ఈ వారం కథ

వెస్టిబ్యూల్ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలుపు చప్పుడయ్యింది. రామభద్రం నిద్రనుండి మెలకువలోకి వచ్చాడు. ఆయన మంచం దిగి తలుపును సమీపించే లోపుగా మరోసారి తలుపుమీద బాదిన చప్పుడయ్యింది. ఈసారి ఆయనను ‘బాబాయ్!’ అని పిలిచారు.
తలుపు తెరచాడు రామభద్రం.
మేడమీద అద్దెకు ఉంటూన్న కుమార్.
అతడి మొహంలో గాభరా కనిపిస్తోంది. ‘‘బాబాయ్‌గారూ! మీ కోడలికి ఎక్కువగా జ్వరం వస్తోంది. మాత్రలు వేశాను కాని అవి గుణం ఇవ్వలేదు. ఆస్పత్రికి తీసుకువెళ్తాను. మీరు పిల్లల వద్ద పడుకోరా! వాళ్ళు గాఢనిద్రలో ఉన్నారు’’ అన్నాడు కుమార్.
రామభద్రం తల వూపి తన మొబైలు ఫోన్‌ని జేబులో వేసుకుని, క్రింది వాటాకు తాళం పెట్టి అతడి వెనుక బయలుదేరాడు. అతడి భార్య సుజాత నీరసించిపోయి నిస్త్రాణగా వుంది. రామభద్రం, కుమార్ కలిసి సుజాతను కారులోకి సాయం పట్టారు.
వయస్సుకు మించిన పని కావడంతో రామభద్రం వగరుస్తున్నాడు.
‘‘మీకు శ్రమ ఇచ్చాను’’ అన్నాడు కుమార్.
అతడి భుజం తట్టి, ‘‘్ఫరవాలేదు, వెళ్లిరా!’’ అన్నాడు రామభద్రం. పైవాటా చేరుకున్నాడు ఆయన. పిల్లలను పరిశీలించాడు. వాళ్ళు నిశ్చితంగా నిష్పూచిగా నిద్రపోతున్నారు.
హాల్లో దివాన్ కాట్‌మీద నడుం వాల్చాడు రామభద్రం.
తెల్లవారుఝాము మూడు గంటలకు భార్యాభర్తలు తిరిగి వచ్చారు. సుజాతకు స్వస్థత చిక్కింది. రామభద్రం ఆమెకు బార్లీనీరు అందించాడు. తన వెంట కొబ్బరి బోండాలు తెచ్చాడు కుమార్.
‘‘ఈ సమయంలో మా అమ్మా నాన్నా ఇక్కడే ఉంటే బాగుండేది. మీకు శ్రమ ఇచ్చేవాడిని కాదు!’’ అన్నాడు కుమార్.
‘‘శ్రమ కాదు. సమయానికి ఇంట్లోనే ఉన్నందుకు ఎంతో సంతోషపడుతున్నాను. మిమ్మల్ని ఇద్దరినీ నా కుటుంబ సభ్యులే అనుకుంటాను’’ అన్నాడు రామభద్రం.
కుమార్ కళ్లు చెమర్చాయి. తన వాటాలోకి వచ్చి పడుకున్నాడు రామభద్రం. ఆయన కంటిమీదికి నిద్ర రావడంలేదు. వారం రోజుల్లో ఆయన టెక్సాస్ రాష్ట్రం బయలుదేరవలసి వుంది. పెద్దకొడుకు ఆయనకు విమానం టికెట్ పంపించాడు. అక్కడ పెద్దకొడుకు ఉద్యోగం చేసుకుంటున్నాడు. అతడికి ఇద్దరు పిల్లలు! అబ్బాయికి పది, అమ్మాయికి ఎనిమిది వయస్సు.
టికెట్‌తోబాటు కోడలు రాసిన ఉత్తరం చదువుకున్నాడు ఆయన.
‘ప్రియమైన మామయ్యగారికి,
నమస్కారం. మీరు తప్పకుండా బయలుదేరి రాగలరని అందరం ఎదురుచూస్తున్నాం. తెలుగు సంస్కృతం, తెలుగు మాటలూ, క్రమశిక్షణ నేర్పి మీ మనవడినీ, మనవరాలినీ తీర్చిదిద్దగలరని మా ఆశ. ఇంట్లో పెద్ద దిక్కు ఉన్న తీరు వేరు కదా!
సెలవు ఇవ్వండి
మీ కోడలు!
ఉత్తరాన్ని ఒకటికి రెండుసార్లు చదువుకున్నాడు రామభద్రం. ఆయన మనస్సు అటు అమెరికాకూ ఇటు భారతదేశానికీ మధ్య ఎక్కడుండాలో తేల్చుకోలేక ఊగిసలాడింది. చలిదేశాలలో ఇప్పటికిప్పుడు ఈ వయస్సులో తాను అలవాటు పడగలడా!
ఆయన పెద్దకొడుక్కీ, పెద్ద కోడలికీ విదేశీ వ్యామోహం మోతాదు చాలా ఎక్కువ. కోడలు ధనవంతుల కుటుంబం నుండే వచ్చింది.
ఇక రామభద్రం కూతురు ఢిల్లీలో ఉంటుంది. అల్లుడు రాష్ట్ర ప్రభుత్వపు ఉద్యోగం చేస్తున్నాడు. ఆమెకూ ఇద్దరు ఆడపిల్లలు. సాదాసీదా సంసారం. ఆర్థికంగా సహాయపడుతుంటాడు రామభద్రం. తనకు చేతి సహాయంగా తండ్రిని ఢిల్లీ రమ్మంటూంది కూతురు. ఆడపిల్లలు పెళ్లికి స్థిరపడే వయస్సులు దగ్గరవుతున్నాయి. రక్షణ కావాలని ఆమె ఆరాటం.
రామభద్రం జీవితం అంతా విశాఖపట్నంలోనే గడిచింది. ఇంకా గడుస్తోంది. కొత్త వాతావరణం అంటే ఆయనకు బెదురు వుంది. తన భార్య జ్ఞాపకాలతో ఆయన ఇలాగే బతికేస్తూన్నాడు.
ఇక చిన్నకొడుకు సౌదీ అరేబియాలో కెమికల్ ఇంజనీర్. అతడికి పెళ్లి కావలసి వుంది. పెళ్లికూతురును వెతుక్కునే తీరికే దొరకడంలేదు. ‘మగాడికి ఇంకా తండ్రి దగ్గరుండి పెళ్లి జరిపించవలసిన పరిస్థితి ఉందా!’ అంటాడు రామభద్రం.
‘నాన్నా! నీకు ఎలాంటి కోడలు కావాలో చూసుకోవద్దా!’ అంటుంది కూతురు.
‘సౌదీ నుండి వాడిని ఇక్కడికి వూడిపడమను!’ అంటాడు
తండ్రి.
తల విదిలించాడు రామభద్రం. ఆలోచనలు చెదిరిపోయాయి. కాఫీ త్రాగి కూర్చున్నాడు కొన్ని క్షణాల్లోనే ప్రత్యక్షమయ్యాడు కుమార్.
‘‘బాబాయ్! పిల్లలను స్కూల్‌లో దింపగలరా!’’ అడిగాడు కుమార్.
రామభద్రం సంతోషంగా స్కూల్‌కి బయల్దేరాడు. ఆఫీసుకు సెలవు పెట్టుకుని కుమార్ ఇంట్లోనే ఉండిపోయాడు. ఆ రోజు సాయంత్రం కూడా రామభద్రమే స్కూల్‌కి పోయి పిల్లలను తీసుకువచ్చాడు. తానే పోయి వస్తానన్నాడు కుమార్. అయినా రామభద్రం బయలుదేరాడు.
ఆ రాత్రికి పైవాటాలోనే ఎక్కువసేపు గడిపాడు రామభద్రం. పిల్లల చేత ఇంటిపని చేయించాడు. పాఠాలు చదివించాడు. సుజాత తేరుకుని ఆ రాత్రికి వంట చేసింది.
రామభద్రం బయటికి వెళ్లినట్లే వెళ్లి హోటల్‌లో చపాతీలు తిని వచ్చాడు. ఆ సంగతి తర్వాత తెలుసుకుని కుమార్ దంపతులు నొచ్చుకున్నారు. తమ యింట్లో తినవలసిందిగా అభ్యర్థించారు.
‘‘నా పొట్ట ఎంత! నేనేం తినాలి! ఒక చపాతీ, ఒక అరటిపండూ నా ఆకలికి సమాధానం చెబుతాయి’’ నవ్వాడు రామభద్రం.
కుమార్ వినయంగా చూశాడు. రామభద్రం సంగతి అతడికి బాగా తెలిసిన సంగతే! తన స్వేచ్ఛా స్వాతంత్య్రాలమీద పట్టుతోనే ఆయన తన బిడ్డల వద్దకే వెళ్ళడం లేదు.
రామభద్రం నుండి పెద్దరికం నేర్చుకుంటున్నాడు కుమార్. నిరాడంబరత, ఉన్నంతలోనే సర్దుకుని బతకడం కూడా ఆయన నుండే గ్రహించాడు. ఎందుకైనా మంచిదని సుజాతను ఆ రాత్రివేళ డాక్టర్‌కి చూపించి తీసుకువచ్చాడు కుమార్. తల్లీ తండ్రీ తిరిగి వచ్చేటప్పటికి రామభద్రం వద్దే నిద్రపోయారు పిల్లలు.
అదే రాత్రి తొమ్మిది గంటల వేళ కుమార్‌కి అతడి తండ్రినుండి ఫోన్ వచ్చింది. దక్షిణ భారతదేశ యాత్రలకు బయలుదేరిన అతడి తల్లిదండ్రులు చెన్నైలో చిక్కుపడిపోయారు. యాత్ర మొదట్లో ప్రారంభమైన తుపాన్, వరదలా ఇరవై రోజులైనా తగ్గలేదు.
ఒక హోటల్‌లో చిక్కుకుపోయారు వాళ్ళు. చెన్నైతో బాహ్య ప్రపంచానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. విద్యుత్ సరఫరా, నీటి సరఫరా నిలిచిపోయాయి. మొబైల్ ఫోన్లు కూడా మూగపోయాయి.
చెన్నై ప్రజలు తిండికీ, కనీసం త్రాగునీటికీ మొహం వాచిపోయారు. కోట్లాది రూపాయలు సంపాదించుకునేవారు కూడా తిండి గింజలకు ఇబ్బంది పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కుమార్ తల్లీ తండ్రీ చెన్నైలో చిక్కుకుపోయారు.
యువకుడైన కుమార్ అనుభవిస్తోన్న వేదన ఇంతా అంతా కాదు. బయటి ప్రపంచంతో విడివడిపోయి దీవిలాగా మారిపోయిన చెన్నైన్‌ని చేరుకోవటం ఎలా? ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా కూడా తుఫాన్ ప్రభావంతో విలవిలలాడుతూనే వుంది.
‘‘చెన్నై విమానాశ్రయం కూడా నీట మునిగిపోయి వుంది. పడవలూ, మొసళ్ళూ రోడ్డెక్కాయి. పాములూ, తేళ్ళూ విమానాల్లో చేరాయి’’ అన్నాడు కుమార్.
కొన్ని నిముషాల వరకూ రామభద్రం మాట్లాడలేకపోయాడు.
తల్లిదండ్రులకు ఇతడు ఒక్కడే కొడుకు. పాకేజీ విధానం మాట్లాడుకుని తల్లిదండ్రులు యాత్రలకు బయలుదేరారు. అప్పటికే వాళ్ల ఇద్దరి ఆరోగ్యాలూ అంతంతమాత్రం.
ప్రకృతి బీభత్సానికి మానవ నిర్లక్ష్యం కూడా తోడయ్యింది. కాలువలు, చెరువులు, పల్లపు ప్రాంతాలూ- అపార్ట్‌మెంట్సూ, వాణిజ్య కేంద్రాలుగా మారిపోయాయి. వరద ప్రవాహం సహజంగా పోనివ్వకుండా ఎలా అడ్డం పడాలో అలా అడ్డం పడిపోయారు. పాతిక రోజులుగా కురుస్తోన్న కుంభవర్షం చాలా మానవ ప్రాణాలు బలి తీసుకుంది. జనావాసాలు తెప్పల మాదిరిగా తేలిపోయాయి.
రోడ్లమీద మూడడగుల ఎత్తున చెత్త, బురద!
దేశ ఆర్థిక వ్యవస్థమీద ఈ ప్రళయం ఒక పిడుగుపాటే అయ్యింది. రైళ్ళు పునరుద్ధరింపబడ్డాక రామభద్రంతోపాటు కుమార్ బయలుదేరి చెన్నై మహానగరం చేరుకున్నారు. చిక్కిపోయి ఎముకల పోగు మాదిరిగా తయారై, కళ్లలో ప్రాణాలు పెట్టుకున్న తన తల్లిదండ్రులను చూసి బావురుమన్నాడు కుమార్.
అంచెలంచెలుగా ప్రయాణం చేసి మూడు రోజులకు చావు తప్పి కన్ను లొట్టపోయి ఆ నలుగురూ విశాఖపట్నం చేరుకున్నారు. రామభద్రం బాగా నీరసించిపోయాడు. ఏ వేళకి ఏం కావాలో అన్నీ సుజాతే పెద్దదిక్కు అయ్యి ఆయనకు ఇంత ఆహార పానీయాలు అందిస్తోంది.
రామభద్రం మరో రెండు రోజుల్లో టెక్సాస్ బయల్దేరవలసి వుంది. అదే సంగతి ఆయన టెక్సాస్ కొడుకు కూడా ఫోన్ చేసి గుర్తుచేశాడు. తన నీరసం సంగతిని అతడితో చెప్పకుండా దాటవేశాడు తండ్రి. అయినప్పటికీ తండ్రి గొంతులోని నీరసం గుర్తించాడు కొడుకు. ‘విమానం ఎక్కేస్తే సరిపోతుంది. టెక్సాస్ చేరుకున్నట్టే’ అభిభాషించాడు కొడుకు.
పిల్లలు గుమ్మం వద్ద ప్రత్యక్షమయ్యారు. రామభద్రం ఒంట్లోకి చివ్వున ఉత్తేజకెరటం ప్రవేశించింది. వాళ్లను తన దగ్గరికి పిలుచుకుని, స్కూలు విషయాలూ, హోంవర్క్ విషయాలూ అడిగాడు ఆయన.
‘‘తాతయ్యా! మీకు జ్వరం వచ్చిందట కదా!’’ అడిగింది అమ్మాయి.
‘‘అదే తగ్గిపోతుంది. మీ హోంవర్క్ తెచ్చుకోండి. చేసుకుందురుగాని!’’ అన్నాడు రామభద్రం.
పుస్తకాలు తెచ్చుకోవడానికి పిల్లలు వెళ్లిపోయారు.
ఆయన నీళ్లగదికి పోయి తిరిగి వచ్చాడు. ఫ్లాస్కులోంచి కాఫీ ఒంపుకుని తాగాడు. గ్లాసు కడిగి బోర్లించాడు. దినపత్రిక అందుకున్నాడు. తమ వాటాకు పోయిన పిల్లలు ఎంతకూ తిరిగి రాలేదు. దినపత్రికను బల్లమీద ఉంచి ఆయన మెట్లెక్కి పైవాటా చేరుకున్నాడు.
సుజాతకు జ్వరం తిరగబెట్టిందేమో, ఆమె అత్తమామలు ఇంకా తేరుకోలేదేమోనని ఆరాటపడ్డాడు రామభద్రం.
పిల్లలచేత హోంవర్క్ రాయిస్తున్నాడు పితామహుడు. మధ్య మధ్య దగ్గుతున్నాడు, నీరసంతో మూలుగుతున్నాడు. ఆ నీరసంతోనే పిల్లలమీద విసుక్కుంటున్నాడు.
‘‘ఆ తాతయ్య అయితే ఇలా విసుక్కోరు!’’ అంది అమ్మాయి.
పితామహుడికి కోపం ఉవ్వెత్తున ముంచుకొచ్చింది. ఆ పాపను కొట్టినంత దూకుడు చేశాడు. పాప దడుచుకుని ఏడుపు మొహం పెట్టింది. ఆ వెనకనే సుజాత గొంతు వినిపిస్తోంది.
‘‘మామయ్యగారూ! మీకెందుకు శ్రమ! ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు కదా!’’ అంది సుజాత.
ముసలాయన మాట్లాడలేదు.
రామభద్రం వౌనంగా చూస్తున్నాడు. ఆయన నిలబడిన చోటినుండి దృశ్యం కనిపిస్తోంది. అక్కడే ఉండలా, క్రిందికి పోవాలో అర్థంగాక ఆయన అలాగే నిలబడిపోయాడు. ఆయనను మరింత నిస్సత్తువ ఆవరిస్తోంది.
‘‘ఈ మాత్రం చదువుకు ఆ ముసలాయన సాయం కూడా తీసుకోవాలా?’’ అన్నాడు ఆ ముసలాయన, తాను వృద్ధుడు కానట్టు.
‘‘పిల్లలు ఆయనకి బాగా చేరికయ్యారు. ఆయన కూడా ఒంటరిగా ఉంటున్నారు కదా! అన్నింటికీ చేదోడువాదోడుగా ఉంటున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, చెన్నై మీ అబ్బాయితో కలిసి బయలుదేరాలన్నా’’ అంటోంది సుజాత.
వాటన్నింటినీ కొట్టిపారేసినట్టు, ‘‘ఈ వయస్సులో ఆయనకి ఇక్కడేమైనా అయ్యిందనుకో- నువ్వు సాయం చేయగలవా!’’ అన్నాడు ముసలాయన.
‘‘పోనీలెండి, మనం అలా అనుకోవద్దు!’’ అంది సుజాత.
‘‘ఈ ముసలాయన ఇక్కడ ఒక్కడూ ఎందుకు? ఒంటికాయ శొంఠికొమ్ములాగా!’’
‘‘మామయ్యగారూ! ఆ మాట వింటే బాధపడతారు!’’
‘‘పిల్లల దగ్గరకు పోవచ్చు కదా! మనవడూ, మనవరాలూ, కోడలూ సంతోషిస్తారు కదా!’’
ముసలాయన అటు తర్వాత పిల్లల వద్ద పాఠం ఒప్పచెప్పించుకుంటున్నాడు. రామభద్రం మానసికంగా తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నైలో చావుకు దగ్గరగా పోయిన వృద్ధుడు కాదు ఆయన.
తన మంచంమీదికి వచ్చి పడ్డాడు రామభద్రం. ఆయనకి రెండు సంవత్సరాల క్రితం నాటి సంగతి గుర్తుకువచ్చింది. ఆ రోజు రైల్వే స్టేషన్‌కి తన పెద్దకొడుకుతోపాటు రామభద్రం కూడా వెళ్ళవలసి వచ్చింది. తండ్రీ కొడుకులు వీడ్కోలు పలకవలసిన వారి బంధువు ఎస్-5లో ప్రయాణించవలసి వుంది.
వాళ్ళు ముగ్గురూ నిలబడిన చోటునుండి ఎస్-5 దూరంగా ఆగింది. వాళ్ళవద్ద ఎస్-1 ఆగింది. ఎస్-5 వైపు పరుగెత్తాలని బంధువు ఆరాటపడ్డాడు. పెద్దకొడుకు అతడిని వారించాడు. ఆ రైల్వే స్టేషన్‌లో కంపార్ట్‌మెంట్ ఇండికేటర్ లేదు.
‘‘ఎస్-1 కంపార్ట్‌మెంట్ ఎక్కండి. వెస్టిబ్యూల్ ద్వారా అయిదుకి వెళ్లిపోవచ్చు’’ అన్నాడు కొడుకు.
ఒక కంపార్ట్‌మెంట్ నుండి మరో కంపార్ట్‌మెంట్‌కి, ఈలోగా ఆ కంపార్ట్‌మెంట్ చెయ్యి జారిపోకుండా, జీవితమే చెయ్యి జారిపోకుండా! తరం నుండి తరానికి సహాయం అందడానికి! సంస్కృతి అందడానికి! సంప్రదాయం జారిపోకుండా ఉండడానికి!
కుమార్ తండ్రి పడుతోన్న తాపత్రయం అదే! తన సాంప్రదాయం, సంస్కృతీ, మేధస్సూ తన అనుభవం తన కుటుంబ వారసత్వానికే అందించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. రామభద్రం కళ్లు తళతళలాడాయి.
***
శరీరం గడ్డకట్టే చలిలో ఆ ముసలాయన విమానాశ్రయంలో కాచుకుని ఉన్నాడు. తాను ప్రయాణించబోయే విమానం ఒక గంట ముందే బయల్దేరాలని ఆయన ఆరాటపడుతున్నాడు.
‘్భరతదేశానికి టెక్సాస్ రాష్ట్రానికీ మధ్య ఒక అడ్డదారి ఉండవలసిందే!’’
నవ్వుకుంటున్నాడు రామభద్రం. *

-ఎమ్.వి.వి.సత్యనారాయణ
రచయిత సెల్ నెం:8019622396

-ఎమ్.వి.వి.సత్యనారాయణ