నల్గొండ

కోదాడ బైపాస్‌లో సైడ్ ఫెన్సింగ్ ఏర్పాటుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, ఫిబ్రవరి 14: 65వ, నెంబరు జాతీయరహదారిపై వున్న కోదాడ బైపాస్ రోడ్‌పై హుజూర్‌నగర్ ఫ్లై ఓవర్ దగ్గరనుండి మేళ్లచెర్వు రోడ్డు ఫ్లై ఓవర్ వరకు ప్రమాదాలు జరగకుండా సైడ్ ఫెన్సింగ్ ఏర్పాటుకు కృషి చేస్తానని నల్లగొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి హమీ ఇచ్చారు. కోదాడ కాంగ్రెస్ కార్యాలయానికి ఆదివారం సాయంత్రం వచ్చిన ఎంపి గుత్తాకు 11వ వార్డు కౌన్సిలర్ కంభంపాటి పద్మ శ్రీనివాస్, వార్డు ప్రజలు వినతిపత్రాన్ని అందించారు. బైపాస్‌కు ఫెన్సింగ్ లేకపోవడం వలన రోడ్డుదాటుతున్న సందర్భంలో ప్రమాదాలు జరిగి అనేకమంది మృత్యువాత పడుతున్నారని వారు ఎంపి గుత్తాకు వివరించారు. ఫెన్సింగ్ ఏర్పాటుచేసి ప్రమాదాలనుండి ప్రజలను రక్షించాలని వారు కోరారు. స్పందించిన ఎంపి గుత్తా వెంటనే జియంఆర్, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకొంటానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్ తెప్పని శ్రీనివాస్, బాగ్దాద్, పాశం శ్రీనివాస్, సైదిబాబు, కందరబోయిన వేలాద్రి, ఉద్దండు, కందుల రాయప్ప తదితరులు పాల్గొన్నారు.
ముంచుకొస్తున్న తాగునీటి ఎద్దడి
నివారణకు 22.96కోట్ల నిధులు
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఫిబ్రవరి 14: జిల్లాలో వర్షాభావంతో నెలకొన్న కరవు, భూగర్భ జలాలు అడుగంటి పోతుండటం, ఎండల తీవ్రతతో క్రమంగా వేసవిలో తాగునీటి ఎద్దడి సమస్యలు జఠిలమవుతున్నాయి. జిల్లాకు ప్రధాన సాగు, తాగునీటి వనరుగా ఉన్న నాగార్జున సాగర్ జలాశయంలో నీటి నిల్వలు కనీస స్థాయికి పోవడంతో సాగర్ కాలువలు, ఎఎమ్మార్పీ ఎత్తిపోతల పథకాల పరిధిలోని తాగునీటి చెరువులు సైతం అడుగంటి పోయాయి. భూగర్భ జలమట్టం సైతం గత ఏడాది జనవరిలో 10.24ఉండగా ఈ ఏడాది 13.12అడుగులకు పడిపోయింది. ఈ నేపధ్యంలో బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతుండగా పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి సమస్యలు అధికమవుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 261జనావాస ప్రాంతాల్లో అద్దె బోర్లతో, 19గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ సంఖ్య వేసవి ఎండల తీవ్రతను అనుసరించి మరింతగా పెరుగనుంది. సంస్థాన్ నారాయణపురం, బొమ్మలరామారం, భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, తుర్కపల్లి, రాజాపేట, మునుగోడు, ఆలేరు, మిర్యాలగూడ, మఠంపల్లి, దేవరకొండ, చింతపల్లి తదితర మండలాల్లో మంచినీటి సమస్యలు రోజురోజుకు జఠిలమవుతున్నాయి. తీవ్రమవుతున్న తాగునీటి ఎద్దడి నివారణ దిశగా ప్రభుత్వ యంత్రాంగం సైతం కసరత్తు చేపట్టినా తాగునీటి నీటి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. నీటి మట్టం పడిపోవడంతో చేతిపంప్‌లు, పంచాయతీ బోర్లు ఎండిపోతున్నాయి. కాగా శ్రీశైలం జలాశయం నుండి సాగర్‌కు వచ్చిన నీటి నుండి జిల్లాలోని ఎడమకాలువ, ఎఎమ్మార్పీ ఎత్తిపోతల పథకాల పరిధిలోని ఉదయ సముద్రం తదితర తాగునీటి చెరువులకు నీటి విడుదల కొనసాగిస్తుండటం కొంత ఊరటనిచ్చింది. అయితే చెరువుల్లోని ప్రస్తుత నీటి నిల్వలు మార్చి నుండి జూన్, జూలైల వరకు తాగునీటి అవసరాలు తీర్చలేవన్న ఆందోళన తాగునీటి ఎద్దడి తీవ్రతను చాటుతుంది.
తాగునీటి సమస్యల పరిష్కారానికి 22.96కోట్ల మంజూరు
జిల్లాలో వేసవి తీవ్రత నేపధ్యంలో పెరిగిపోతున్న తాగునీటి సమస్యల పరిష్కారానికి ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం 22.96కోట్ల నిధులు మంజూరు చేసింది. సిఆర్‌పిఎఫ్ నుండి 10.88కోట్లు, నాన్ సిఆర్‌పిఎఫ్ నుండి 12.28కోట్లు జిల్లాకు విడుదలవ్వగా సదరు నిధులతో గ్రామాల్లో మంచినీటి ఎద్దడి నివారణ చర్యలు ప్రారంభించారు. కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఇప్పటికే మంచినీటి సమస్యలపై టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్‌లతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నా క్షేత్ర స్థాయిలో తాగునీటి సమస్యలు వినిపిస్తునే ఉన్నాయి. జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ కార్యాలయంలో ప్రజల నుండి తాగునీటి ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రతి బుధవారం ఆర్‌డబ్ల్యుఎస్, జిల్లా పరిషత్, పంచాయతీ అధికారులు మండల స్థాయి అధికారుతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి రోజు వారీ నివేదికలు సమర్పించాలని ఆదేశించడం ద్వారా తాగునీటి సమస్యల పరిష్కారానికి ముందస్తు కసరత్తు సాగిస్తున్నారు.

యాదాద్రి అభివృద్ధిలో వసతి గృహాలు
యాదగిరిగుట్ట రూరల్, ఫిబ్రవరి 14: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో కుమ్మర్ల వసతి సత్రం ప్రారంభించటం ఆనందంగా ఉందని ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్‌రెడ్డి అన్నారు. వసతి సత్రాల వలన వచ్చే భక్తులకు ఆధునాతన పద్ధతిలో సౌకర్య వంతమైన భవన నిర్మాణం చేయటంతో భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. ఆదివారం యాదగిరిగుట్టలో కుమ్మర్ల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన కుమ్మర్ల వసతి భవనంను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ యాదాద్రి అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ్మస్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారని, వారికి సకల సౌకర్యాలతో ఇలాంటి సత్రాలను నిర్మించటంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అన్నారు.
రాష్ట్ర రైతువిభాగం నాయకులు గొంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణంలో కులాలకు చెందిన వసతి గృహాలు ఉండటంతో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులు వారి వారి సౌకర్యవంత మైన వసతి గృహలలో బస చేస్తున్నారని, దీంతో భక్తుల ఎంత మంది వచ్చినా అన్ని సౌకర్యాలు కలుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి కర్రె కమలమ్మ, ఎంపిపి గడ్డమీది స్వప్న రవీందర్‌గౌడ్, సర్పంచ్ బూడిదస్వామి, ఎంపిటిసి సీసీ కృష్ణ, కుమ్మరి సంఘం ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
సాగర్ నీటిని విడుదల చేయాలని రాస్తారోకో
గరిడేపల్లి, పిబ్రవరి 14 : సాగర్ నీటిని విడుదల చేసి సాగు, తాగునీటి సమస్యలను వెంటనే ప్రభుత్వం తొలగించాలంటు బిజెపి ఆధ్వర్యంలో మండంలోని మర్రికుంట వద్ద సాగర్ ఎడుమ ప్రధాన కాల్వపై ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కిసాన్‌మోర్చా ప్రధాన కార్యదర్శి గంగా వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భజలాలు పడిపోయాయని దీంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. అనేక గ్రామాల్లో తాగునీటికోసం ఇప్పటికే ప్రజలు సతమతమవుతున్నారని కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకవైపు బావులు, బోర్ల ఆధారంగా ఆయకట్టులో రైతులు వేసిన పంటలుకూడా ఎండిపోతున్నాయని వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే సాగు,తాగు నీటి అవసరాలకోసం సాగర్ నీటిని విడుదల చేసి చెరువులను, కుంటలను నింపాలని డిమాండ్ చేశారు. మండల బిజెపి అధ్యక్షులు రామినేని కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రంలో చంద్రయ్య, శ్రీరాములు, కర్ణం భద్రయ్య, రామినేని వెంకటయ్య, బక్కయ్య, శ్రీనివాస్, నాగేశ్వరరావు, అశోక్, సైదులు, బాటసారి, వెంకన్న పాల్గొన్నారు.
గోవర్ధన గిరిధారి అలంకారంలో
పాతగుట్ట నృసింహుడు
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 14:యాదగిరిగుట్ట సమీపంలోని పాతగుట్ట శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి దేవస్ధానంలో జరుగుతున్న ఆద్యయనోత్సవాల్లో భాగంగా రెండవరోజైన ఆదివారంనాడు స్వామి వారిని గోవర్ధనగిరి ధారిగా అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. ఇంద్రాది దేవతలకు కల్గిన గర్వమును తొలగించి తనను ఆశ్రయించిన భక్తులను జీవులను రక్షించిన తిరు ఈ అలంకార విషిష్టత.రుత్వికుల ప్రభంధపఠణం పండితుల వేదమంత్రోచ్చరణల మధ్య కొనసాగిన అలంకారసేవను భక్తజనులు దర్శించారు.అదే విదంగా స్వామి వారు రాత్రి వేళ వేంకటేశ్వరస్వామి అలంకరణలో భక్తులకు దర్శణమిచ్చారు.కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీనివాసుని వర్ణిస్తూ పాడిన పాశురములలో స్వామి వారి వైభవాన్ని కీర్తిస్తూ జగధ్రక్షకుడైన శ్రీనివాసుడు లోకములను జీవులను రక్షించుటయే ఈ అలంకార సేవ ప్రత్యేకత.యాజ్ఞీకులు కాండూరి వెంకటాచార్యులు ప్రధానార్చకులు ఆరుట్ల సంపతాచార్యులు,సురేంధ్రాచార్యులు కైంకర్యాలు నిర్వహించగా కార్యక్రమంలో దేవస్ధానం కార్యనిర్వహణాధికారి ఎన్.గీత, చైర్మన్ బి.నర్సింహమూర్తి, ఏ ఈ ఓలు దోర్బల భాస్కర్‌శర్మ, ఆకునూరి చంధ్రశేఖర్, వేముల రామ్మోహన్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
భువనగిరి ఖిల్లాను
సందర్శించిన విదేశీ బృందం
భువనగిరి, ఫిబ్రవరి 14: ఫ్రాన్స్, ఇటలీ దేశాలకు చెందిన పర్యాటకులు ఆదివారం భువనగిరి ఖిల్లాను సందర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి ఖిల్లా నిర్మాణం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆసియా ఖండంలోనె ఏకశిలఅయిన కోటను సందర్శించినందుకు తమకు ఆనందంగా ఉందని తెలిపారు. ఇటలీ, ఫ్రాన్స్‌కు చెందిన పర్యాటకులు అసాంటా, ట్రావెలేంటా తదితరులు కోటను సందర్శించిన వారిలో ఉన్నారు.
ప్రశాంతంగా ఓపెన్ బిఈడి,
స్పెషల్ బిఈడి ప్రవేశ పరీక్షలు
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 14: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్‌జి కళాశాలలో బిఈడి, స్పెషల్ బిఈడీ కోర్సుల ప్రవేశ పరీక్షను నిర్వహించారు. బిఈడిలో ప్రవేశానికిగాను 233మందికి 203 మంది హాజరై 30మంది గైర్హాజరయ్యారు. స్పెషల్ బి ఈడిలో 42మందికి గాను 34మంది హాజరుకాగా మరో 8మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాన్ని ఏడి ధర్మానాయక్ తనిఖీ చేశారు.
నాడు జూనియర్ ఎన్టీఆర్..
నేడు ప్రణీత
సూర్యాపేట, ఫిబ్రవరి 14: నల్లగొండ జిల్లాలో పలువురు సినీనటులు ప్రమాదాలకు గురవుతుండటం విషాదం కలిగిస్తోంది. డివిజన్ పరిధిలోని మోతె మండలకేంద్రం శివారులో ఆదివారం జరిగిన ప్రమాదంలో ప్రఖ్యాత సినీనటి, అత్తరింటికి దారేదిఫేం ప్రణీత ప్రాణపాయం నుండి తృటిలో బయటపడింది. ఆమె ప్రయాణీస్తున్న వాహనం మూలమలుపువద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో స్వల్ప గాయాలయ్యాయి. సూర్యాపేట-ఖమ్మం రహదారిపై జిల్లా శివారు మండలంగా ఉన్న మోతె మండలకేంద్రానికి రెండు వైపులా ఉన్న మూలమలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ప్రణీత ప్రమాదానికి గురైన ప్రాంతానికి సమీపంలోనే గతంలో సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణీస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. 2009 ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన ముగించుకొని మార్చి 26వతేదీ రాత్రి టాటాసఫారీ వాహనంలో హైదరాబాద్‌కు వెళ్తుండగా అర్ధరాత్రి సమయంలో మోతె పోలీస్‌స్టేషన్ సమీపంలోని మూలమలుపువద్ద కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈప్రమాదంలో ఆయనతో పాటు మరో సినీనటుడు రాజీవ్‌కనకాల సైతం గాయపడిన విషయం విదితమే. మోతె వద్ద రహదారిపై ప్రమాదకరంగా ఉన్న మూలమలుపులలో గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. 2008లో ఈప్రాంతంలో ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో 12మంది దుర్మరణం చెందారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో 50మందికి పైగా మరణించినట్లు చెబుతున్నారు. కాగా నల్లగొండ జిల్లాలో పలువురు సినీనటులు గతంలో ప్రమాదాల బారిన పడ్డారు. 2014 డిసెంబర్ 6వ తేదీన డివిజన్ పరిధిలోని మునగాల మండలం ఆకుపాములవద్ద జరిగిన ప్రమాదంలో సినీనటుడు నందమూరి హరికృష్ణ తనయుడు, సినీనటుడు, నిర్మాత నందమూరి జానకిరామ్ దుర్మరణం చెందారు. జానకిరామ్ ప్రయాణీస్తున్న కారును ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈప్రమాదం సంభవించింది. అంతకు ముందు 2003లో కట్టంగూర్ మండలం అయిటిపాముల శివారులో కారు ఫల్టీకొట్టిన ప్రమాదంలో సినీ హిరో, కమేడియన్ సునీల్ సైతం తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా మోతె వద్ద జరిగిన ప్రమాదంలో ప్రణీతకు గాయాలుకావడంతో ఈజిల్లాలోనే సినీనటులు అధికంగా ప్రమాదాలకు గురవుతున్నారన్న విషయం చర్చకు వస్తోంది. మోతె వద్ద ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకొని తమ మండలంలోనే ఇద్దరు సినీతారల ప్రమాదాలు ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నా ప్రాణపాయం నుండి బయటపడం కాస్త ఊరటిస్తుందన్న చర్చా మోతె వాసుల్లో వినవస్తోంది.

చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు
తీప్రారంభించిన కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్
నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 14: చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను లాంచనంగా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లు ప్రారంభించగా ఆలయ పూజారులు వేదమంత్రోచ్చారణల మధ్య వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రతి ఏడాది మాదిరిగా ఫిబ్రవరి మాసంలో ప్రారంభమైన ఉత్సవాలకు ఆలయ పరిసర ప్రాంతాలు, ముఖద్వారాలు, ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కలెక్టర్‌తో పాటు హాజరైన ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. పిదప చెర్వుగట్టుకు వచ్చిన మండలి డిప్యూటి చైర్మన్ నేతి విద్యాసాగర్ దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు జరిగే స్వామి వారి కల్యాణోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు లక్షలాదిమంది భక్తులు హాజరవ్వనుండడంతో వారికి అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ ఎల్‌సిడి టీవీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొండపైన భక్తుల సౌకర్యం కోసం మంచినీటి ఏర్పాటుతోపాటు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, జడ్పీటీసి దూదిమెట్ల సత్తయ్యయాదవ్, తహశీల్ధార్ రాములు, ఎంపిడివో సురేష్, సర్పంచ్ రమణబాలకృష్ణలతోపాటు ఆలయ కార్యనిర్వహణాధికారి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
నేడు స్వామివారి కల్యాణం
తెలంగాణ శైవ క్షేత్రమైన పార్వతీ జడల రామలింగేశ్వరుని కల్యాణం సోమవారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరపనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి మనోహర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వేడుకల్లో జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డితోపాటు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలిపారు.
ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 14: ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ భజరంగ్‌దళ్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ప్రధాన వీదుల గుండా మోటార్ బైక్‌లతో పాశ్యాత్య సంస్కృతిని నిరసిస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా భజరంగదళ్ కార్యకర్తలు మాట్లాడుతూ విదేశీ ఉత్పత్తులకు ఊతమిచ్చే దిశగా వారి వ్యాపార అభివృద్ధి కోసం గ్రీటింగ్ కార్డులు, ప్రేమికుల బ్యాండ్‌లు, చిహ్నాలను విక్రయిస్తూ దేశ సంస్కృతిని, యువతను పక్కదారి పట్టిస్తూ దేశ వ్యతిరేక శక్తులు కొంత మంది ఇలాంటి పాశ్యాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భజరంగ్‌దళ్ ప్రేమికులకు వ్యతిరేకం కాదని, రోమన్ దేశస్తుడైన వ్యాలంటైన్ అనే వ్యక్తి చనిపోయిన రోజును ప్రేమికుల రోజుగా జరపడమే వ్యతిరేకిస్తున్నామన్నారు. దేశ వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడ జరిగిన భజరంగ్‌దళ్ చూస్తూ ఊరుకోదన్నారు. ఈ ర్యాలీలో విశ్వహింద్ పరిషత్ జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖీ, జిల్లా కార్యదర్శి జెల్లల్ల గోవర్ధన్‌యాదవ్, విభాగ అధ్యక్షులు కనె్నబోయిన వెంకట్, పట్టణ కార్యదర్శి జెల్లల్ల భాస్కర్‌యాదవ్, జిల్లా భజరంగ్‌దళ్ గ్రామీణ అధ్యక్షులు యలిజాల నర్సింహ్మ, సాయిదయాల్‌సింగ్, బద్రి, గడ్డం సైదులు, నిఖిల్, విజయ్, రమేష్, శ్యామంత్, కరుణాకర్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
హోరాహోరీగా ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నీ
కోదాడ, ఫిబ్రవరి 14: ది కోదాడ వాలీబాల్ అసోసియేషన్ కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న యల్.వెంకట్రామిరెడ్డి స్మారక ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ కోదాడ ప్రాంత క్రీడాభిమనుల్లో క్రీడాసక్తిని నింపాయి. టోర్నమెంట్‌లో జాతీయస్ధాయిలో ప్రత్యేక గుర్తింపుపొందిన దక్షిణమధ్యరైల్వే, ఆదాయపుపన్నుశాఖ, సెంట్రల్ ఎక్సైజ్, పోస్టల్, ఎవోసి, ఇయంయఫ్, బుడిగె, కర్నాటక తదితర జట్లు పాల్గొని హోరీహోరీగా విజయం కోసం తలపడ్డాయి. ఒక జట్టును మించిన ప్రతిభను ఇంకొక జట్టు కనపరుస్తూ సాగుతున్న పోటీలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. శనివారం ఉదయం ప్రారంభమైన పోటీలు శనివారం రాత్రి కూడా నిర్వహింపబడ్డాయి. ఆదివారం పోటీలు ఉత్కంఠగా జరిగాయి. వందలాది మంది క్రీడాభిమానులు ఎండను లెక్కచేయకుండా పోటీలను ఆసక్తిగా తిలకించారు. పోటీలను అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, యంవిఐ కె.శ్రీనివాసరెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు జూలూరు వీరభద్రం, కళ్యాణ్‌బాబు తదితరులు నిర్వహిస్తున్నారు.
క్రీడాకారులను ఆదివారం కోదాడ జూనియర్ సివిల్ జడ్జి వీరనాగేశ్వర్‌రావుకు క్రీడల నిర్వాహకులు శ్రీనివాసరెడ్డి, ఎజిపి గట్ల నర్సింహరావు పరిచయం చేశారు.