కథ

ఆత్మసంభాషణ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్ధరాత్రి దాటింది. స్టేషన్‌లో ఆగిన ఆ ట్రైన్‌లోంచి నేనూ, నాలుగయిదు బోగీల అవతల మరో మనిషీ దిగాం. ఎక్కేవాళ్లు ఎవరూ కనిపించలేదు. ఇంజను బద్దకంగా కూతవేసి తన ప్రయాణాన్ని కొనసాగించింది.
జనవరి మాసపు చలి. స్టేషన్ చుట్టూ పెరిగిన చెట్లు, బయలు ప్రదేశం, చలిని మరింత ఎక్కువ చేస్తున్నాయి. స్టేషన్ మొత్తానికి ఒకే ఒక మెర్క్యురీ లాంపు. లాంపు చుట్టూ దట్టంగా మూగిన దీపపు పురుగులు. స్టేషన్ ఆవరణ అంతా గుడ్డి వెలుతురు పరచుకుని ఉంది. ఆ ఊరు నాకు కొత్త కాకపోయినా, చీకటి, ఒంటరితనంలోంచి పుట్టుకొచ్చిన తడుములాట.

వదులైన మఫ్లర్ విప్పి తలకు మళ్లీ గట్టిగా చుట్టుకున్నాను. రైల్వే కళాసీ అనుకుంటాను చంకలో ఏదో వస్తువును ఇరికించుకుని, చేతిలో జెండాలు పట్టుకుని స్టేషనుకు దూరంగా కాసేపు నడిచి అదృశ్యమయ్యాడు. తెల్లవారితే కాని మరో ట్రైన్ ఆ స్టేషన్‌గుండా వెళ్లే అవకాశం లేదు. రైల్వే సిబ్బందికి అలా ‘ఇన్‌స్టాల్‌మెంట్’ నిద్ర అలవాటే! ముందు స్టేషన్‌లో ట్రైన్ బయలుదేరిందన్న సమాచారం అందగానే ‘ఎలర్ట్’ అయిపోతారు.
చిన్న ఊరు. ఆ స్టేషన్‌లో ప్యాసింజర్ బళ్లు తప్ప మరే బళ్లు ఆగవు. అందుకని వెయిటింగు రూంలాంటి హంగులేమీ లేవు. తన చిన్నతనంలోనయితే స్టేషన్‌లో రెండు మూడు కర్ర స్తంభాల మీద గాజు తలుపుల వెనుక కిరసనాయిలు దీపాలు ఉంచేవారు. ఊరికి దూరంగా ఉండటంవల్ల ఎప్పుడో కాని స్టేషనుకు రావాల్సిన అవసరం ఉండేది కాదు.
కాళ్లు విరిగిన ఓ సిమెంటు బెంచీ మీదా కాసేపు కూర్చున్నాను. పున్నమి దగ్గర పడింది కాబోలు చంద్రుడు ఆకాశంలో ప్రకాశవంతంగా వెలుగుతూ పయనిస్తున్నాడు. నిజానికి పయనించేది భూమీ, భూమీదున్న జనం. కాని మనం స్థిరంగా ఉండి చంద్రుడు పయనిస్తున్నట్లు భ్రమ. ఏది నిజమో ఏది భ్రమనో తెలియనితనం, పట్టణాల్లో ఇరుకు ఇరుకు సందుల్లోకి రావటానికి చంద్రుడు జంకుతాడు కాబోలు! అమావాస్య అయినా, పున్నమి అయినా, కరెంటు దీపాలే దారి చూపటం.
దారి చూపటం అంటే గుర్తుకు వచ్చింది. నా చిన్నతనాన అత్యవసరమై, అమ్మ నన్ను పక్క వీధిలోకి వెళ్లి రమ్మంది. రాత్రి. చీకటి. ‘అమ్మో నాకు భయం’ అన్నాను. ‘నీ కోసం చాలా ఎత్తున ఓ పే...ద్ద.. దీపం ఉంచాను. అది నీ వెంటే తోడు వస్తుంది. ఏం భయం లేదు. వెళ్లు’ అంది. ఆనాడు నిజంగానే చంద్రుడు నా వెంటే వచ్చాడు. నేను ఆగిపోతే తనూ ఆగిపోవటం. నడక మొదలెడితే... తనూ నడవటం... ఆశ్చర్యం వేసింది. ‘ఎంత గొప్ప అమ్మ’ అనుకున్నాను.
చీమ కాబోలు, చెప్పులోకి దూరి కుట్టింది. చటుక్కున కాలు విదిలిస్తూ మళ్లీ ఈ లోకంలో పడ్డాను.
కాళ్లు విరిగిన ఆ సిమెంటు బెంచీ మీద తెల్లారేదాకా, చీమల్నీ, దోమల్నీ తోలుకుంటూ కూర్చోవటమా, లేక వెనె్నల్లో నెమ్మదిగా ఊరిదాకా నడక సాగించటమా.. కాస్సేపు మల్లగుల్లాలు పడి, నడకే నయమనుకున్నాను. పైపెచ్చూ లగేజీ కూడా ఎక్కువ లేదు. బ్యాగులో ఓ జత దుస్తులు, లోదుస్తులు, ఓ టవలు అంతే.
స్టేషన్ బయటకు వచ్చాను. జన సంచారం లేదు. నాతోబాటు ట్రైను దిగిన వ్యక్తి అప్పుడే నడిచి ఊరివేపు వెళ్లాడు. కనపడలేదు.
నేను వెళ్లాల్సింది ఆ ఊరికి పది కిలోమీటర్ల దూరంలో వున్న మరో చిన్న ఊరు. బాల్య స్నేహితుడు వెంకటరమణ మనవరాలి పెళ్లికి వెళ్తున్నాను. రమణ దగ్గర్నుంచి కార్డు రాగానే రావటానికి నిశ్చయించుకున్నాను. కారణం, ఈ విధంగానైనా స్నేహితులందరినీ కలిసినట్లవుతుంది. రమణ మాట తీసివేయలేక పెళ్లికి వచ్చినట్లూ ఉంటుంది - ఇదీ నా ఆలోచన.
మరో రెండు గంటలు గడిచి, తెల్లారాక గాని ఆ ఊరికి వెళ్లే బస్సు కదులుతుంది.
రైల్వేస్టేషన్ నుండి కాస్త దూరం నడిచి చెరువు కట్ట ఎక్కాను. చెరువు కట్ట అవతలివేపు నేను వెళ్లాల్సిన ఊరు బస్సులు ఆగుతాయి. అక్కడకు చేరితే ఎవరైనా ప్రయాణికులు కలిస్తే, కాస్త కాలక్షేపం అవుతుంది.
సాయంత్రం ఏడు గంటలకే తిని బయలుదేరాను. ఆకలి అనిపించింది. ఇప్పుడెలా ఉందో కాని ఆ రోజుల్లో, చెక్క గోడలు, టిన్ను రేకుల పైకప్పుతో రెండు ‘్ఠలాలు’ ఉండేవి. బీడీ, సిగరెట్లు, పాన్‌లు, గాజు సీసాల్లో బిస్కట్లు, మురుకులు ఉంచి అమ్మేవారు. ‘నాలుగు బిస్కట్లు తిని దొరికితే చాయ్ తాగితే, ఆకలికి కాస్త ఉపశమనం’ అనుకున్నాను.
చెరువు కట్ట మీంచి నడవటం ప్రారంభించాను. కుడివేపు చెరువు, ఎడంవేపు పల్లంలో ఊరు ఉంది. ఊళ్లోకి కరెంటు వచ్చింది. అక్కడ కూడా లైట్లు గుడ్డిగా వెలుగుతున్నాయి.
దూరాన అప్పుడప్పుడు కుక్కల అరుపులు వినపడ్తున్నాయి. ఎదురుగా ఎవరో మనిషి వస్తున్నట్లు మనిషి ఆకారం కనిపించింది. ‘ఇంత రాత్రి ఎవరై ఉంటారు’ అనుకున్నాను.
‘ఎవరదీ’ అంటూ కేకవేశాను. ఊళ్లో ఇలా పలకరించటం మామూలే! బక్కపల్చని ఆకారం. కొంచెం కుంటుతోంది. ‘్భస్కర్ కాదు కద’ అనుకున్నాను.
అవుననిపించింది. ‘ఇంతరాత్రి వీడికి ఇక్కడేం పని’ అనుకున్నాను. భాస్కర్ నా బాల్య స్నేహితుడు. ఒకరంటే ఒకరం ప్రాణం పెట్టేవాళ్లం. టీచర్‌గా రిటైరయ్యాడు. కేన్సర్‌తో భార్య పోయింది. ఇద్దరు కొడుకులు కోడళ్లు ఉన్నా, ఒంటరిగానే ఉంటున్నాడు. కాస్త చాదస్తం తలతిక్క మనిషి భాస్కర్.
ఎదురుగా వస్తున్న ఆ మనిషి తలకు, ముఖానికీ గుడ్డ చుట్టుకున్నాడు. గుడ్డ కాస్త తొలగినట్లనిపించింది. చంద్రుడు మబ్బుల్లోకి పోయాడు కాబోలు, గుడ్డి వెలుతురుగా ఉంది.
‘్భస్కర్’ అన్న పిలుపునకు ‘ఊఁ’ అన్న జవాబు వినపడింది. నాకు సంతోషం కలిగింది. ఆ ఊరి బస్సు వచ్చేదాకా స్నేహితుడితో కాలక్షేపం. అనుకోని అవకాశం!
ఇద్దరం చెరువుకు అవతలి గట్టుకు నడిచి తూము మీద కూర్చున్నాము. తూములోంచి అవతలి వేపునకు నీరు జారుతున్న చప్పుడు తప్ప, అంతా నిశ్శబ్దం. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ కప్పల బెకబెకలు, చిమ్మెటల సంగీతం, చెరువు గట్టుకు కుడివేపు కొంత దూరంలో స్మశానం ఉంది. ఎవరిదో చితి కాల్తోంది. సగం కాలిన చితిలో ఎర్రగా నిప్పులు కనిపిస్తున్నాయి.
నేను అదే పనిగా వాగుతున్నాను, వాడి నుండి ‘ఆఁ’ ‘ఊఁ’ అన్న పొడి పొడి సమాధానాలే వస్తున్నాయి. నాకిది మామూలే! భాస్కర్ మూడీ. ఇంట్లో గొడవలయినప్పుడు నన్ను ఈ తూము మీదకు లాక్కొచ్చేవాడు.
నేను వాగటం వాడు వౌనంగా వినటం.
‘ఇనే్నళ్లయినా వెధవ మారలేదు’ అనుకుంటూనే కబుర్లు దొర్లిస్తున్నాను.
తెల్లవార్తోంది ఇంకా చీకటిగానే ఉంది. చెరువు కట్ట అవతలి వేపు బస్టాండ్‌లో బస్సు వచ్చినట్లు ఇంజన్ మోత. బస్సు హారన్ వినపడింది.
‘ఇక వెళ్తాను’ అంటూ లేచాను. వాడింకా అక్కడే కూర్చున్నాడు. నిశ్చలంగా, నిర్వేదంగా, ఉలుకూ పలుకూ లేకుండా.
వాడెప్పుడూ ఇంతే. వాడి ప్రవర్తన నాకు కొత్త అనిపించలేదు.
నేను వెళ్లేసరికి బస్సు నిండిపోయింది. నా చలువ గుడ్డలు, నాజూకుతనం, వయసు గమనించి ఒకాయన లేచి నాకు చోటిచ్చాడు. గతుకుల రోడ్డు. బస్సు నెమ్మదిగా సాగుతోంది. ఉషోదయం వేళకు ఆ ఊరు చేరాను.
ఆ ఊళ్లో రమణ స్థితిమంతుడే! ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఒకడు అధునాతన పనిముట్లతో వ్యవసాయం చేస్తాడు. మరొకడు కాంట్రాక్టరు. పాలస్ లాంటి ఇల్లూ, నౌకర్లు, కార్లు. ఇప్పుడు పెద్ద కొడుకు కూతురు పెళ్లి. ఇంటి ముందు అర ఎకరం మేర షామియానాలు వేసి ఉన్నాయి. కొబ్బరాకులూ, బంతిపూల దండలు, జనరేటర్, లైటు బల్బులు, పెళ్లి పందిరి, మండపం. అలంకరణ భారీగానూ, అధునాతనంగానూ ఉంది.
రమణకు నా రాక చాలా సంతోషం కలిగింది. ఆప్యాయంగా ఒకర్నొకరు కౌగిలించుకున్నాం.
నాకో గది కేటాయించి, ఓ నౌకరుకు నా బాధ్యత అప్పగించి వెళ్లాడు. ఊళ్లో రమణకు ఉన్న గౌరవం, భక్తీ చూస్తూంటే ముచ్చటేసింది. పదో క్లాసు పాసవగానే వాళ్ల నాన్న రమణ చదువు మానిపించాడు. మేమంతా, పియుసి చదువుకు కాలేజీ వెళ్తుంటే రమణ బాధపడేవాడు. ‘ఒరే! మీరంతా అదృష్టవంతులురా. పై చదువులకు వెళ్లగలుగుతున్నారు’. ఆనాటి రమణ మాటలు నా మనసులో మెదిలాయి. ఆ తర్వాత ప్రైవేటుగా బి.ఏ. పాసయ్యాడు.
చదువు మానిపించి వ్యవసాయం రమణ భుజాన వేసి, వాళ్ల నాన్న మంచి పనే చేశాడనిపించింది. మగ పెళ్లివారు కూడా, రమణకు, ఇద్దరబ్బాయిలకూ ఇచ్చే గౌరవం చూసి ముగ్ధుడనయ్యాను.
రెవిన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ప్రముఖ వ్యాపారులు. జిల్లా అంతా పెళ్లికి వచ్చినట్టనిపించింది. విస్తరాకుల్లో టేబుల్ భోజనం, పది రకాల స్వీట్లతో విస్తరి నిండిపోయింది. రమణ, వాడి ఇద్దరు కొడుకులూ కలియ తిరుగుతూ, ఒక్కొక్కర్ని పేరుపేరున పిలుస్తూ, వడ్డనని పర్యవేక్షించారు. భోజనానంతరం రమణకు కాస్త తీరిక చిక్కింది. ఆప్యాయంగా పాత కబుర్లు, ఆనాటి మనుషుల్నీ నెమరువేసుకున్నాము.
మాటల సందర్భంలో మధ్యరాత్రి ట్రైన్ దిగానని, చెరువు గట్టు మీద నేనూ, బాల్య స్నేహితుడు భాస్కర్ కబుర్లు చెప్పుకున్నామని అన్నాను.
ఒక్కసారిగా రమణ ముఖం గంభీరంగా మారిపోయింది.
‘ఏంటీ, భాస్కర్‌తో మాట్లాడావా?’ అన్నాడు.
‘అవును ఏం?’ అన్నాను.
‘వాడు చనిపోయి వారం రోజులయింది’ అన్నాడు రమణ.
ఒక్క నాకు మాత్రమే వినపడేంత లో గొంతుతో.
*

కూర చిదంబరం.. 888 555 2423

-కూర చిదంబరం