాదు. అన్ని మతాల్లో, అన్ని దేశాల్లో ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి. అమెరికాలో దిష్టితీయడానికి ఖాళీ కోడిగుడ్లతో దండ కడతారు. అంతెందుకోయ్.. ప్రపంచంలో దేశాల మధ్య చిచ్చు రగిల్చి, యుద్ధ వాతావరణం కల్పించి, ఆయుధాలు అమ్మే దేశాలన్నీ యుద్ధ విమానాలపై పవిత్ర జలాలు చల్లుతాయి. అది తెలుసా? నీకు’’
‘‘పవిత్ర జలం చల్లడం అంటే అదో పవిత్ర కార్యం. కానీ ఇంకా వేల సంవత్సరాల నాటి నిమ్మకాయలతోనే పూజలేంటి? మూఢనమ్మకం కాకపోతే. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? నిమ్మకాయలతో యుద్ధాల్లో విజయాలు దక్కుతాయా?’’
‘‘నిమ్మకాయలను బలిస్తే తట్టుకోలేక పోతున్నావు. మనిషే మానవ బాంబుగా మారితే స్వాగతిస్తున్నావు అంటే నువ్వు నిజంగా గొప్ప మేధావివి’’
*

buddhamurali2464@gmail.com