కథ

భౌ..! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథల పోటీలో ఎంపికైన రచన
.........................................
వామన్రావ్ ఆ రోజు చాలా హుషారుగా ఇంటికొచ్చేడు. రాగానే ‘మన ఇంట్లో అద్దెకు దిగడానికి మంచి కుటుంబం దొరికింది. అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను. రేపు ఫస్ట్ నుంచీ దిగుతున్నారు..’ అన్నాడు.
‘ఎవరండీ వాళ్లు..? మంచీ చెడ్డా కనుక్కునే అడ్వాన్స్ తీసుకున్నారా? ఇంతకు ముందు ఖాళీ చేసిన వాళ్లు శుభ్రం లేకుండా వుండేవాళ్లు. ఇల్లు నాశనం చేసి పోయారు. వీళ్ల సంగతెలా ఉంటుందో మరి..?’ అంది సుబ్బలక్ష్మి.
‘ఆ మాత్రం చూసుకోకుండా ఇచ్చేశాననుకున్నావా..? మొగుడూ పెళ్లాం.. ఇద్దరే ఉంటారు. పిల్లలు ఉద్యోగరీత్యా దూరంగా ఎక్కడో ఉంటున్నారట. ఇద్దరే గాబట్టి ఇల్లు శుభ్రంగానే ఉంచుతార్లే... అంతేకాదు.. వీళ్లో కుక్కని పెంచుకుంటున్నారు’
‘కుక్కా..? కుక్కని పెంచేవాళ్లనెందుకండీ దించుతున్నారు..? దాంతో ఏవైనా ఇబ్బందులొస్తాయేమో..?’ అనుమానంగా అంది సుబ్బలక్ష్మి.
‘నీ మొహం.. కుక్క ఉండటం వల్ల మనకే లాభం! ఈ మధ్య మన కాలనీలో రెండు మూడిళ్లలో దొంగతనాలు జరిగాయి.. గుర్తులేదా..? మన రెండిళ్లూ పక్కపక్కనే ఒకే కాంపౌండ్‌లో వున్నాయి గదా.. అంచేత వాళ్ల దగ్గర కుక్క ఉందంటే మనకీ రక్షణ వున్నట్టే...! సరిగ్గా చెప్పాలంటే మనకో ఖర్చులేని వాచ్‌మేన్ దొరికినట్టే..! అదంతా ఆలోచించే అడ్వాన్స్ తీసుకున్నాను...’ తన తెలివితేటల్ని తక్కువ అంచనా వెయ్యొద్దన్నట్టు చెప్పాడు వామన్రావ్.
‘అవునండోయ్... మీరు చెప్పిందీ నిజమే..’ ఒప్పుకుంది సుబ్బలక్ష్మి.
* * *
ఫస్ట్ తారీఖున వామన్రావ్ పక్క వాటాలో శంకర్రావుగారూ, ఆయన భార్య సామానుతో సహా దిగేరు. ఆ టైములో వామన్రావు లేడు. సాయంత్రం అతడు ఇంటికొచ్చాక శంకర్రావు దంపతుల ఆహ్వానం మీద వాళ్ల వాటాలోకి వెళ్లాడు.
ఏదో మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా లో నుంచి వచ్చింది కుక్క! సరాసరి సోఫాలో కూర్చున్న వామన్రావ్ మీదకి ఎక్కేసి ఒళ్లంతా నాకేయసాగింది. వామన్రావ్‌కి గుండెలవిసిపోయాయ్. ఒకపక్క లోపలంతా తడిసిపోతున్నా వాళ్లతో మీ కుక్కని వెనక్కి పిలవండి.. నాకు భయం వేస్తోంది అని చెప్పడానికి మొహమాటపడి పిచ్చి నవ్వు నవ్వుతూ మేనేజ్ చెయ్యడానికి ప్రయత్నించసాగాడు.
శంకర్రావుగారు తాపీగా.. ‘మా పప్పీకి ఎవరైనా నచ్చితే అంతేనండీ... వెంటనే మీదకి వచ్చేసి దాని ప్రేమని చూపించేస్తుంది..’ అన్నారు.
వామన్రావ్ ఇంక తట్టుకోలేక.. ‘హిహి... ఇంక చాలు... కిందకి దిగమ్మా పప్పీ..’ అనసాగాడు.
‘పప్పీ.. అంకుల్‌కి చక్కిలిగిలి పెడుతుంది.. ఇలా రామ్మా...’ అంటూ పిలిచారు శంకర్రావుగారు. దాంతో పప్పీ వామన్రావ్‌ని వదిలి వెళ్లింది.
బతుకుజీవుడా అనుకుని ఆ ఇంటి నుంచి బైటపడ్డాడు వామన్రావు. ఆ రోజు నుంచి మొదలయ్యేయి అతని కష్టాలు! ఇంటికి ఎవరొచ్చినా భొయ్యిమని అరుచుకుంటూ వచ్చేసేది పప్పీ. దాంతో వాళ్లు ఝడుసుకుని గబుక్కున గేటు తెరచుకొని వెనక్కి పారిపోయేవాళ్లు. పేపర్ అబ్బాయి లోనికి వచ్చి పద్ధతిగా వరండాలో వేసేవాడల్లా పప్పీకి భయపడి బైట్నుంచే పేపర్ విసిరేసి పోవడం ప్రారంభించాడు. అదొక్కటే కాదు... వాళ్లకు వాడుకగా వచ్చే పాలిచ్చే రంగయ్య కూడా కుక్క దెబ్బకి జడిసి ఆ కుక్కని కట్టెయ్యకపోతే పాలుపోయడం నా వల్ల కాదయ్యగారూ...’ అంటూ నిష్కర్షగా చెప్పేశాడు. అప్పుడప్పుడూ ఇంటికొచ్చే స్నేహితులు కూడా కుక్కకి భయపడి రావడం మానేశారు.
వామన్రావు ఇంక తప్పక శంకర్రావుతో తమ ఇబ్బందిని మొరపెట్టుకున్నాడు.
‘మీ కుక్కని కట్టేసి ఉంచకపోతే మా ఇంటికెవరూ రాలేమని చెప్తున్నారండీ... మీరు చూస్తున్నారుగా... ఎవరొచ్చినా అది భయంకరంగా అరుస్తోంది. అంచేత కొంచెం మీ కుక్కని కట్టేసి ఉంచండి...’ అన్నాడు.
శంకర్రావుగారి మొహం ధుమధుమలాడుతున్నట్టుగా మారిపోయింది.
‘చూడండి వామన్రావుగారూ... ముందసలు మా పప్పీని కుక్క అనడం మానేయండి. దాన్ని అలా పిలిస్తే నాకేదోలా ఉంటుంది. పప్పీని మేం మా సొంత కొడుకులా చూసుకొంటున్నాం. ఇక కట్టేయడం సంగతంటారా? మా పప్పీ మొదట అనుమానంతో అరుస్తుంది తప్ప ఎవర్నీ కరిచే రకం కాదండీ... చాలా తెలివైంది అది. అనవసరంగా మీరు భయపడుతున్నారు తప్ప మరేం కాదు. మీ ఇంటికొచ్చేవాళ్లను నా దగ్గరికి పంపించండి... నేనే వాళ్లను పప్పీ గురించి చెప్పి వాళ్ల భయం పోగొడతాను..’ అన్నారు.
వామన్రావ్‌కి ఒళ్లు మండిపోయింది. ‘అదేంటండీ అలా అంటారు..? అసలు ఇంటికొచ్చేవాళ్లు పప్పీ భయంతో అట్నుంచి అటే పారిపోతుంటే ఇంక మీ దగ్గరికెలా వస్తారు..?’ అన్నాడు కాస్త కోపంగా.
శంకర్రావుగారు కొంచెం తగ్గి ‘సరే.. అలాగేలెండి.. నేను పప్పీని వాకింగ్‌కి తిప్పే టైంలో తప్ప మిగతా సమయాల్లో కట్టి ఉంచుతానె్లండి..’ అయిష్టంగా అన్నారు.
హమ్మయ్య అనుకున్నాడు వామన్రావు.
* * *
పప్పీని కట్టి ఉంచడం మొదలెట్టినా సమస్య తీరిపోలేదు. గొలుసుతో ఎప్పుడూ కట్టేసి ఉంచడం దానికి నచ్చనట్టుంది. వరండాలో అందుబాటులో వున్న గోడల్ని గీకేయసాగింది. వరండాలో గోడలన్నీ దాని గోకుళ్లతో అసహ్యంగా తయారయ్యాయి. పైగా రోడ్డు మీద వెళ్లేవాళ్లని చూసి కూడా అరవడం సాగించింది. దాని గోలతో వామన్రావు కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఆరు, నాలుగు క్లాసులు చదువుతున్న వాళ్ల పాప, బాబు కూడా ‘ఇదేంటి డాడీ... ఈ గోల... మేం భరించలేక పోతున్నాం..’ అంటూ కంప్లైంట్ చెయ్యసాగారు. వామన్రావ్‌కి ఏం చెయ్యాలో తోచలేదు.
శంకర్రావుగారి దగ్గరకెళ్లి ‘ఏంటండీ బాబూ... మీ పప్పీ అలా ఒకటే అరుస్తోంది? పక్క వాటాలో మేం ఉండలేకపోతున్నాం...’ అన్నాడు.
‘అలా అడుగుతారేంటండీ.. మీరేగా కట్టెయ్యమన్నారు? అలా కట్టేస్తే దానికి చిరాగ్గా ఉండి అలాగే అరుస్తుంది... ఏం చెయ్యమంటారు చెప్పండి...’ అసహనంగా అన్నారు శంకర్రావుగారు.
‘అవుననుకోండి.. కానీ అదలా అరుస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. అరవకుండా మీరేం చెయ్యలేరా..?’ కొంచెం తగ్గి అడిగాడు.
‘ఎందుకు చెయ్యలేనూ... కట్టడం మానేస్తే సరిపోతుంది.. మీ ఇంటికొచ్చేవాళ్ల కోసం వర్రీ అవ్వకండి. అదేమీ కరవదులెండి..’ అన్నాడాయన.
వామన్రావ్ ఏమీ అనే్లక వెనక్కొచ్చేశాడు. ఇప్పుడు పప్పీని గొలుసుతో కట్టెయ్యడం మానేశారు. అయితే ఇంతకు ముందులా ఇంటికొచ్చిన వాళ్లని చూసి పెద్దగా అరవడం మానేసి పోలీసులు నిందితుణ్ణి చూసినట్టు అనుమానంగా చూడ్డం, వాళ్ల చుట్టూ ఓ రౌండ్ కొట్టడం మొదలెట్టింది పప్పీ. పోనీల.. ఇలా అయితే కొంతవరకూ పర్వాలేదు... అనుకొని ఇంటికొచ్చిన వాళ్లకు అది కరవదని చెప్పి తనే ఏదో సర్ది చెప్పసాగాడు వామన్రావు.
వాళ్లకు ఇప్పుడు మరో సమస్య తగులుకుంది. సాయంత్రం వామన్రావు ఇంటికొచ్చేసరికి శంకర్రావుగారు ‘ఏం చేస్తున్నావయ్యా..’ అంటూ పప్పీతో సహా తయారై పోతున్నారు. ఇంక అక్కణ్నుంచి ఆయన చెప్పే కథలు మొదలయ్యేవి. పిల్లలు వేరే గదిలోకి వెళ్లిపోయినా వామన్రావ్‌కీ, సుబ్బలక్ష్మికీ ఆ కథలు వింటూ పప్పీ చేసే దుందుడుకు చేష్టలు కూడా భరించక తప్పేది కాదు. పోనీ ఏవైనా మామూలుగా ఆ మాటా ఈ మాటా మాట్లాడతాడా.. అంటే అది కూడా కాదు. ఏ టాపిక్ ఎత్తుకున్నా తిప్పి తిప్పి దాన్ని పప్పీ దగ్గరికే తెచ్చేవాడాయన.
దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లి జరిగిన సందర్భంగా వాళ్లు అరిసెలు, పొంగడాలు లాంటి పిండివంటలు ఇవ్వడంతో శంకర్రావుగారు వచ్చినప్పుడు ఆయనకి అవి ప్లేట్లో వేసి పెట్టారు. శంకర్రావుగారు అరిసె ముక్క తుంచి నోట్లో వేసుకుంటూ... ‘ఈ అరిసెలున్నాయి చూడండి.. కొంతమంది మెత్తగా మృదువుగా వచ్చేట్టు చేస్తారు.. ఇంకొందరు చేస్తే గట్టిగా తినడానికి పనికిరాకుండా ఉంటాయి. ఆ మధ్య ఏం జరిగిందనుకున్నారు? ఇలాగే ఎవరో ఇచ్చిన పిండివంటలు మా పప్పీకి పెట్టాం. తిండి విషయంలో మా పప్పీ చాలా కచ్చితంగా ఉంటుందండోయ్. దానికే మాత్రం నచ్చకపోయినా సహించదు. ఇంతకీ ఆ పిండివంటల్ని అదేం చేసిందనుకున్నారు? వాసన చూసి నచ్చకపోయేసరికి దానికి చిరాకు పుట్టి వాటి మీదే పాస్ పోసేసింది...’ అంటూ గట్టిగా నవ్వసాగారు.
వామన్రావ్‌కి అతని మాటలకు ఒళ్లు మండింది గానీ ఏమనే్లక ఊరుకున్నాడు. సుబ్బలక్ష్మి పప్పీకి ఒక అరిసె ముక్క పెడదామనుకున్నదల్లా కొంపదీసి అది అరిసె మీద పాస్ పోసేస్తే పరువు పోతుంది కదా అనుకుని ఆ ప్రయత్నం విరమించింది.
‘అసలు మా పప్పీకి తిండి విషయంలో అన్నీ ప్రత్యేకంగా ఉంటే తప్ప తినదండి. బోటీ గోంగూరో లేకపోతే తలకాయ మాంసం పులుసో ఏదో ఒకటి దాని కోసం కర్రీ పాయింట్ కెళ్లి తెస్తూనే ఉంటాను. ఇంట్లో అయినా దానికోసం ప్రత్యేకంగా ఉండాల్సిందే అనుకోండి.. దాని సబ్బూ, టవల్సూ అన్నీ వేరేగా మెయింటైన్ చెయ్యాల్సిందే. ఏది బడితే అది తినేసి ఎలా పడితే అలా ఉండే రకం కాదు మా పప్పీ...’ శంకర్రావుగారి వాక్ప్రవాహం కొనసాగుతూనే ఉంది.
‘వార్నీ.. ఇంటి ముందు నిలబడి ఆకల్తో అరిచే బిచ్చగాడిని కసురుకొని పొమ్మనడమే తప్ప ఏనాడూ ఓ ముద్ద పెట్టరు వీళ్లు. కుక్క విషయంలో మాత్రం ఎన్ని సౌకర్యాలు చేస్తున్నారు..! ఆశ్చర్యంగా అనుకున్నాడు వామన్రావు. కుక్కల్ని ఆదరించే వాళ్లు మనుషుల పట్ల కూడా అంతే దయతో వుంటారన్న అతని ఊహ ఎగిరిపోయింది.
* * *
ఈసారి పప్పీ నుంచి మరో సమస్య ఎదురైంది. హఠాత్తుగా దానికేమైందో గానీ సరిగ్గా అర్ధరాత్రి అయ్యేసరికి అదో రకంగా అరవడం సాగించింది. అది అరుపు అనేకన్నా ఏడుపు అంటే సరిపోతుంది. మోర పైకెత్తి దేవుడికి ఏదో మొర పెడుతున్నట్టు ఏడవసాగింది. దాంతో వామన్రావ్ కుటుంబానికి మళ్లీ హింస మొదలైంది. రాత్రిళ్లు నిద్ర కరవైంది.
‘ఏవండీ... మనకేమిటీ హింస..?’ అర్ధరాత్రి కుక్క ఏడుస్తున్న శబ్దానికి హఠాత్తుగా లేచి అడిగింది సుబ్బలక్ష్మి.
‘అదే ఆలోచిస్తున్నా... వయొలిన్ పట్టుకోవడం రానివాడు దాన్ని అడ్డదిడ్డంగా వాయించినట్టూ... జలుబు చేసిన నక్క వూళ పెట్టినట్టూ.. ప్రసవ సమయంలో పంది మూలుగుతున్నట్టూ.. ఇదేమి అరవడమో నాకు అర్థం కావడంలేదు!..’ అప్పటికే నిద్ర ఎగిరిపోయి లేచి కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న వామన్రావ్ అన్నాడు.
ఆ ఉపమానాలు విన్న తర్వాత నిద్రలేమి వల్ల వామన్రావ్‌కి తాత్కాలికంగా మెంటల్ బేలన్స్ తప్పిందేమో అన్న అనుమానం వచ్చింది సుబ్బలక్ష్మికి.
‘ఇంతకీ ఇదెందుకలా అరుస్తోందో శంకర్రావుగార్ని అడిగారా..?’ అడిగింది.
‘ఎందుకడగలేదూ.. అడిగాను. అప్పుడప్పుడూ పప్పీ కొన్ని రోజులపాటు రాత్రిళ్లు ఇలాగే అరుస్తుందిట. దానికి కారణమేమిటో వాళ్లకు కూడా తెలీదట.. అలా ఎన్ని రోజులు అరుస్తుందో కూడా తెలీదన్నారు. ఇలాంటివన్నీ వాళ్లకు అలవాటై పోవడం వల్ల అది ఎలా అరిచినా వాళ్లకు మాత్రం నిద్రకు ఇబ్బందేమీ ఉండదుట..’ చెప్పాడు వామన్రావు.
‘సరిపోయింది.. ఇక పడుకోండి..’ అటు తిరిగి పడుకొంటూ అంది సుబ్బలక్ష్మి.
ఆ మర్నాడు ఉదయం వామన్రావ్ దగ్గరకొచ్చి ‘మా తమ్ముడు రేపిక్కడికి వస్తున్నానని ఫోన్ చేశాడండీ... ఈ ఊళ్లో వాడికేదో ఫ్రెండ్ ఫంక్షన్ ఉందిట...’ అంది సుబ్బలక్ష్మి.
‘అలాగా... పక్కింట్లో కుక్క ఉందని ఓసారి చెప్తే కుక్కలంటే నాకు చాలా ఇష్టం అన్నాడు మీ వాడు. రానీ... పప్పీని చూసి హేపీగా ఫీలవుతాడేమో చూద్దాం..’ అన్నాడు వామన్రావ్.
మర్నాడు సునంద్ అంటే సుబ్బలక్ష్మి తమ్ముడు వచ్చాడు. గేటు దాటి అతను లోపలికి వచ్చేసరికి పప్పీ ఎంటరైపోయింది. కొత్త మనిషిలా కనిపించడం వల్లనో ఏమో ఒకేసారి భౌ మని అరుస్తూ సునంద్ మీదకు వచ్చేసింది. అతను జజ్జరిల్లిపోయి వెనక్కి పోతుండగా వామన్రావ్ వచ్చి పప్పీని తగిలేసి బావమరిదిని లోపలకు తీస్కెళ్లాడు. సునంద్‌కి చెమటలు పట్టేసినయ్. కొంచెం మంచినీళ్లు తాగాక తేరుకున్నాడు.
‘ఇదేంటి బావా... ఈ కుక్క ఇలా ఉంది..?’ అన్నాడు బిత్తరచూపులు చూస్తూ.
‘కుక్కలంటే నీకిష్టం అని చెప్పావుగా.. మరి అలా భయపడ్డావేం?’ అడిగాడు వామన్రావు.
‘కుక్కంటే ఏదో చిన్నదిగా ఉంటుందనుకున్నాను గానీ ఇదేంటి జెగజ్జెట్టీలా ఉంది..! అమ్మో... అది మీదకు ఎగిరేసరికి నా పనై పోయిందనుకున్నాను...’ మళ్లీ తల్చుకుని భయపడుతూ అన్నాడు.
ఆ కుక్కతో తాము పడుతున్న బాధలన్నీ ఏకరవు పెట్టింది సుబ్బలక్ష్మి.
‘ఇన్ని ఇబ్బందులు పడే బదులు వాళ్లకు ఏదోటి చెప్పి ఖాళీ చేయించేస్తే బెటర్ కదా బావా..?’ అడిగాడు.
‘అవుననుకో... కానీ వాళ్లు దిగి మూణ్ణెల్లు కూడా కాలేదు. ఏ కారణం చెప్పి ఖాళీ చేయించేస్తాం...?’ సందేహిస్తూ అన్నాడు వామన్రావ్.
‘అలా అంటావేంటి బావా... చెప్పాలంటే ఏవైనా చెప్పొచ్చు. మా పెద్దక్కా బావలకు ఈ ఊరే ట్రాన్స్‌ఫర్ అయిందనీ అంచేత వాళ్ల కోసం ఆ ఇల్లు ఖాళీ చేయించక తప్పదనీ, మరీ తొందరేం లేదనీ, ఓ నెల్రోజుల్లో మరో ఇల్లు చూసుకోమనీ చెప్పేయ్.. ఆ తర్వాత మరొకళ్లని దించుకోవచ్చు. వాళ్లేమైనా చూడొచ్చారా ఏమిటి?’ సలహా ఇస్తూ అన్నాడు.
వామన్రావుకు ఇదేదో బాగానే ఉందనిపించింది. శంకర్రావు గారి దగ్గరకెళ్లి ‘మా తోడల్లుడికి ఇదే ఊరు ట్రాన్స్‌ఫర్ అయింది. ఎక్కడో ఎందుకు.. మా ఇంట్లోకే రమ్మని చెప్పాం. ఆయన రిలీవ్ అయి వచ్చేసరికి మరో నెల రోజులు పడుతుంది. ఏమీ అనుకోకుండా ఈలోపు మరో ఇల్లు చూసుకోండి’ అని కన్విన్సింగ్‌గా చెప్పాడు. శంకర్రావుగారు మొదట చిరాకు పడుతూ ‘అదేంటండీ అలా అంటారు..? అడ్వాన్స్ తీసుకున్నారు కదా.. అప్పుడే ఖాళీ చేసెయ్యమంటారేంటి?’ అన్నారు గానీ వామన్రావు నెమ్మదిగా ఆయనకి నచ్చజెపుతూ ‘మీ అడ్వాన్స్ తిరిగిచ్చేస్తాం. ఇలా జరుగుతున్నందుకు మరేమీ అనుకోవద్దండీ’ అంటూ ప్రాధేయపడుతూ అడిగేసరికి చివరికి అయిష్టంగానే ఒప్పుకున్నారు.
ఎలాగైతేనేం... ఓ నెల తిరక్కుముందే శంకర్రావుగారు మరో ఇల్లు చూసుకొని ఖాళీ చేసి వెళ్లిపోయారు. వామన్రావు, సుబ్బలక్ష్మి దంపతులు ‘హమ్మయ్య...’ అనుకొంటూ నిట్టూర్చారు. ఓ రోజు ఆఫీసులో వామన్రావ్ కొలీగ్ అయిన రాఘవరావు ‘మీ ఇల్లు ఖాళీగా ఉందని తెల్సింది. మాకు తెలిసిన వాళ్లొకరు వాటర్ ప్రాబ్లం వల్ల ఇల్లు మారదామనుకొంటున్నారు. మీ ఇల్లు ఇస్తావా..?’ అంటూ అడిగాడు.
‘వాళ్లకు కుక్క లేదు కదా..?’ వెంటనే అడిగాడు వామన్రావు.
అదేం ప్రశ్న అన్నట్టు చూసి ‘లేదు..’ అన్నాడు రాఘవరావు.
వాళ్ల గురించి వివరాలు కనుక్కున్నాడు. వీళ్లు కూడా రిటైరైన దంపతులే! కొడుకు హైదరాబాద్‌లో ఏదో పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురికి పెళ్లై విజయవాడలో వుంటోంది. ఇక్కడుండేది వీళ్లిద్దరే!
‘సరే.. మాట్లాడదాం.. ఆయన్ని ఆదివారం మా ఇంటికి తీసుకొని రా..’ అన్నాడు వామన్రావ్.
ఆదివారం రాఘవరావుతో పాటు వచ్చిన సత్యానందంతో అద్దె తదితర విషయాలన్నీ మాట్లాడాడు వామన్రావ్. ఇల్లు, పరిసరాలు బాగా నచ్చడంతో వామన్రావ్ అడిగినంత అద్దె ఇవ్వడానికి ఒప్పుకున్నాడు సత్యానందం. వచ్చేవారమే ఈ ఇంట్లోకి మారతామని కూడా చెప్పాడు.
అంతా అయ్యాక ‘నువ్వు ఇంతకు ముందున్న వాళ్లని కావాలనే ఖాళీ చేయించావనీ, మీ బంధువులు ఎవరో వచ్చి ఈ ఇంట్లో వుంటారనీ ఎవరో అన్నారు.. అసలేమిటి విషయం?’ అడిగాడు రాఘవరావు.
‘అబ్బెబ్బే.. అదంతా ఏం లేదు. నేనే ఖాళీ చేయించిన మాట నిజమే గానీ వాళ్లతో మాక్కొంచెం తేడాలు రావడం వల్ల అలా చెప్పి ఖాళీ చేయించానన్నమాట. అంతే తప్ప మా బంధువులు రావడం అదీ ఏం లేదు..’ కుక్కతో తాము పడిన అవస్థలన్నీ చెప్పుకోవడం నామోషీగా అనిపించి కవర్ చేసుకుంటూ అన్నాడు వామన్రావ్.
‘అంటే మరేం లేదు.. ఇప్పుడు ఇల్లు మారడమే వీళ్లకి చికాగ్గా ఉంది. అక్కడ బోర్‌లో వాటర్ రాకపోతుండటం చేత తప్పనిసరై ఖాళీ చేసి ఇక్కడికొస్తున్నారు. మళ్లీ మళ్లీ ఇల్లు మారడం తమ వల్ల కాదని చెప్పారు.’
‘అవునండీ.. ఇల్లు మారడమంటే అదో పెద్ద తతంగం. ఎవరూ సాయం లేని మాలాంటి వాళ్లకు మరీ ఇబ్బంది.. అందుకనే అలా అన్నాను.. మళ్లీ కొన్నాళ్ల తర్వాత ఏదో కారణం చెప్పి ఖాళీ చేయించరుగా..?’ అనుమానంగా అన్నాడు సత్యానందం.
‘్భలేవారే.. మీరు మా ఇంట్లో ఎన్నాళ్లైనా ఉండొచ్చు. ఖాళీ చెయ్యమని ఎందుకంటాం..?’ స్నేహపూర్వకంగా నవ్వుతూ అన్నాడు వామన్రావు.
ఇంట్లో వుండే వాళ్లు ఇద్దరే కావటం, అదీగాక సత్యానందం మంచివాడిలా, నెమ్మదస్థుడిలా కనిపించడం, ఇంతకు ముందు ఇచ్చిన వాళ్లకన్నా బాగా ఎక్కువ అద్దె చెప్పినా ఒప్పుకోవడంతో ఈ బేరం ఎక్కడ చేజారిపోతుందోనని కంగారుగా ఉందతనికి.
‘అది కాదు.. చిన్న అగ్రిమెంట్ లాంటిదేమైనా..’ నసుగుతూ అన్నాడు సత్యానందం.
‘సరే... మీ ఇష్టం.. ఎలా రాసుకుందాం చెప్పండి..?’ అడిగాడు వామన్రావు.
చివరికి వాళ్లు చర్చించుకున్న తర్వాత ఓ అగ్రిమెంట్ తయారుచేసుకున్నారు. సంవత్సరం తర్వాత అద్దె పెంచవచ్చనే కండిషన్‌తో రెండు సంవత్సరాలు పూర్తయ్యే వరకూ ఖాళీ చేయించకూడదనే నిబంధనతో అగ్రిమెంట్ తయారైంది. ఒకవేళ రెండు సంవత్సరాల లోపల గనుక ఖాళీ చేయిస్తే తీసుకున్న అడ్వాన్స్‌కు డబుల్ ఎవౌంట్ తిరిగి అద్దెకున్న వాళ్లకే వామన్రావు చెల్లించే విధంగానూ, రెండు సంవత్సరాల లోపల అద్దెకున్న వాళ్లే వెళ్లిపోతామంటే వాళ్లు అడ్వాన్స్‌ను వదులుకునే విధంగానూ అందులో ఉంది. అది ఉభయులకూ సమ్మతం కావడంతో మర్నాడే దాన్ని డాక్యుమెంట్ రూపంలోకి మార్చి సంతకాలు చేసుకున్నారు.
తర్వాత వారంలోనే సత్యానందం దంపతులు వామన్రావ్ ఇంట్లో పాలు పొంగించారు. పది రోజుల వ్యవధిలో ఇరు కుటుంబాలూ మంచి సన్నిహితంగా మారిపోయాయి.
ఓ ఫైన్ మార్నింగ్ సత్యానందం ఇంటికెవరో చూట్టాలొచ్చినట్టుగా గ్రహించాడు వామన్రావు. బహుశా రాత్రి ట్రైన్‌లో దిగి ఉంటారు అనుకున్నాడు. వచ్చినతనిలో సత్యానందం పోలికలు చూశాక బహుశా కొడుకూ, కోడలు పిల్లలతో సహా వచ్చినట్టున్నారని గ్రహించాడు. ఆ సాయంత్రానికే వాళ్లు వెళ్లిపోయారు.
ఆ తర్వాత బైటికొస్తున్న సత్యానందాన్ని చూసి ‘మీ అబ్బారుూ, కోడలూ, పిల్లలూ వచ్చినట్టున్నారు’ అన్నాడు.
‘అవునండీ.. మా అబ్బాయికి కంపెనీ అమెరికా బ్రాంచిలో పని చేసేందుకు అవకాశం వచ్చింది. అంచేత వాళ్లు మరో పదిరోజుల్లో అమెరికా వెళ్లిపోతున్నారు. పాస్‌పోర్ట్, వీసాలన్నీ రెడీ చేసుకున్నారు. అక్కడికి వెళితే మళ్లీ రావడం ఎప్పటికవుతుందో తెలీదు గాబట్టి అంతా ఓసారి మా దగ్గరికొచ్చారు..’ అన్నాడు సత్యానందం.
‘పోనె్లండి.. మంచి విషయం చెప్పారు..’ అంటుండగా సత్యానందం వెనక నించి జెయింట్ సైజులో వున్న ఓ పెద్ద కుక్క భయంకరంగా మొరుగుతూ ఇంట్లోంచి వచ్చింది. అది వామన్రావ్ వంకే క్రూరంగా చూడసాగింది. మధ్యలో సత్యానందం వుండటంవల్ల గానీ లేకుంటే వామన్రావ్ అంతు చూసేలా కనిపించిందది.
‘అరె... ఇది.. ఇది ఇదెక్కణ్నుంచి వచ్చింది..?’ ఆశ్చర్యపోతూ.. తడబడుతూ.. దానివంకే భయంగా చూస్తూ అన్నాడు వామన్రావు.
‘ఇది మా వాడు పెంచుకుంటున్న కుక్కేనండీ. సిమీ దీని పేరు. మా వాళ్లు అమెరికా వెళ్లిపోతున్నారు కదా.. అంచేత దీన్ని మా దగ్గరే వదిలేసి పోయారు. మేం హైదరాబాద్ వెళ్లినప్పుడల్లా మాతో బాగా అలవాటు కాబట్టి మా దగ్గర ఉండడానికి దీనికేం ఇబ్బంది లేదు. అంచేత ఇది ఇక నుంచీ మాతోపాటే ఉంటుంది..’ అని చెప్పి ‘సిమీ.. సిమీ’ అంటూ దాన్ని నిమరసాగాడు ఆయన.
వామన్రావుకి నిల్చున్న పళంగా స్పృహ తప్పుతున్నట్టనిపించి అక్కడే కూలిపోయాడు.

-యం.రమేష్‌కుమార్
దేవాంగుల వీధి, ఇ.నెం.26-160
నెల్లిమర్ల -535 217, విజయనగరం జిల్లా.
94924 54678

-ఎం.రమేష్‌కుమార్