పశ్చిమగోదావరి

కిరోసిన్‌కు చెల్లుచీటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 14 : రేషన్ సరుకుల పంపిణీ విధానంలో భారీ సంస్కరణల దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రేషన్ విధానంలో వస్తున్న సరికొత్త మార్పులు కొన్ని సార్లు డీలర్లను ఇబ్బందుల్లో పడేస్తుంటే మరికొన్ని సార్లు వినియోగదారులను గందరగోళంలో పడవేస్తూ వస్తున్నాయి. అయితే తాజా పరిణామాల్లో దీపం గ్యాస్ కనెక్షన్ల సంఖ్య పెరిగినందున రానున్న రోజుల్లో ఇక కిరోసిన్ అవసరాలు కుటుంబాలకు ఉండవని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. దానికి తగ్గట్టుగా రానున్న మే నెల నుంచి రేషన్ కార్డులపై ఇస్తున్న కిరోసిన్‌ను పూర్తిస్థాయిలో నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగా అన్ని ప్రాంతాల్లోనూ రేషన్ డీలర్లకు సూత్రప్రాయమైన నిర్ణయాన్ని వెలువరించినట్లు సమాచారం. వాస్తవానికి జిల్లాలో దాదాపు 11 లక్షలకు పైగా రేషన్‌కార్డులు వున్నాయి. వీటికి తోడు ఇటీవల కొత్త కార్డులను కూడా మంజూరు చేశారు. వీటితో ఈ సంఖ్య మరింతగా పెరిగింది. మరోవైపు గ్యాస్ కనెక్షన్ వున్న వారికి ఒక లీటరు, లేనివారికి గ్రామీణ ప్రాంతాల్లో రెండు లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో నాలుగు లీటర్లు చొప్పున కిరోసిన్‌ను ఇంతకాలం సరఫరా చేస్తూ వస్తున్నారు. ఆ విధంగా చూస్తే సరాసరిన కార్డుకు రెండు లీటర్లు చొప్పున వేసుకున్నా దాదాపు 22 లక్షల లీటర్ల మేరకు జిల్లా వ్యాప్తంగా కిరోసిన్ వినియోగం రేషన్ దుకాణాల నుంచి జరుగుతున్నట్లు భావించవచ్చు. అయితే ఈ మొత్తంలో కొన్ని సందర్భాల్లో తగ్గుదల, పెరుగుదల వున్నప్పటికీ సరాసరిన ఆ స్థాయిలో కిరోసిన్‌ను పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వున్న సామాజిక పరిస్థితుల్లో కిరోసిన్ అవసరంపై ఎన్నో ప్రశ్నలు రేగడం తెలిసిందే. కిరోసిన్‌ను వినియోగించి కుటుంబ అవసరాలను ముందుకు తీసుకువెళుతున్న కుటుంబాలు ఎన్ని వుంటాయన్న అంశంలోనూ ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుతం టిడిపి ప్రభుత్వ హయాంలోనూ కూడా దీపం పధకాన్ని జోరుగా అమలు చేస్తూ రావడం తెలిసిందే. దీనిలో భాగంగా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను పెద్ద ఎత్తున మంజూరు చేశారు. ఇక పట్టణ ప్రాంతాల్లో దీపం పధకం కింద కనెక్షన్లు తీసుకున్న వారూ అధిక శాతం మంది వుండగా ప్రైవేటుగా కూడా గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వారి సంఖ్య కూడా భారీగానే వుంది. ఆ విధంగా గ్యాస్ కనెక్షన్లు వున్న వారి సంఖ్య గత కొద్దికాలంలోనూ భారీ ఎత్తున పెరిగిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే గ్యాస్ కనెక్షన్లు వున్న వారికి కిరోసిన్‌ను సరఫరా చేయడం ఎంత వరకు సహేతుకం అన్న అంశంలో అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. దీపం పధకం కింద సబ్సిడీని అందిస్తూ గ్యాస్ కనెక్షన్లు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పంపిణీ చేస్తూ వస్తున్నారు. అలాగే గ్యాస్ సిలెండర్ల విషయంలోనూ సబ్సిడీ అమలవుతూనే వుంది. మరోవైపు అవే కుటుంబాలకు పూర్తిస్థాయి సబ్సిడీతో పంపిణీ చేసే కిరోసిన్‌ను సరఫరా చేయడంలో హేతుబద్దత లేదన్న అంశం తెరపైకి వచ్చింది. ఆ విధంగా చూస్తే జిల్లాలో దీపం పధకం భారీ ఎత్తున అమలు కాగా దీనిలోనూ బయట కూడా గ్యాస్ కనెక్షన్లు పొందిన వారి సంఖ్య దాదాపు రేషన్‌కార్డుదారుల సంఖ్యతో సరిపోలే విధంగా వుండటం గమనార్హం. ఈ గణాంకాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం కనెక్షన్లు వున్న వారికే మళ్లీ కిరోసిన్ కూడా అందించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని భావించింది. అంతేకాకుండా డబుల్ సబ్సిడీగా కూడా ఈ వ్యవహారం మారుతుండటాన్ని గమనించింది. దీంతో ప్రస్తుతం వున్న సామాజిక పరిస్థితుల్లో లీటరు కిరోసిన్ సరఫరా చేయడం వల్ల ఆయా కుటుంబాలకు పెద్దగా ఉపయోగం ఉండకపోగా మరోవైపు దీనివల్ల సబ్సిడీ భారం మాత్రం ప్రభుత్వంపై భారీగా ఉందన్న వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపధ్యంలోనే జిల్లా యంత్రాంగం రానున్న మే నెల నుంచి కిరోసిన్ పంపిణీని నిలిపివేయాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయంపై సహజంగానే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఒక విధంగా చూస్తే ఏజెన్సీ, మరికొన్ని మెట్ట ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్ల విస్తృతి అంతగా లేదన్న విషయం బహిరంగ రహస్యమే. అలాంటి చోట్ల కిరోసిన్ వాడకం అధికంగానే వుంటుంది. ఆ ప్రాంతాల్లోనూ దీని పంపిణీ నిలిపివేస్తే సమస్యలు తలెత్తుతాయన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రాధమికంగా తీసుకున్న ఈ నిర్ణయం అమలులోకి వచ్చే సరికి ఎన్ని మార్పులకు లోనవుతుందో వేచి చూడాలి.
అంతర్వేది ఉత్సవాలు ప్రారంభం
నరసాపురం, ఫిబ్రవరి 14: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. వివిధ జిల్లాల నుంచి అంతర్వేది పుణ్యక్షేత్రానికి వెళ్ళే యాత్రికులు స్థానిక మాధవాయిపాలెం రేవు నుంచి పంటుపై సఖినేటిపల్లి చేరుకుంటున్నారు. యాత్రికులను అంతర్వేది చేరవేసేందుకు ఆర్టీసి సుమారు 100 బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. నరసాపురం సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వసిష్ఠ నదిపై వంతెన నిర్మాణానికి
కేంద్రం సుముఖత
నరసాపురం ఎమ్మెల్యే బండారు
నరసాపురం, ఫిబ్రవరి 14: ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ పట్టణంలో వశిష్ట నదిపై వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు వెల్లడించారు. ఆదివారం స్థానిక నీటి పారుదల శాఖ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో రూ.1800 కోట్ల వ్యయంతో డ్రెడ్జింగ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి రేవుల మధ్య రూ.200 కోట్ల వ్యయంతో వంతెన నిర్మిస్తారన్నారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి అందించారన్నారు. దీనిపై మంత్రి గడ్కరీ సూత్రపాయంగా అంగీకరించారన్నారు. పూర్తి ప్రభుత్వ అనుమతులు, టెండర్ ప్రక్రియలతో ఈ ఏడాది మే, జూన్ నెలల్లో వంతెన నిర్మాణానికి సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అలాగే కోటిపల్లి-నరసాపురం రైల్వే లైను ఏర్పాటుపై కూడ సిఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో ఎఎంసి ఛైర్మన్ రాయుడు శ్రీరాములు, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బండారు పటేల్‌రాజా నాయడు, టిడిపి నాయకులు కొప్పాడి రవీంద్ర, పొనమండ నాగేశ్వరరావు, పసుపులేటి సాయి, కొల్లు పెద్దిరాజు, కాగిత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఆస్తులంటే అంతే!
*ఆస్తుల వివరాల నిక్షిప్తంపై అలక్ష్యం*రూ.కోట్లాది విలువైన స్థలాలకు జియోట్యాగింగ్*పురపాలికల్లో పూర్తికాని నమోదు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, ఫిబ్రవరి 14: పురపాలక సంఘాల్లో రూ.కోట్లు విలువజేసే ఆస్తులను గుర్తించి వాటి ఉనికి, వివరాలు, విస్తీర్ణం ఇతరత్రా పూర్తి వివరాలను ఫొటోలతో సహా ఇంటర్నెట్‌లో నమోదుజేసి రక్షణ కంచె ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియోట్యాగింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఏడాది గడిచినా ఈ ప్రకారం జిల్లాలో పూర్తికాలేదు. పురపాలక, ప్రభుత్వ ఆస్తులను రక్షించి భావితరాలకు మిగిలేలా తీసుకోవాల్సిన చర్యలు ముందుకు సాగడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం జియోట్యాగింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పురపాలక సంఘాల్లో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ, పురపాలక సంఘ స్థలాలను రక్షించుకునేందుకు శాటిలైట్ ద్వారా వాటి సరిహద్దులను గుర్తించి ఫోర్ ఫిగర్, సిక్స్ ఫిగర్‌లో వాటిని ప్రభుత్వ వెబ్‌సైట్లలో నమోదుజేసి వాటి వివరాలను నిక్షిప్తం చేయాల్సి ఉంది. ఇప్పటికే ఎన్నోచోట్ల పురపాలక ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయన్న సంగతి తెలిసిందే. అధికారుల వైపునుండి స్పందన లేకపోవడంతో ప్రభుత్వ ఆస్తుల, భూ వివరాలు ప్రభుత్వం ఆదేశించిన విధంగా నిక్షిప్త ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తికాలేదు. పూర్తయిన వాటి వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచాల్సి ఉంది. జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఇంకా ఆస్తుల గుర్తింపే పూర్తి కాలేదు. ఏడాది దాటినా ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
ఆరంభంలోనే హడావుడి..
జియోట్యాగింగ్ చేయాలని వెంటనే వెబ్‌సైట్‌లో వాటి వివరాలు పొందుపర్చాలని పురపాలకశాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. దీంతో ఏడాది క్రితం హడావుడిగా వారి దగ్గరున్న వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. అంతే ఇక అక్కడ నుండి జియోట్యాగింగ్ అంశం మూలకు చేరింది. జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌తోపాటు నగర పంచాయితీగా ఉన్న జంగారెడ్డిగూడెం తదితర పురపాలక సంఘాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించడంలో మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. ఏదో తమకు తెలిసిన సమాచారాన్ని ఒక ఫొటో తీసి వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఇక పురపాలక సంఘాలకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న వాణిజ్య దుకాణాలను జియోట్యాగింగ్ పూర్తిస్థాయిలో చేయలేదు. ఏలూరు, నరసాపురంలలో ఇంకా ఈ ప్రక్రియ చేయాల్సి ఉంది. పాఠశాలల భవనాలను గుర్తించడంలో భీమవరం, ఏలూరు, నరసాపురం, తణుకు పురపాలక సంఘాలు జియోట్యాగింగ్ చేయాల్సి ఉంది. పురపాలక భవనాలు జియోట్యాగింగ్ చేయడంలో భీమవరంతోపాటు నరసాపురం, ఏలూరు, నీటి సరఫరా కేంద్రాలు, మొక్కల పెంపకం కేంద్రాలు, మతపరమైన నిర్మాణాలను, క్రీడా స్థలాలు, ఆసుపత్రులను ఇంకా జియోట్యాగింగ్ చేయాల్సి ఉంది. ఏదేమైనా ఆయా పురపాలక సంఘాల్లోని పట్టణ ప్రణాళిక అధికారులు మాత్రం ప్రభుత్వ, పురపాలక సంఘం ఆస్తులను గుర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు పుర ప్రజలు ఆరోపిస్తున్నారు.

సూర్య, చంద్రప్రభ వాహనాలపై విహరించిన శ్రీవారు
ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 14: సప్త ఆశ్వాలను అధిరోహించిన చినవెంకన్న ఉదయం వేళ సూర్యప్రభ వాహనంపై అలాగే రాత్రి చంద్రప్రభ వాహనంపై క్షేత్ర తిరువీధుల్లో ఉభయ దేవేరులతో విహరించారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం జరిగిన ఈ తిరువీధి సేవ ఆద్యంతం భక్తులను అలరించింది. మాఘమాస శుద్ధ సప్తమి తిథి రోజున సూర్యభగవానుడు అవతరించిన రోజు కావడంతో ఈ రథసప్తమి వేడుకను క్షేత్రంలో వైభవంగా జరిపారు. ఉదయం ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సూర్యప్రభ వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య శ్రీవారి వాహనం క్షేత్ర పురవీధులకు పయనమైంది. అలాగే రాత్రి చంద్ర ప్రభ వాహనంపై శ్రీవారి తిరువీధి సేవ ఆద్యంతం భక్తులకు నేత్రపర్వమైంది. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఇఒ వేండ్ర త్రినాధరావు పర్యవేక్షించారు.
పారిజాతగిరిపై వైభవంగా చక్రస్నానం
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా ఆదివారం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి ఆలయ తిరువీధులలో పల్లకీపై ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సుదర్శన పెరుమాళ్‌ను మేళతాళాలతో, గోవిందనామ స్మరణలతో ఊరేగింపుగా స్వామివారి కోనేరు వరకు తీసుకు వెళ్లి వసంతోత్సవం నిర్వహించారు. వసంతోత్సవం తరువాత కోనేరులో చక్రస్నానం కార్యక్రమం నిర్వహించారు. సుదర్శన్ పెరుమాళ్‌తో కలసి భక్తులంతా కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిపారు. ఆలయ ప్రధానార్చకులు నల్లూరు రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమ ఏర్పాట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాథరాజు (శివ) పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటి సభ్యులు పేరిచర్ల జగపతిరాజు, బిక్కిన సత్యనారాయణ, కాకాని శ్రీహరిరావు, రాజాన సత్యనారాయణ, కంది బాలకృష్ణారెడ్డి, దుగ్గిరాల వెంకట సుబ్బారావు, రెడ్డి రంగప్రసాదరావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బిసిలకు అన్యాయంచేస్తే ఉద్యమిస్తాం
* రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు నౌడు
ఉంగుటూరు, ఫిబ్రవరి 14: బిసిలకు అన్యాయంచేస్తే సహించేది లేదని, ఉద్యమిస్తామని బిసి జెఎసి జిల్లా ఛైర్మన్ నౌడు వెంకటరమణ అన్నారు. ఆదివారం యర్రమళ్ల గ్రామంలో నాలుగు గ్రామాలకు చెందిన బిసిలతో సదస్సు నిర్వహించారు. సదస్సుకు బిసి సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పివి పెద్దిరాజు అధ్యక్షత వహించగా, నౌడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. బిసిలు శ్రామికులుగా పనిచేస్తూ దేశ సంపదను సృష్టిస్తున్నారని, బిసిలుగా ఉన్న ఈ వర్గాలకు ప్రభుత్వాలు, పార్టీలు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో బిసిలు ఐక్యతగా ఉద్యమించాలన్నారు. లక్షమందితో పెట్టబోయే బిసిల సింహగర్జన విజయవంతం చేసేందుకు బిసిలు సిద్ధంగా ఉండాలని నౌడు పిలుపునిచ్చారు. బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వి కాశి మాట్లాడుతూ బిసిలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు బిసిలు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నెల 15వ తేదీన కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న రిలే దీక్షకు బిసిలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సభాధ్యక్షుడు పివి పెద్దిరాజు మాట్లాడుతూ బిసిలు ఐక్యంగా ఉండి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీల కతీతంగా ఆయా పార్టీలలోని బిసి నేతలంతా ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో బిసి నాయకులు చిటికిన ప్రసాదు, తాడిశెట్టి ఎంబిస్వామి, వై త్రిమూర్తులు, బి రాంబాబు, బి రామకృష్ణ, అనుపోజు బ్రహ్మం, శ్రీను, నెరుసు పుల్లయ్య, పొన్నాడ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
ఆక్వా పార్కు నిర్మాణ పనులు నిలిపివేతకు సిఎం ఆదేశం
నరసాపురం, ఫిబ్రవరి 14: తుందుర్రు ఆక్వా పార్కు నిర్మాణ పనులను నిలుపుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారని నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా ఫుడ్ పార్కును ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఎక్సయిజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలసి సిఎంకు వివరించామన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి పార్కు నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారని తెలిపారు.
గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

డిసిసిబి ఛైర్మన్ ముత్యాల రత్నం
ఆకివీడు, ఫిబ్రవరి 14: కార్యకర్తలంతా సమిష్ఠిగా గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని డిసిసిబి ఛైర్మన్ ముత్యాల రత్నం అన్నారు. ఆకివీడు మండల టిడిపి కార్యకర్తల సమావేశం ఆదివారం స్థానిక ఎఎంసి కార్యాలయ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదవర్గాల కోసం ప్రతిష్టాత్మకంగా ఎన్నో బృహత్తర కార్యక్రమాలు రూపొందిస్తుందన్నారు. వాటిని ప్రజలకు చేరవేసే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. పలువురు కార్యకర్తలు వాణిజ్య బ్యాంకులు లబ్ధిదారులకు సహకరించడంలేదని సమావేశం దృష్టికి తెచ్చారు. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన పలు రుణ సదుపాయాలు అందించడంలో ఆయా బ్యాంకు మేనేజర్లు సహకరించడం లేదన్నారు. ఎఎంసి ఛైర్మన్ మోటుపల్లి ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ పరిధిలో రూ. 1.2 కోట్ల నిధులు పుంతరోడ్ల నిర్మాణానికి మంజూరయ్యాయన్నారు. రూ.60 లక్షలు ఎఎంసి, రూ.60 లక్షల ఉపాధి హామీ నిధుల నుండి వెచ్చించనున్నట్లు తెలిపారు. సాగునీటి విషయంలో ఎమ్మెల్యే శివరామరాజు ప్రత్యేక శ్రద్ధతీసుకుని ప్రతీ ఎకరాకు నీరందేలా చర్యలు చేపడుతున్నారన్నారు. సమావేశంలో బొల్లా వెంకట్రావు, సర్పంచ్ గణపతి, బచ్చు సరళకుమారి, చుండూరి సత్యనారాయణ, బచ్చు కృష్ణ, నగేష్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

పాలకొల్లులో సూర్యనమస్కార పోటీలు
పాలకొల్లు, ఫిబ్రవరి 14: స్థానిక వాసవీ క్లబ్, పంతంజలి నిత్య యోగ సాధనా కేంద్రం సంయుక్తంగా శ్రీసరస్వతీ శిశుమందిర్ ప్రాంగణంలో సూర్య నమస్కారాల పోటీ నిర్వహించారు. 400 మంది ఈ పోటీలలో పాల్గొన్నారు. 8 సంవత్సరాల నుండి 90 సంవత్సరాలు వయస్సు వారు పాల్గొన్నారు. ఇద్దరు విద్యార్థులు 410 సూర్యనమస్కారాలు నిర్వహించి పట్టణ రికార్డును అధిగమించారు. 7 విభాగాలలో బహుమతీ ప్రదానం మండల విద్యాశాఖాధికారి గంగాధరశర్మ, వాసవీ మాజీ గవర్నర్ శ్రీఖాకొల్లు మైథిలి అందించారు. వాసవీ క్లబ్ అధ్యక్షుడు రవికుమార్, పంతంజలి యోగ సాధన కేంద్ర వ్యవస్థాపకుడు బోడా చక్రవర్తి, శ్రీసరస్వతీ విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు నరసింహరాజు తదితరులు వేదికనలంకరించారు. రవీంద్ర ఆధ్వర్యంలో సూర్యయజ్ఞం నిర్వహించారు. లింగరాజు సూర్య శతనామావళితో తొలి 108 మంత్రాలతో సూర్యనమస్కారాలు చేయించారు.
పాలకొల్లు రూరల్ టిడిపి సమావేశం
పాలకొల్లు, ఫిబ్రవరి 14: పాలకొల్లు మండలం తెలుగుదేశం సమావేశం ఆదివారం శివదేవునిచిక్కాలలో మండల అధ్యక్షుడు కోడి విజయభాస్కర్ అధ్యక్షత నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు పాల్గొని కార్యకర్తలు నిత్యం పార్టీ అభివృద్ధికి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు లబ్దిదార్లకు అందేవిధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయో, లేదో చూడాలని ఆయన పిలుపునిచ్చారు. మండల ఉపాధ్యక్షుడు దిడ్ల రామాంజనేయులు, జడ్పీటిసీ కోడి విజయలక్ష్మి, ఉంగరాల నరసింహారావు, అందే కోటి వీరభద్రం, పచ్చగల్ల సైమన్, బెజవాడ మహలక్ష్మి, కె.రామచంద్రరావు, మండలంలోని టిడిపి సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఇతర టిడిపి నాయకులు పాల్గొన్నారు.