AADIVAVRAM - Others

అపకారికి ఉపకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ఒక అడవి.
ఆ అడవిలో ఒక కోతి, ఏనుగు, ఎలుగుబంటి, కుక్కతోపాటు కొన్ని చిన్నచిన్న జంతువులు స్నేహ భావంగా ఉంటుండేవి.
ఒక పర్యాయం ఓ దుష్టబుద్ధి పులి జొరబడి చేజిక్కిన జంతువులని పొట్టన పెట్టుకునేది. సాధుజంతువులు ప్రాణభయంతో ఏ పొదలలోనో రెండు మూడు రోజుల వరకు దాగి ఉండేవి నకనకలాడే ఆకలిని భరించుకొంటూ.
ఒక పర్యాయం పులిలేని సమయం చూసి జంతువులన్నీ సమావేశమై పులిని ఎలా తరిమి కొట్టాలా అన్న విషయంపై తర్జనభర్జనలు చేశాయి. వాటి ఆలోచనలు ఒక కొలిక్కి రాలేక ఏవీ పులిని ఎదిరించేందుకు సాహసించలేదు.
చివరికి ఏనుగు సాహసించి పులిని ఎదిరించింది. పులి కోపంతో పంజా విసిరి కొట్టింది. ఏనుగు తొండం గాయంతో రక్తసిక్తమయ్యింది.
కొన్ని దినాలు గడిచాయి. ఓ రోజు పులి సంచరిస్తుండగా ఓ బాణం దాని పొట్టలో దూసుకొని పోయింది. పులి బాధతో గాండ్రించగానే జంతువులన్నీ ఒక్కసారిగా పరుగులు తీశాయి.
వచ్చేపోయే ప్రాణంతో విలవిలలాడుతూ కొట్టుకుంటున్న పులిని ఎలా అయినా కాపాడాలనుకొని అటూ ఇటూ వెళ్లి ఏనుగు తీసుకొచ్చిన నీటితో గాయం శుభ్రమైంది. వెంటనే కోతి పులి కడుపులోకి దూసుకెళ్లిన బాణాన్ని జాగ్రత్తగా పైకి తీసింది. ఎలుగుబంటి తెచ్చిన ఆకుల పసరు పూసింది. కుక్క దాగి ఉన్న వేటగాడిని తరిమికొట్టింది.
జంతువులు చేసిన ఉపచర్యకు పులి ప్రాణం స్థిమితపడింది. అది పశ్చాత్తాపంతో ‘మీ అందరూ నన్ను క్షమించండి. మీకు నేను చాలా అపకారం చేశాను. దేవుడు మీకు ఇచ్చిన బుద్ధితో నా ప్రాణాన్ని నిలబెట్టారు. మీ మేలు ఎన్నటికీ మరువను’ అంది.
వెంటనే కోతి ‘ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయడంలో గొప్పతనం లేదు. గొప్పతనమల్లా అపకారం చేసిన వారికి ఉపకారం చేయడమే’ అంది.
పులి వాటి ఉదార స్వభావాన్ని గ్రహించి ‘నేను క్రూర జంతువుని. పైగా మాంసాహారిని. నా బుద్ధి ఎప్పుడు చెడుగా ప్రవర్తిస్తుందో చెప్పలేను. అందుకే నన్ను కాపాడిన మీ అందరి మేలు కోరి నేను ఈ ప్రాంతం విడిచి దూరంగా వెళ్లిపోతాను’ అంది.
జంతువులన్నీ ‘హింసాత్మక క్రూర జంతువు అయినా ఒక మంచి పనికి తలవంచింది’ అనుకున్నాయి.

************************************

ప్రపంచ శాస్తవ్రేత్తలు
డార్విన్
-పి.వి.రమణకుమార్

చార్లెస్ డార్విన్ 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లండ్‌లోని ష్రాస్‌బరీలో జన్మించాడు. తండ్రి రాబర్ట్ డార్విన్ పేరు పొందిన డాక్టర్. పాఠశాల అనంతరం డార్విన్ ఒంటరిగా పొలాల్లోనూ, కొండల్లోనూ తిరుగుతూ సీతాకోకచిలుకలను, తుమ్మెదలను, తేనెటీగలను పట్టుకుని వాటిని శల్య పరీక్షలు చేసేవాడు.
ఎప్పుడూ జీవుల పరిణామం ఎలా జరిగిందనే విషయంపైనే ఆలోచించేవాడు. తండ్రి డార్విన్‌ను ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్‌లో చేర్పించాడు. డార్విన్‌కి వైద్యవిద్యపై ఏ మాత్రం ఆసక్తి లేదు. కాలేజీ మానేసి, గుర్రం ఎక్కి అడవుల్లో తిరుగుతూ పక్షులను, జంతువులను గమనించేవాడు. ముఖ్యంగా చింపాంజీలను పరిశీలించేవాడు. మనుషుల్లాగే ఉండే వాటి అలవాట్లు చూసినప్పుడు డార్విన్ ఆలోచనలో పడిపోయేవాడు.
యూనివర్సిటీలో అక్కడి ప్రొఫెసర్ ‘హెన్‌స్లో’ను కలిసి తనకు జీవుల పరిణామ సిద్ధాంతం గురించి పరిశోధన చేయాలనే కోరిక ఉన్నదని తెలిపాడు. ఆయన డార్విన్ ఆశయం విని ఆశ్చర్యపోయినా, తర్వాత చేతనయినంత సహాయం చేయడానికి అంగీకరించాడు. ఆనాటి నుండి డార్విన్ ఎందరో శాస్తవ్రేత్తలను, పరిశోధకులకు కలిశాడు. వారితో తన సిద్ధాంతం గురించి చర్చించాడు.
మారుతున్న కాలానికి, పరిస్థితులకు, వాతావరణానికి అనుకూలంగా జీవులు పరిణామం చెందుతున్నాయి. పాత జీవుల నుండి కొత్త జీవులు ఉద్భవిస్త్తున్నాయి. ఈనాటి మనిషి కూడా ఒకప్పుడు కోతే. మనిషికి కోతికి చాలా పోలికలున్నాయి. మనుషులకు వచ్చే వ్యాధులే కోతులకు వస్తాయి. కాలక్రమంలో ఆనాటి మానవుడు తన మేధకు పదును పెట్టుకుని కాలానుగుణంగా మారుతూ, ప్రకృతి ఎంపికలో నెగ్గి, మనుగడ సాగిస్తూ ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నాడు.. అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ‘ది ఆరిజన్ ఆఫ్ స్పుసిస్’ అనే గ్రంథాన్ని రచించి మానవ జాతి ఆవిర్భావానికి మూలమైన గొప్ప ఆవిష్కరణను అందించాడు.
మొదట్లో ఆ గ్రంథంపై అనేక విమర్శలు వచ్చాయి. డార్విన్ వంశమే కోతి వంశం అంటూ హేళన చేశారు. డార్విన్ మాత్రం అదరక బెదరక తన సిద్ధాంతాన్ని రుజువు చేశాడు. ఆ తర్వాత డార్విన్ బాటలో ఎందరో శాస్తవ్రేత్తలు మానవ పరిణామ క్రమాన్ని అనేక పరిశోధనలతో సంచలనాలు సృష్టించారు. మానవ పరిణామ క్రమం తెలియజేయడానికి ఎన్నో అవహేళనలు పొందిన మహాజ్ఞాని, శాస్తవ్రేత్త అయిన చార్లెస్ డార్విన్ 1882 సం.లో మరణించాడు.

***********************************

ఆధ్యాత్మిక భోజనం
-మల్లాది వెంకట కృష్ణమూర్తి
స్కూల్ నించి ఇంటికి తిరిగి వచ్చిన ధర్మజ్ఞ తల్లిని అడిగాడు.
‘ఆకలి వేస్తోంది. టిఫిన్ ఏం చేసావు?’
‘ఉప్మా, పెసరట్టు’
‘సరే’
‘కొద్ది రోజుల నువ్వు నేను చేసింది తినేవాడివి కాదు. స్కూల్ నించి వచ్చాక బిస్కెట్స్, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పెప్సీకోలా లాంటి మీ నాన్న తెచ్చినవి తిని తాగేవాడివి’
‘అవును. నాకు అప్పట్లో అవి ఇష్టంగా ఉండేవి. కానీ తర్వాత కడుపంతా నొప్పిగా ఉండేది. నువ్వు చేసిన టిఫిన్ తింటూంటే బావుంటోంది. నాకు బలం కూడా పెరుగుతోంది’ చేతిని ఎత్తి కండలు చూపిస్తూ చెప్పాడు.
ఆ రాత్రి తండ్రి షెల్ఫ్‌లోంచి భగవద్గీతని తీసి భోజనానికి మునుపు చదివే పురుషోత్తమ యోగం అధ్యాయాన్ని తెరిచాడు.
‘ఈ రోజు మనం అది మానేద్దామా? ఇంకో రెండు నిమిషాల్లో పోగోలో హైడీ సీరియల్ వస్తుంది’ ధర్మజ్ఞ తండ్రిని కోరాడు.
‘జంక్ ఫుడ్‌తో నువ్వు కడుపు నింపుకుంటే నీ కడుపుకి ఏమైందో గుర్తుందా?’ తల్లి ప్రశ్నించింది.
‘గుర్తుంది. అనారోగ్యం కలుగుతుంది. కానీ దానికి, టివి షోకి ఏమిటి సంబంధం?’ ప్రశ్నించాడు.
‘మంచి ఆహారం తింటే నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నీ మనసు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నీ నోట్లో ఉంచుకునేది నీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, అలాగే నీ మనసులో ఉంచుకునేది కూడా నీ మనసుని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యవంతమైన హిందువుగా నువ్వు ఉండాలంటే, టివి షోని చూసే కంటే భగవద్గీతని చదవడం మంచిది’
‘అది నిజమే. కాని నాకు ఇష్టమైనవి వదులుకోవడం కష్టం’ ధర్మజ్ఞ చెప్పాడు.
‘నీకు ఉప్మా ఎలా నచ్చింది?’ తల్లి ప్రశ్నించింది.
‘నువ్వు ఉప్మా చేసినప్పుడల్లా నన్ను కొంచెం కొంచెం తినమన్నావు. అలా నాకు ఇష్టమైంది’
‘దాన్ని తినడంతో అదంటే ఇష్టం ఏర్పడింది. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఇలాగే జరుగుతుంది. గీతని చదవడం, ప్రార్థించడం, గుడికి వెళ్లడం నీకు ఇష్టం ఉండకపోవచ్చు. కానీ వాటిని చేస్తూంటే క్రమంగా వాటి మీద ఇష్టం ఏర్పడుతుంది’
‘సరే. మనసు ఆకలి తీర్చే సరైన భోజనం కూడా నాకు అవసరమే. ఆ అధ్యాయం చదువు నాన్నా’ ధర్మజ్ఞ చెప్పాడు.
తండ్రి చిన్నగా నవ్వి ఆ అధ్యాయం తెరిచాడు.

-ఆరుపల్లి గోవిందరాజులు