విశాఖపట్నం
విశాఖపట్నం, మార్చి 29: సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఏప్రిల్ 4న విశాఖ రానున్నారు. ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ ప్రతినిధి, ఎన్టీఆర్ అభిమాన సంఘాల నాయకుడు కొత్తపల్లి శ్రీహరిరాజు పెదకర్మకు ఆయన హాజరుకానున్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి వీరాభిమానిగా ఉన్న శ్రీహరిరాజు, జూఎన్టీఆర్‌తో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. శ్రీహరిరాజు అంత్యక్రియలకు జూఎన్టీఆర్ హాజరవుతారని భావించినప్పటికీ రాలేకపోయారు. పెదకర్మకు జూఎన్టీఆర్ వస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
హెచ్‌టి వినియోగదారులకు మరో అవకాశం
* వచ్చేనెలాఖరు వరకు ఇపిఎస్‌ఎస్ పొడిగింపు
విశాఖపట్నం, మార్చి 29: చార్జీలు భారమైనా పర్వాలేదు...అవసరాలకనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేస్తే చాలు...అనుకునే హెచ్‌టి విద్యుత్ వినియోగదారులకు ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) మరో అవకాశాన్ని ఇచ్చింది. ఎక్స్‌పెన్సివ్ పవర్ సప్లై స్కీమ్ (ఇపిఎస్‌ఎస్)ను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించినట్టు సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ పివివి సత్యనారాయణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 60 శాతం కంటే ఎక్కువుగా విద్యుత్‌ను కోరుకునే హెచ్‌టి వినియోగదారులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. అగ్రిమెంటు ఈ నెల 31వ తేదీ వరకు తీసుకోబడునన్నారు. ఔత్సాహిక విద్యుత్ వినియోగదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. కాగా 60 శాతం వరకు విద్యుత్‌ను వాడుకునే వినియోగదారులకు యూనిట్ విద్యుత్‌కుగాను నాలుగు రూపాయలు చెల్లిస్తే సరిపోతోంది. ఆ తరువాత 60 శాతం పైబడి విద్యుత్‌ను కోరుకునే వినియోగదారులు మాత్రం ఇపిఎస్‌స్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకుంటే యూనిట్ పది రూపాయల వంతున సరఫరా చేస్తారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం దృష్ట్యా కొద్దిరోజులుగా కోతలు అనివార్యమయ్యాయి. తప్పనసరి పరిస్థితుల్లో గృహ, వాణిజ్య అవసరాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నా, రోజుకీ రెండు గంటలపాటు కోతలుఅ అమలవుతున్నాయి. అయితే పరిశ్రమల ఉత్పత్తులకు తీవ్ర ఆటంకం కలుగుతున్న నేపధ్యంలో అధిక చార్జీలు చెల్లించి అయినా కరెంటు కోనుగోలు చేసేందుకు హెచ్‌టి వినియోగదారులకు సంస్థ అవకాశం కల్పిస్తోంది.
ఆక్రమిత భూముల స్వాధీన ప్రక్రియ ముమ్మరం
* సర్కార్ ఖాతాలోకి విలువైన భూములు
* మధురవాడ పరిధిలోనే అధికం
* ఒకేసారి 90 ఎకరాలు స్వాధీనం
* రెవెన్యూ సదస్సులో 24వేల ఫిర్యాదులు
విశాఖపట్నం, మార్చి 29: కోట్లాది రూపాయల విలువైన ఆక్రమిత భూములు సర్కార్ ఖాతాలోకి జమ అవుతున్నాయి. రాష్ట్రంలోనే మరెక్కడా లేనివిధంగా విశాఖ జిల్లాలో ఈ ప్రయోగం విజయవంతమైంది. ప్రభుత్వ భూముల స్వాధీన ప్రక్రియ చురుగ్గా సాగుతుండటం ఇదే ప్రథమం. గతంలో అనేకసార్లు చేపట్టిన స్వాధీన కార్యక్రమాలు కొన్నాళ్ళకే పరిమితమయ్యేవి. రాజకీయ వత్తిళ్ళు, సిబ్బంది కొరత, ఎన్నికల సందర్భాల్లో ఆక్రమిత భూముల స్వాధీనానికి అడ్డంకిగా నిలిచేవి. అయితే కలెక్టర్ శేషాద్రి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ప్రభుత్వ భూముల స్వాధీనమే లక్ష్యంగా ఈ ప్రక్రియను వేగవంతం చేసి, నిరంతర కార్యక్రమంగా కొనసాగిస్తున్నారు. గజం ప్రభుత్వ భూమిని కూటా విడిచిపెట్టరాదనే కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు కళ్ళెం వేస్తున్నారు. అనేక రకాలుగా ఆక్రమణలకు గురైన ఈ భూముల స్వాధీనంపె రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. అవసరమైతే కోర్టులో అప్పీల్ వేస్తున్నారు. దీంతో కోట్ల విలువైన ఎకరాల భూములు సులభంగా స్వాధీనపర్చుకునేందుకు వీలవుతోంది. ఆక్రమిత భూములను గుర్తించడం, వీటిని రక్షణకు సర్వే రాళ్ళు పాతడం, ప్రభుత్వ భూములుగా బోర్డులను తగిలించడం, వీటిని సులభంగా గుర్తించే ప్రత్యేక రంగులను పులమడం వంటి విధానాల ద్వారా విశాఖ జిల్లాలో మూడు వేల ఎకరాలకు పైగా భూములు స్వాధీనం చేసుకోగలిగారు. అలాగే వివాదస్పదంగా మారినవి, ఎవరికి చెందకుండా పదిలంగా ఉన్నవి, బడాబాబుల చేజిక్కుంచుకునే భూములు, అసైన్డ్ భూముల వివరాలను సేకరించే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. దీనిలోభాగంగా తహశీల్దార్ (రూరల్) కార్యాలయం పరిధిలో మధురవాడ, ఎండాడ సమీపానున్న పలు ప్రాంతాల్లో దాదాపు వంద ఎకరాల భూములను అధికారులు స్వాధీనపర్చుకోగలిగారు. వీటి విలువ మూడు వందల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
శివారు ప్రాంతాలపై దృష్టి
విశాఖ నగరానికి అతి చేరువలో ఉండే మధురవాడ, బోయిపాలెం, కాపులుప్పాడ, ఆనందపురం, గాజువాక, పరవాడ, పెందుర్తి తదితర మండలాల పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను రెవెన్యూ అధికారులు గుర్తిస్తున్నారు.
సర్కార్ భూములకు రెక్కలు
నకిలీ పత్రాలు సృష్టించి మరీ ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకునే ల్యాండ్ మాఫియా విశాఖ కేంద్రంగా తన కార్యకలాపాలు సాగిస్తున్న పరిస్థితులపై రెవెన్యూ కనే్నసింది. కోట్లాది రూపాయల విలువైన భూములను తమ గుప్పిట్లో పెట్టుకుందనే ఆరోపణలను రెవెన్యూ అధికారులు పరిగణనలోకి తీసుకుని ఈ కోణంలో సమాచారన్ని రాబడుతున్నారు. ఈ విధంగా పరులపాలైన ప్రభుత్వ భూములన్నీంటినీ ఓ క్రమంలో సేకరించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రధానంగా విశాఖ జిల్లాలో పది మండలా పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనపర్చుకోవాల్సి ఉంది.
రెవెన్యూ సదస్సుల్లో 24 వేల ఫిర్యాదులు
గత నెల 12వ తేదీ నుంచి ప్రారంభమైన రెవెన్యూ సదస్సుల ద్వారా విశాఖ జిల్లావ్యాప్తంగా 24 వేల ఫిర్యాదులు అందాయి. వివాదస్పదమైనవి, రాజకీయ వత్తిళ్ళతో భూములు కోల్పోయినవి, అర్హులైన వారికి అడంగల్ కాపీలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీలో తీవ్ర జాప్యం, సొంత భూములను సైతం ఆక్రమించారనే ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా 29 వేల ఫిర్యాదులు వచ్చాయి. ఈ విధంగా భూములకు సంబంధించిన పిర్యాదులే అధిక శాతంలో ఉంటున్నందున వీటిపైనే రెవిన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టింది.
Add new comment