ఈ వారం కథ

కలహభోజిని ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకడలి ప్రశాంతంగా ప్రవహిస్తున్న వేళ.. ఆ లాహిరికి ఆనంద పరవశుడై ఆదిశేషువు డోలికలూపుతూండగా.. చిరునవ్వులు చిందిస్తూ రమారమణి తన కరపద్మాలతో సుతిమెత్తగా పతి పాదములొత్తుతూన్న సమయాన.. జగన్నాటక సూత్రధారి చిన్ముద్రలో చిరు మెదలిక..

‘‘నారాయణ.. నారాయణ..! లక్ష్మీనారాయణులకు ప్రణామములు..’’
‘‘రావయ్యా నారదా..! త్రిలోక సంచారి బహుకాలమునకు దర్శనమిచ్చినాడు.. ఏ లోకపు విశేషములు నిన్నంతగా ఆకర్షించినవయ్యా..?’’
‘‘ఇంకేది స్వామీ? కడు రమ్యమైనదీ, మిక్కిలి వింతలకు నెలవైనదీ అయిన భూలోకమే. అందునా తమకు అత్యంత ప్రియమైన భరత ఖండంబునే సంచరించుచూ కాలము మరచితిని...’’
‘‘కాలమును మరపించునట్టి విశేషములా? నీ నోట వినవలెనని ఆత్రముగా ఉన్నది. శీఘ్రముగా చెప్పు నారదా?’’
‘‘అటులనే తల్లీ! తొలుత నా ఈ నూతన సంవత్సర కానుకను స్వీకరించండి’’.
‘‘కొత్తగా ఈ కానుకల బహూకరణ ఏమిటి నారదా?’’
‘‘అది భూలోక సంచార ప్రభావమేమో దేవీ! అవునా.. నారదా?’’
‘‘అయినా సంవత్సరాది గడచినదిగా స్వామీ! బ్రహ్మ మానస పుత్రుడీ విషయము మరచినాడేమో..? అంతేనా నారదా?’’
‘‘లేదు తల్లీ! అది గడచిననేమి? మరొకటి వచ్చును కదా! అయిననూ కర్మభూమి యందు కానుకలిచ్చి పుచ్చుకొనుటకు బోలెడు ‘దినము’లున్నవి.’’
‘‘దినములా?’’
‘‘అదే తల్లీ..! దినోత్సవములు. మాతృదినోత్సవము, పితృ దినోత్సవము, ప్రేమికుల దినోత్సవము.. ఇలా ఎనె్నన్నో..!’’
‘‘అది సరే.. నీవు నాకు, స్వామికి కానుకగా ఇచ్చిన ఈ మందసము లేమి?’’
‘‘అది మందసము కాదు తల్లీ! చరవాణి యంత్రము. దీనిని ఉపయోగించి ఎక్కడనుంచైనా, ఎవరితోనన్నా మాట్లాడవచ్చును’’
‘‘అదెలా?’’
‘‘ఒక్కొక్క చరవాణికి పది అంకముల చొప్పున ఒక సంఖ్య కేటాయించబడి ఉండును. ఆ సంఖ్యను ఇందున్న మీటలు నొక్కినచో ఆవలివారికి ఆవృత శబ్దము వినబడును. మనకు ఆ శబ్దము వినవచ్చినచో ఈ ఆకుపచ్చని మీటను నొక్కి మాట్లాడవలెను మాతా!’’
‘‘్భళా! ఇట్టి వింత పరికరములుపయోగించుచున్న మానవులు కడు భాగ్యశాలురు కదా!’’
లక్ష్మి మాటలకు శ్రీమహావిష్ణువు తలపంకిస్తూ నారదుని వంక చూసి ‘‘అయినచో ముల్లోకముల విశేషములు వివరించుటకు నీవు మా కడకు రానక్కరలేదన్నమాట...’’
‘‘అది కొంతవరకు నిజమే స్వామీ! యుగముల తరబడి తిరుగుచున్ననూ ఆరోగ్యముగానే యుంటిని. మరి కలి ప్రభావమో, కర్మభూమి మహత్యమో ఇప్పుడీ మోకాళ్ళ నొప్పులు అంకురించినవి. నాకు సెలవిప్పించినచో నేను పోయి వచ్చెదను. ఈ కానుకలను ఇంకా మాతాపితరులకు, ఆదిదంపతులకు, స్వర్గ్ధాపతికి.. ఇతరులకు అందజేయవలె.’’
‘‘ఆ.. ఆ.. వెళ్లిరా నారదా! ఈ చరవాణి నీకు మారుగా పనిచేసి నీకు విశ్రాంతి కల్పించునులే..’’
‘‘ఈ నారాయణుడు నర్మగర్భముగా పలికిన ఈ పలుకులకు అంతరార్థమేమియో యుండును.. అది తెలుసుకొనుటకు నా కడ సమయమూ లేదు.. మేధస్సూ చాలదు..’’ నారదుడు గొణుగుతూ కైలాసమునకరిగినాడు.
***
అది కైలాసము-
‘‘నారాయణ.. నారాయణ.. ఆదిదంపతులకు వందనములు...’’
‘‘ఏమి నారదా? భూలోకము నుండి భారమేదో తెచ్చినట్లున్నది..?’’
‘‘అవును శంకరా! ఇపుడీ ఈ యంత్రములను వైకుంఠమునందు ఇచ్చి ఇటువచ్చితిని..’’
‘‘కానీ.. వీటితో మాకు పనేమున్నది నారదా?’’
‘‘నిజమే.. మీరు సర్వజ్ఞులు.. సర్వేశ్వరులు.. కానీ- పార్వతీమాత ముచ్చట...!’’
‘‘అవును స్వామీ! ఈ చిట్టి మందసము కడు ముచ్చట గొల్పుతున్నది. దీనిని ఉపయోగించవలెనని కోరికగా యున్నది.’’
‘‘దేవీ..! కామనలు.. అనర్థహేతువులు...’’
‘‘చాలు స్వామీ! అర్థాంగి ముచ్చటలు అనర్థహేతువులుగా అగుపడుట ఆదినుండియు మీకలవాటే కదా!’’
‘‘సరే.. నీ చిత్తము.. నారదా! ఆ మందసము పనిచేయు విధానమేదో ఆమెకు బోధించుము...’’
అటులనే మహాదేవా.. అయ్యో! ఇచ్చట సూచికలు లేవు. ఈ యంత్రము కైలాసమునందు పని చేయుట అసాధ్యము...
భోళాశంకరుడు భళ్ళున నవ్వాడు.
‘‘నారదా! కైలాసమునందున్నది శక్తిస్వరూపిణి.. అసాధ్యమన్న పదము ఇచట నిషిద్ధము..’’
‘‘క్షమించండి మాతా.. ఇక సెలవు.. నారాయణ.. నారాయణ... తాతగారి మాటలకర్థము ఇపుడిపుడే అవగతమగుచున్నది..’’
***
అది సత్యలోకము-
‘‘శ్రీ శారదాంబా.. నమోస్తుతే...’’
‘‘వాణీ! నీ చరవాణి మోగుచున్నది..’’
‘‘ఆ.. ఇదిగో.. వచ్చుచుంటిని స్వామీ..’’
‘‘క్షేమమా కోడలా?’’
‘‘అత్తగారికి ప్రణామములు.. మీ దయవలన క్షేమమే.. నా పుత్రుడు అందించిన ఈ కానుక ద్వారా సకల లోకముల క్షేమ సమాచారములు ఎల్లరకునూ క్షణములో తెలియుచున్నవి..’’
(‘ఏమి ఈ సరస్వతి మాటలయందు ఒకింత గర్వము పొడసూపుచున్నది..?)
‘‘అవునవును.. అయిననూ లక్ష్మీ కటాక్షము వలన కదా సర్వులునూ ఇటువంటి పరికరములు సమకూర్చు కొనగలుగుతున్నారు. ఏమందువు కోడలా?’’
(అబ్బో..! అత్తగారి స్వోత్కర్ష పరిధిని మించుచున్నది. దీనికి అడ్డుకట్టవేయవలె..)
‘‘అంతేకాదులెండి అత్తయ్యా..! సరస్వతీ అనుగ్రహము వలన కదా మానవుల బుద్ధి వికసించి ఇట్టి వింత వస్తువులను కనిపెట్టగలుగుచున్నారు..’’
(హూ.. ఈమె అహంకారము జాస్తియగుచున్నది. విషయము పక్కదోవ పట్టించవలె..)
‘‘అది సరే కోడలా.. ఈ శీతాకాలమునందు కూడా భానుని ప్రతాపము భగభగ మండించుచున్నది. భరత ఖండంబునకు వ్యాహ్యాళికి పోయి నూలు చీరెలు కొనుక్కుందామా?’’
‘‘అలాగే అత్తగారూ! నాకు కూడా ఈ శే్వత వస్తమ్రుల యెడ విసుగు వచ్చుచున్నది. మీ అందరిలా చిత్రవర్ణముల చీరెలతో నా స్వామిని మురిపించవలెనని కోరికగా యున్నది. మరి కైలాసమునకు కబురంపినారా?’’
‘‘హు.. అదియునూ అయినది. ఆమెగారికి పతిదేవుల అనుమతి లేదట. ఆమె రాదట. ఆమె బడాయి కానీ.. పార్వతికి భర్త అనుమతి అవసరమా? మున్ను అది పొందియే దక్షవాటికయందు అడుగిడినదా?.. సరి సరి.. సాయంత్రము మనము పోయి వచ్చెదము...’’
‘‘ఈ చరవాణి ముగురమ్మల మధ్య ముసలమును పుట్టించుననుటకు ఇదియే నాంది...’’ అనుకుని లక్ష్మీ సరస్వతుల సంభాషణ సమగ్రముగా ఆలకించిన నలువ నిట్టూర్చినాడు.
***
అది అమరావతి నగరం..
‘‘ఏమి సువర్ణసుందరీ? నీ అకాల ఆగమమునకు కారణము?’’
‘‘ఏమున్నది దేవేంద్రా? నర్తకీమణులకు తీరిక లేక ఇంద్రసభను రంజింపజేయుటకు నన్ను పంపిరి’’.
‘‘అవునవును.. ఈ మధ్య రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమల చరవాణి యంత్రములు స్పందించుటయే లేదు.. వారంత అవిశ్రాంతముగా యుంటిరా? కారణం?
‘‘ప్రత్యేక కారణమేమియూ లేదు దేవేంద్రా! ఈమధ్య భూలోకము నుండి చలన చిత్ర ప్రముఖులు చాలామంది వచ్చి చేరినారు. వారి బుద్ధి ఊరకనే యుండదు కదా! అమరావతినందు కూడా ఒక చలన చిత్రము తీయవలెనని యోచించుచుంటిరి. మన నల్వురు నర్తకీమణులు అవకాశము కొరకు ప్రయత్నించుచుంటిరి.’’
‘‘అటులైన.. ఇంద్రసభపైనే శీతకన్ను వేయుదురా? అచ్చర కనె్నలకు అభిజాత్యము అధికమైనది.. వెంటనే వారినిచ్చటకు తోడ్కొనిరమ్ము! ఇది సురేంద్రుని ఆజ్ఞ!
‘‘ప్రభూ..!’’
‘‘ఏమి?’’
‘‘నారదుల వారు స్వర్గలోకమువారికి చరవాణి యంత్రములు అందజేసిన నాటినుండి ఎవరికెవరూ ప్రత్యక్షముగా అందుబాటులో లేరు. ఒక చోట ఉండి- వేరొక చోట ఉంటిమని చెప్పుచుంటిరి..’’
‘‘అవును దేవేంద్రా! ఇట్టి యంత్రములు భూలోకవాసులు విరివిగా వాడుచుండుటవలన యమపురినందు పాపుల సంఖ్య పెరిగిపోవుచున్నదట..!’’ -అంటూ సప్తర్షులు తమ ఆవేదనను మూకుమ్మడిగా వెలిబుచ్చినారు.
‘‘ఇది ఎట్టి విచిత్రము? చరవాణినుపయోగించుట పాపమా? అటులైన నారదుడు మనకెందుకు అందజేసినట్లు?’’
‘‘పాపము కాదు.. దాని వలన అనృతములాడువారు, కలహించుకొనువారి సంఖ్య అధికమగుచున్నది..’’
‘‘మునీంద్రా..! నేటి నుంచి మన అమరావతినందు ఇట్టి యంత్రములు నిషేధించితినని నా మాటగా ఎల్లరకూ తెలియజేయండి.’’
‘‘అది కూడా మీ చరవాణి యంత్రము ద్వారా ఎల్లరకూ సమాచారమందించండి ప్రభూ! క్షణములో చేరిపోగలదు’’.
‘‘ఆ..!’’
***
అది వైకుంఠము..
స్వామీ..! మీ చరవాణియందేవో కొత్త సంఖ్యలు అగుపడుచున్నవి. ఇవి నాకు తెలిసినవి కావే...?
అవునవును.. ‘వినియోగదారుల జాగరూకత’ విభాగము వారట.. ఏవేవో కొత్త కొత్త పాటలను ప్రవేశపెట్టినామనుచూ ఏదేదో చెప్పినారు...’’
‘‘అంతేనా?... ఏ చంద్రాస్యమో నా స్వామిని వశపరచుకొనలేదు కదా!’’
‘‘హతవిధీ! ఇది ఎట్టి శంక దేవీ! నిత్యము నీ దాసుడనే... నిన్ను వక్షస్థలమునందు నిలుపుకున్నవాడనే.. త్రేతాయుగమునందు ఏకపత్నీవ్రతుడను నామధేయుడను కానా? ఈ సంగతి నీవెరుగవా?’’
‘‘ఎరుగకేం స్వామీ..! ద్వాపర యుగము నాటి సంగతులు కూడా ఎరుగుదును.. యుగముల తరబడి మీ చిలిపి చేష్టలకు విలపించుటయే నాకు మిగిలినది...’’
‘‘ఇపుడు నేనేమంటినని నీవంతగా విలపించుచుంటివి? ఇప్పటివరకూ లోకములు చుట్టివచ్చినది నీవు.. అయినా- నీవెవరిని కలిసి వచ్చితివో నేనడిగితినా? నీ చరవాణి యంత్రమును పరీక్షించితినా?’’
‘‘అంటే...? నన్ననుమానించుచున్నారా? అంతేలెండి.. ఏకపత్నీవ్రతుడననుచూ త్రేతాయగుమును గుర్తుచేసినపుడే అనుకొంటిని. అప్పటి బుద్ధులింకా మిమ్ము పట్టి పీడించుచున్నవని. అప్పుడు నా తల్లి నన్నాదుకున్నది.. ఇప్పుడిక నా తండ్రి ఈ సాగరుడే నాకు శరణ్యం...’’
‘‘దేవీ.. దేవీ.. కినుక వలదు.. అంతా ఈ యంత్రము వల్లనే జరుగుచున్నది.. ఇది మనకు వలదు..’’- అంటూ విష్ణుమూర్తి తన చేతిలోని యంత్రము (చరవాణి)ను పాలకడలిలోనికి విసిరినాడు..’’
అప్పుడే వైకుంఠములోనికి అడుగుపెడుతున్న నారదునికి ఈ దృశ్యము కంటపడినది.
‘‘నారాయణ.. నారాయణ..! ఆనాడు నారాయణుడు పలికిన పలుకులకు అంతరార్థమిదియా? ఈ చరవాణి యంత్రము నాకన్నా మిన్నగా పనిచేయుచున్నది. సాక్షాత్తూ లక్ష్మీ నారాయణులకే తంపులు పెట్టిన దీనిని- పరిస్థితి విషమించకమందే అందరికడ నుండి తిరిగి తీసుకొనుట ఉత్తమమేమో!.. మరి భూలోక వాసుల స్థితి..?’’
***
‘‘స్వామీ.. నదికి పోలేదా?.. స్వామీ.. నదికి పోలేదా?’’
‘‘స్వామీ.. స్వామీ...’’
‘‘సెల్‌ఫోన్ అంతలా మోగుతూంటే లిఫ్ట్ చేయకుండా మీరు- స్వామీ.. స్వామీ అంటారేమిటండీ...’’ పక్కనున్న భార్య తట్టి లేపుతుంటే ఉలిక్కిపడ్డాడు దివాకరం.
అంటే- తనింతసేపూ కన్నది కలా? సెల్‌ఫోన్‌లో వచ్చే మిస్డ్‌కాల్స్, చెత్త మెసేజ్‌ల వల్ల అనుమానంతో తన భార్య విడాకుల వరకూ వెళ్లిందని ముందురోజు సాయంత్రం రామం గాడు తన గోడు వెళ్ళబోసుకుంటూంటే- ఆ విషయానే్న సీరియస్‌గా ఆలోచిస్తూ పడుకున్నాడతడు.
అమ్మో..! నిజంగా ఈ చరవాణి ఇతర లోకాలకు వ్యాపిస్తే దేవతల మధ్యైనా పొరపొచ్చాలు రావలసిందేనా?
‘‘స్వామీ.. నదికి పోలేదా? స్వామీ.. నదికి పోలేదా?’’
‘‘అబ్బబ్బ! ఆదివారం పూటన్నా ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా ఈ ఫోన్ గొడవేమిటండీ? ఇంతకీ ఈ ‘రమ’ ఎవరూ?’’
‘రమ’ కాదే.. ‘రామా’ అంటే రామం గాడు ఫోన్ చేస్తున్నాడు.
‘‘అబద్ధాలాడకండి.. రామం అన్నయ్యగారి సెల్ నెంబరు నాకు తెలుసు. పైగా అది ‘రామం’ అనే ఫీడ్ చేసి ఉంటుంది.’’
‘‘అయ్యో..! ఇది వాడి రెండో నెంబరే...’’
నన్ను మోసగించడానికి ప్రయత్నించకండి... మొన్న ‘కళానికేతన్’లో కనిపించి పలకరించిందే.. మీ కొలీగ్.. ఆ అమ్మాయి పేరు ‘రమ’ కదూ!’’
‘‘బాబోయ్..! చరవాణి..!’’ అంటూ జుట్టు పీక్కున్నాడు దివాకరం.
‘‘మళ్ళీ ఆవిడెవరండీ..?’’
*

శ్రీమత్కందాళ బాలసరస్వతి
8712 7191 73

శ్రీమత్కందాళ బాలసరస్వతి