రాష్ట్రీయం

కాపు జాతికోసం.. ముద్రగడ దంపతుల ఆమరణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 5: కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కిర్లంపూడిలోని తన ఇంట్లో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆమరణ దీక్ష ప్రారంభించారు. భార్య పద్మావతి సైతం ఆమరణ దీక్షకు కూర్చున్నారు. తొలిరోజు ముద్రగడ దంపతులకు మద్దతుగా కుటుంబీకులు దీక్షలో కూర్చున్నారు. ఎలాంటి అట్టహాసానికి తావులేకుండా నిరాడంబరంగా ఆయన దీక్ష ప్రారంభించారు. ముద్రగడ దీక్ష చేస్తుండగా మరోవైపు ఆయన ఇంటి పరిసరాల్లో సాయుధ సైన్యం మోహరించి, ఆధీనంలోకి తీసుకుంది. ఇతర గ్రామాలు, ప్రాంతాల నుండి ఏ ఒక్క వాహనం రాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలను సైతం అతి కష్టంమీదే ముద్రగడ నివాసంలోకి వెళ్ళేందుకు అనుమతించారు. గుర్తింపు కార్డులు కలిగిన మీడియా ప్రతినిధులను మాత్రమే లోనికి అనుమతించారు.
ముద్రగడతోపాటు ఆయన భార్య పద్మావతి ఆమరణ దీక్ష ప్రారంభించారు. తొలిరోజు వీరికి మద్దతుగా ముద్రగడ అక్క పెదబేబీ, చెల్లెలు లక్ష్మీబాయి, కోడలు సిరి, మనుమరాలు సత్యవతి తదితరులు దీక్షలో కూర్చున్నారు. కుమారులు వీర రాఘవరావు, గిరిబాబు దీక్షాస్థలిలో ఉన్నారు. దీక్ష ప్రారంభించిన సమయంలో మీడియా ప్రతినిధులు ముద్రగడను కలవగా ‘కాపు జాతికి నా జీవితం అంకితం’ అని వ్యాఖ్యానించారు. తన డిమాండ్లలో మార్పేమీ లేదని, ప్రభుత్వం అధికారికంగా దూతలను చర్చలకు పంపితే సిద్ధమేనన్నారు. ప్రభుత్వం కాపులను బీసీలుగా గురిస్తూ జీవో విడుదల చేస్తేనే దీక్ష విరమిస్తానని స్పష్టం చేశారు. ఆమరణ దీక్షలో ఉండటం వలన దయచేసి ఎక్కువగా మాట్లాడించకండి అంటూ మీడియాను కోరారు. ముద్రగడ ఇంటి ఆవరణలో కాపు ఐక్య గర్జన నాయకులు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఖాళీ కంచాలు, గరిటెలతో ప్రదర్శన నిర్వహించారు. కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షుడు వివై దాసు మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ దీక్షకు మద్దతుగా ప్రతి ఒక్క కాపు సోదరుడు మధ్యాహ్నం భోజనం మానివేసి, ఖాళీ కంచాలు, గరిటెలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. దీక్షా స్థలిని మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, కె మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్, పిసిసి కార్యదర్శి పంతం నానాజీ, మాజీ ఎంపి జివి హర్షకుమార్ తదితరులు సందర్శించి ముద్రగడకు సంఘీభావం ప్రకటించారు. ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించడానికి వచ్చిన రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావును సాయుధ దళాలు నిలువరించాయి. ముద్రగడ ఇంట్లోకి వెళ్ళేందుకు అనుమతించకపోవడంతో విహెచ్ అక్కడే రోడ్‌పై బైఠాయించారు. దీంతో పోలీసులు లోనికి అనుమతించారు. దీక్షలో ఉన్న ముద్రగడను కలిసి విహెచ్ సంఘీభావం తెలిపారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, కాపులను బీసీ జాబితాలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
సాయుధ బలగాల కనుసన్నల్లో
ముద్రగడ ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో కిర్లంపూడి, పరిసర ప్రాంతాలు సాయుధ బలగాల కనుసన్నల్లోకి వెళ్ళాయి. గ్రామంలో 10 కంపెనీల పోలీసు బలగాలు, నాలుగు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలు, 5వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు. కిర్లంపూడి పరిసరాల్లో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పద్మనాభం ఇంటివద్ద మెటల్ డిక్టేటర్లు అమర్చారు. ప్రతి ఒక్కరినీ నఖశిఖ పర్యంతం తనిఖీ చేస్తున్నారు. ఆమరణ దీక్షా స్థలిని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి ప్రజలెవ్వరూ తూర్పుగోదావరి జిల్లాకు రావద్దని సూచించారు. జిల్లాకు చెందిన ప్రజలు కూడా కిర్లంపూడికి రావద్దన్నారు. చెక్‌పోస్ట్‌ల్లో పెద్దఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 144 సెక్షన్, 30-పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నట్టు ఎస్పీ స్పష్టం చేశారు.