ఈ వారం కథ

మృగ మైదానం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కమాన్ స్వరూపా.. మాట్లాడు సిగ్గెందుకు?..’’ అంది వింధ్య.
‘‘వద్దక్కా. నాకు భయం..’’ అంది స్వరూప.
‘‘హే.. ఇదంతా కామన్.. నివాస్ మనకు సీనియర్.. ఆ మాటకొస్తే లాస్ట్ ఇయర్ మమ్మల్ని ఇంకా సతాయించేవాళ్లు. ‘లైట్’ తీస్కో’’ అంది వింధ్య. భయం.. భయంగా ఫోన్ అందుకుంది స్వరూప..
‘‘ఎందుకు అంత బెట్టుచేస్తున్నావ్.. నినే్నమైనా కొరుక్కుతిన్నామా.. నీ ఫ్యామిలీ డీటైల్స్ చెప్పు చాలు..’’ అన్నాడు నివాస్.
‘‘అమ్మా.. నాన్న..’’ స్వరూప మాట పూర్తికాకముందే-
‘‘ఒక తమిళమ్మాయి’’ పూర్తిచేశాడు. మళ్ళీ తనే..
‘‘దద్దోజనం.. ఫ్యామిలీ డీటైల్స్ అంటే నాన్న ఏం చేస్తాడు, అమ్మ ఏం చేస్తుంది..’’ నివాస్ ప్రశ్న పూర్తికాకముందే ‘‘అమ్మ గృహిణి.. నాన్న వ్యవసాయం..’’
‘‘ఇంకా ఆత్మహత్య చేసుకోలేదా..’’ పక్కున నవ్వేవాశాడు.. స్వరూపకి కోపం వచ్చింది.
‘‘సర్.. ఇది టూమచ్..’’ అంది. ‘‘ఏంటి ఆత్మహత్య చేసుకోకపోవడమా..?’’ అన్నాడు అల్లరిగా.
‘‘ఏం.. మీ నాన్న ల్యాండ్ లార్డా.. ముష్టి వుండేది మూడెకరాలేగా’’ అన్నాడు.. దెబ్బతిన్నట్లు చూసింది.
వింధ్య నిర్లక్ష్యంగా గోళ్లకు రంగేసుకుంటుంది. ఫోన్ ‘కట్’చేసి వింధ్యవైపు చూసింది.
‘‘ఏం చెప్పాలి ఆయనకి.. ఆల్ రెడీ నువ్వు చెప్పేశావుగా..’’ అంది కోపంగా.
‘‘శంకువులో పోస్తేనే తీర్థమట.. నువ్వు చెబితే వినాలన్నది అతగాడి తపన..’’ అంది వింధ్య.
స్వరూప ప్రెషర్.. వింధ్య సెకండ్ ఇయర్.. నివాస్ ఫోర్త్ ఇయర్. ముందు రోజు వెళ్తున్న వింధ్యని పిలిచి.. ‘‘నీ పేరు..’’ అడిగాడు నివాస్.. చెప్పింది వింధ్య.
‘‘నీ రూంలో జూనియర్స్ ఎవరు దిగారు..’’ అడిగాడు నివాస్.
‘‘మహబూబ్‌నగర్ జిల్లా అమ్మాయి.. పేరు స్వరూప...’’ చెప్పింది వింధ్య.
‘‘నా నెంబర్ నోట్ చేసుకో..’’ అని చెప్పి.. ‘రింగ్’ ఇవ్వమన్నాడు.
వింధ్య ఇచ్చాక.. ‘‘పాలమూరు పాప ఇంట్లో వాళ్ళు ఏం చేస్తుంటారు..’’ అడిగాడు.
తనకు తెలిసిన డీటైల్స్ చెప్పింది. ‘‘నువ్వు గదికి వెళ్ళాక మాట్లాడించు..’’ అన్నాడు.
అందుకే వింధ్య మాట్లాడించింది. వింధ్య ఫోన్ మరో రెండుసార్లు మ్రోగింది.
వణికిపోయింది వింధ్య. ‘‘ఏదో ఒకటి పాజిటివ్‌గా మాట్లాడి ఫోన్ పెట్టవే.. లేకపోతే సీనియర్ నన్ను సతాయిస్తాడు’’ అంది భయంగా.
‘‘ఏం మాట్లాడాలక్కా.. మీ నాన్న ఆత్మహత్య చేసుకోలేదా? అని అడుగుతున్నాడు’’ అంది డెస్పరేట్‌గా స్వరూప.
‘‘అదంతా కామన్.. ఏదో ఒకటి మాట్లాడు..’’ అని ఫోన్ ఆన్ చేసి స్వరూపకి ఇచ్చింది.
నివాస్ స్వరంలో కోపం కన్పించింది.. ‘‘ఏం దీమాక్ చెడిందా.. ఫోన్ కట్ చేశావేంటి?’’ అడిగాడు.
‘‘మీరు అడగడం బావోలేదు కదా..’’ అంది.
‘‘అందులో తప్పేం వుంది. గిట్టుబాటు ధర లేదని ఒకరు, బోర్ వేయిస్తే నీళ్ళు పడలేదని ఒకరు, నకిలీ పురుగుమందులతో నష్టపోయామని మరొకరు.. మీ జిల్లాలో రైతులు పోతున్నారు కదా..? ఆ జాబితాలో మీ నాన్న కూడా ఉన్నాడేమో అని అడిగా, తప్పేం వుంది..’’ అన్నాడు.
కోపం తమాయించుకొని ‘‘ఐనా మీరిలా అడగడం’’ అంటుంటే ఆపేసి-
‘‘పిచ్చి పుల్లమ్మా.. ఇవాళ కాకున్నా రేపైనా అలాంటి పరిస్థితి వస్తే ప్రాణాలు తీసుకోక తప్పదు కదా..’’ అంటుంటే మరోసారి కట్ చేసి ‘స్టుపిడ్’ అనుకుంది స్వరూప.
మళ్లీ ఫోన్ చేశాడు. వింధ్య భయంతో ‘లిఫ్ట్’ చేసింది.
‘‘సరే.. తనకొక ఆఫర్ ఇస్తున్నా చెప్పు.. వాళ్ళ ‘అయ్య’కి ఏమైనా అయితే ఆదుకోవడానికి ఈ నివాస్ ఉన్నాడని చెప్పు.. బట్ ఒన్ కండిషన్.. నేనేం చెబితే అది చెయ్యాలి..’’ అన్నాడు వింధ్యతో.
ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ‘ఎస్.. సర్...’’ అని ఫోన్ పెట్టేసింది.
స్వరూప వైపు తిరిగి ‘‘వెధవలు వెధవ వాగుళ్ళు ఏవో వాగుతారు. మనం మనసుకి పట్టించుకొంటే ఎలా? నెక్స్‌ట్ ఇయర్ నువ్వు కూడా మరో అమ్మాయికి నీ ఫోన్ కలిపి ఇస్తావ్.. ఇదంతా ‘నార్మల్’ ఇక్కడ’’ అంది.
‘‘మన పేరెంట్స్‌ని డ్యామేజింగ్‌గా మాట్లాడితే ‘నార్మల్’ ఎలా అవుతుందక్కా..’’ అంది కోపంగా స్వరూప.
‘‘ఇంతకుమించి గొడవ పడితే క్యాంపస్‌లోని ముళ్ళపొదల్లోకి తీసుకెళ్ళి.. నీ పెదవులు బావున్నాయ్.. అవి నాకివ్వు అని ముద్దు పెడతారు.. ఇంకా గింజుకుంటే ‘టాప్’ తీసి పంపుతారు. వన్ ఇయర్ తలవూపు.. అంతా సర్దుకుంటుంది..’’ అంది వింధ్య. స్వరూప కళ్ళలో నీళ్లు తిరిగాయి.
‘‘ప్చ్.. ఓ.. గాడ్.. ఇది యూనివర్సిటీ క్యాంపసా.. అడవా..’’ అంది స్వరూప.
‘‘ఇది క్యాంపసే.. వాళ్ళు మృగాలే..’’ అంది వింధ్య.
‘‘ప్రిన్సిపల్.. ప్రొఫెసర్లు వీళ్ళకు బుద్ధి చెప్పరా?..’’ అడిగింది ఆసక్తిగా స్వరూప.
‘‘రిటెన్‌గా కంప్లైంట్ ఇవ్వమంటారు.. ఇచ్చే ధైర్యం ఎవరికి వుంది? మూడేళ్ళ క్రితం.. రాగిణి అనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందట.. ‘కట్’ చేస్తే మన కాలేజీ మూడో అంతస్తుమీదనుండి ఆ అమ్మాయి దూకి చనిపోయిందట.. వాళ్ళు పైకి వెళ్ళి తోసారో.. ఆ అమ్మాయి పడిపోయిందో.. ఎవరికీ తెలీదు. ఇటువంటి కథలు వినపడబట్టే ఎవరికివాళ్లు నోరు కట్టేసుకొని వుంటారు.. ఒకటే సుగుణం ఏంటంటే, కేవలం జూనియర్స్‌ని మాత్రమే ‘ర్యాగింగ్’ చేస్తారు.. సెకెండ్ ఇయర్.. థర్డ్ ఇయర్ వాళ్లు కోపరేట్ చేయాలి.. కోపరేట్ చేయకపోతే నరకం చూపుతారు..’’ అంది.
‘‘నాకు భయంగా వుందక్కా..’’ అంది స్వరూప.
‘‘్ఫస్ట్ ఆరునెలలే ర్యాగింగ్ వుంటుంది.. ఆ తర్వాత ఎవరి చదువుల్లో వాళ్లు పడిపోతారు..’’ ధైర్యం చెప్పింది వింధ్య. ‘‘మనసు చితికిపోవడానికి ఆరు నెలలు చాలదా..?’’ గొణుక్కుంది స్వరూప.
‘‘నేను మంచిదాన్ని కాబట్టి కొంత అలర్ట్ చేస్తున్నాను.. ఇంకెవరన్నా సీనియర్ చేతుల్లో పడితే... నీ పరిస్థితి దుర్భరం. పైన ‘టాప్ తీసి’‘ ఫొటో ఇవ్వమంటారు. ఆ ఫొటోని వాళ్ళ వాట్సప్‌లో పంపమంటారు.. అది మిగతా వాళ్ళకు ఫార్వర్డ్ చేసి ఆనందిస్తారు...’’ వాంతి వచ్చినంత పనైంది స్వరూపకి.
‘‘ఓ.. గాడ్..’’ అంది.
‘‘ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ వుంటాయి.. మన ఇడియట్స్ ప్రొఫెసర్లు కూడా ఈ సీనియర్ల చేతుల్లో వుంటారు. పరస్పరం లింకులు వుంటాయి.. ‘హఠం’ చేసే అమ్మాయిల మార్కులు ‘కట్’ చేయిస్తారు. ఇంకా చాలా వున్నాయ్.. అవన్నీ చెబితే అన్నం కూడా తినవు..’’ అంది వింధ్య.
ప్రక్కరోజు స్వరూపకి జ్వరం వచ్చింది.. క్యాంప్‌కి వెళ్లాలంటే భయం వేస్తుంది.
రెండ్రోజుల తర్వాత జ్వరం తగ్గి వెళ్లింది. వెనుకనుండి ఎవరో పిలుస్తుంటే ఆగింది..
తన ప్రక్కనున్న కొలీగ్స్ ఇంద్రజ, కోమలి గబగబా ముందుకెళ్ళారు.
‘‘ఏయ్.. పాలమూరూ.. ఏంటి జ్వరమొచ్చిందట కదా..?’’ అడిగాడు అతడు.
అతడు నివాస్ అని అర్థమైంది.
‘‘నీ రూమ్మేట్ వింధ్య చెప్పిందిలే.. ఇదిగో నమ్మకపోవడంతో నువ్వు జ్వరంతో వణుకుతున్న ఫొటో ‘వాట్సప్’లో పంపింది’’ తన మొబైల్ ఓపెన్ చేసి చూపాడు.. హడలిపోయింది.
తాను జ్వరంతో మూలుగుతుంటే.. తనకి తెలియకుండా వింధ్య ఎప్పుడు ఫొటో తీసింది.. ఎలా జరిగింది ఇది. కోపం వచ్చింది.
‘‘ఎక్కువ ఆలోచించకు.. మాక్కావాలనుకుంటే నీ బాత్‌రూం ఫొటోస్ కూడా అందుతాయ్’’ అన్నాడు నివాస్.
‘‘ఎందుకు మీరిలా జూనియర్స్‌ని ఇబ్బంది పెడుతున్నారు..’’ అడిగింది కోపంగా.
‘‘ఎంజాయ్ బేబీ.. ఎంజాయ్.. నెక్ట్స్ ఇయర్ నువ్వు నీ జూనియర్స్‌ని ‘ర్యాగ్’ చేస్తావ్ కదా?!..’’ అన్నాడు.
‘‘అదంతా నాకు తెలియదు సర్.. మా నాన్న నిరుపేద రైతు.. బాగా కష్టపడి చదివించాడు. కష్టపడి నేను సీటు సంపాదించాను.. ఇంజనీరింగ్ పూర్తయ్యాక జాబ్ చేసి అమ్మా నాన్నను చూసుకోవాలి..’ అంది.
‘‘అబ్బో ఈ సినిమా కథలు క్యాంపస్‌లో చేరిన తొలి రోజుల్లో ఎవరైనా చెబుతారులే.. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఎవరో ఒకడ్ని పట్టి.. ఎగిరిపోతారు.. కనీసం పెళ్లి చేసుకున్నామని కూడా ఇంట్లో చెప్పరు. లివింగ్ టుగెదర్.. జాబ్ వచ్చింది.. అని లవర్‌తో కలిసి బ్రతికేస్తుంటారు..’’
‘‘ఏం మాట్లడుతున్నాడు ఇతడు..? తనని కూడా అలాగే చూస్తున్నాడా?..’’’ అనుకొని..
‘‘ఇప్పుడు ననె్నందుకు ఆపారు?..’’ అడిగింది. ‘నెంబర్ ఇవ్వు..’ చెప్పాడు.
‘‘ఎందుకు..’’ అడిగింది పీలగా.
అతడు సమాధానం చెప్పకుండా.. స్వరూప చేతుల్లోంచి ఫోన్ లాక్కొని ఆ అమ్మాయి సెల్లోంచి.. తన సెల్‌కి నెంబర్ నొక్కాడు. రింగ్ పోలేదు.. ‘బ్యాలెన్స్ లేదు..’ చెప్పింది.
‘‘అనుకున్నా.. ఈ డబ్బా ఫోన్‌లో రింగ్‌కి కూడా డబ్బులుండవని అనుకున్నా..’’ అని, స్టార్ ఒన్ యాష్ నొక్కాడు.. ఆ సిమ్ నెంబర్ స్క్రీన్‌మీద కన్పించింది.
నెంబర్ నోట్ చేసుకుని.. స్వరూపకి ఫోన్ ఇచ్చి.. ‘‘బోర్ కొట్టినపుడల్లా ఫోన్ చేస్తూంటా.. కొండొకచో రొమాంటిగ్గా కూడా మాట్లాడుతుంటా.. నీకు ఇంట్రస్ట్ వుంటే పోర్న్ మూవీస్ గురించి కూడా.. డిస్కస్ చేస్తుంటా.. మాట్లాడుతూ వుండు..’’ అని వెళ్లిపోయాడు.
స్వరూప గుండెలు లబలబ లాడిపోయాయి.
రొమాంటిక్.. పోర్న్ మూవీస్ గురించా? ఓ గాడ్.
తొమ్మిదవుతుండగా నివాస్ నుండి ఫోన్ వచ్చింది.
‘‘వాట్ డార్లింగ్ ఎలా వున్నావ్..’’ అని మొదలుపెట్టి టాపిక్ తనకి ఇష్టం వచ్చిన వైపు తీసుకెళ్ళాడు.
వంటిపైన పాములూ, జర్రెలూ పాకిన ఫీలింగ్.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అప్పటికే ఆ అమ్మాయి వంటికి చెమట్లు పట్టాయి. తెల్లారిందాకా నిద్రపోకుండా గడిపింది. వింధ్య ఇదేమీ పట్టించుకోకుండా నిద్రపోతోంది.
ఎలా ఎదుర్కోవాలి? ప్రక్కరోజు జ్వరం పేరు చెప్పి క్యాంపస్‌కి వెళ్ళలేదు.
వింధ్యకి ఫోన్ చేశాడు నివాస్. ‘‘్ఫన్ జూనియర్‌కి ఇవ్వు..’’ అన్నాడు రెక్‌లెస్‌గా.
భయంతో ఆ ఫోన్ అందుకుంది స్వరూప.. ‘‘ఏంటి జ్వరమా? తరచూ ఎందుకు వస్తుంది.. కొంపదీసి హెచ్.ఐ.వి లేదు కదా..’’ అన్నాడు. స్వరూపకి ఆత్మాభిమానం గాయపడింది.
‘‘షటప్ రాస్కేల్..’’ అంది.. వింధ్య భయంగా చూసింది.
‘‘ఏంటే ఆలా తిట్టేశావ్..’’ అంది భయంగా.
‘‘ఏంటక్కా ఇది.. ఎక్కడున్నాం మనం. ఎన్నో కష్టాలు పడి అమ్మా నాన్న మనల్ని చదివిస్తుంటే ఈ మృగాల చిత్రహింసలు ఏంటి?..’’ అంది నిర్వేదంగా. స్వరూప కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయ్.
‘‘వీళ్ళని ఏం చేయలేమా అక్కా?’’ అంది స్వరూప. కాసేపటి తర్వాత వింధ్య స్వరూపని హత్తుకొని ‘‘ఐయామ్ సారీ స్వరూపా.. నీ బాధకు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో నేనూ కారణమే కదా..’’ అంది.
అవునూ కాదూ అనకుండా చూసింది స్వరూప.
‘‘నన్ను చదివించడం కోసం మా అమ్మ.. ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది స్వరూపా.. ఎలాగైనా ఈ ప్రొఫెషనల్ కోర్సును కంప్లీట్ చేసుకొని జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను.. వాడి కబంధ హస్తాల నుండి అమ్మను కాపాడుకోవాలనుకుంటున్నాను.. అందుకే అన్నీ దిగమింగుకొని బ్రతుకున్నా..’’ అంది.
స్వరూప జాలిగా.. సానుభూతిగా వింధ్యవైపు చూసింది..
రాత్రంతా స్వరూప నిద్రలేని రాత్రిని గడిపింది. స్వరూప చాలా సెన్సిటివ్ అని వింధ్యకి అర్థమైంది.
తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని తను కూడా మేల్కొని గడిపింది.
తెల్లవారు జామున వింధ్యకు కునుకుపట్టింది.
ఉలిక్కిపడి లేచింది.. తాను కన్నది పీడకల.. స్వరూప కూడా నిద్రపోతోంది.
ముఖం ప్రశాంతంగా వుంది. ఆలస్యంగా నిద్రలేచినా.. బాగా ముస్తాబై..
‘‘అక్కా నివాస్‌కి ఫోన్ చెయ్యి, అతడ్ని కలవాలి..’’ అంది.
విస్తుపోయి చూసింది వింధ్య.. ‘‘ప్లీజ్ చెయ్యక్కా..’’ అంది. అప్రయత్నంగా రింగ్ చేసింది.
‘‘వాట్ మేడమ్ ఇంత ఎర్లీగా ‘కాల్’ చేశారు’’ అడిగాడు.
‘‘జూనియర్ స్వరూప మిమ్మల్ని కలవాలనుకుంటోంది సర్..’’ అంది.
‘‘ఏంటి దద్దోజనమా?..’’ అడిగాడు నవ్వుతూ.
‘‘అలా ఫిక్సయ్యిపొయ్యారా..?’’ అంది తను కూడా నవ్వుతూ.
‘‘రాత్రి మంచి మూడ్‌లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది...’’ అన్నాడు.
‘‘ఏం మంత్రం వేశారో... సూపర్‌గా రెడీ అయ్యింది. మిమ్మల్ని కలవాలని అంటోంది..’’ అంది.
‘‘ఓ.. మై గుడ్‌నెస్.. లవ్వూ.. గివ్వూ అంటుందేమో.. నాకు మా అత్త కూతురు రెడీగా వుంది.. అరకోటి కట్నంతో మరీ..’’ అన్నాడు. ‘‘అదంతా నాకు తెలీదు బాబూ...’’ అంది.
‘‘సరే, డి బ్లాక్ దగ్గరున్న పార్క్‌కి రమ్మను..’’ చెప్పాడు. ‘‘సరే’’ అంది వింధ్య.
‘‘అక్కా నువ్వు కూడా రావా..’’ అడిగింది స్వరూప. అయిష్టంగా ‘సరే’నంది వింద్య.
‘‘రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నావ్. ఇంత సడెన్ ఛేంజ్ ఏంటి?’’ అంది వింధ్య.
స్వరూప ఏమీ మాట్లాడలేదు.
‘‘నే చెప్పాగా.. తక్కువ కాలంలో అడ్జస్ట్ అయిపోతారు కొందరు.. నువ్వు చాలా ‘స్మార్ట్’ ఇంకా త్వరగా ఛేంజ్ అయ్యావు..’’ అంది. స్వరూప ఏం మాట్లాడకుండా నవ్వింది.
పది గంటల ప్రాంతంలో పార్క్ దగ్గరకు చేరారు ఇద్దరూ..నివాస్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. స్వరూప అంత ముస్తాబై వస్తుందని అతడనుకోలేదు. రెప్ప వేటులో జరిగింది ఆ సంఘటన..
కాలికి వున్న చెప్పు తీసి.. నివాస్‌ని ఫట్... ఫట్.. మని కొట్టింది.
యాభై ఏళ్ల వ్యక్తి సడెన్‌గా రెక్కలు విరిచి పట్టుకున్నాడు.. ‘‘గట్టిగా పట్టుకో నాన్నా వీడ్ని...’’’ అంది.
సడెన్‌గా అక్కడ కెమెరాలు ప్రత్యక్షమయ్యాయి.
నివాస్ నిరుత్తరుడయ్యాడు. క్షణాల్లో ఈ వార్త ‘లైవ్’లోకి వెళ్లిపోయింది.
వింధ్య కూడా ఈ పరిణామం ఊహించలేదు.
పాతికేళ్ళ యువకుడు ఒక వ్యక్తిని తన వెంట పెట్టుకొని రావడం గమనించింది వింధ్య.
ప్రిన్సిపల్.. సుబ్రహ్మణ్యం. మైకులు ముందుకు వెళ్ళాయి.
‘‘నివాస్‌లాంటి చీడపురుగుల్ని క్యాంపస్ నుండి ఏరివేస్తాం. నివాస్ తనని ఎలా ర్యాగింగ్ చేస్తున్నాడో నిన్న రాత్రే నాకు ఫోన్ చేసి చెప్పింది.. స్వరూప. ఇతడు మిస్టర్ వివేక్. జర్నలిస్టు మాత్రమే కాదు.. స్వయాన స్వరూప బావ. ఇతడిచ్చిన తోడ్పాటు చొరవతోనే ధైర్యంగా నివాస్‌ని పట్టించింది. అతడి మాటల్ని రికార్డు చేసి వాట్సప్ ద్వారా మాకు చేర్చింది..’’’ చెప్పాడు ప్రిన్సిపాల్.
అప్పటికే అక్కడికి చేరిన మహిళా విద్యార్థినులు.. ముఖ్యంగా జూనియర్స్ స్వరూపని అభినందనగా చూశారు..
కెమెరాలు స్వరూప తండ్రి కొమరయ్య వైపు ఫోకస్ చేశాయ్.
‘‘నా బిడ్డ స్వరూప క్యాంపస్‌లో జరిగినవి నాకు చెప్పడానికి వెనుకా ముందూ ఆడింది.. నా చెల్లెలు కొడుకు నా అల్లుడు వివేక్‌కు చెప్పుకుంది. వీడు నాకు చెప్పాడు. చదువుకంటే నీకు గౌరవం ముఖ్యం. తిరుగుబాటు చెయ్యమని చెప్పా.. అందులో భాగమే ఇదంతా.. భయపడితే జంతువులు భయపెడుతూనే వుంటాయమ్మా.. పట్టి బంధించాలని చెప్పా..’’ చెప్పుకుపోతున్నాడు కొరమయ్య.
హర్షాతిరేకాలు మిన్నంటాయ్... *

రచయిత సెల్ నెం:9849241286

- శరత్ చంద్ర