నిజామాబాద్

కోటి ఎకరాలకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఫిబ్రవరి 19: సాగునీటి రంగాన్ని పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. 25వేల కోట్ల రూపాయల వ్యయంతో కోటి ఎకరాల భూములకు నీరందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రణాళికలను అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో 3కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 5వేల మెట్రిక్ టన్నుల గోదాంల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఏ రీతిగానైతే ఉద్యమం చేశామో, అదే విధంగా బంగారు తెలంగాణ లక్ష్య సాధన కోసం పనులు చేపడుతున్నామని చెప్పారు. సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే మిషన్ కాకతీయ వల్ల వాటికి పునర్ వైభవం సంతరిస్తోందని తెలిపారు. చెరువుల్లో పూడిక మట్టి ఎరువులా ఉపయోగపడుతుందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రాణహిత-చేవెళ్ల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా నియోజకవర్గంలో 15వేల ఎకరాల పంట భూములకు నీరందిస్తామని పేర్కొన్నారు. అయితే పంట కాల్వల నిర్మాణానికి రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావాలని, ఒప్పందం కుదిరిన వెంటనే నష్టపరిహారాన్ని సంబంధిత రైతులకు చెక్కుల ద్వారా అందజేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఎంత త్వరగా ముందుకు వచ్చి భూములు అప్పగిస్తే, అంత త్వరగా సాగునీటిని పంట పొలాలకు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. రైతులకు అందుబాటులో ఉండే విధంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 1000కోట్లతో 5వేల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మిస్తున్నామని తెలిపారు. తొందర పడి రైతులు పండించిన పంటలను అమ్ముకోవద్దని, ఈ గోదాముల్లో నిల్వ చేసుకుని గిట్టుబాటు ధర అనుకూలంగా ఉన్నప్పుడే అమ్ముకోవాలని సూచించారు. పైగా గోదాముల్లో ఉత్పత్తులు నిల్వ చేసుకున్న రైతులకు లక్ష రూపాయల సరుకుపై 75వేల చొప్పున రుణాలు అందించడం జరుగుతుందన్నారు. నిజామాబాద్ జిల్లాలో 394మంది రైతులకు 480లక్షల రూపాయల రుణాలను ఈ పథకం ద్వారా అందించడం జరిగిందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 70చెరువులను మిషన్ కాకతీయలో చేపట్టి, 30చెరువులను పూర్తి చేయడం జరిగిందని, మిగతా 40చెరువులను మార్చి 31కల్లా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు.
రెండవ విడతగా 60చెరువులకు ప్రతిపాదనలు రాగా, 30చెరువులకు ఆమోదం తెలుపడం జరిగిందని, మిగతా వాటికి కూడా త్వరలోనే మంజూరు ఇస్తామన్నారు. వేల్పూర్‌లో మార్కెట్ యార్డు నిర్మాణం చేపడ్తామని హామీ ఇచ్చారు. గుమ్మిర్యాల ఎత్తిపోతల పథకానికి 15కోట్లు మంజూరు చేస్తున్నామని, గాండ్లపేట పెద్దవాగులో చెక్‌డ్యామ్ నిర్మాణానికి 4.8కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. లక్ష్మికాల్వ ఆధునికీకరణకు గాను 64లక్షల రూపాయల నిధులు మంజూరు ఇస్తున్నామన్నారు. త్వరలోనే పగటిపూట 9గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపి కల్వకుంట్ల కవిత, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజుతో పాటు స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

మార్చి నుండి ఇళ్ల నిర్మాణాలు
ఎంపి కవిత
మోర్తాడ్, ఫిబ్రవరి 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్‌రూమ్‌ల ఇళ్ల నిర్మాణం ప్రక్రియను మార్చి నుండి ప్రారంభిస్తామని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంత్రి హరీశ్‌రావుతో కలిసి మోర్తాడ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె, అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ నిర్మాణానికి గాను ప్రణాళికా బద్ధంగా ముందడుగు వేస్తున్నారని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చాలామందికి పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని, ఇంకా కొన్ని గ్రామాల్లో దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో వాటిని పరిశీలించి, త్వరలోనే ఆమోదం తెలుపుతామని తెలిపారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న వ్యవసాయ గిడ్డంగులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పూర్తిస్థాయిలో చేయూతనిస్తోందని, రైతులు, ప్రజలు కూడా అదే స్థాయిలో ప్రభుత్వానికి మద్దతు పలకాలని ఆమె కోరారు.
ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు పలు సమస్యలను మంత్రి హరీశ్‌రావు, ఎంపి కవిత దృష్టికి తీసుకువచ్చారు. పలువురు బీడీ కార్మిక నేతలు మంత్రిని కలిసి బీడీ కట్టలపై పుర్రెగుర్తును తొలగించాలంటూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కల్లెడ చిన్నయ్య, జడ్పీటిసి అమిత, సర్పంచ్ దడివె నవీన్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

24న చలో కలెక్టరేట్
ఇందూర్, ఫిబ్రవరి 19: బీడీ కట్టలపై 85శాతం గొంతు క్యాన్సర్ గుర్తులను ముద్రించేందుకు జీవో నెంబర్ జిఎస్‌ఆర్ 727(ఇ)ని విడుదల చేయడాన్ని నిరసిస్తూ 24న చేపట్టే చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయాలని బీడీ కామ్‌గార్ జిల్లా అధ్యక్షుడు, టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు పోశెట్టి పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బీడీ యాజమాన్యాలు ఈ నెల 15నుండి 24వ తేదీ వరకు బీడీ పరిశ్రమను మూసి ఉంచేందుకు నిర్ణయం తీసుకోవడంతో కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయంతో దేశంలోని కోటి మంది బీడీ కార్మికులు, 40లక్షల తునికాకు సేకరించే కూలీలతో పాటు కమీషన్‌దారులు, సేల్స్‌మెన్స్, అమ్మకందారులు, కోకావాలాలు కలుపుకుని మరో కోటి మంది ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కార్మికుల ఉపాధి, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నెల 24న తలపెట్టిన చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని పోశెట్టి పిలుపునిచ్చారు. విలేఖరుల సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టూర్ చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

అనాథ బాలలకు అండగా నిలుస్తాం
ఎంపి కవిత
డిచ్‌పల్లి రూరల్, ఫిబ్రవరి 19: తల్లిదండ్రులు లేని అనాథ బాలలకు అండగా నిలుస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తామని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత అన్నారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని తహశీల్ కార్యాలయం సమీపంలో అనాథ బాలల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని ఆమె కలెక్టర్ యోగితారాణా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌లతో కలిసి ప్రారంభించారు. 12లక్షలతో నిర్మిస్తున్న భవనానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ, ఎవరూ లేరనే భావనను దరి చేరనీయవద్దని, ప్రభుత్వమే వారికి తల్లిదండ్రులుగా మంచిచెడ్డలు చూస్తూ బాసటను అందిస్తుందన్నారు. అనాథ పిల్లల వసతి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని, వారికి అవసరమైన అన్ని వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని చెప్పారు. విద్య, వైద్యం, దుస్తులు, చదువుకునేందుకు అవసరమయ్యే అన్ని ఖర్చులను ప్రభుత్వపరంగానే భరిస్తామని భరోసా కల్పించారు. ప్రభుత్వ తోడ్పాటును ఆలంబనగా మల్చుకోవాలని, చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఉద్బోధించారు. ఈ వసతి గృహంలోని విద్యార్థులకు ఎలాంటి సహాయ, సహకారాలు అవసరమైనా అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే అధికారులను సంప్రదించాలని వసతి గృహం బాలలకు సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కొంతమంది చిన్నారులు భిక్షాటన చేస్తుంటారని, వారిని చూసి తాను ఎంతగానో చలించిపోతానని ఎంపి కవిత అన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని, బడి ఈడు కలిగిన ప్రతి ఒక్కరూ పాఠశాలల్లో చేరి చదువుకునేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని చెప్పారు. తమకు ఎవరూ లేరనే భావనను మది నుండి తుడిచేసి, ప్రభుత్వ సంకల్పమైన బంగారు తెలంగాణ నిర్మాణంలో అనాథ బాలలు సైతం భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కాగా, డిచ్‌పల్లిలో గత ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయమై తాను ఇదివరకే కేంద్ర రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపగా, కోటి యాభై లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ వర్గాలు హామీ ఇచ్చాయని అన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 3కోట్ల రూపాయల నిధులు అవసరమవుతుండగా, కేంద్రం అందించే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మిగతా నిధులను జతచేసి సాధ్యమైనంత త్వరలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభమయ్యేలా చూస్తానని చెప్పారు. డిచ్‌పల్లిలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపేలా చూడాలంటూ స్థానికుల నుండి విజ్ఞప్తులు వచ్చాయని, వాటిని కేంద్ర రైల్వే మంత్రికి నివేదించామని అన్నారు. త్వరలోనే కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను డిచ్‌పల్లి స్టేషన్‌లో నిలుపనున్నారని, ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన చేయనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ తెలంగాణలో తెరాస ప్రభుత్వం పెద్దఎత్తున సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడం వంటివి చేపడుతూ స్పష్టమైన ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. అత్యవసర పనులు సత్వరమే చేపట్టేందుకు వీలుగా మునుపెన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా కలెక్టర్లకు పది కోట్ల రూపాయల నిధులు కేటాయించారని అన్నారు. అనాథలను ఆదుకోవడం వంటి వాటితో పాటు ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పనులు చేపట్టేందుకు కూడా ఈ నిధులను వినియోగించుకునే వెసులుబాటు కల్పించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అభ్యున్నతి కోసం పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, వారి ముఖ్యమైన పండుగల సమయంలో ప్రభుత్వం తనవంతు తోడ్పాటును అందిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీలు విజి.గౌడ్, డాక్టర్ భూపతిరెడ్డి, ఎంపిపి ఇందిర, జడ్పీటిసిలు అరుణ, తనూజరెడ్డి, సర్పంచ్ అంజయ్య, దర్పల్లి ఎంపిపి ఇమ్మడి గోపి, ఎంపిడిఓ సురేందర్, తహశీల్దార్ రవీందర్‌తో పాటు రూరల్ సెగ్మెంట్ పరిధిలోని ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బీడీ కార్మికులకు అన్యాయం జరగనివ్వం
డిచ్‌పల్లి రూరల్, ఫిబ్రవరి 19: తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది బీడీ పరిశ్రమను నమ్ముకుని జీవనాలు వెళ్లదీస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ బీడీ కార్మికులకు అన్యాయం జరుగనివ్వమని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత పేర్కొన్నారు. డిచ్‌పల్లిలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, బీడీ కట్టలపై పుర్రె గుర్తు, క్యాన్సర్ బొమ్మలను 85శాతం సైజులో ముద్రించాలని కేంద్రం ఆంక్షలు విధించడంతో బీడీ కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. బీడీ కట్టలపై గొంతు క్యాన్సర్ బొమ్మను ముద్రించాలనే ఆంక్షలపై పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని, బీడీ కార్మికుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వారి పక్షాన తెరాస ఎంపిలమంతా గట్టిగా పోరాడతామని అన్నారు. గతంలోనే ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి నివేదించామన్నారు. మళ్లీ క్యాన్సర్ బొమ్మల సైజును ఎందుకు పెంచారన్నది అర్ధం కావడం లేదన్నారు. కాగా, తెలంగాణకు రావాల్సిన పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా తమ వాణిని వినిపించి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ఇప్పటికే కేంద్ర రైల్వే మంత్రిని కలిసి పెండింగ్ ప్రాజెక్టులకు విరివిగా నిధులు కేటాయించాలని కోరామని, కొత్త లైన్ల కోసం విజ్ఞాపనలు అందించినట్టు ఎంపి కవిత తెలిపారు. గతేడాది తరహాలోనే పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్ పనులకు ఈసారి బడ్జెట్‌లో కూడా 140కోట్ల రూపాయలు కేటాయించాలని కోరగా, రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ మేరకు నిధులు కేటాయిస్తే ప్రస్తుత ఏడాదిలోనే పనులు పూర్తయ్యేందుకు ఆస్కారం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడిన అంశాలపై ఎంతమాత్రం రాజీపడబోమని, అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ నిధులను సాధించుకుంటామని ఎంపి కవిత స్పష్టం చేశారు.

ప్రజల అవసరాలతో వ్యాపారాలు చేస్తే సహించం
జెసి రవీందర్‌రెడ్డి
తాడ్వాయి, ఫిబ్రవరి 19: వాటర్ ట్యాంకుల యాజమానులు ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకోని వారితో వ్యాపారాలు చేస్తే ట్యాంకర్ యాజమానులపై కేసులు నమోదు చేస్తామని జెసి రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని ఆర్‌డబ్ల్యుఎస్, రెవెన్యూ, ఎంపిడిఓ అధికారులతో తాగునీటి సమస్యపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలోని తాడ్వాయి మండలంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని, ప్రస్తుతం వేసవి సమీపిస్తుండడంతో నీటి సమస్యను ఆసరాగా చేసుకొని కొంతమంది ప్రజల అవసరాలతో వ్యాపారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు మండలానికి నూతనంగా మరో 42నూతన బోర్లకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, గ్రామంలో ఎక్కడ నీటి వసతి ఉందో అక్కడ ప్రజలు బోర్లు వేసుకోవాలని అందుకు అధికారులు పూర్తిగా సహకరిస్తారని తెలిపారు. నీటి సమస్య పరిష్కారం కోసం ఎన్ని లక్షలు ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. నీటి సమస్యను తీర్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని గురుకుల, కస్తూర్బా పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గురుకుల పాఠశాల ప్రధానోఫ్యాయురాలు లక్ష్మీబాయితో మాట్లాడారు. గురుకుల పాఠశాలకు రోజు 6-8ట్యాంకర్ల నీటి సరఫరా జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలుపడంతో అలా కాకుండా వారం రోజుల్లోగా నీటి వసతులు ఉన్న చోట బోర్లు వేసి ఎంత ఖర్చైనా పైప్‌లైన్ ద్వారా పాఠశాలకు నీరు తేవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మండలాన్ని రానున్న నాలుగు నెలల్లో నీటి సమస్య లేకుండా నూతన బోర్లు వేయడానికి తాము అనుమతి ఇచ్చామని తెలిపారు. ఈ సమావేశంలో కామారెడ్డి ఆర్‌డిఓ నగేశ్, తహశీల్దార్ గంగాధర్, ఇఓపిఆర్‌డి నారాయణ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

రైతులకోసమే గిడ్డంగుల నిర్మాణం
మంత్రి హరీశ్‌రావు వెల్లడి
బాల్కొండ, ఫిబ్రవరి 19: రైతుల మంచిచెడ్డలను దృష్టిలో పెట్టుకునే వారి శ్రేయస్సు కోసమే రాష్ట్ర ప్రభుత్వం గిడ్డంగుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని వేంపల్లి గ్రామంలో 1.53కోట్లతో లిఫ్ట్ పనులను, బాల్కొండలో 3కోట్లతో గిడ్డంగి నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌రావు ప్రజలు, రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు పంట ఉత్పత్తులను అమ్ముకోవాలంటే మద్దతు ధర లేని సమయాల్లో విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సిఎం కెసిఆర్ మండలానికో గిడ్డంగిని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. దీంతో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేని సమయంలో తమ ఉత్పత్తులను గిడ్డంగిలో నిల్వ పెట్టుకుని, ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చని అన్నారు. ధాన్యం నిల్వ పెట్టుకునేందుకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నిల్వ చేసుకున్న ధాన్యంపై 75శాతం రుణాన్ని సైతం అందించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్, టిడిపిలు రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం గోదాముల కెపాసిటీ 60వేల మెట్రిక్ టన్నులని, టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో 100కోట్లతో లక్షా 60వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలను నిర్మిస్తున్నామని అన్నారు. రైతులు సహకరిస్తే జూన్ నాటికి చెక్‌డ్యామ్‌లు, ఎత్తిపోతలు, మిషన్ కాకతీయ పనులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపి కవిత, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, కలెక్టర్ యోగితారాణా, ఆర్డీఓ యాదిరెడ్డితో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.