ఈ వారం కథ

ఆమె ఒంటరి కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చుట్టాలందరూ వెళ్లిపోతున్నట్టున్నారు. అమ్మ దగ్గరెవరైనా ఉన్నారా?!’’ అడిగింది ప్రియ.
‘‘పిన్ని ఉంది పెద్దక్కా!’’ జవాబుగా చెప్పింది ప్రణీత.
‘‘ఇవాళ మనం అమ్మతో విషయం మాట్లాడేద్దామక్కా’’ ప్రియను చూస్తూ చెప్పింది పావని.

అవునన్నట్టుగానూ కాదన్నట్టుగానూ తల ఊపింది ప్రియ.
ఆ ముగ్గురు అక్కచెలెళ్ళ ముఖాల్లోనూ విచారం స్పష్టంగా కనిపిస్తోంది.
కళావిహీనమై కూర్చున్న వాళ్ళ దగ్గరకు లోపలినుండి వచ్చిన చుట్టాలు, స్నేహితులు కొందరు వౌనంగా తలలూపి నిష్క్రమిస్తున్నారు. కొందరు ధైర్యం తెచ్చుకోవాలని సర్ది చెప్పి బయటకు వెళుతున్నారు.
హాల్లో దండ వేసి ఉన్న ఆ ఇంటి యజమాని ఫొటో ఓ బల్లమీద గోడకు జారవేసి ఉంది. ఫొటో ముందు వెలుగుతున్న దీపం, పళ్ళు, స్వీట్సు ఉన్నాయి. లోపలి గదిలోంచి హృదయం ద్రవించేలా ఓ రోదన వినిపిస్తోంది.
మరో అరగంటకు ఆ రోదన వినిపించడం ఆగింది. వాళ్ళ పిన్ని బయటకొచ్చి చెప్పింది. ‘‘ప్రియా! అమ్మకి ఇప్పుడే నిద్రపట్టింది. నేను మా ఇంటికెళ్లి కొన్ని బట్టలు తెచ్చుకుంటాను. అమ్మ లేస్తుందేమో కాస్త కనిపెట్టుకుని ఉండండి’’
‘‘అలాగే పిన్నీ!’’ చెప్పింది ప్రియ.
పిన్ని వెళ్లిపోయిన అయిదు నిమిషాల తర్వాత అంతకుముందు ఆగిన సంభాషణకు తిరిగి తెర తీసింది ప్రియ. ‘‘ఇప్పుడే మనం అన్నీ మాట్లాడేస్తే అమ్మ ఏమనుకుంటుందో చెల్లీ!’’
‘‘ఇలా మనం ఆలస్యం చేసే కొద్దీ అమ్మ ఈ ఇంట్లోనే ఉండిపోతానంటుంది. నీ దగ్గరో, నా దగ్గరో, లేకపోతే ప్రణీత దగ్గరో ఉంటేనే తనకు బావుంటుంది’’ పావని చెప్పింది.
‘‘నిజమే కానీ ఎలాంటి నిర్ణయమైనా అమ్మ ఇపుడు తీసుకునే పరిస్థితిలో లేదేమో చిన్నక్కా!’’ చెప్పింది ప్రణీత.
‘‘నీకన్నీ నిదానమే చెల్లీ! ప్రతి విషయానికీ మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే ఎలా?!’’ విసుగ్గా చెప్పింది పావని.
‘‘అది కాదు పెద్దక్కా! నాన్నగారు చనిపోయి ఇవాళ్టికి పదకొండో రోజంతే. చుట్టాలంతా ఇవాళే వెళ్ళారు. వాళ్ళున్నంతసేపూ అమ్మ ఏడుస్తున్నా వాళ్ళందరి ఓదార్పుతోనూ కొంచెం సేద తీరింది. ఇపుడు పిన్ని తప్ప ఎవరూ లేరు. తను కూడా దగ్గరి ఊరే కాబట్టి వెళ్ళేందుకు త్వరపడదు. తనకు నాన్నగారి మరణమే పెద్ద షాక్. నాన్నగారు లేని లోటును అలవాటు పడేందుకు కొంచెం కూడా టైమంటూ ఇవ్వకుండా ఇలాంటి విషయాలు మాట్లాడితే అమ్మ మరింతగా డీలా పడిపోదూ?!’’ అడిగింది ప్రణీత.
‘‘ఇప్పుడు చెప్పొచ్చు, అప్పుడు చెప్పొచ్చు అని అలా వాయిదాలు వేసే కొద్దీ టైం ముందుకు పరుగు పెడుతూనే వుంటుంది ప్రణీతా! పెద్దక్కా, అవన్నీ నేను ఆలోచించలేను కానీ అమ్మతో ఏ విషయమైనా మాట్లాడేందుకు ఇదే మంచి సమయం’’ కుండ బద్దలు కొట్టింది పావని.
ప్రియ, ప్రణీత ముఖాముఖాలు చూసుకున్నారు. వాళ్ళిద్దరికీ పావని సంగతి తెలియనిది కాదు. తను అనుకున్నదే తడవుగా ఆ పనీ ఆఘమేఘాలమీద పూర్తికావలసిందే! ఓ నిర్ణయం తీసుకుందంటే అది తప్పనిసరిగా తక్షణం నెరవేరవలసిందే!
‘‘మీకు మాట్లాడ్డానికి ఇబ్బందయితే నేనొక్కదానే్న అమ్మతో మాట్లాడేస్తాను. కానీ విషయం మీక్కూడా తెలియాలి కాబట్టి మీకు చెబుతున్నా. ఇదివరకు మేము అద్దె ఇంట్లో ఉండేటప్పుడు ఇల్లు ఇరుకు కావడంవల్ల మాకు ఎగస్ట్రాగా ఉన్న డబుల్ కాట్, సోఫాసెట్, గాడ్రెజ్ బీరువా ఈ ఇంట్లో ఉంచాం. ఇపుడు నాన్నగారు లేరు కాబట్టి, అమ్మ మనలో ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది కాబట్టి వాటితో ఇక అమ్మకు అవసరం ఉండదు. ఇపుడు మా సొంత ఇంట్లోకి వెళ్లిపోయాం కదా. వాటిని నేను తీసుకునిపోతాను.
మిగతా ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు.
వారి వౌనాన్ని కొద్ది క్షణాలు మాత్రమే భరించిన పావని మళ్లీ తనే చెప్పింది. ‘‘అమ్మకు చంద్రహారం నేనే చేయించాను. ఇప్పుడది తనకెలాగూ పనికిరాదు కాబట్టి అది కూడా నేను తీసుకుంటాను’’.
మళ్లీ వౌనం రాజ్యమేలింది కానీ ముందుకంటే తక్కువ క్షణాలే. నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ చెప్పింది ప్రియ. ‘‘అమ్మ చేతికున్న నాలుగు గాజులూ నేను చేయించినవే. అమ్మ చేతికి రెండు గాజులుంచి మిగతావి నేను పట్టుకుని పోతాను. నల్లపూసల దండ కూడా నేను చేయించినదే. అదీ తీసుకెళ్తాను. మంగళసూత్రమున్న గొలుసును చెడగొట్టి మామూలుగా చేయిస్తే సరిపోతుంది. అమ్మ అది వేసుకుంటుంది. దాన్ని నాన్నగారే చేయించినట్టున్నారు’’.
ప్రణీత మరేమీ మాట్లాడలేదు. కానీ ఆమె ఇద్దరక్కలూ ఏదో ఒకటి మాట్లాడు అన్నట్టుగా చూస్తోంటే ఇక తప్పదన్నట్టుగా నోరు విప్పిందామె. ‘‘మీ ఇద్దరూ నాకంటే పెద్దవాళ్లక్కా! పైగా మీ ఇద్దరికీ చదువులు అయిపోగానే మంచి ఉద్యోగాలు వచ్చేసాయి. నాకు పెళ్ళయిన రెండేళ్లకి కానీ ఏదో చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం దొరికింది కాదు. ఇప్పటికీ నా సంపాదన అంతంత మాత్రమే. మా ఆయనది కూడా చిన్నపాటి ఉద్యోగమే. అమ్మకు మీరు బంగారం కొనగలిగారు. నేను కొనలేదు. ఇపుడు మీరు తీసుకుపోతామంటే అది మీ ఇష్టం. నాకేమీ అభ్యంతరం లేదు’’.
ప్రణీత మాటలు విన్న ప్రియ, పావనిల కళ్ళు మెరిసాయి. తమ తోబుట్టువు ఏమీ అభ్యంతరం చెప్పకపోవడంతో వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
‘‘మరి ఇల్లు ఏం చేద్దాం?’’ పావని అడిగింది.
‘‘ఇంకా అమ్మ ఎక్కడ ఉంటుందో నిర్ణయించుకోలేదు కదా పావనీ? అపుడే ఎందుకు తొందర?’’ ప్రియ అడిగింది.
‘‘తొందరపాటేమీ కాదక్కా. అమ్మ ఇంత పెద్ద ఇంటిలో ఎలాగూ ఒంటరిగా ఉండలేదు. అందువల్ల త్వరగా ఈ ఇంటిని అమ్మేసి మనం ఎవరి వాటా వాళ్ళు తీసేసుకుంటే అందరికీ హాయిగా ఉంటుంది. తరవాత ఎలాంటి తగవులూ మనమధ్య రావు’’ ఎక్కడా తొట్రుపాటు లేకుండా చెప్పింది పావని.
రెండు మూడు రోజులాగి అమ్మను ఎలాగో ఒప్పించి మా ఇంటికి తీసుకెళ్తాను. అక్కడ తను అలవాటుపడుతుందో లేదో చూద్దాం. లేదంటే ఆ తర్వాత మీ ఇద్దరి ఇళ్ళలోనూ కూడా అమ్మను ఉంచి చూద్దాం. ఎక్కడైనా ఉండగలను ఫర్వాలేదని అమ్మ అంటే అపుడు ఇంటి అమ్మకం సంగతి ఆలోచిద్దాం’’ వివరంగా చెప్పింది ప్రియ.
అనుకున్నట్టుగా తల్లి రాఘవమ్మను తన ఇంటికి తీసుకెళ్లింది ప్రియ. అక్కడ రాఘవమ్మ వారం రోజులకంటే ఎక్కువ ఉండలేకపోయింది. కూతురు, అల్లుడు వాళ్ళ ఉద్యోగాలకూ, పిల్లలు బడులకూ వెళ్లిపోయాక ఆమెకు ఏమీ తోచేది కాదు. అదే ఊళ్ళో ఇల్లైనా సరే ఆమెకు ఆ ఇంట్లో కొత్తగా అనిపించి ఉండేందుకు మనస్కరించలేదు.
ఓరోజు సాయంత్రం ప్రియ ఆఫీసు నుండి వచ్చాక అడిగింది రాఘవమ్మ. ‘‘ప్రియా! నేనిక్కడ ఉండలేకపోతున్నా. మా ఇంటికి తీసుకుపోవా?’’ ప్రశ్న పూర్తికాకముందే ఆమె కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.
‘‘ఇక్కడే ఉంటే నీకు, మాకు కూడా బావుంటుందేమో అమ్మా. పిల్లలకు కూడా నీవిక్కడికి రావడం బావుంది’’ తల్లిని ఆపే ప్రయత్నం చేస్తూ అంది ప్రియ.
‘‘పిల్లలు మాత్రం ఇంటిపట్టున ఎప్పుడుంటున్నారు చెప్పు? ఉదయానే్న ఆటోలో వెళ్ళడం, సాయంత్రం వచ్చి పట్టుమని పది నిమిషాలు కూడా గడవకుండానే ట్యూషన్‌కి అని చెప్పి వెళ్లిపోవడం, ఎపుడో తొమ్మిదిన్నరకి ఇంటికి చేరడం, అన్నం తినడం, పడుకోవడం. ఇంక వాళ్ళకు మాత్రం నాతో గడిపే టైం ఎక్కడుంటోంది చెప్పు?’’ చెప్పింది రాఘవమ్మ.
తల్లి మాటలకు కాసేపు ఏమని జవాబు చెప్పాలో అర్థం కాలేదు ప్రియకు. కాసేపటికి చెప్పిందామె తల్లితో. ‘‘నీ ఇష్టమమ్మా. రేపు ఇంటికి తీసుకెళ్లి విడిచిపెడతానులే’’.
తల్లితోపాటుగా మర్నాడు ఇంటికొచ్చింది పావని. లోపలికెళ్లగానే ఒక్కసారిగా బావురుమంది రాఘవమ్మ. అప్పటికే అక్కడికి చేరుకున్న పావని, ప్రణీత కూడా ప్రియతోపాటు తల్లిని ఊరుకోబెట్టారు. రాఘవమ్మను ఓదార్చడానికి వాళ్ళకు దాదాపు అరగంటసేపు పట్టింది.
‘‘నేను కాసేపు పడుకుంటానమ్మా. మీరిక వెళ్ళండి’’ చెప్పింది రాఘవమ్మ.
‘‘నేనివాళ సెలవు పెట్టానమ్మా. వంట చేసి మధ్యాహ్నం నువ్వు తిన్నాక వెళ్తాను’’ చెప్పింది ప్రణీత.
‘సరే’ అన్నట్టుగా తలూపి నడుం వాల్చింది రాఘవమ్మ.
వరండాలో కూర్చుని ముగ్గురు అక్కాచెల్లెళ్ళూ సమావేశమయ్యారు.
‘‘అమ్మను నా దగ్గర ఉంచుకుందామనుకుంటున్నాను అక్కా!’’ సంభాషణకు తెరతీస్తూ చెప్పింది పావని.
‘‘తను వస్తానంటే తీసుకెళ్ళు. మా ఇంట్లో తను ఎడ్జెస్ట్ కాలేకపోయిందిరా!’’ చెప్పింది ప్రియ.
‘‘కాకపోతే మా ఆర్థిక పరిస్థితి మీ ఇద్దరికీ తెలియనిది కాదు కదా! ఆయన అమ్మ పెన్షన్ కూడా మనం వాడుకుంటే కానీ ఇల్లు గడవదని అంటున్నారు’’ అసలు విషయం బైటపెట్టింది పావని, మిగతా ఇద్దరివైపూ చూస్తూ.
ప్రియ ఏమీ మాట్లాడలేదు. ప్రణీత నోరు విప్పింది. ‘బావగారే అలా అన్నారా, లేకపోతే ఇది నీ ఆలోచనా?!’’
‘‘నీకన్నీ లేనిపోని అనుమానాలే ప్రణీతా! ఆయన అంటేనేగా నేను మీతో చెప్పేది?! పెళ్లయ్యాక మనం వాళ్ళ మాటే కదా వినాలి. అమ్మను బాగా చూసుకోవాలని నాకు మాత్రం ఉండదా!’’ కస్సుమంది పావని.
‘‘మామూలుగా అడిగిందిలే పావనీ! కోపం తెచ్చుకోకు’’ సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది ప్రియ.
‘‘మీరిద్దరూ పెద్దవాళ్ళు. ఎపుడూ నేనిదే చెప్తాను. ఏం చెయ్యాలో మీరే నిర్ణయించుకోండి’’ ముక్తసరిగా చెప్పింది ప్రణీత
‘‘ఓ పని చేద్దాం పావనీ! పెన్షన్లో సగం నువ్వు తీసుకో, మిగతా సగం మేమిద్దరం పంచుకుంటాం’’ తీర్పు చెప్పింది ప్రియ.
‘‘సరే, ఆయనేమంటారో మరి! చెప్పి చూస్తాను. ఆయన నిర్ణయాన్ని బట్టి మనం ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. నాకు ఆఫీసుకు టైం అయిపోయింది. అమ్మ పడుకున్నట్టుంది. నేను వెళ్లిపోయినట్టు తనకు చెప్పెయ్యండి..’’ అని వెళ్ళడానికి లేచింది పావని.
‘‘ఆగు, నేనూ వచ్చేస్తాను, నాకూ పనుంది’’ అని తనూ లేచింది ప్రియ.
‘‘ఒక్క నిమిషం’’ అంటూ లోపలినుండి వినిపించిన తల్లి మాటలకు లోపలికి చూసారు ముగ్గురూ.
‘‘పావనీ, ప్రియా! నా బాగోగుల గురించి మీరు చేస్తున్న ఆలోచనలన్నీ మొన్నటినుండీ వింటూనే ఉన్నాను. నాన్నగారితోపాటుగా ఈ ఇంట్లో నాది నలభయ్యేళ్ళ అనుబంధం. ఆ గదిలో మంచం మీద పడుకున్నట్టుగానో, హాల్లో పడక కుర్చీలో కూర్చుని టీవీ చూస్తున్నట్టుగానో, వంటింటి ఫ్రిజ్ దగ్గరకొచ్చి తినడానికి ఏదైనా కావాలని అడిగినట్టుగానో ఆయన నా ఊహల్లోకొస్తూనే ఉంటారు. ఒక్కోసారైతే ఎదురుగా కనిపిస్తున్నట్టే ఉంటుంది. మీరు ముగ్గురూ పుట్టింది ఈ ఇంట్లోనే. ‘నువ్వెక్కడికీ వెళ్ళొద్దు. నిన్ను నేనే చూసుకుంటానుగా’ అని చెప్పి మీరు కడుపులో పడింది మొదలు కానుపు అయ్యేవరకూ కూడా అపురూపంగా చూసుకున్న మీ నాన్నగారి జ్ఞాపకాలన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి. నేను బ్రతికే కొద్దికాలమూ ఆ జ్ఞాపకాలతోనే జీవిస్తాను. దయచేసి అందుకు నాకు సహకరించండి.
మీకు ఏమేం వస్తువులు కావాలో మీరు ఇవ్వాళే తీసుకుపోండి. దానికి ప్రతిఫలంగా మీ దగ్గరుంచుకుని నన్ను పోషించవలసిన పనిలేదు. కానీ చిన్నమాట. ప్రణీత నోరు లేనిది. మీ ఇద్దరిలాగా అది బ్రతకనేర్చింది కాదు. ఏది తీసుకున్నా దానికి భాగం ఇవ్వండి. మీకు ఈ అమ్మ మీద గౌరవం ఉంటే ఆ పని చెయ్యండి.
ఆస్తి పంపకాలకోసం నేను పోయేదాకా ఆగండి. అది ఎలా చెయ్యాలో నన్ను ఆలోచించుకోనివ్వండి. మీ నాన్నగారితో నా నలభై నాలుగేళ్ళ సాహచర్య పర్యవసానంగా నాకు దక్కిన ప్రతిఫలం ఆయన పెన్షన్. ఒంటరిగానైనా నా బ్రతుకును నేను నెట్టుకురాగలనన్న దైర్యాన్నిచ్చేది కూడా అదే! కాబట్టి దాన్ని నా ఊపిరితో పాటే ఆగనివ్వండి.
ఆయనకూ నాకూ ఈ ఇంటికీ ఉన్న అనుబంధాన్ని మీ సొంత నిర్ణయాలతో బలవంతంగా తెంపే ప్రయత్నాలు చెయ్యకండి. నన్నిలా బ్రతకనివ్వండి చాలు’’ రెండు చేతులూ ఎత్తి నమస్కరించి కన్నీళ్ళు పొంగుకుని రాగా ఏడుస్తూ లోపలికి వెళ్లిపోయింది రాఘవమ్మ! *
రచయిత సెల్ నెం: 9700467675

-రాజేష్ యాళ్ళ 9700467675