అక్షర

కవిత్వంలో సొంత సంతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మా ఊరు అట్లాలేదు’’
(కవిత్వం)
డా.బెల్లి యాదయ్య
పేజీలు 100,
వెల: రూ.100/-
పదం ప్రచురణలు, పాలెం
ప్రతులకు- రచయిత- 9848392690

కవిత్వంలో ఏదో దిశానిర్దేశాన్ని రంగరించకుండా, దానిలో కవి తానే స్పష్టంగా, స్వచ్ఛంగా కనబడడం, కవి తన అక్షరాలతో ఓ కాలిబాటను తవ్వుకుంటూ ముందుకు సాగడం, అవి వెదజల్లే మట్టి పరిమళాన్ని పేజీల్లోకి నింపడం డా.బెల్లి యాదయ్య ‘మా ఊరు అట్లాలేదు’లో చూడతరమైన సొగసు.
‘మా ఊరు అట్లాలేదు’లోని కవిత్వం కవి అనుభవాల్ని నాటకంలో రంగ గతిలా ఆవిష్కరిస్తుంది. కవి ఆలోచనలు, మనోభావాలు, దృక్పథాలు నీటి రంగులో జలచరాల్లా కవితల్లో ఈదుతుంటాయి.
డా.బెల్లియాదయ్యకు కవిత్వం పూర్తిగా సొంత వ్యవహారం. ఎవరో ఏదో రాస్తున్నారనో, నేటి కవిత ఫలానారీతిలో సాగుతున్నదనో వెనకాల నడవరు. ఆయనపై తెలుగేతర కవితా విధానాల ప్రభావం ఉంది అనడంకన్నా చెప్పే అంశాన్ని చరణాలు చరణాలుగా స్పష్టతను, వివరణను పెంచుతూ ఓ పరిపూర్ణతను కల్పించడం ఆయన శైలి అని అనవచ్చు. తాను ఆశించిన ఫలితం ప్రస్ఫుటమయ్యేదాకా కవితను ముగించరు. ఉపాధ్యాయులకుండే సోదాహరణ బోధనాపద్ధతి కవిత్వంలోను ప్రయోగించారు.
కవితలో ఉన్న మొదటి పాదాన్ని పునరుక్తికావిస్తూ కవిత్వాన్ని దాని ఆధారంగా లోతుగా తవ్వుతూ మిగతా పాదాల్ని పొందించడం ఈ కవికి అలవాటైపోయింది.
‘కలుసుకోవడం లోపల’ కవితలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు’ పదాలను ప్రతి పాదానికి, మకుటం చేస్తూ భావాన్ని పంపకం చేస్తాడు. ముగింపులో తాను ఆశించిన మార్పును లేదా జరిగే పరిణామాల్ని తెలిపి కవితను ముగిస్తాడు. ‘కలయిక ఏమాత్రం కృతకమైందైనా/ నువ్వొక మొలకెత్తలేని విత్తనానివి/ పుష్పించలేని ఉత్తరానివి’. అని పై కవిత ముగింపు అదే విషయం చెబుతుంది.
‘నాయకుడు కావాలి’ కవిత కూడా అదే ధోరణిలో ప్రస్తుత ఏలికలోని తప్పులను ఎత్తిపొడుస్తూ చివరగా మాకు రాష్ట్రం సిద్ధించింది/ దీనికో నాయకుడు కావాలి/ ప్రజాస్వామ్యం అతని తాయెత్తుకావాలి’అని ఆకాంక్షిస్తాడు.
కవికి తన వూరు పాలెంపై వల్లమాలిన ప్రేమ. మాల గౌండ్లను ఆరేయ్ తమీ అనడం, మాదిగ గొల్లను ఒరే కొడకా అనడం, ఆ ఊళ్లో ప్రజాస్వామ్యం అందుకే కవి- ‘మాఊరులాంటి ఊరు/ ఏదైనాఉంటే చెప్పండి అక్కడ మూడు నిద్రలు చేసి వస్తాను’ అంటాడు.
మాల్స్ కనబడగానే వినియోగదారుడి ఉబలాటాన్ని కబేళాను గుర్తించలేని మేకపిల్లంత ప్రాకృతికంగా/ నాలో నర్తిస్తున్న కోరికల ఊర్వశి ఈ ఉబలాటం అంటాడు. ఆర్థిక జంతువు, యుద్దోత్సాహం, దగ్దదేహుడు ఇందులో ప్రయోగించిన కొత్త పదాలు.
లోకంతీరును ఎండగట్టే రీతిలో రాసిన ‘పాంచజన్యం’ కవిత కవి పలవరింత. ‘యుద్ధ్భూతం/ రక్తాన్ని జుర్రుకు తాగాక సంధి గురించి/ శోంచాయిస్తున్నాడొక శాంతిదూత! ఇలా ఎన్నో అంశాల్ని ఎత్తిచూపిన ఈ కవిత ముగింపుగా వేణువైనంత కాలం పాడుకొనే లోకం/ విల్లయితే పారిపోతారని/ వెదురుకు మరొకరం చెప్పాలా బెల్లీ’అని ప్రశ్నించుకుంటాడు.
ధ్వంసమవుతున్న ప్రకృతిమీద కవి కోపానికి అక్షర రూపం ‘మాస్టర్ మైండ్’ కవిత. ‘మమీ చెప్పలేదు. డాడీ పోయిరమ్మనలేదు, మాకు మేంగానే ఇక్కడికి వచ్చాం’ అంటూ పిల్లలు నీటివాగుల గురించి, కోతి కొమ్మచ్చి గురించి, కంకుల, కాయలు, పండ్లు, సీతాకోకచిలుకలు, ఊరపిచ్చుక, తల్లిపాలు గురించి నిలదీయడం కొత్తకోణంలో ఉంది.
విగ్రహానికి ఉన్న గొప్పతనాన్ని ఇదువరకు ఏ కవీ స్పృశించలేదు. విగ్రహం అంటే/ఏ కదలికాలేని/లాన్‌లో మొలచిన రాతి చెట్టుకాదు/ దిక్కులేని వాళ్లకు దిక్కుగా/ నిలిచిన జ్ఞాన నేత్రం/ సామాన్యుడే/ విగ్రహాలకు నిజమైన పూజారి.’ విగ్రహాల పట్ల ఒక్కసారిగా గౌరవాన్ని పెంచే పదాలు ఇవి.
తమ కాలేజీ ప్రాంగణంలోకి దండెత్తిన వానర దండు గురించి రాసిన ఉల్లాసవంతమైన కవిత ‘వానరోపాఖ్యానం’. తప్పు నరులదేగాని వానరులది కాదని చక్కగా చెప్పారు.
తన సొంత ఆలోచనలను ఇంపుగా, సొంపుగా అక్షరబద్దంగావించి ‘మా ఊరు అట్లాలేద’ని ధృడంగా చెప్పిన డా.బెల్లియాదయ్య కవితలు చదవదగ్గవి.

-బి.నర్సన్