సబ్ ఫీచర్

మరపురాని దేశభక్తుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపు నంద కృష్ణమూర్తి 95వ జయంతి
=======================
‘స్వాతంత్య్రం నా జన్మహక్కు అది కాదన్నవాడి పీక నొక్కు’ వంటి నినాదాలతో ఆంధ్ర ప్రాంతాన్ని దద్దరిల్లజేసిన స్వరాజ్య ప్రజా నాయకుల్లో నంద కృష్ణమూర్తి అగ్రగణ్యులు. ఆచార్య ఎన్.జి. రంగా, సర్దార్ గౌతు లచ్చన్న సహచరునిగా ఉంటూ, వారు పాల్గొన్న అన్ని సభల్లో స్వాతంత్య్ర గీతాలను ఆలపించి ఆంగ్లేయులపై అగ్నివర్షాన్ని కురిపించారు. ప్రముఖ బుర్రకథ కళాకరుడు నాజర్ తరహాలో కృష్ణమూర్తి పాటలు పాడే తీరు ఉండేదని చెబుతారు.
స్వరాజ్య ఉద్యమంలో ఉవ్వెత్తున లేచిన కెరటంలా వ్యవహరించిన కృష్ణమూర్తి కృష్ణమూర్తి శ్రీకాకుళం జిల్లా కనిమెట్టలో 1921, మార్చి 13న నంద చిన్నమ్మి, శేషయ్య దంపతులకు జన్మించారు. ఈ మారుమూల పల్లె అక్షరాలా పదిమంది స్వాతంత్య్ర సమరయోధులకు జన్మనిచ్చింది. బాల్యంలో కృష్ణమూర్తి ఎంతో చురుగ్గా ఉండి ఎందరో ఉపాధ్యాయుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఏడాది పాటు ఆమదాలవలస మండలం గట్టుముడిపేటలోని ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో హయ్యర్ గ్రేడు టీచర్‌గా పనిచేశాడు. తర్వాత స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితుడై ఉద్యోగానికి రాజీనామా చేశాడు. బ్రిటిషు వలస సామ్రాజ్యాన్ని ప్రతిఘటిస్తూ ‘క్రిప్స్ రాయబారం’ పేరిట కృష్ణమూర్తి పల్లెల్లో, బస్తీల్లో బుర్రకథ ప్రదర్శనలిచ్చాడు. ఈ ప్రదర్శనలు ప్రభంజనం సృష్టించాయి. దీంతో తెల్లదొరలు కృష్ణమూర్తితో పాటు, నంద ఆదినారాయణ, కూన ఎర్రయ్య తదితరులను అరెస్ట్ చేశారు. వీరందరినీ చీపురుపల్లి కారాగారంలో నిర్బంధించారు.
1940 జనవరి 20న మహాత్ముడు దూసి రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన సభలో జన సమీకరణలో కృష్ణమూర్తి కీలకపాత్ర పోషించాడు. ఆమదాలవలస-పొందూరు రైల్వే మార్గంలో దూసి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పించడం, కళింగపట్నంలో ఉప తపాలా కార్యాలయంపై దాడితో పాటు పలు కేసుల్లో కృష్ణమూర్తి సహా పలువుర్ని ముద్దాయిలుగా నాటి ఆంగ్లేష సర్కారు కేసులు పెట్టింది. ప్రముఖ ఉద్యమకారులైన ఆచార్య రంగా, లచ్చన్న, కిల్లి అప్పల్నాయుడు, బెండి అప్పల సూరి వంటి ప్రముఖులను కనిమెట్ట, ఎస్.ఎం.పురం ప్రాంతాల్లో రహస్య స్థావరాల్లో ఉంచిన ఘనత కృష్ణమూర్తి బృందానికే దక్కుతుంది. పోలీసుల కదలికలను బట్టి ఎప్పటికప్పుడు స్థావరాలను మార్చేవారు. ఆ తరువతా కృష్ణమూర్తి జాతీయ కాంగ్రెస్‌లో కీలక భూమికను పోషించారు.
1953లో జరిగిన విశాఖపట్నం జిల్లా బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి హెచ్చు ఆధిక్యతతో విజయం సాధించాడు. విశాఖలో ‘జల ఉష’ నౌకను ప్రారంభించేందుకు వచ్చిన భారత తొలి ప్రధాని పండిట్ జవరహర్‌లాల్ నెహ్రూ పాల్గొన్న సభలో జాతీయ గీతాలను, దేశభక్తి పాటలను అద్భుతంగా పాడారు. తెలుగుభాష రాకపోయినా నెహ్రూ తన్మయత్వం చెంది కృష్ణమూర్తి వెన్నుతట్టి ప్రశంసించారు. 1955, సెప్టెబర్ 26న తన 34వ ఏట కృష్ణమూర్తి ఈ లోకాన్ని వీడారు. నిజానికి ఆయనకు రావలసినన్ని పేరు ప్రఖ్యాతులు రాకపోవడం దురదృష్టం. స్వాతంత్య్ర సమరయోధునిగా, ప్రజా కళాకారునిగా, రంగస్థల నటునిగా విశిష్ట సేవలందించిన కృష్ణమూర్తి చిరస్మరణీయుడిగా మిగిలిపోతారు.

- వాండ్రంగి కొండలరావు