తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

భాషా వైవిధ్యత రంగమెక్కాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మధ్య రెండు రోజుల వ్యవధిలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కర్నూలు, నల్గొండ జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో తిరగవలసి వచ్చింది. ఈ కాలంలో తిరగడం శ్రమే. అయినా మధ్యమధ్య రోడ్డుపక్కన టీ కొట్లవారితో, కాస్తంత దూరంలో రైతులు, రైతుకూలీలతో, వివిధ వృత్తులవారితో మాట్లాడ్డం, వారిని వినడం అపూర్వ అవకాశం. వారి మాటలు సుస్పష్టం. తమ బాధలే కాదు, ఇతరుల బాధల్ని వినిపించడం వారి సహజ గుణం. అలాంటి వారిలో స్ర్తిలు, పురుషులు, వృద్ధులు, యువకులు, పిల్లలు ఉంటారు. ముస్లింలు, కిరస్తానీలు, హిందువులు, హైందవేతరులూ, గిరిజనులూ ఉన్నారు. ఒక మినీ భూఖండం పర్యటించినంత వైవిధ్యత. భారతదేశంలో ఈ జీవన వైవిధ్యత చివరి దశలో ఉందని అనిపిస్తున్నది. అతి ప్రాచీన జీవన విధానాల మధ్య ఆధునిక మనిషి జీవిస్తుంటాడు. సంప్రదాయం అల్లంత దూరంలో.. మనిషేమో మరో కొత్త ప్రపంచంలో. జీవన పోరాటంలో ఓడిపోతున్నామని తెలిసి కూడా ఏమీ చేయలేనితనం. సకల ప్రాకృతిక సంపద అందరిదీ అనే సమాజంలో బతికిన ప్రాణులు ఇప్పుడు తమదికాని లోకంలో, నేలమీద జీవిస్తున్నాయన్నది నిజం. దానిని వారు స్పష్టంగా వారి మాటలలో వినిపించారు.
మనం మనిషి భాషను కూడా వినలేకపోతున్నాం. ఏదో అంతరం వలయా లు వలయాలుగా మనకు దూరం చేస్తున్నది. ఒక్కసారి పలకరించిన మనిషి భళ్ళుమనే శబ్దం అవుతున్నాడు. ఆ శబ్దాలలో దాగిన మనిషి క్రౌర్యం చేసే విధ్వంసం లోంచి మాటలు రావడం లేదు. శబ్దాల వంటి ఆక్రందనలు వినవస్తున్నాయి. ఆదిమ మానవుడి మనుగడ పోరాటాల పోలిక ఇక్కడ వర్తించదు. ఆనాడు ప్రకృతిని జ యించే శక్తిగలిగిన మని షి నిలబడ్డాడు. ఇప్పుడు ప్రకృతి నుండి, ప్రాకృతిక స్వభావపు మానవీయ దయాధర్మాల ఆలోచనల, నిర్మాణాల నుంచి మనిషి పెకిలింపు శబ్దాలు!
భాష ఎప్పుడూ అర్ధ వ్యక్తీకరణే. దానికి మరెన్నో హంగులు కలగలవాలి. సందర్భం, సమయం, శ్రోతృవర్గం, వారి స్పందన భాషని, దాని వ్యక్తీకరణని పరిపూర్ణం చేయడానికి హేతువులవుతారు. అప్పటిదాకా భాష ఏకపక్షంగా దాని పరిధిలో అ ది ఉండిపోతుంది. స మూహం లోంచి మనిషికి మనిషికి మధ్య ఒక మేర భావ వినిమయం సాగుతునే ఉంటుంది. ఒకప్పుడు ఎలాంటి మమేకత, దగ్గరితనం, ఆత్మీయత, లోలోతుల్లోంచి ఆలింగనం వంటివేమీ లేకుండానే మాటలు పనిచేస్తుంటాయి. మనమిప్పుడు మాటలభాషకి మాత్రమే పరిమితం అవుతున్నాం. భాషలోంచి సజీవతని యాంత్రికం చేస్తున్నాం. భాషా సుసంపన్నతని క్షీణింపచేస్తూ శుష్క భాషా సంస్కృతికి దారితీస్తున్నాం. మన పత్రికలు, చానెళ్ళూ సజావుగా నిరంతరం అదే పనిచేస్తున్నాయి. భాషా సామాజీకరణ భావన, మాండలిక భాష అనే భావన భాషని కత్తిరిస్తున్నాయి. మార్కెట్ రంగం, రాజకీయ రంగం కోసమే భాష అన్నంతగా ఒక కల్పిత లోకాన్ని నిర్మించి అందులోని వారికి భాషను అందించాలని అనుకుంటున్నాం. విశాలమైన లోకంలో జీవిస్తూ భాషా విషయంగా ఒక పిగ్మీ ప్రపంచాన్ని లేదా బోన్సాయ్ లోకాన్ని తయారుచేసుకుంటున్నాం. ఇక్కడ తల్లి పిల్లవాడితో సంభాషించే లాలిజోలపాటల మధురానుభూతుల భాష లేదు. కొడుకుని కోల్పోయిన తల్లి విషాద జ్ఞాపకాల గుండెలవిసిన భాష లేదు. వైవిధ్య భరిత జీవనోల్లాసాల మధురిమల జాతీయాలు కేవలం కర్తకర్మక్రియలే మిగిలాయి. పర్యాయ పదాలు కూడా భాషకి భారమైన కాలంలో జీవన సత్యాల సామెతల్ని కూడా నిషేధించి ప్రస్తుతం ఆధికారిక ఉత్తర్వులలోని భాష మనని శాసిస్తున్నది. అలాంటి సమయంలో అన్ని బంధనాలను ఛేదించి అలా మనుషులలోకి, వారి యాసలలో మాండలిక నాగేటి చాళ్ళలోకి అడుగులు వేయడం కొంత ఉప్పస. మరోసారి వారి మాటలను, ఈటల వంటి ప్రకటనలను తాజాగా వినడం హాయిగొలిపే అనుభూతి. అప్పుడు అనిపించింది- ఈ భాషను అలా చేస్తున్నదెవరు? సినిమా,చానెళ్ళు, పత్రికలు, సాహిత్యాలలోకి రావద్దని, అవి పనికిరావని ప్రకటించిన వ్యవస్థకు మూలకారణాలు ఏమిటి? అనే ఆలోచన వచ్చింది.
ఆగ్రహించడానికి, హాస్యానికి కృత్రిమ భాష పుట్టించాలా? ఒక ప్రాంతీయ అస్తిత్వాన్ని అగౌరవపరిచి తృప్తిపడాలా? ఎందుకిన్ని సంకెళ్ళు. ప్రజలు సహజంగా మాట్లాడుకునే భాషని చదువుకున్నవాడు తన తల్లితో, కిరాణాషాపు వాడితో మాట్లాడలేకపోతున్నాడు. కూరగాయల చిన్నక్కతో మాట్లాడే సజీవ భాషలో మాట్లాడ్డానికి ఎందుకంత అనుమానపడుతున్నాడో తెలియడం లేదు. తన స్థాయికాని భాష అని, భాషాస్థాయినే కుదించే ప్రయత్నం అది. దానివల్ల ఏం సాధిస్తాడు? మానవ జ్ఞాన వ్యక్తీకరణని ఖూనీ చేయడమేగా. వేయి పరిమళాల భాషని వికసింప చేయని ప్రతివాడు ఒక ఖూనీకోరే. ప్రతి మనిషిలో ఒక విధ్వంసకారుడు ఉంటాడు. కాని ఆ విధ్వంసం ఎల్లప్పుడూ ప్రజలపైనే గురి. వారి భాషపై, వారి సంస్కృతిపై. ఎందుకంటే వాడి శ్రమని దోచుకోవడం కోసం. వాడి నేలని, వాడి నీటిని, వాడి జీవావరణాన్ని ఆక్రమించడం కోసమే. వారికి భాష లేకుండా చేయడం, భాషను శుష్కింపచేసేది పండితుడే. భాషను సృష్టింపజేసే లాక్షణికుడు పామరుడే. ఆ పామర భాషలోని సృజనాత్మకతని శిష్ట్భావన అనే గండ్రగొడ్డలితో నరుకుతునే ఉంటాడు. పదాలని యాసతో, శబ్దాలని ఉచ్ఛారణతో, వాక్యాలని వ్యాకరణంతో, సాహిత్యాన్ని అంటరానితనంతో, కళని, సంగీతాన్ని పరాయికరణతో అంతమొందిస్తూనే ఉంటాడు. ఇప్పుడా భాష ఆధునిక సామాజిక మాధ్యమాలలో కూడా స్థానం లేనిదైంది.
భాషాభిమానులు-‘సజీవమైన భాషలో, దేశీభాషలలో మేం వార్తలు వింటాం. మేం కార్యక్రమాలు చూస్తాం. పత్రికలలో గొప్ప వ్యక్తీకరణలు చదవడానికి హక్కుదారులం. ప్రజల భాషా వినియోగం నేడు అవసరం’ అని అడగలేక పోతున్నారెందుకు? వైవిధ్య రహిత భాషా వ్యతిరేకోద్యమం మొదలు కావాలిప్పుడు. వ్యావహారిక భాషోద్యమం ప్రారంభించిన ‘గిడుగు’కి పండిత వర్గం, పత్రికాధిపతుల నుండి అనేక ఆవాంతరాలు, వ్యతిరేకతలు ఎదురయ్యాయి. కాని మెల్లిమెల్లిగా వ్యావహారిక భాషావాదమే గెలిచి నిలిచింది. అందుకే చాలాకాలం మనకి భాషా వైవిధ్యత కనుపించింది.
కానీ ఇప్పుడు ‘గిడుగు’లు కాదు. శ్రోతలు, పాఠకులు మూకుమ్మడిగా ఒక్కటై చక్కని అర్థవంతమైన మాండలిక భాష టీవీ చానెళ్లలో వినబడాలని కోరాలి. తెలుగు పత్రికలలో మాండలికాలు, మంది భాషలు కనబడాలని కోరాలి. ఈ భాషలు ఎన్నో కొత్త వ్యక్తీకరణలకు పునాది గని అని పాఠకులు ఎలుగెత్తి చాటాలి. యాంత్రిక భాషని నిలువరించి, సృజనాత్మక ప్రజల నుడికారాల భాష ఆత్మీయంగా పలకరించాలి. అది నేటి అవసరం, రేపటి మన పిల్లల భాషా హక్కు కోసం నినదించాలి.

*