కడప

భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌పై జోరుగా బెట్టింగ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 19: భారత్ - పాకిస్తాన్ మధ్య శనివారం వరల్డ్‌కప్ 20-20మ్యాచ్‌పై జిల్లాలో జోరుగా పందాలు కాశారు. గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఓటమి చవిచూసినా శనివారంనాటి భారత్ -పాకిస్తాన్ మ్యాచ్‌పై భారీఎత్తున పందాలు కాశారు. క్రికెట్ బుకీలు జిల్లావ్యాప్తంగా బహిరంగంగానే పందేలు కాస్తున్నారు. కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేటలో కొంతమంది ప్రముఖులు సిండికేట్‌గా ఏర్పడి హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని మ్యాచ్‌పై జోరుగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. కాగా పోలీసుశాఖలో జిల్లాలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అధికారులు, పోలీసు సిబ్బందికి క్రికెట్ బెట్టింగ్‌పై సమాచారం అందినా అధికారపార్టీ నేతలు కొందరు ఈ మ్యాచ్‌లో భాగస్వామ్యం కావడంతో పోలీసులు కూడా అంటీ అంటనట్లుగా వ్యవహరిస్తున్నారు. గత మ్యాచ్‌లో పోగొట్టుకున్న సొమ్మును ఈ సారి రాబట్టుకునేందుకు పందెంరాయుళ్లు భారీగా పందేలు కాసినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం నుంచే సురక్షిత ప్రాంతాల్లో బుకీలు పెద్దఎత్తున పందెం డబ్బులు సేకరించి హైదరాబాద్‌లో మకాంవేసిన బుకీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండవ ముంబాయిగా ప్రసిద్దిగాంచిన ప్రొద్దుటూరులో ముంబాయి తరహాలోనే కర్నాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రముఖులను రప్పించుకుని వారితో కూడా పందేలు కాసినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఎర్రచందనం మాఫియా, మాదక ద్రవ్యాల మాఫియాలు సైతం కోట్లరూపాయల్లోనే పందేలను కట్టినట్లు తెలుస్తోంది. భారత్ -పాకిస్తాన్ మ్యాచ్‌పై కోట్లరూపాయల్లో పందెం కాశారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో తలపడిన క్రీడాకారులపైన, మరికొందరు బంతులపై కూడా బెట్టింగ్ కాసినట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువశాతం పందేలు భారత్ గెలుస్తుందని పందేలు కాయగా, పాకిస్తాన్‌పై కూడా భారీగా బెట్టింగ్‌లు వేశారు. బెట్టింగ్ రాయుళ్లలో సంపన్న కుటుంబాలకు చెందిన వారు , వడ్డీ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, రియల్డర్లు , పలువురు రాజకీయ వేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక యువత కూడా అప్పులు చేసి పందేలు జోరుగా కాశారు. మొత్తమీద భారత్ -పాకిస్తాన్ మ్యాచ్ జిల్లాలో పలువురి తలరాతలు మార్చనుంది.
యథేచ్చగా క్రికెట్ బెట్టింగ్
ప్రొద్దుటూరు, మార్చి 19: టి-20 వరల్డ్ కప్ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. ఈనెల 15 నుంచి టి-20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. దీంతో క్రికెట్ బుకీలకు పండగ వాతావరణం ఏర్పడింది. కోట్లాదిరూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. బుకీలు పోలీసుల కళ్లుగప్పి ఎవరికీ అనుమానం రాకుండా వుండే రహస్య స్థావరాలను ఎన్నుకొని ఆయా నివాసాలలో టివిలను ఏర్పాటుచేసుకొని ఫోన్ల ద్వారా, తమకు నమ్మకంగా వుండే ఏజెంట్ల ద్వారా ఈ పందేలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా పోలీసుల నుంచి కూడా ఇబ్బందులేవీ రాకుండా ఉండేందుకోసం ముందుగానే పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పినట్లు కూడా పట్టణంలో ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. జిల్లాలోనే వాణిజ్య కేంద్రంగా పేరొందిన ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ పూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోందనేది అందరికి తెలిసిన విషయం. ఇక క్రికెట్ టోర్నీలు, ఐపిఎల్, వరల్డ్‌కప్ వంటి సందర్భాలలో బెట్టింగ్ రాయుళ్లు చెలరేగిపోయి పందేలు కాస్తుంటారు. అంతే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కొందరు బెట్టింగ్‌రాయుళ్లు ప్రొద్దుటూరులో తిష్టవేసి పందేలు కాస్తుంటారు. ఇటీవల కాలంలో బుకీలు విద్యార్థులను ప్రలోభపెట్టి, డబ్బు ఆశచూపి వారిని లోబరుచుకొని ఏజెంట్లుగా మార్చుకుంటున్నారు. వీరి ద్వారా పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహించి వారికి కమీషన్ల రూపంలో ముట్టజెబుతుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడి కళాశాలల్లో విద్యనభ్యశించే విద్యార్థులు జల్సాలకు అలవాటుపడి బుకీలు చెప్పినట్టల్లా చేస్తూ వారి విద్యాభ్యాసాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకుగాను బుకీలు ఖరీదైన భవంతులలో, అపార్ట్‌మెంట్లలో గదులను అద్దెకు తీసుకొని టివిలు, ఇంటర్నెట్‌లు ఏర్పాటుచేసుకొని సెల్‌ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ ఏజెంట్లకు, బెట్టింగ్‌రాయుళ్లకు అందుబాటులో వుంటూ తమ వ్యాపారం సాగిస్తున్నారు. ముఖ్యంగా పట్టణంలోని వై ఎం ఆర్ కాలనీ, హౌసింగ్‌బోర్డు, పట్టణ పరిధిలోని అపార్ట్‌మెంట్లలో బుకీలు ఎక్కువశాతం వుంటున్నట్లు సమాచారం. నిత్యం కోట్ల రూపాయల్లో బెట్టింగ్ రూపంలో చేతులు మారుతున్నాయని, ఈ డబ్బంతా బెట్టింగ్‌కు ప్రధాన కేంద్రాలైన హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు యధేచ్ఛగా తరలుతోందని కొందరు పందెంరాయుళ్ల ద్వారా తెలుస్తోంది. ఈ తతంగమంతా పోలీసు అధికారులకు తెలియకుండా వుంటుందా అనేది ప్రజల్లో నెలకొన్న ప్రశ్న. పోలీసు అధికారులు తమ పరిధిలో పనిచేసే కింది స్థాయి సిబ్బందిచే బుకీల సమాచారాన్ని తెప్పించుకొని, బుకీలతో సంబంధాలు ఏర్పరుచుకొని నెలనెలా వారికి అందాల్సిన ముడుపులను తెప్పించుకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో గుట్టుచప్పుడు కాకుండా జరిగేటువంటి ఈ క్రికెట్ బెట్టింగ్ ప్రస్తుతం విచ్ఛలవిడిగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని ప్రతి కాలనీలో, ప్రతి వీధిలో ఓ ఏజెంట్ పుట్టుకొస్తున్నాడనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఆటోవాలాలు, వాహనాల మెకానిక్‌లు, నిరుద్యోగ యువత క్రికెట్ ఏజెంట్లుగా మారుతున్నట్లుగా సమాచారం. ఈ విధంగా ప్రొద్దుటూరు పట్టణంలో విజృంభిస్తున్న క్రికెట్ మహమ్మారిని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కూకటి వేళ్లతో సహా పెకళించకపోతే ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా వీధినపడే అవకాశాలున్నాయని ప్రజలు కోరుతున్నారు.