కథ

మాధవరావా.. మజాకానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో
ఎంపికైన రచన

స్ గదిలోకి అడుగుపెట్టబోతున్న వాడల్లా అనుకోకుండా లోపలి నుండి బాస్ మాటల్లో తన పేరు వినపడటంతో అక్కడే ఆగిపోయాడు మాధవరావు.
‘ఏమోయ్ గుర్నాథం.. ఈసారి ఆ అమెరికా ప్రాజెక్టు పని మీద నిన్ను, నీతోపాటు రాంబాబుని పంపుదామనుకొంటున్నాను.. ఏమంటావ్ నువ్వు..?’
‘పాపం మాధవరావు ఎప్పటి నుండో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు కదా సార్.. ఈసారికి నాతోపాటు తనని పంపిస్తే బావుంటుందేమో...’
‘బాగానే ఉంటుందయ్యా.. హార్డ్ వర్క్ కూడా చేస్తాడు. కానీ.. అతన్ని పంపిస్తే ఇక్కడ ఆఫీస్ పనులు, నా పర్సనల్ పనులు ఎవరు చేస్తారు? ఏ పని చెప్పినా మా ఇంటి మనిషిలా, తన సొంత పని అన్నంత శ్రద్ధగా చేసి పెడతాడాయె. అలాంటి వాడిని ఎలా పంపించమంటావు.. మాధవరావు లేకపోతే నాకిక్కడ చాలా ఇబ్బంది కదా...’
బాస్ మాటలు వినేసరికి తల గిర్రున తిరిగినట్లైంది. తర్వాత మాటలు వినాలనిపించక మెల్లగా క్యాంటీన్ వైపు వెళ్లాడు. నీరసంగా కుర్చీలో కూర్చుని కాఫీ ఆర్డరిచ్చాడు.
హమ్మ బాసూ..! ఎంత నాటకమాడుతున్నావు.. నాలుగేళ్ల క్రితం అమెరికా ఛాన్సు వస్తే వెళ్తావటోయ్.. అని నాలో లేనిపోని ఆశలు కల్పించి ‘ఇదిగో.. అదుగో’ అని ఊరిస్తూ నా చేత అడ్డమైన పన్లన్నీ చేయించుకొంటూ, వచ్చిన అవకాశాలన్నీ నా దాకా రాకుండా చేస్తున్నావన్నమాట. నీ స్వార్థం కోసం నా కెరీర్ మీదే దెబ్బకొడతావా.. ఇన్నాళ్లు నన్నో పిచ్చి వెధవని చేసి ఆడించావన్నమాట. నీ కళ్లకి నేనొక ‘వెర్రిపప్ప’లాగానో ‘బకరా’గాడి లాగానో కనిపిస్తున్నానన్నమాట.
ఉండు ఉండు.. ఇప్పుడేగా నీ అసలు రంగు బయటపడింది. ఇక ముందు ముందు చూపిస్తా నేవేంటో.. నా తఢాకా ఏమిటో...
కోపం కొద్దీ ఆవేశంగా ఏదేదో చెయ్యాలని అనుకున్నాడే కాని ఏం చెయ్యాలో, బాస్‌కి ఎలా బుద్ధి చెప్పాలో అర్థం కాలేదు. నాలుగు రోజులపాటు ఇదే ఆలోచనతో ఉండి ఆఫీస్‌లో కూడా ఎవ్వరితో సరిగా మాట్లాడక మూడీగా ఉండిపోయాడు. వర్క్ కూడా చెయ్యబుద్ధికాక రెండ్రోజులు లీవ్ అడుగుదామని బాస్ బ్రహ్మానందం దగ్గరికి వెళ్లాడు.
‘ఏంటోయ్.. అలా డల్‌గా ఉన్నావు. ఒంట్లో బాగోలేదా ఏమిటీ..?’ మాధవరావు వాలకం చూడగానే అడిగాడు బాసు.
‘అవున్సార్.. రెండు మూడు రోజుల్నుండి ఒకటే ఒళ్లు నొప్పులు.. కొంచెం జ్వరం కూడా ఉన్నట్లుంది. అందుకనే రెండ్రోజులు లీవ్ అడుగుదామని వచ్చాను’
‘ముందు ఆరోగ్యం బాగా చూసుకోవాలయ్యా. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. అసలే ఫారిన్ వెళ్లాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తుంటివి.. ఈసారి కూడా లిస్టులో నీ పేర ఉన్నట్లుంది...’
విషయమంతా మాధవరావుకి తెలిసిపోయిందని తెలియక మళ్లీ తాయిలం ఎరవేశాడు పాపం. ఆ మాటలకి మాధవరావుకి ఒళ్లు మండిపోయింది. పుండు మీద కారం రాసినట్లైంది.
‘ఆఁ నాకు ఛాన్సు వచ్చినప్పటి మాట కదా సార్.. లిస్టులో నాలుగేళ్ల నుండి నా పేరు ఉంటూనే ఉంది. ఏదీ.. ఇంతవరకు అమెరికా వెళ్లే ఛాన్సు రాలేదు కదా. ఈసారైనా వస్తుందన్న గ్యారంటీ లేదు. ఐనా.. నా పిచ్చి కాకపోతే వడ్డించేవాడు మనవాడైతే భోజనాల్లో ఎక్కడ కూర్చున్నా ఒకటే కదండి...’ చివరి మాటలంటున్నప్పుడు సూటిగా బాస్ వంక చూశాడు.
ఎక్కడో తగలరాని చోట తగిలినట్లనిపించి కాస్త కంగారుపడ్డాడు బాసు బ్రహ్మానందం.
తన కంగారు కనపడనీయకుండా ఓ క్షణం బట్టబుర్ర మీద గోక్కుని ‘ఓకె.. లీవ్ శాంక్షన్డ్.. యుకెన్ గో..’ అన్నాడు మరో మాటకి అవకాశమివ్వకుండా.
లీవు రెండ్రోజులవు, శని, ఆదివారాలు కలిపి నాలుగు రోజులు బెడ్‌రూంలో పడుకొని సీలింగ్ ఫ్యాన్ వంక చూస్తూ తెగ ఆలోచించాడు. చించగా.. చించగా.. నాలుగో రోజుకి ఏదో ఐడియా తట్టి మంచం మీద ఎగిరి కూర్చుని ‘యురేకా...’ అని పెద్దగా అరవబోయి ఎవరైనా వింటే బాగోదని తమాయించుకున్నాడు.
వారం రోజుల తర్వాత ఓ రోజు ప్యూన్ వచ్చి బాస్ పిలుస్తున్నారంటే ఎందుకోననుకుంటూ వెళ్లాడు.
‘రావోయ్ మాధవా..! కూర్చో..’
‘ఏం బాసూ.. ఏంటి కత? ఇంత ప్రేమగా పిలుస్తున్నావంటే ఏదో పర్సనల్ మేటరేనని అర్థమయిందిలే. నీ సంగతి నాకేం కొత్త కాదు కదా.. ఇలా పిలిచేగా నాలుగేళ్ల నుండి అమెరికా తాయిలం చూపించి నాచేత అడ్డమైన పన్లన్నీ చేయించుకుంటున్నావు.. ఊ... కానీ.. ఇప్పుడు కూడా విషయమేమిటో త్వరగా చెప్పు...
‘హిహిహి.. పిలిచారట..’ తనలోని భావాలు బయటపడనీయకుండా సదా మీ సేవకే అంకితం అన్నట్లు మోస్టు ఒబీడియెంట్ ఫెలోలా చేతులు కట్టుకొని ఎయిరిండియా సింబల్‌లా అతి వినయంగా నిలబడ్డాడు.
‘ఏం లేదోయ్... మా అమ్మాయి మామగారు హెల్త్ చెకప్ కోసమని వస్తున్నారు. పోయిన సారి కూడా వాళ్లని నువ్వే తీసుకొచ్చావు కదా.. ఈసారి కూడా నా కారు తీసుకొని స్టేషన్‌కి వెళ్లి వాళ్లని పికప్ చేసుకురావాలి. ఇప్పుడే కాదులే.. వాళ్ల ట్రైన్ వచ్చేసరికి ఎనిమిది దాటుతుందిలే.. ఏడున్నరకల్లా నువ్వు బయల్దేరి వెళ్తే సరి...’
ఏడింటికల్లా బాస్ కారు వెనకాలే బైక్ మీద వాళ్లింటికి వెళ్లి తన మైక్‌ని అక్కడ పెట్టి బాస్ కారు తీసుకొని బయల్దేరాడు. ఎందుకనో బ్రహ్మానందానికి డ్రైవర్‌ని పెట్టుకోవటం ఇష్టం ఉండదు.
సరిగ్గా ఎనిమిదింబావుకి బాస్ దగ్గర్నుండి ఫోన్. ‘ఏమోయ్ మాధవా..! ఎక్కడున్నావింకా..? మా వియ్యంకుడు వాళ్లు ట్రైన్ దిగి నీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎంట్రెన్స్ దగ్గరే నిలబడి ఉన్నారట. కాస్త చూసుకో...’ అని.
అయ్యో.. అప్పుడే వచ్చేశారాండీ.. నేనింకా స్టేషన్‌కి చాలా దూరంలో ఉన్నానండి. ఇక్కడ ట్రాఫిక్ బాగా జామ్ అయింది. చూస్తుంటే ఇప్పట్లో క్లియరయ్యేలా లేదు. ఎటూ కదలటానికి లేకుండా మధ్యలో ఇరుక్కుపోయాను. ఈ ట్రాఫిక్ క్లియరై నేను స్టేషన్‌కి వెళ్లేసరికి ఇంకో అరగంట పట్టినా పట్టవచ్చు...’
పార్కులో బెంచీ మీద పడుకుని పున్నమి చంద్రుడ్ని చూస్తూ కాళ్లూపుకుంటూ సెల్‌ఫోన్‌లో పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నవాడల్లా బాస్ దగ్గర్నుండి ఫోన్ రావటంతో ఎంతో వినయంగా జవాబిచ్చాడు.
‘అమ్మో.. అరగంటా.. అంతసేపు వాళ్లెక్కడ వెయిట్ చేస్తారు..?’
బాస్ మొహంలో మారే ఫీలింగ్స్‌ని గుర్తు తెచ్చుకుని నవ్వుకొంటూ ‘మరిప్పుడు ననే్నం చెయ్యమంటారు సార్..? వాళ్లు వెయిట్ చేస్తామంట స్టేషన్‌కి వెళ్లి పికప్ చేసుకు వస్తాను. లేదంటే చెప్పండి రిటన్ వచ్చేస్తాను. ఐనా.. ఈ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మీకు తెలియనిదేముందండి.. ఇంకో అరగంట ముందుగా బయల్దేరాల్సింది నేను. ప్చ్.. పాపం.. వాళ్లని బాగా ఇబ్బంది పెట్టేశాను..’ తెగ బాధపడిపోతున్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు.
‘సర్లే... ఏం చేస్తాం.. వాళ్లకి విషయం చెప్పి ఏదైనా ఆటో మాట్లాడుకొని రమ్మంటానే్ల.. నువ్వు ఇంటికి వచ్చి కారిచ్చి వెళ్లు...’
‘అలాగే సర్..’ వినయంగా అంటూ పార్కులో జంటల్ని చూస్తూ ఇంకో అరగంట వెనె్నల్లో విహరించి, నిదానంగా పార్కు బయట పార్కు చేసి ఉన్న కారెక్కి బాస్ ఇంటి దారి పట్టాడు.
‘ఏమోయ్ మాధవా...! మా వియ్యంకుడు వాళ్లు వచ్చి కూడా పావుగంట పైనే అయింది. ఇంతకీ.. ఏ రోడ్డులో వెళ్లావేంటి..?’ మాధవరావుని చూడగానే కోపంగా అన్నాడు.
‘కాస్త దగ్గర దారని. ట్రాఫిక్ కూడా అంత ఎక్కువగా ఉండదని సందులు, గొందులు ఉన్నా సరే అటైతే త్వరగా వెళ్లొచ్చని ఆ దారిన వెళ్లానండి. తీరా వెళ్తే నా ఖర్మకొద్దీ ఈ రోజు ఇలా జరిగింది...’ అంటూ నోటికొచ్చిన ఏదో రూట్ పేరు చెప్పి...
‘సారీ సర్.. ఎప్పుడూ లేనిది ఇవాళే ఇలా జరిగింది. నా మూలంగా మీ వాళ్లకి చాలా ఇబ్బంది కలిగింది. ఏమనుకున్నారో ఏమో... కాస్త బయటకి పిలవండి సర్ అపాలజీ చెప్పుకుంటాను.. లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఈ రాత్రికి నిద్ర కూడా పట్టదు...’
ఎంతగానో ఫీలైపోతున్న మాధవరావుని చూసి ‘సర్లే.. సర్లే.. ట్రాఫిక్ జాం అయితే నువ్వు మాత్రం ఏం చేస్తావ్.. ఎవరో అయితే నేను కూడా అంతగా పట్టించుకునే వాడ్ని కాదు. ఎటొచ్చి అమ్మాయి వాళ్ల అత్తమామలైతిరి.. అందుకే కాస్త బాధ అనిపించింది. సర్లే కాని.. వాళ్లు ఫ్రెషప్ అవుతున్నారు. చాలా పొద్దుపోయింది. ఇక నువ్వు ఇంటికి వెళ్లు...’ అన్నాడు కాస్త శాంతంగా.
కారు కీస్ ఇచ్చి బైక్ తీసుకుని బాస్ ఇంటి సందు మలుపు తిరిగాక ‘యాహూ...’ అని అరుస్తూ బైక్ మీద లేచి నిలబడి కాసేపు డాన్స్ చేసి విజిలేసుకొంటూ ఇంటికి బయల్దేరాడు.
‘తిక్క కుదిరింది. వియ్యంకుడి ముందు తలెత్తుకోలేకుండా చేశాను..’ అని నవ్వుకున్నాడు.
శనివారం.. తాపీగా నిద్ర లేచి భార్య భారతి వేడివేడిగా పూరీలు చేసి పెడుతుంటే తింటూ పిల్లలతో సరదాగా కబుర్లు చెబుతున్నాడు.
ఇంతలో పంటికింద రాయిలా బాస్ దగ్గర్నుండి ఫోన్.
‘ఏమోయ్ మాధవా...! ఈ రోజు ఫ్రీయే కదా.. ఏం లేదు.. కాస్త నా కారు సర్వీసింగ్‌కి ఇచ్చి వస్తావని చేశానే్ల.. నేనే వెళ్దామనుకున్నా కాని.. కొంచెం హెడేక్‌గా ఉంది. అందుకని...’
హెడేకా.. నా పిండాకూడా.. చేసి పెట్టే వాళ్లుంటే ఏ పనైనా చేయించుకోవూ... నీ సంగతి నాకు తెలియందేముంది అనుకొంటూ ‘అయ్యో.. మా బంధువుల ఇంట్లో పెళ్లైతే నిన్న రాత్రే ఫ్యామిలీతో బయల్దేరి గుంటూరు వచ్చానండి.. నిన్న సాయంత్రం మీరు ఈ సంగతి చెప్పినా ఇచ్చి వచ్చేవాడిని..’ నొచ్చుకుంటున్నట్లుగా అన్నాడు.
‘రేపు ఉదయానికి వస్తారా..?’
‘లేదండి.. రేపు రాత్రికి కాని రాము..’ ప్లేట్‌లో ఉన్న పూరీ ముక్కలో కూర పెట్టుకుని నోట్లో వేసుకుంటూ అన్నాడు.
‘గుంటూరు పేరు వినగానే గోంగూర గుర్తొచ్చి నోరూరిపోతుందోయ్.. వీలైతే వచ్చేటప్పుడు కాస్త గోంగూర పచ్చడి, ఆ చేత్తోటే కాస్తంత ఆవకాయ కూడా పట్రావోయ్...’
‘మీరంతగా అడిగాక తీసుకురాకుండా ఎలా ఉంటానండి.. తప్పకుండా తెస్తాను..’ అతి వినయంగా సమాధానం చెప్పి ఫోన్ ఆఫ్ చేసి ‘్ఛఛీ.. ఫ్రీగా వస్తే ఫినాయిలేం ఖర్మ తేరగా వస్తుందంటే తారు కూడా తాగుతాడు.. ఒఠ్ఠి సోంబేరి మొహం. పొద్దునే్న మూడంతా పాడు చేశాడు..’ కోపంగా సెల్‌ని సోఫాలోకి విసిరేశాడు.
‘ఎవరండీ ఫోన్ చేసింది..’ భర్త కోపం చూసి అడిగింది భారతి.
‘మా బాసు బకాసురుడు. ఇంట్లో మెక్కేది చాలక సెలవు రోజు కూడా నన్నిలా పీక్కుతింటున్నాడు..’ అంటూ విషయమంతా చెప్పాడు.
అంతా విని పకపక నవ్వి ‘ఎటూ సెలవే కదా.. వెళ్లి ఆ కారేదో గ్యారేజీలో ఇచ్చి వస్తే పోయేదానికి ఒక చిన్న అబద్ధానికి చూడండి ఒక కేజీ గోంగూర పచ్చడికి, కేజీ ఆవకాయకి మీ జేబుకి చిల్లు.. తప్పేముంది. బజారెళ్లినప్పుడు రుచిదో, ప్రియా కంపెనీదో కొనుక్కురండి. ప్యాకింగులు మార్చి వేరే ప్యాక్ చేసి ఇస్తాను. సోమవారం తీసికెళ్లి మీ బాస్‌కి నైవేద్యం సమర్పిద్దురు...’ అన్నది.
‘ఆఁ నాకింకేం పనిలేదు... ఆయన అడిగినవన్నీ తీసికెళ్లి సమర్పించటానికి నేనేం కుబేరుణ్ని కాను. ఛీఛీ... సెలవు రోజున కూడా సంతోషంగా ఉండనివ్వకుండా జలగలా పట్టుకుంటాడు.. ఏం మనిషో ఏమో..’ ఓ చిన్న అబద్ధానికే భార్య ముందు అలా బుక్కైపోయినందుకు బాసు మీద చిరాకుపడ్డాడు.
ఆ రోజు రాత్రంతా ఆలోచించి, ఆలోచించి మర్నాడు ఉదయాన ఎప్పటిలాగే ఆఫీస్‌కి వెళ్లాడు. ఒఠ్ఠి చేతుల్తో వచ్చిన తనవైపు బాసు గుర్రుగా చూడటం గమనించి, ‘సారీ సర్.. నిన్న మీరు ఫోన్ చేసిన తర్వాత మా తాతగారికి సీరియస్‌గా ఉందని ఫోన్ వచ్చింది. దాంతో పెళ్లి కూడా చూడకుండానే అందరం తాతయ్యగారి ఊరు వెళ్లాం. ఆ హడావిడిలో మీరడిగిన పచ్చళ్లు తీసుకురావటం కుదరలేదండి.. ఈసారి మా వాళ్లెవరైనా వస్తుంటే తప్పకుండా తెప్పిస్తానండి...’
‘అరరె.. ఇప్పుడెలా ఉందయ్యా మీ తాతగారికి..?’
‘ప్రస్తుతం ఐసియులో ఉంచారండి. రెండ్రోజులు గడిస్తే కాని ఏ విషయం చెప్పలేమన్నారు. మా వాళ్లంతా ఇప్పుడు అక్కడే ఉన్నారు...’ దీనంగా మొహం పెట్టి పదేళ్ల క్రితమే పాస్‌పోర్ట్, వీసా లేకుండా పైలోకాలకెళ్లిపోయిన తాతగారిని ఆఫ్ట్రాల్ ఆవకాయ, గోంగూర పచ్చళ్ల నుండి తప్పించుకోవటానికి ఈ లోకంలోకి తీసుకొచ్చాడు.
ఆ రోజు శుక్రవారం. ఫైల్ మీద సంతకం పెట్టి తిరిగి ఇచ్చేస్తు ‘చూడు మాధవా! సాయంత్రం ఓసారి మా ఇంటికి వెళ్లు. మా అమ్మ మా వాడి కోసమని లడ్లు, అరిసెలు, జంతికలు వండి ఉంచింది. ఈ రోజు మా వాడి ఫ్రెండ్ రాజేష్ వైజాగ్ నుండి బయల్దేరి ముంబయి వెళ్తున్నాడట. ఆ ట్రైను ఇక్కడికి వచ్చేసరికి పది, పదిన్నర అవుతుంది. ఈలోపు నువ్వు వండినవన్ని తీసికెళ్లి ప్యాక్ చేయించి స్టేషన్‌కి వెళ్లి వాటిని రాజేష్‌కి ఇచ్చి రావాలి. ఆ ట్రైన్ ఇక్కడ చాలాసేపు ఆగుతుందిలే. కంగారేం లేదు..’ అంటూ రాజేష్ ఫోన్ నెంబర్, బోగీ నెంబర్, ట్రైన్ పేరు, నెంబర్ ఇచ్చాడు.
బాస్‌గారి పుత్రరత్నం ముంబయి ఐఐటిలో ఎంటెక్ చేస్తున్నాడు.
‘నా కారు తీసుకెళ్లు...’
‘వద్దు లెండి. కారైతే ట్రాఫిక్‌లో కష్టం. నా బైక్ మీదే వెళ్తాను’
ఎంతో బుద్ధిమంతుడిలా రాత్రి ఎనిమిదిన్నరకల్లా బాస్ ఇంటికి వెళ్లి స్వీట్స్ తీసుకొని బయల్దేరాడు.
పదిన్నరకి ఫోన్ రింగవడంతో నంబర్ చూసి భార్య చేతికిచ్చాడు.
‘హలో ఎవరండీ..? నేను మాధవరావుగారి భార్యను..’
‘కొంపదీసి ఈ మాధవరావు ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్లలేదు కదా..’ అనుకొంటూ ‘మాధవరావు లేడామ్మా? నేను వాళ్ల బాస్‌ని..’ సౌమ్యంగా అడిగాడు.
‘నమస్కారమండీ.. మీ పని మీదే స్టేషన్‌కి వెళ్లాలని ఇంట్లో నుండి ఎనిమిదింటికే బయల్దేరి వెళ్లారు. పది నిమిషాల క్రితం ఫోన్ వస్తే నేను హాస్పిటల్‌కి వచ్చానండి..’
ఆమె మాటల్లో ఏడుపు జీర వినిపించి ‘అదేవిటమ్మా హాస్పిటల్ అంటున్నావు.. ఏం జరిగింది?’ ఆదుర్దాగా అడిగారు.
‘ఏం చెప్పమంటారండీ.. ఎవరిదో కారు రాంగ్ రూట్‌లో వచ్చి ఈయనగారి బైక్‌ని గుద్దేసిందట. ఈయన ఎగిరి రోడ్డు మీద అంత దూరాన పడితే ఎవరో పుణ్యాత్ములు చూసి హాస్పిటల్లో చేర్పించి నాకు ఫోన్ చేశారు..’ ముక్కు ఎగపీలుస్తూ ఏడుపు గొంతుతో జరిగింది చెప్పింది.
‘అరరె... ఎంత పని జరిగింది? దెబ్బలేమైనా తగిలాయా.. ఇప్పుడెలా ఉన్నాడమ్మా..?’
‘ఎడమకాలికి, ఎడమ మోచేతికి, నుదుటి మీద దెబ్బలు తగిలాయండి. ఏదో మా అదృష్టం బాగుండబట్టి సరిపోయింది కాని ఏదైనా జరగరానిది జరిగితే నేను, నా పిల్లలు ఏమైపోయే వాళ్లమో... ఇప్పుడే గాయాలు క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేయటానికని లోపలికి తీసికెళ్లారు...’ భర్త ముందుగానే చెప్పిన డైలాగుల్ని తు.చ తప్పకుండా చెప్పింది.
‘అదృష్టవంతుడు. తేలికగా బైటపడ్డాడు.. ఇంతకీ మా ఇంట్లో తీసికెళ్లిన పార్సిల్ సంగతి ఏమైనా తెలుసామ్మా..’ అడగలేక అడిగాడు.
‘స్వీట్స్ పార్సిల్ గురించాండీ.. అది కూడా అంతెత్తున ఎగిరి పడటంతో పార్సిల్ ఓపెన్ అయి స్వీట్సన్నీ రోడ్డు నిండా చిందరవందరగా పడిపోయాయట...’
ఇక వినలేక ఫోన్ పెట్టేశాడు బ్రహ్మానందం.
అప్పటివరకు సోఫాలో భార్య ఒడిలో తలపెట్టుకొని పడుకొని బాస్‌గారి లడ్డూ టేస్టుని ఎంజాయ్ చేస్తూ వచ్చే నవ్వుని బలవంతాన ఆపుకొంటున్న వాడల్లా లేచి డాన్సు చేయటం మొదలెట్టాడు.
‘పాపమేమోనండి..’ భర్త ఆనందం చూసి అన్నది భారతి.
‘పాపమా.. నా పిండాకూడా.. నాలుగేళ్ల నుండి కేవలం తన సొంత పనుల కోసం నన్ను అమెరికా వెళ్లనీయకుండా ఆపుతున్నాడంటే నాకెట్లా ఉంటుంది.. మొన్నటి దాకా విషయం తెలియలేదు. నిజం తెలిశాక నాకెంత మండుతుందో ఆలోచించుకో... అప్పుడే ఏమైంది. ఇంకా ముందు ముందు చూపిస్తా సినిమా..’ చేస్తున్న డాన్స్ ఆపి సీరియస్‌గా అన్నాడు.
సోమవారం ఒక చేతికి, పాదానికి కట్టుకట్టుకొని, నుదుటి మీద ప్లస్ మార్కు ప్లాస్టర్ వేసుకొని కాస్త కుంటుకుంటూ ఆఫీస్‌కి వచ్చాడు.
‘అరెరె... అదేంటోయ్ ఈ పరిస్థితిలో ఉండి కూడా ఆఫీస్‌కి వచ్చావు... ఓ నాలుగు రోజులు రెస్టు తీసుకోక..’ కంగారుగా అన్నాడు బాస్.
‘్ఫర్లేదు సార్.. పెయిన్ కిల్లర్స్ వాడుతున్నానుగా. కాస్త నొప్పులు తగ్గాయి. ఈ రోజే డ్రెస్సింగ్ మార్పించుకొని వచ్చాను. ఐయామ్ వెరీ సారీ సర్... ఇలా జరుగుతుందనుకోలేదు. నా మూలంగా మీ అమ్మగారు ఎంతో కష్టపడి చేసిచ్చిన స్వీట్లన్నీ నేలపాలయ్యాయి. కాస్త తగ్గాక మా బామ్మతో చేయించి ఈసారి ముంబయి వెళ్ళైనా సరే మీ అబ్బాయికి ఇచ్చి వస్తానండి..’
‘పోనీలేవయ్యా... ఎవరికెంతవరకు ప్రాప్తమో అంతవరకే.. నువ్వు క్షేమంగా ఉన్నావు అంతే చాలు...’
‘ఏం క్షేమమో ఏమో సార్.. ఈ సంవత్సరం నా జాతకం అంత బావున్నట్లు లేదు. నాకిలా జరిగిందని తెలిసి మా బామ్మ సిద్ధాంతిగారి దగ్గరికి వెళ్లిందట. ఆయన నా జాతకం చూసి ‘రెండు సంవత్సరాల క్రితమే మీ మనవడు విదేశాల్లో ఉండాల్సిన వాడమ్మా.. రాహువులా ఓ వ్యక్తి అడ్డం పడి వెళ్లనీయకుండా చేస్తున్నాడు. ఇంకా మీ అబ్బాయి ఇక్కడే ఉంటే మీ అబ్బాయితోపాటు అతనికి అడ్డుపడుతున్న వ్యక్తికి కూడా కొన్ని ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముందు ముందు ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి...’ అని చెప్పారట. అది విన్న దగ్గర్నుండి ఏ క్షణంలో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని క్షణక్షణం టెన్షన్‌తో ఛస్తున్నాననుకోండి...’
మొహం నిండా విషాదాన్ని నింపుకొని మూడేళ్ల క్రితమే బాల్చీ తనే్నసిన బామ్మని తన అవసరం కోసం మళ్లీ ఈ లోకంలోకి తీసుకొచ్చాడు.
‘నా చిన్నప్పటి నుండి ఆ సిద్ధాంతిగారు చెప్పింది చెప్పినట్లు తు.చ తప్పకుండా జరుగుతోంది. అందుకనే ఆయన మాటలు విన్న దగ్గర్నుండి మాకందరికీ భయం పట్టుకుంది. మా బామ్మ ఐతే ‘అందరికీ ఎంతో కొంత సాయం చేస్తూ తల్లో నాలుకలా ఉండే నీ మీద ఎవరికిరా అంత కోపం... నిన్ను విదేశాలకు వెళ్లనీయకుండా చేస్తే వాడికేం వస్తుందట.. వాడికి పోయే రోగం రానూ... వాడికి శ్రాద్ధం పెట్ట.. వాడి పిండం కాకులెత్తుకుపోను.. వాడి పెళ్లాం పిల్లలకి ఎయిడ్స్ రోగం రానూ.. చూస్తూ ఉండు.. నీ ఉసురు తగిలి వాడు ఇంతకింతా అనుభవిస్తాడు..’ అంటూ శాపనార్థాలు పెట్టింది.
ఆ తిట్లు వినలేక ఎదురుగా ఉన్న మంచినీళ్ల గ్లాసు తీసుకొని గటగటా తాగాడు బాస్.
ఊపిరి పీల్చుకోవటానికన్నట్లు ఆగి ఓరచూపుతో బాస్ మొహంలోని ఫీలింగ్స్ గమనించసాగాడు.
ఆముదం తాగినట్లు మొహం పెట్టి మిడిగుడ్లేసుకొని చూస్తున్న బాస్‌ని చూస్తుంటే నవ్వాపుకోవటం కష్టమై కావాలని సెల్‌ఫోన్ కిందకి పడేసి దాని కోసమన్నట్లు కిందకి వంగాడు.
‘నీకు అన్యాయం చేశారనుకొంటున్న వాళ్లని తిట్టాలి కాని పాపం.. వాళ్ల భార్యాపిల్లల్ని ఎందుకు తిట్టేది..?’ మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ అమాయకంగా అడిగాడు.
‘మీకు తెలియదేమోనండి.. మగవాళ్లు చేసిన పాపపుణ్యాల ఫలితం వాళ్ల కుటుంబంలో అందరికీ వర్తిస్తుందని పురాణాల్లో ఉందట.. మా బామ్మ చెప్పింది. మీరే చెప్పండి సర్.. ఇనే్నళ్లుగా నన్ను చూస్తున్నారు కదా.. ఎవరికైనా నాకు చేతనైనంతలో సాయం చేస్తానే కాని ఎప్పుడైనా కీడు తలపెట్టానా.. కల్లో కూడా ఎవ్వరికీ హాని తలపెట్టనే అలాంటి నాకు వచ్చిన అవకాశాలన్నీ నాకు దక్కకుండా చేసి నాకింత ద్రోహం తలపెట్టినవాడు మాత్రం ఏం సుఖపడతాడు లెండి.. మా బామ్మ అన్నట్లు వాడికి నా ఉసురు తగలకుండా ఉండదు.
మాటకు ముందు మాధవరావు వాడు.. వాడు అంటుంటే గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడినట్లుగా అనిపించి ఏం మాట్లాడాలో అర్థంకాక పిచ్చిచూపులు చూడసాగాడు.
బాస్ మొహంలోని ఫీలింగ్స్‌ని గమనించి ఈసారి ఈ డోస్ చాలనుకొని ‘సారీ సర్..! నా బాధతో ఏదేదో వాగి మీ టైమంతా వేస్ట్ చేసినట్లున్నాను. క్షమించండి.’ అంటూ నెమ్మదిగా లేచి కుంటుకుంటూ బాస్ రూం నుండి బయటకి వచ్చాడు.
మొహం వేలాడేసుకొని పిచ్చిచూపులు చూస్తూ వెర్రి వెంగళప్పలా కూర్చున్న బాస్‌ని చూసి సంతోషంతో ఎగిరి గంతేయాలనిపించింది. అది ఆఫీసు అని, తన గుట్టు బయటపడిపోతుందని గుర్తుకు రావటంతో ప్రస్తుతానికి ఆ ప్రోగ్రాంని పోస్ట్‌పోన్ చేశాడు.
ఈ దెబ్బతో బాస్ క్లీన్‌బౌల్డ్. ఆస్కార్ అవార్డుకి తక్కువగా, నేషనల్ అవార్డుకి ఎక్కువగా ఎంత బాగా యాక్ట్ చేశానో.. తనని తనే మెచ్చుకున్నాడు మాధవరావు.
మాధవరావు మాటలు బాస్ బ్రహ్మానందం మీద బ్రహ్మాండంగా పని చేశాయి. బామ్మ తిట్టిన తిట్లు గుర్తుకొచ్చి తెలియకుండానే ఒకలాంటి భయం కలిగి గుండెల్లో దడ మొదలైంది. ఆ టెన్షన్‌లో ఉండి కారుడ్రైవ్ చేస్తూ సడెన్‌గా ఎదురుగా వస్తున్న లారీని గుద్దబోయి వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు. నాలుగు రోజుల తర్వాత ఓ రోజు స్నానం చేస్తూ బాత్‌రూంలో జారిపడ్డాడు. వారం తర్వాత గుడికి వెళ్లి వస్తున్న వాళ్లమ్మగారి మెడలోని గొలుసుని ఎవడో చైన్ స్నాచర్ లాగాడట. ఆ పెనుగులాటలో ఆమె మెడ ఒరుసుకుపోయి బాలెన్స్ తప్పి కిందపడిపోవటంతో ఆమెకి కొంచెం దెబ్బలు తగిలాయి. ఆమె కాస్త కోలుకొంటుండగానే ఐఐటిలో చదువుతున్న కొడుక్కి చిన్న యాక్సిడెంట్ జరిగి చేతికి కట్టుతో ఇంటికొచ్చాడు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రమాదాలు జరుగుతుండటంతో బెంబేలెత్తిపోయాడు బ్రహ్మానందం. అన్నీ యాదృచ్ఛికంగానే జరిగినా సిద్ధాంతి చెప్పాడని మాధవరావు చెప్పిన మాటలు పదేపదే గుర్తొచ్చి మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. దాంతో ఓ నిర్ణయానికి వచ్చాడు.
నెల రోజుల తర్వాత ఓ రోజు ఆఫీస్ నుండి ఇంటికి రావటంతోనే షూస్ కూడా విప్పకుండా ‘ఝజ్జనక.. ఝజ్జనక’ అంటూ డాన్స్ చేస్తున్న భర్తని చూసి ‘ఏమిటండీ విశేషం?’ అంటూ వచ్చింది భారతి.
భార్యని రెండు చేతుల్తో చుట్టేసి ‘చూశావా మన ఘనకార్యం. ఎలా సాధించానో చూడు...’ అంటూ అమెరికా ఫ్లైట్ టికెట్ ఆమె కళ్ల ముందు ఆడించాడు.
అమెరికా వెళ్లబోయే రోజు ఉదయానే్న రెండు ప్లాస్టిక్ డబ్బాల్లో అరిసెలు, లడ్లు పెట్టుకొని బాస్ ఇంటికి వెళ్ళాడు.
‘సార్.. మా బామ్మ నేను అమెరికా పట్టుకెళ్లటానికని లడ్లు, అరిసెలు చేసింది. మీకిష్టమని కొద్దిగా తీసుకొచ్చాను తీసుకోండి...’ అంటూ ఎంతో భక్తిని, వినయాన్ని ప్రదర్శించాడు.
‘ఏమిటో నీ అభిమానం.. నువ్వు అమెరికా వెళ్తున్నావంటే ఓ పక్క ఆనందంగా ఉన్నా మరో పక్క మా కుటుంబ సభ్యుడు దూరమవుతున్నాడు అన్నంత బాధగా ఉందోయ్..’
అవి రెణ్నెల్ల క్రితం తల్లి మనవడి కోసం చేసినవేనని, మాధవరావు, అతని భార్యాపిల్లలు తిన్నంత తినగా ఇక వెగటేసి ఫ్రిజ్‌లో పెట్టినవి తెచ్చి మరీ మళ్లీ తనకే ఇచ్చాడని తెలియని బాస్ (బకరా) బ్రహ్మానందం అతని అతి వినయానికి మురిసి ముగ్ధుడయ్యాడు.
దటీజ్ మాధవరావు. *
**
కె.రాజేశ్వరి
కేరాఫ్ శ్యాంప్రసాద్
12-8-40, ఎ.జి.కాలేజ్ రోడ్
బాపట్ల -522 101
గుంటూరు జిల్లా. ఆం.ప్ర.
9440356824

కె.రాజేశ్వరి