కథ

చివరి చీర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో
ఎంపికైన రచన
***
‘కొక్కొరోకో... కొక్కొరోకో...’
దిగ్గున లేచి కూర్చున్నాడు సారయ్య... పక్క మంచంలో పడుకున్న ప్రకాశ్ మీద చెయ్యేశాడు.
‘లే బిడ్డ లే... కోడి కూసింది. తెల్లవారక ముందే సాగువాటు కావాలె. చేండ్లకు పోయి కొమ్మగొట్టి రావాలె...’
కొడుకును లేపుతూ అన్నాడు.
‘ఎపో... నీ యవ్వ! నేనెందుకు సాగువాటవుడు. నువ్వే కాపో...’ ఛద్దరు నిండుగా కప్పుకుంటూ అన్నాడు ప్రకాశ్.
‘తెల్లవారితె ఉగాది గద! కొత్త సంవత్సరం... ఈ సంవత్సరం నీ పేరు మీద మంచిగున్నదని రాత్రే చెప్పితి గద. పొద్దు పొడువక ముందే అన్నయిపోవాలె. అగో మీ అవ్వ లేసింది. చెల్లెగూడ లేసింది. మంచాలెత్తుతండ్రు లే నువ్వు...’
కప్పుకున్న ఛద్దరును లాగేస్తూ అన్నాడు సారయ్య.
మబ్బు విరుచుకుంటూ లేచి నిల్చున్నాడు ప్రకాశ్.
వాకిట్లో ఉన్న మంచాల నెత్తుతున్నారు నర్సమ్మ, సరోజ.
‘చెరువు కట్ట దాక పొయ్యచ్చె వరకు ఆల్చెమైతది. ముంత పట్టుకొని పోయిరా. తొందరగచ్చి ముఖం కడుక్కొని స్నానం చెయ్యి. నేం బోతన్న’
తండ్రీ కొడుకులిద్దరూ వెళ్లిపోయారు.
నర్సమ్మ, సరోజ పొయ్యిల బూడిద ఎత్తి పారబోశారు. పొయ్యి మీద నీళ్ల కుండబెట్టి మంటపెట్టింది నర్సమ్మ. పుట్టమన్నుతో ఇల్లలికారు.
ప్రకాశ్, సారయ్య తిరిగొచ్చేసరికి అలుకు చల్లారు. వాకిట్లోంచి పేడ వాసన ముక్కుపుటాలను తాకుతుంది. ముగ్గేస్తున్నారు.
‘నీళ్లు కాగినట్టున్నయి. ముఖం కడుక్కొని స్నానం చేయి’
చింతచెట్టు మీద కాకులు కావ్‌కావ్‌మని అరుస్తున్నాయి.
పిడుక బొగ్గుతో పళ్లు తోముకొని ముఖం కడుక్కున్నాడు ప్రకాశ్.
గంగాళంలో వేడినీళ్లు పోసింది సరోజ.
‘బి.ఏ. చదువుతున్న పొల్లగాన్ని సాగువాటు కమ్మన వడ్తివి. స్నానం చెయ్యి బిడ్డ...’ అంది నర్సమ్మ.
‘ఎంత చదివినా తినేది మనం పండించిన అన్నమే కాదోయ్... అందుకే రాజాధిరాజయిన లవణమన్నమె కాని వెండి బంగారంబు కుడువలేడు అన్నారు..’ అన్నాడు సారయ్య నవ్వుతూ.
‘అబ్బో... కీర్తనలు గూడ సదువుతున్నవా. ఇయ్యాల్ల జోరు మీదున్నట్టున్నవు’ నవ్వుతూ అంది నర్సమ్మ.
తువ్వాలు తీసుకొని బావి దగ్గరికెళ్లాడు ప్రకాశ్.
గంగాళంలో చేయి పెట్టి చూశాడు. వేడిగా తగిలాయి. మరో చేద నీళ్లు అందులో పోశాడు.
‘పండుగ గదా బిడ్డ! నెత్తిమీదకెల్లి పోసుకో నీళ్లు. తలకు చెంబుల నానేసిన రాగటి మన్ను రుద్దుకో... సబ్బు వెడితె బాయినీల్లకు మురికిపోదు. పెయ్యికి లైఫ్‌బాయ్ సబ్బు రాసుకో...’
‘సరేనే అవ్వ...’
‘అన్న చిన్న పిల్లగాడని గివ్వన్ని చెప్పుతున్నవా?’ అంది సరోజ.
‘్ఢల్లికి రాజయిన తల్లికి బిడ్డే. సరెగని పొయ్యి మీద నీళ్లు పెట్టుపో. మనం గూడ స్నానాలు చేసి బూరెలు చేద్దాం’
‘అట్లనేనే అవ్వ...’ అంది సరోజ.
కొద్ది నిమిషాల్లోనే స్నానం ముగించి తల, శరీరం తుడుచుకున్నాడు ప్రకాశ్. బట్టలేసుకున్నాడు. నుదుట కుంకుమ పెట్టింది నర్సమ్మ.
గొడ్డలి చేతిలోకి తీసుకున్నాడు ప్రకాశ్.
సారయ్య ముందు నడుస్తుంటే అతన్ని అనుసరిస్తున్నాడు.
నిండు ముంతతో ఓ స్ర్తి ఎదురైంది.
‘మంచి శకునం బిడ్డా!’ అన్నాడు సారయ్య.
‘బాపూ! నీకు వ్యవసాయమంటే ప్రాణం. దీంట్లో పెద్దగా వచ్చేదేం లేకున్నా భూమినే నమ్ముకొని బతుకుతున్నవు...’
‘వ్యవసాయం ఓ సామాజిక బాధ్యత బిడ్డా. ఇండ్ల లాభనష్టాల గురించి ఆలోచించవద్దు...’
తండ్రి మాటల్లోని లోతు హృదయానికి తాకింది ప్రకాశ్‌కు.
ఊరు ప్రక్కనున్న చేల్లోకి చేరుకున్నారు వాళ్లు. కుహూ... కుహూ అంటూ కోకిలలు కూస్తున్నాయి.
వసంతాన్ని ఆహ్వానిస్తున్నాయి.
‘గొడ్డలితో ఓ కొమ్మ నరికి చెట్టు మొదట్లో పెట్టు...’
తండ్రి చెప్పినట్టు చేశాడు ప్రకాశ్. తూర్పు దిక్కు తిరిగి దండం పెట్టాడు.
ఊరి దిక్కు నడుస్తున్నారు వాళ్లు.
‘బాపూ! నాకు నౌకరయినంక మీరు వ్యవసాయం చేయొద్దు. మిమ్ములను కూసుండబెట్టి సాత్త’
‘అప్పటివరకు చూద్దాం పటు. అయినా వట్టిగుండి నేనేం జేత్త. చాతనైనన్ని రోజులు ఎవుసం నడుత్తది’
ఇల్లు చేరుకున్నారు వాళ్లు. అరుగు మీద కూర్చున్నారు.
‘సాగువాటయినోల్లు నిద్రవోతె వ్యవసాయం నిద్రవోయినట్టుంటది... నువ్వు రాత్రిదాక నిద్రపోవద్దు బిడ్డ...’
చెట్టు మీద కాకులరుస్తూ లేచి వెళ్లిపోతున్నాయి.
నర్సమ్మ గంప కింద కమ్మిన కోళ్లనొదిలింది. క్కొక్కొక్కొ అంటూ అవి వాకిలంతా తిరుగుతున్నాయి.
దూరం నుంచి కోకిల స్వరాలు వినిపిస్తున్నాయి.
తూర్పు చీకట్లను చీల్చుకుంటూ కర్మసాక్షి బయటకొస్తున్నాడు.
ఊరంతా మేల్కొంటుంది. పండుగ పనుల్లో నిమగ్నమయ్యారు. నర్సమ్మ, సరోజ పండుగ వంట పనులు చేస్తున్నారు.
శనగపప్పు ఉడుకుతున్న వాసన కమ్మగా వస్తుంది.
‘రైతులకిది తొలి పండుగ గద! సంవత్సరాదాయె. రెండు సాల్లు నాగలి దున్నివద్దాం బిడ్డ...’
తండ్రి మాటలతో లేచి నిల్చున్నాడు ప్రకాశ్.
ఎడ్ల తోలుకొని చేల్లో కెళ్లారు. నాగలి కట్టి కొడుకు చేతికిచ్చాడు.

‘ఒక్క కోండ్ర దున్న చాలు...’ అన్నాడు.
నాగటి పాలె, పగ్గాలు చేతిలోకి తీసుకున్నాడు ప్రకాశ్. ముల్లుగర్రతో ఎడ్లను పొడిచి జా అన్నాడు. నాగలి నడుస్తుంది.
ఏరువాకా సాగుమురో రన్నో చిన్నన్నా...
నీ కష్టమంతా తీరునురో రన్నో రైతన్నా...
సారయ్య పాట పాడుతుంటే ప్రకాశ్ నాగలి దున్నుతున్నాడు.
ఓ కొండ్రు దున్ని నాగలి విడిచారు.
ఎడ్లను కొట్టంలో కట్టేసి ఇంటికెళ్లారు.
కూర తాళింపు వాసన, శనగపప్పు బూరెల వాసన కమ్మగా వస్తుంది. దర్వాజలకు కట్టిన మామిడాకుల తోరణాలు పందిరికి చెక్కిన మామిడి కొమ్మలు వసంత రుతువు నాహ్వానిస్తున్నాయి. నర్సమ్మ చీర, రవికెలతో శ్రామిక స్ర్తికి ప్రతిరూపంలా ఉంది. సరోజ లంగా జాకెట్టుతో తెలుగింటి ఆడపడుచులా ఉంది.
అంబటివేళ కాబోతుంది.
‘అత్తకు బూరెలిచ్చి వచ్చాను. సాయమాన్లో కూచొని అందరం బూరెలు తిందాం పాండ్రి...’ అంది నర్సమ్మ.
సాయమాన్లో నలుగురు పీటలపై కూర్చున్నారు.
అందరికీ గినె్నల్లో బూరెలు వడ్డించింది నర్సమ్మ.
నెయ్యి పావు మధ్యలో పెట్టింది.
‘నెయ్యేసుకొని తినుండ్రి... కమ్మగుంటయి...’
మామిడి వక్కలు, కొబ్బరి వక్కలు, చింతపండు, బెల్లం, వేప పువ్వులు కలిపి తయారుచేసిన ఉగాది పులుసు తాగుతూ భక్ష్యాలు తింటున్నారు నలుగురు.
‘ఏం కూర చేసినవోయ్’
‘ఇయ్యాల్లేముంటది...? శనగకట్టు చారు...’ అంది నర్సమ్మ.
కడుపు నిండా బూరెలు తిని బ్రేవ్ మన్నారందరు.
మధ్యాహ్నం భోజనం చేశారు. చిన్నాన్న ఇంటికెళ్లి నానమ్మను చూసి
వచ్చాడు ప్రకాశ్.
సాయంత్రం ఆంజనేయ స్వామి గుళ్లో జరిగే పంచాంగ శ్రవణానికెళ్లాడు ప్రకాశ్.
సూర్యుడు రాజు... మంత్రి చంద్రుడు... పశుగణాధిపతి శ్రీకృష్ణుడు... పంచాంగ పఠనం చేశాడు శాస్ర్తీ... ఆదాయ వ్యయాలు చెప్పాడు. తమ రాశిని, ఆదాయ వ్యయాలను తెలుసుకున్నారు రైతులు.
ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
పొద్దు గూట్లో పడుతూండగా ఎవరింటికి వారెళ్లారు. కాకులు కావ్‌కావ్‌మని అరుస్తూ చెట్లపైనున్న గూళ్లకు చేరుకుంటున్నాయి. ఊరు ఊరంతా ఉగాది పండుగను ఆనందోత్సాహాలతో చేసుకున్నారు.
* * *
‘నాన్నా! ఏమాలోచిస్తున్నారు..? ఊరు జ్ఞాపకం వచ్చిందా. సంవత్సరాది పండుగ రోజు ఎందుకలా పిల్లి పట్టిన కోడిలా ఉన్నారు..?’
వినయ్ మాటలతో ఈ లోకంలోకొచ్చాడు ప్రకాశ్.
అరవై ఏళ్ల వయసుకు దగ్గరున్న ఆ వృద్ధుడి కళ్ల ముందు ప్రకృతి శోభతో, సమతుల్య వాతావరణంతో ఉండి వైభవోపేతంగా పండుగలు జరుపుకునే తన బాల్యం నాటి ఊరే కదలాడుతుంది.
‘ఏం లేదు.. ఏం లేదు...’ అన్నాడు తడబడుతూ...
‘ఏంటి మామయ్యా! రిటైరయ్యారు కదా. హైదరాబాద్‌లో మాతో హాయిగా ఉండొచ్చు కదా! ఊళ్లో ఏముందని అదే ధ్యాస...’ అంది ఆ గదిలోకొస్తూ సుమ...
‘గ్రాండ్‌పా.. మేమూ వచ్చేసినం... ఈ రోజు ఫెస్టివల్ కదా..! మా ఫ్రెండ్స్‌కి ఫెస్టివల్ విషెస్ చెబుతూ మెసేజెస్ పంపాం...’
జీన్ పాంట్లు, టీషర్టులతో ఉన్న అభిలాష్, వౌనికలను చూస్తున్నాడు ప్రకాశ్.
‘మంచి పని చేశారు...’ ముభావంగా అన్నాడు.
‘ఏంటి నాన్నా? ఎలాగో ఉన్నారెందుకు? ఈ రోజు సంవత్సరాది...’
ఆ ఇంట్లో పండుగ వాతావరణం అసలే కనపడటం లేదు ప్రకాశ్‌కు. తెల్లవారుజామున లేచి కిటికీ దగ్గర కూర్చున్నాడు. వసంతాగమనాన్ని సూచించే పక్షుల అరుపులు, కోకిల స్వరాల కోసం చెవులు రిక్కించి ఎదిరిచూస్తున్నాడు. మోటారు వాహనాల ధ్వనులు తప్ప అవేవీ వినపడటం లేదు. పొద్దు పొడిచి చాలాసేపయినా ఆ ఇంట్లోనూ పండుగ జాడలు కనపడటంలేదు. ఉడుకుతున్న శనగపప్పు పరిమళంగాని, ముక్కుపుటాలను తాకే తాళింపులు గాని లేనే లేవు. అదే మాట కొడుకుతో, కోడలితో అనాలన్న భావాన్ని అణచుకోలేక పోతున్నాడు.
‘ఈ రోజు ఉగాది కదా! వసంతాగమనాన్ని సూచిస్తూ ఒక్క పక్షీ...’ అన్నాడు ప్రకాశ్.
‘ఇదా నాన్నా మీ బాధ. ఈ హైదరాబాద్‌లో పక్షుల ధ్వనులెక్కడ వినబడుతున్నాయి? అక్కడక్కడ చెట్లున్నా ఈ రణగొణ ధ్వనుల మధ్య చెట్లపై పక్షులుంటాయా? మన ఊళ్లోలా మీకు ప్రకృతి కనపడటం కష్టం. ఇప్పుడు ఊళ్లలోనూ పక్షులు కనపడటం అరుదైందన్న విషయం మీకు తెలియదా? దసరా రోజు గరుత్మంతుడు, పాలపిట్టను చూడటం ఇక్కడైతే కుదరదు. అక్కడా కష్టంగానే ఉందనుకుంటాను. అలాగే ఉగాది నాడు కోకిల ధ్వనులు...’
వినయ్ మాటల్లోని వాస్తవాలు ప్రకాశ్‌ను బాధాతప్తుణ్ని చేస్తున్నాయి. అతని హృదయం భారమైంది.
‘అంటే..? వసంతం వౌనంగా ప్రవేశిస్తుందన్న మాట. వౌన వసంతం వచ్చే రోజులు దగ్గర పడుతున్నాయన్నమాట...’
తనలో తానే అనుకున్నాడు.
‘పండుగ రోజయినా అమ్మాయికి లంగా జాకెట్టు వేస్తేంబోతుంది? మన సంప్రదాయం’
‘వాట్ గ్రాండ్‌పా లంగా జాకెట్టా...? ఫన్నీ’ అంది వౌనిక.
‘మామయ్యా! మీకు తెలియందేముంది? తెలుగు వాళ్ల చీరకట్టు క్రమక్రమంగా దూరమైపోతుంది. మా తరం వాళ్లే సగం మంది పంజాబీ డ్రెస్‌లోకి మారారు. ఈ తరం పిల్లలయితే లంగా, చీర లాంటి వాటినసలే ముట్టడం లేదు...’
‘అవును నాన్నా! మరో యాభై ఏళ్లలో చీరను మ్యూజియాల్లోనే చూడాల్సి వస్తుందేమో?’
కొడుకు, కోడలు మాటలు ప్రకాశ్ హృదయానికి గునపాల్లా తాకుతున్నాయి. తెలుగువారి చీరకట్టు మరో ఒకటి రెండు తరాల్లో అంతరించిపోతుందన్న ఆలోచనను భరించలేక పోతున్నాడు.
‘అవును మామయ్యా! పట్టు లంగా కట్టుకొమ్మంటే ఎక్కడ పుట్టినవే మమీ అని ఎగతాళి చేస్తున్నారు’ అంది సుమ.
‘హి..హిహి...’ అంటూ అమాయకంగా నవ్వారు పిల్లలు.
‘పండుగ కదా?!... భక్ష్యాల వాసన కూడా లేదేంటి?’ అనకూడదనుకుంటూనే అన్నాడు ప్రకాశ్.
‘అదా నాన్నా...’ అంటూ నవ్వాడు వినయ్.
‘శనగపప్పును ఉడకబెట్టడం.. బెల్లం వేసి రుద్దడం.. గోధుమపిండి ముద్దలను సాగదీయడం.. అందులో పప్పుని పెట్టడం.. పెనం మీద కాల్చడం ఎంత పని మామయ్యా బూరెలు చేయడమంటే... తినే ఒకటీ, రెండు కోసం ఈ పనులన్నీ చేయడం దండగ కదా..! అంతేకాదు అవిప్పుడు బేకరీల్లో రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. రెండు మూడేళ్లుగా బూరెలను బేకరీల్లోంచే తెప్పించుకుంటున్నాం. తీసుకురావడానికెళ్లాడు మా తమ్ముడు...’ అంది సుమ.
బేకరీ బూరెల మాట వినగానే ప్రకాశ్ ముఖం మరింత వాడిపోయింది. గొంతు దుఃఖంతో పూడుకుపోతుంది. పండుగ పబ్బాల్లో ఎంతో ఆనందంతో హడావిడి పడే తన తల్లి, భార్య, చెల్లెలు జ్ఞాపకం వచ్చి దుఃఖం పెల్లుబుకు వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఒక్క మాటా బయటకు రావడం లేదు...
‘ఇప్పుడంతా ఫాస్ట్ఫుడ్‌లే కదా నాన్నా..! అంత తీరికగా వంటలవీ చేసే ఓపిక ఎవరికుంది? వంటలవీ చేస్తూ కూర్చుంటే పండుగను ఎంజాయ్ చేసే సమయమెక్కడ దొరుకుతుంది? అందుకే పండుగ రోజు బిర్యానీ, ఇతరాలన్నీ హోటల్ నుంచే తెప్పించుకుంటాం... అదుగో.. బావమరిది రానే వచ్చాడు...’ అన్నాడు వినయ్.
అందరూ దర్వాజ దిక్కు చూశారు.
‘ఇదుగో... పండుగ స్పెషల్స్. బిర్యానీ, బూరెలు, కూరలు, స్వీట్లు అన్నీ తెచ్చాను. లెటజ్ ఎంజాయ్ ది ఫెస్టివల్...’ అని రెండు క్యారియర్లు టేబుల్ మీద పెట్టాడు వినయ్ బావమరిది విజయేందర్.
తండ్రిని డైనింగ్ టేబుల్ కుర్చీలో కూర్చోబెట్టాడు వినయ్. బూరెలు, వెజిటబుల్ బిర్యానీ, కూరలు, ఉగాది పచ్చడి గినె్నల్లో వడ్డించింది సుమ. వాళ్లంతా కుర్చీల్లో కూర్చున్నారు. అందరి ముందూ వడ్డించిన గినె్నలు.
తన ముందున్న పదార్థాలను చూస్తుంటే భయమేస్తుంది ప్రకాశ్‌కు. ఆ పదార్థాలు నోరూరించకపోగా అసహ్యంగా కనపడుతున్నాయి.
‘చివరి చీరను చూసే పరిస్థితులు తరుముకొస్తున్నాయి. వౌన వసంతమూ వచ్చేస్తుంది. పట్టణాలు వీటిని ఎర్ర తివాచీ పరచి మరీ ఆహ్వానిస్తున్నాయి. పల్లెలు కొంత నయం... పల్లీకరణమే అన్నిటికీ పరిష్కారం.. ఎదుర్కోవాలి.. సంస్కృతి విధ్వంసానె్నదుర్కోవాలి. నా బాల్యం నాటి పల్లె నాకు కావాలి...’
తనలో తానే గొణుక్కుంటున్నాడు ప్రకాశ్.
అతని కడుపు ఆవేదనతో కళఫెళా కాగుతుంది. కళ్ల వెంట ధారాపాతంగా నీళ్లు కారుతున్నాయి.
‘వద్దు... నాకివేవీ వద్దు...’ అని కంచాన్ని తోసేసి లేచి నిల్చున్నాడు ప్రకాశ్. ఎవరు వారిస్తున్నా వినకుండా దర్వాజ దాటి గేటు దగ్గరికెళ్లాడు.
‘నాన్నా... నాన్నా...! పండుగ రోజు...’
అని వెంబడిస్తున్న కొడుకు మాటలు విని ఆగాడు. కోపంగా చూశాడు. వినయ్ ప్రక్కన, వెనుక నిల్చున్న వాళ్లనూ చూశాడు.
‘పండుగా..! ఇది పండుగా..! దర్వాజకు ఒక్క మామిడాకయినా లేదు. వాకిట్లో ముగ్గయినా లేదు. పండుగెలా అవుతుంది? హోటల్ నించి భోజనం తెప్పించుకొని తినడం పండుగా? మీకు పండుగంటేందో తెలుసా? పండుగల పరంపరను కొంతయినా కాపాడుతున్న నా ఊరి వాళ్ల దగ్గరికెళ్తున్నాను...’
అని గేటు తీసుకొని గబగబా నడుస్తున్నాడు ప్రకాశ్.
‘గ్రాండ్ పా... గ్రాండ్ పా...’ మనుమడు, మనవరాలి పిలుపులాతన్ని మరింత వేగంగా వెళ్లడానికి పురిగొల్పుతున్నాయి. పక్కనుంచి వెళ్తున్న ఆటోనాపి అందులో కూర్చున్నాడు ప్రకాశ్.
‘జూబ్లీ బస్‌స్టేషన్.. తొందరగా పోనియ్...’ అన్నాడు.
***
డా.కాలువ మల్లయ్య
44/214, హుడా కాంప్లెక్స్
క్రాంతిహారిక అపార్ట్‌మెంట్స్
కొత్తపేట, సరూర్‌నగర్, హైదరాబాద్-500 035
9849377578

-కాలువ మల్లయ్య