తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

గురువు గాడి తప్పె-కళ తప్పె నృత్యభంగిమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె పేరు ఏదైనా కావచ్చు. ఉష కావచ్చు గాయత్రి కావచ్చు. ఉషాగాయత్రి కావచ్చు. ఏదైతేనేం. మేం ఉన్న ఏరియాలో ఆమె పేరే చెప్పారు.
ఆమె ఫోను నంబర్ సులభంగానే దొరికింది. కాని ఫోనులో ఆమె చాలా కష్టంగా దొరికింది. ఫోను ఎత్తదు. ఎత్తిన తరువాత ఫలానా పని అని చెప్పాక అసలే ఎత్తలేదు. రింగవుతుంది. పలకరు. అలా రోజులు గడిచాయి. ఓ రోజు చాలాసార్లు చేశాక విసుగు పడాల్సిన నేను శాంతంగా మాట్లాడాను. విసుగెత్తించిన ఆమె విసుగ్గా, విసురుగా మాట్లాడింది. ప్రతిసారి ఫోనుచేసి ఆమెని డిస్ట్రబ్ చేసినట్లుగా మాట్లాడింది. సరే. ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన ద్వారం పక్కన ఉన్న అరబిందో ప్రిస్కూలు విభాగానికి ఇరవై నిమిశాల్లో రండి అని పెట్టేసింది. అంత త్వరగా రాగలరో లేదో ఆలోచించే అవసరం ఆమెకు ఏ కోశాన కలగలేదు.
ఐనా అవసరం నాది.
ఆలస్యం అవుతే ఏమంటుందో అని భయపడుతూ ఉన్నఫళంగా కదిలాను. కింద స్నేహితులతో ఆడుకుంటున్న ఐదేళ్ళ జైత్ర ఇప్పుడే రానని మారాం చేసినా బలవంతంగా పిలిచాం. వాళ్ళ అమ్మమ్మ కూడా వెంటనే బయలుదేరింది. ఆటోకి తక్కువ, కాలికి ఎక్కువ దూరం. ఆమె చెప్పిన స్కూలులోకి వెళ్ళాం. చెప్పిన సమయానికి.
ఆమె వస్తుందో రాదో మాకేం తెలుసు అన్నాడు వాచ్‌మన్. ఐనా అక్కడే కదలకుండా వేచి కూచున్నాం. మా చిన్నారి మనుమరాలు జైత్ర అడిగే లక్ష యక్ష ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక యాతన పడుతుంటే అలా ఎవరితోనో పిచ్చాపాటి మాట్లాడుతూ వచ్చిందొకావిడ.
మీరేనాండీ డాన్స్ టీచర్‌గారు అని అడిగాను.
తీన్ పట్టీ జమేదార్‌ని మీరు పోలీసాండీ అని అడిగితే ఎలా చూస్తాడో అలా చూసింది.
అవును. కాదు. ఏమీ మాట్లాడకుండా, ముందుకి కదిలింది. ఆమె వెనక నడవక తప్పలేదు. ఆమె మమ్మల్ని గుర్తించినట్లుగానే ఉంది వాలకం. అరగంటాగి ఓసారి చూసింది. ఎక్కడో మేం నచ్చనట్లుగా తల విదిలించి ఫోను కలిపింది.
పేరెంట్స్ టైంకి రాలేకపోతే పిల్లల్ని ఎవరితోనైనా పంపండి. అంతేగాని ఆలస్యం అసలే కుదరదు అని నిష్కర్షగా చెప్పింది.
ఫోను పెట్టేసాక ఈ చిన్నది నా మనమరాలు. దీనికే శాస్ర్తియం నృత్యం ఏదైనా నేర్పాలి అని నమ్రతగా అన్నాను. దీనికి కాకపోతే మీ ఈవిడకు నేర్పించాలా అని జైత్ర అమ్మమ్మని చూపుతూ అంది. అది హాస్యమా, పరిహాసమా తెలియలేదు.
ఈలోగా మరో ఫోను కలిపి మాట్లాడింది. ఈ నెలలో అరంగేట్రం జరపకపోతే తనకు మరో ఆర్నెల్లు తీరిక లేదని చెప్పింది. ఏమేమి కావాలో చెప్పిన పట్టిక చూస్తే లక్షదాక ఖర్చవుతుంది. రవీంద్రభారతి ఆడిటోరియం రంగుల ఇన్విటేషన్. టీచర్‌కి పట్టుచీర, పదివేల అదనపు గిఫ్టు. తబలా, మృదంగం, వాయులీనం తదితర సంగీత వాద్యాలు, వాదకుల ఖర్చు వంటివి పెద్ద లిస్టు...
ఆ విషయం నాకే చెప్పినట్లుగా అనిపించింది. మధ్యమధ్యలో మావేపు చూసింది- మేం వింటున్నామా లేదా అని.
చలికాలపు సాయంకాలం. దోమలు ఒక్కసారి విజృంభించాయి. వాటిని మేం చేతులతో కొట్టుకుంటుంటే ఆమెకు చిరాకు వేసింది.
దోమల బెడద పెరిగింది.
పక్కకు తిరిగి వేరొకరితో మాట్లాడ్డం పూర్తయ్యాక మేడం! అని పిలిచాను.
మీరిలా తొందరపడితే లాభంలేదు అని ఖరాకండిగా అన్నది. ఇదంతా అక్కడ ఉన్న వాచ్‌మన్, డ్రైవర్, మిగతావాళ్ళు చూస్తూనే ఉన్నారు.
నిన్ననే చెంచుగూడేలకు వెళ్ళి రావడంవల్ల కాళ్ళు తీపులు తీస్తున్నాయి. ఆవిడ పక్కన రెండు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. రెండు గంటలైంది నిలబడి. కూర్చుందామా అని అనిపించింది. ఆమెకు ఎలా తెలిసిందో ఏమో గబుక్కున తన పర్స్‌పడేసింది. ఓ కుర్చీలో. ఆ ఆలోచన మానుకున్నాను.
కాసేపాగి- ఎక్కడ చదువుతుంది అని అడిగింది.
గోడ పక్కనే ఉన్న ఆంధ్ర మహిళా సభ లాబ్ స్కూల్లో అని చెబుతున్నాను-
ఈ స్కూల్లో కాదన్నమాట! అంది. మరో తప్పుచేశావన్నట్లు చూపు.
మీరు ముస్లింలు కారుకదా అంది నా తెల్లగడ్డం చూస్తూ... లేదండీ అన్నాను. మా ఆవిడని చూశాకైనా తెలియాలి. నా పూర్తి చెప్పాలని అనుకున్నాను. పాప తల్లిదండ్రులు రాలేదా- ఎందుకు? అడిగింది.
వాళ్ళు బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నారు. మాదగ్గరే ఉంటోంది అన్నాను. సంజాయిషి ఇస్తున్న ధోరణిలో.
జైత్రని చూసి, ఏం చదువుతున్నావ్- నీకు చదువువచ్చా అనే ముఖ కవళిక పెట్టి. జరుగుతున్నదంతా నిశితంగా పరిశీలిస్తున్న జైత్రలో జడుపు కనుపిస్తోంది. తల ఊపింది. నోటితో చెప్పలేవా. అది పని చేస్తుందా అని అడిగింది. చేస్తుంది అన్నట్లు తల ఊపింది. ఐతే చెప్పవేం అని గదమాయింపులాంటి ప్రశ్న.
యుకేజి.... నసిగింది.
ఐదేళ్ళ ఐదు నెలల ఐదురోజులు పూర్తవ్వనిదే నేర్పను అంది.
అదేంటండీ ఫోనులో వివరంగా చెప్పానుగా. అన్నాను.
కుంక సంప్రదాయ నృత్యం నేర్చుకుంటానని ఏడాది పైగా పోరుపెడుతోంది. అది సాధ్యం కాకపోవడం వల్ల పిచ్చిపిచ్చి సినిమా సాంగ్స్ డాన్సులు చేస్తోంది. వేరే బడుల్లో-పాశ్చాత్య నృత్యాలు నేర్పిస్తున్నారు. వాటిని నేర్పడం ఇష్టంలేదు. అందుకే శాస్ర్తియ నృత్యం ఏదో ఒకటి నేర్పుతూ ఉండండి. మరో ఐదు నెలల తరువాత పద్ధతి ప్రకారంగా మొదలు పెడదాం. అని ఫోనులో చెబితే సరే మాట్లాడదాం రండి అన్నారు కదా అని గుర్తుచేశాను.
మీకేం ఎన్నైనా, ఆ ఏమైనా అంటారు. గురువులం మేం... మా సాధకబాధకాలు మాకు ఉంటాయి అని అంది. మీకేం తెలుస్తాయండి. విద్య నేర్పడం అంటే మాటలు కాదు. తపస్సులా చేయాల్సి వస్తుంది అంది టీచర్. మళ్ళీ.
నేను తల ఊపాను.
జైత్ర అమ్మమ్మ ఏం చేస్తుందని అడిగింది.
గృహిణిగా ఇంట్లోనే ఉంటుందని చెప్పాను. ఆమె వేపు తేరిపార చూసి నా వంక చూడకుండానే నీవేం చేస్తావ్? నన్ను అడిగింది.
రిటైర్ అయ్యానండీ అని సంజాయిషీగా చెప్పాను.
ఏం చేసే వాడివి అని అడిగింది.
అధ్యాపకుడిగా పనిచేశానని చెప్పాను.
ఏ స్కూల్లో అని అంది.
తెలుగు విశ్వవిద్యాలయంలో అన్నాను. నెమ్మదిగా అలా ఓసారి చూసీ చూడనట్లు చూసి శ్రీశైలం పీఠంలోనా అని అడిగింది.
కాదండి. ఇక్కడే హైదరాబాదులో అని చెప్పాను.
సరే. ఎక్కడైతే నాకేంటి? అని పక్కనున్న ఇద్దరు పిల్లల్ని రమ్మని చెప్పి వాళ్ళతో నిన్న చెప్పిన పాఠం వేసి చూపండి అని అంది. కాసేపాగి వాళ్ళు తనదగ్గర చేరేప్పటి సందర్భం గురించి మాట్లాడింది.
మొత్తం విద్యార్థి తన అధీనంలోకి రావాలి. పేరెంట్స్ (గార్డియన్స్ కూడా) గురువు పట్ల అమిత విశ్వాసంతో ఉండాలి. మారు మాట్లాడకూడదు. చెప్పింది చేయాలి. ముఖ్యంగా చెప్పిన తారీఖునాడు జీతం తేవాలి. ఆలస్యం అయినన్ని రోజులు నృత్యం నేర్పబడదు. ఇదీ ఆమె చెప్పకనే చెప్పిన విషయాలు. నాకు బాగా అర్థమయ్యేలా చెప్పానని అనుకున్న తరువాత అడిగింది.
నృత్యశాఖలో పనిచేసే ఓ ఇద్దరి పేర్లు చెప్పి వాళ్ళు తెలుసా అంది.
తెలుసండీ అన్నాను. నృత్యశాఖ మొదటి హెడ్ కూడా పరిచయమండీ అన్నాను.
రాజమండ్రి సాహిత్యపీఠంలో ఆ తరువాత ఎలా అంది. లలిత కళాపీఠంలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశాను అని చెప్పాను.
ఓహో తెలుసా. ఐతే డాన్స్ గురించి మీకేం తెలుస్తుంది? అంది.
తెలియదండి అని ఒప్పుకున్నాను. నా లాయల్టీ నా మనుమరాలికి ఉపయోగపడాలని నా మనసులో చెలరేగే అసంతృప్తిని, భౌతికంగా జరిగే దోమల దాడిని అణచివేసుకుంటూ.
వారానికి ఎన్ని రోజులు రమ్మంటారండి అని వ్యవహారంలో వద్దామని అడిగాను.
నేను ఇంకా ఒప్పుకోలేదు.
జైత్ర తనకి తాను టీవీలో చూసి నేర్చుకున్న కూచిపూడి, భరతనాట్యం భంగిమలు చూపించి మెప్పిద్దామని ఆశగా ఉంది. జైత్ర కొన్ని స్టెప్స్ నేర్చుకుందని అన్నాను భయపడుతూనే.
కోతి గంతులు చూపి డాన్స్ అనమని అంటారా అన్నది ఆమె.
అయ్యో! అలా కాదండి. దాని ఆసక్తి గురించి మాత్రమే చెప్పాలనే ఉద్దేశ్యం తప్ప మరోటి కాదండీ అన్నాను.
భారతీయ విద్యావ్యవస్థలో ఎక్కడో లోపం ఉంది. పాఠశాలల్లో గురువులు విద్యార్థినులను కాటేస్తున్న కాలం ఇది. తెలుగులో మాట్లాడినందుకు ఎండలో నిలబెట్టే పాఠశాల యాజమాన్యాలు. ప్రైవేట్ వైద్య ఇంజనీరింగ్ కళాశాలల్లో పైరవీలు. తరగతి గదిలో గురువు అంతరించిపోయాడు.
పాత తరం-సంగీతం, నృత్య గురువులు లేరిప్పుడు. సంగీత నృత్యాలు నేర్పే ప్రైవేటు లాభార్జనపరులు ఎక్కువయ్యారు.
శాస్ర్తియ సంగీతం, నృత్యం కూడా వ్యాపారసరుకైంది. పిల్లల ఆసక్తికాదు. తల్లిదండ్రుల జేబులు ముఖ్యమయ్యాయి. మాటలతో భయపెట్టి, జీతం గురించి మరో మాట మాట్లాడనివ్వని తనం ఆసరా తీసుకునే గురువులు తయారయ్యారు.
మా కులం అంతస్తు, ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్న తరువాతే గురువుగారు అంగీకారం తెలుపుతుందని అనిపించింది.
ఈ దేశంలో లలిత కళలకు కూడా స్వేచ్ఛ లేదు. తమలాంటి నృత్యగురువులు కొందరు దేశానికి గౌరవం తెస్తున్నాం అని భ్రమిస్తున్నారు. భారతీయ కళలు నాలుగు కాలాలపాటు జీవించాలని ఆశించేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు.
కాని అల్ట్రామాడరన్ గురువులవల్ల కళలకు తెలియని మకిలి ఏదో అంటుకుంటున్నది.
తాతా! వెస్ట్రన్ డానే్స నేర్చుకుంటా. అక్కడికే పంపు అంది చిన్నారి బేలగా.
ఒక్కసారి తల తిరిగిపోయింది.
ఎంతమంది ఇలా ‘వలస’ కడుతున్నారో.
సినిమాలు, టీవీ చానెళ్ళు, క్లబ్బులు, స్కూల్‌డేలలో విచ్చలవిడి పాశ్చాత్య నృత్యాన్ని, అశ్లీలతని ఆపలేకపోతున్నాం.
నేర్చుకునే వారికి మాత్రం ఇలాంటి ఆసిడ్ టెస్టులు!
ఏవైపు పోతున్నాం!

-జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242