జనాంతికం - బుద్దా మురళి

మూడు కాళ్లపై ప్రజాస్వామ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏంటోయ్.. అంత తీక్షణంగా చూస్తున్నావ్..?’’
‘‘ధర్మదాతల పేర్లు..’’
‘‘ఇందులోఉద్దేశ పూర్వకంగా బ్యాంకులను ముంచిన వారి పేర్లు ఉన్నాయి కదా? ధర్మదాతలని అంటావేం?’’
‘‘నేనూ అదే అనుకుంటున్నాను. లగడపాటి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తాను ఆరువేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని త్యాగం చేసి, ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని అప్పుడు అన్ని పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు ఇచ్చారు కదా? ఆ ఆరువేల కోట్లు ఎవరికి త్యాగం చేశాడా? అని ఇప్పటి వరకు పత్రికలు చూస్తూనే ఉన్నాను.’’
‘‘ఔను.. ఓ ఐదు కోట్ల రూపాయలు పత్రికల్లో మొదటి పేజీ ప్రకటనలకు ఖర్చయినా, మిగిలిన ఐదువేల 995 కోట్ల రూపాయలను ఎంతమందికి దానం చేశారో, వారి పేర్లు ఏమిటో కదా?’’
‘‘ఏంటో.. ఇలా వేల కోట్లు త్యాగం చేసి ప్రజాసేవకు వచ్చామని ప్రకటనలు చేసిన చాలామంది పేర్లు ఇపుడు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన బడాబాబుల జాబితాలో కనిపిస్తున్నాయి..’’
‘‘ప్రజలకు సేవ చేయడానికి వేల కోట్లు త్యాగం చేయడం ఎందుకు? బ్యాంకులను ముంచడం ఎందుకు?’’
‘‘బహుశా వీరికి రాబిన్ హుడ్ ఆదర్శం కావచ్చు.. దోపిడీ చేసి సంపాదించి, ప్రజలకు దానం చేసిన రాబిన్ హుడ్ సినిమాలను వీరు చూశారేమో!’’
‘‘రాబిన్ హుడ్ దోచుకుని పంచాడేమో కానీ మన ధర్మదాతలు దోచుకోవడమే కాని పంచినట్టు ఎక్కడా ఆధారాలు కనిపించడం లేదు’’
‘‘అలా బయటకు కనిపిస్తాయా? చేసిన దానం అనేది కంటికి కనిపించవద్దు, నోటితో చెప్పవద్దు అంటారు. కుడి చేయితో చేసిన దానం గురించి ఎడమ చేయికి తెలియవద్దు అంటారు. వారు చేసిన ధర్మం దేవతా వస్త్రాల వంటివనుకో. అంటే ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోభాల పేరిట ధనం దానం చేస్తారు. ఆ దానం గురించి ఎలాంటి వివరాలను చెప్పుకోరు కదా?’’
‘‘మహా అయితే ఎన్నికల్లో ఓ వంద కోట్లు ఖర్చు చేశారేమో.. మరి మిగిలిన వేల కోట్లు..? బ్యాంకులను నిండా ముంచేసి ఊరేగడం అనైతికం కాదా?’’
‘‘నువ్వేమో బ్యాంకులను ముంచడం అనైతికం అంటావు. రిజర్వు బ్యాంక్ వాళ్లేమో ఆర్‌టీఐ కింద ఉద్దేశ పూర్వకంగా బ్యాంకులను ముంచిన వారి జాబితా ఇమ్మంటే... ముంచిన వారి జాబితా ఇవ్వడం అనైతికం అంటూ ఇంతకాలం వాయిదా వేస్తూ వచ్చారు.’’
‘‘ముంచడం నైతికం, ముంచిన వారి పేర్లు బయటపెట్టడం అనైతికం అనడం భలే ఉంది కదూ? ఏది నైతికమో, ఏది అనైతికమో అస్సలు అర్థం కావడం లేదు’’
‘‘ఔను- మహారాష్టల్రో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రోజూ నైతికం- అనైతికం అక్కడా, ఇక్కడా మారుతూనే ఉండడం చూశాం’’
‘‘అంటే?’’
‘‘్భరతీయ జనతాపార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అనైతికం అని శివసేన, కాంగ్రెస్, పవార్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ మూడు పార్టీల కూటమితో ప్రభుత్వం ఏర్పాటు అనైతికం అని భాజపా అంటోంది’’
‘‘మరి నువ్వు చెప్పు ఏది నైతికం? ఏది అనైతికం?’’
‘‘రెండు వర్గాల వాదనా కరక్టే.. నిజానికి రాజకీయాల్లో నైతికం, అనైతికం అనేవి కలిసే ఉంటాయి. మహారాష్టల్రో భాజపా, శివసేన కలిసి పోటీ చేసినప్పటికీ ఆ రెండు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం నైతికం. అర్ధరాత్రి సమయంలో ఆకస్మికంగా రాష్టప్రతి పాలన ఎత్తేయడం, ఉదయమే హడావుడిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం అనైతికం. మీడియా పెద్దలు మహారాష్ట్ర రాజకీయాలపై అద్భుతమైన విశే్లషణ చేసి వార్తలు ప్రచురించాక ఉదయం లేవగానే దానికి భిన్నమైన ‘సీన్’ కనిపిస్తే ఎవరికైనా మండదా? మండడం నైతిక హక్కు, కానీ వేరువేరుగా పోటీ చేసిన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్‌ల కలయిక అద్భుతం అని కీర్తించడం అనైతికం. ’’
‘‘ఇంతకూ ఏమంటావు? ప్రజాస్వామ్యం నిలబడడం అద్భుతం కదా?’’
‘‘మెజారిటీ సీట్లు సాధించిన పార్టీ అధికారానికి దూరంగా, విడివిడిగా పోటీ చేసిన పార్టీలు అధికారం చేపట్టడం ప్రజాస్వామ్య విజయం అంటావు?’’
‘‘అంతే కదా? మరి నువ్వేమంటావు?’’
‘‘మహారాష్టల్రో ప్రజాస్వామ్యం మూడు కాళ్ల మీద నిలబడిందంటాను.’’
‘‘అది సర్లే.. టిట్ ఫర్ టాట్ అన్నట్టు.. ‘ఉక్కుమనిషి’ సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ను కాంగ్రెస్ వాళ్లు ఆక్రమించుకున్నారు కదా? ఇప్పుడు బాల్ థాకరేను కూడా కాంగ్రెస్ వాళ్లు తమ వైపు తిప్పుకుంటే ఎలా ఉంటుంది?’’
‘‘పోయినవాళ్లను ఎలా?’’
‘‘పటేల్ ఏమన్నా ఇప్పుడు బతికున్నాడా.. అభ్యంతరం చెప్పడానికి..? కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి సర్దార్ పటేల్‌కు భాజపా అక్కున చేర్చుకున్నట్టు.. హిందుత్వ కోసం కాంగ్రెస్ బాల్ థాకరేను చేర్చుకోవాలి.’’
‘‘ముంబయిలో ఆ పని ఇప్పటికే కాంగ్రెస్ ప్రారంభించినట్టు ఉంది. ముంబయిలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇందిరా గాంధీ, బాల్ థాకరేల ఫోటోలు, పోస్టర్లు దర్శనం ఇస్తున్నాయట! చివరకు శివసేన పార్టీ కార్యాలయం వద్ద కూడా ఇందిర, థాకరేల భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు.’’
‘‘్భజపా దెబ్బకు విలవిలలాడిపోతున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు బాల్ థాకరే రూపంలో హిందుత్వ ముద్ర దొరికినట్టు అయింది.’’
‘‘మహారాష్ట్ర వరకు బాల్ థాకరేను శివసేన ఉపయోగించుకుంటే, కాంగ్రెస్ దేశమంతా ఉపయోగించుకుంటే- అప్పుడు ఎలా ఉంటుంది అంటావు?’’
‘‘దేశమంతా తరువాత- ఇప్పుడైతే మహారాష్టల్రో ప్రజాస్వామ్యం మూడు కాళ్ల మీద పరుగెత్తుతోంది’’
‘‘రెండు కాళ్ల మీద పరుగెత్తుతారు కానీ, మూడు కాళ్లు మీద పరుగెత్తడం అంటే కుంటడమే కదా?’’
‘‘ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక స్పీకర్, ఇద్దరు డిప్యూటీ స్పీకర్లు అంటున్నారు. చూడాలి పరుగు ఎలా సాగుతుందో?’’
‘‘ముగ్గురి కాపురం ఓ ఆరునెలలైనా సాగుతుందని అంటావా?’’
‘‘అన్ని పార్టీల కన్నా ఎక్కువ సీట్లు గెలిచిన భాజపాను పక్కన పెట్టడం ఎందుకు? వాళ్లను కూడా చేర్చుకుంటే పోయేది’’
‘‘ఎలా సాధ్యం?’’
‘‘ఇందిరా గాంధీ, బాల్ థాకరేల పోస్టర్లు ఒకే చోట ఉంటాయని ఊహించావా? కాంగ్రెస్, శివసేన కలుస్తాయని ఎపుడైనా అనుకున్నావా? అది సాధ్యం అయినప్పుడు ఇదెందుకు సాధ్యం కాదు’’
‘‘అప్పుడు ఎవరు సీఎం, ఎవరు డిప్యూటీ సీఎం?’’
‘‘మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమా 70వ దశకంలో వచ్చింది. ఇలాంటి సమస్యను ముందే ఊహించి, ఒకరు ప్రధానిగా ఉంటారు. మిగిలిన ఎంపీలంతా ఉప ప్రధానులుగా ఉంటారు. ఒక్కో పార్టీ నుంచి ఒక ముఖ్యమంత్రిని, మిగిలిన ఎమ్మెల్యేలందరినీ ఉప ముఖ్యమంత్రులను చేస్తే సరి..’’
‘‘అప్పుడు కానీ ప్రజాస్వామ్యం మూడు కాళ్ల మీద పరుగులు తీయదు’’
*