హైదరాబాద్

కొత్త పాలక మండలితో బల్దియాపై ఆర్థిక భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: మహానగర పాలక సంస్థలో అధికారంలోకి వచ్చిన పాలక మండలితో కార్పొరేషన్‌పై మరింత ఆర్థిక భారం పడే అవకాశముంది. ఇప్పటికే గ్లోబల్ సిటీ, స్వచ్ఛ హైదరాబాద్ అంటూ రకరకాలుగా వేల కోట్ల ప్రతిపాదనలు సిద్ధమైన నేపథ్యంలో నిధుల సమీకరణకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. పైగా ఆస్తిపన్ను మాఫీ, వసూళ్లకు ముఖ్యమైన సమయంలో ఎన్నికల విధుల్లో బిజీ కావటంతో ఈ సారి ఆశించిన స్థాయిలో ఆస్తిపన్ను వసూలయ్యే పరిస్థితుల్లేనందున పాలక మండలి వేతనాలు, నిర్వహణ వ్యయం కార్పొరేషన్‌కు కాస్త భారమయ్యే అవకాశముంది. ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను సక్రమంగా వసూలు కాకపోయినా పాలక మండలి, సిబ్బంది జీతభత్యాలకు ఢోకా లేకపోయినా, మున్ముందు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు పెరిగే అవకాశాలున్నాయి.
వాస్తవానికి కూడా ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సు, హోర్డింగ్‌లు, భవన నిర్మాణ అనుమతులతో గ్రేటర్‌కు మరింత ఆదాయం వచ్చే అవకాశమున్నా, ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించకపోవటం వల్ల కింది స్థాయి సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శించగా, మరికొందరు తప్పుడు లెక్కలు చూపుతూ జేబులు నింపుకుంటున్నారు. ఇందుకు ఇటీవల మాదాపూర్‌లో జల్సాలు చేస్తూ మాదాపూర్ పోలీసులకు ట్యాక్స్ సిబ్బంది పట్టుబడటం ఇందుకు నిదర్శనం. గతంలో కన్నా పోలిస్తే తెలంగాణ రాష్ట్ర సిద్ధించిన తర్వాత రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, గ్రేటర్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, సభ్యుల జీతాలను గణనీయంగా పెంచుతూ సర్కారు గత సంవత్సరమే సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదివరకు మేయర్లకు కేవలం రూ. పధ్నాలుగువేలు, డిప్యూటీ మేయర్లకు రూ. 8వేలు, కార్పొరేటర్లకు రూ. నాలుగు వేలను గౌరవ వేతనంగా చెల్లించేవారు. గత 2014-15 వార్షిక స్వల్పకాలిక, 2015-16 వార్షిక బడ్జెట్‌లో ఈ జీతాలను మేయర్లకు రూ. 50వేలు, డిప్యూటీ మేయర్లకు రూ. 25వేలు, కార్పొరేటర్లకు రూ. ఆరు వేలుగా జీతాలను పెంచుతూ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అంతేగాక, కార్పొరేటర్లుగా వీరికి ఒక్కొక్కరికి రూ. కోటి వార్షిక బడ్జెట్‌గా కేటాయించనున్నారు. డివిజన్ల అభివృద్ధి, వౌలిక వసతుల కల్పన కోసం కేటాయించే ఈ బడ్జెట్ మాట పక్కనబెడితే అయిదేళ్ల పాటు కొనసాగే మేయర్‌కు జీతం సుమారు రూ. 30 లక్షలు, అదే డిప్యూటీ మేయర్‌కు రూ. 15లక్షల వరకు ఖర్చవుతోంది.
దీనికి తోడు వీరిద్దరికి కారు సౌకర్యానికి నెలకు దాదాపు లక్ష వరకు, అలాగే చాంబర్ రిఫ్రెష్‌మెంట్ ఛార్జీలుగా నెలకు మరో రూ. 50వేల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. దీనికి తోడు 148 మంది కార్పొరేటర్లకు నెలకు రూ. 6వేలు చొప్పున జీతాలు చెల్లించినా, నెలకు కార్పొరేషన్‌పై రూ. 8లక్షల 88000వేల వరకు ఖర్చవుతోంది. దీంతో పాటు వీరికి ప్రతి రెండేళ్లకోసం అధ్యయన యాత్రల కోసం సుమారు రూ. కోటి నుంచి కోటిన్నర వరకు, వార్షిక గిఫ్టులుగా ఒక్కోక్కరికి కనీసం రూ. 30వేల గిఫ్టు ఇచ్చినా, దీంతో సంవత్సరానికి రూ. 45లక్షల వరకు ఆర్థిక భారం పడనుంది.
ఈ రకంగా కొత్త పాలక మండలి మేయర్, డిప్యూటీ మేయర్ల జీతాలతో ఏటా రూ. 9 లక్షలు, వారి కారు సౌకర్యం కోసం రూ. 12లక్షలు, అలాగే కార్పొరేటర్ల జీతాలతో రూ. కోటి 7లక్షల వరకు భారం పడే అవకాశముంది. కొత్త పాలక మండలి అయిదేళ్ల జీతాలు మొత్తం రూ. 6 కోట్లు, వీరి అధ్యయన యాత్రల కోసం కనీసం రెండుసార్లు వెళ్లిన రూ. 3 నుంచి నాలుగు కోట్లు, అలాగే అయిదుసార్లు వార్షిక బడ్జెట్ గిఫ్టుల కోసం సుమారు రూ. 2 నుంచి రూ.రెండున్నర కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇవి గాక, బీమా, సెల్‌ఫోన్ అలవెన్సులు అదనపు భారం కానున్నాయి.