ఈ వారం కథ

పెళ్ళాం చెబితే వినాలి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఒరేయ్ రాజా!.. గదిలో ఫేను వృధాగా తిరుగుతోంది’’ అంటూ మా ఆవిడ మా అబ్బాయిని గట్టిగా కేకేసింది. వాష్‌బేసిన్ ముందు నిలబడి పళ్ళు తోముకుంటున్న రాజా గబగబా పరుగెత్తాడు ఫేను తిరుగుతున్న గదిలోనికి..

‘‘ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు’’ మా ఆవిడ వాణ్ని తోమడం మొదలెట్టింది.
‘‘సారీ అమ్మా! ప్లీజ్..! రేపట్నుంచి చూడు!’’ అంటూ వాళ్ళమ్మని నమ్మించడనికి ప్రయత్నించసాగాడు.
‘‘నేను నిన్ను నమ్మనురా!.. ఈలాంటి రేపులు ఎన్నయ్యాయి?’’.. మీ డాడీ కూడా ఇంతే!.. ఇంటి నిండా లైట్లు వేసేస్తారు... నేను వెనుకనుండి వాటిని తీసుకుంటూ రావాలి!.. కరెంటు ఆదా చేద్దామన్న ధ్యాసే లేదు’’ అని చెయ్యాడించింది.
మా ఆవిడ మాటలు వింటుంటే నాకు ఒళ్ళు మండుకొస్తుంది.
‘‘పోనీలేవే!.. ఈసారినుంచి ఫ్యాను, లైటు పని కాగానే వాటిని తీసేస్తాడులే!’’ అంటూ నేను మావాడికి సపోర్టు పలికాను.
‘‘నేను వాణ్ని మందలించేటప్పుడు మీరు వెనకేసుకురాకండి! వాడిక్కూడా తెలియాలి!.. ఒకటికి నాలుగుసార్లు చెబితే వాడికి బాగా గురుతుంటుంది..’’ అంటూ శృతి పెంచింది మా ఆవిడ!
‘‘వాడికేదో పరీక్ష వుందన్నాడు ఈ రోజు!.. నువ్వు అనవసరంగా తిట్టి వాడి మూడ్ పాడుచెయ్యక..’’ అన్నాను.
‘‘ఇది అవసరమా!.. కరెంటు బిల్లు ఎంతొస్తుందో చూశారా? పొద్దున మీరు కూడా మన బెడ్‌రూంలో ఆల్‌ఔట్ ఆఫ్ చెయ్యకుండా అలాగే వచ్చేశారు!.. టాయ్‌లెట్లో నీళ్ళ టాప్ సరిగ్గా కట్టనే కట్టరు.. కరెంటు వృధా!.. వాటరు వృధా!’’ అంది.
‘‘వాణ్ని వదిలిపెట్టి నా మీద పడ్డావా?.. ఇక నా మూడ్ కూడా ఔటే!’’ అన్నాను నేను చేతులు పైకెత్తి విసురుతూ..
‘‘ఏదైనా అంటే అన్నానంటారు!.. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోరు!.. నేను చెప్పేది చెప్పాను.. ఇక మీ యిష్టం! ఏమైనా చేసుకోండి.. ఇక మిమ్మల్ని మళ్ళీ అడిగితే ఒట్టే!’’ అంటూ ఇంటి ఇల్లాలు అలిగి బెడ్‌రూంలో దూరింది.
మా అబ్బాయి అంతా గమనించి నెమ్మదిగా వాళ్ళమ్మ వున్న గదిలోకి వెళ్ళాడు.. నేను కూడా వాడి వెనకే వెళ్ళాను..
‘‘అమ్మా! ... ప్లీజ్!.. నాతో మాట్లాడమ్మా!.. సారీ అమ్మా!’’ అంటూ మా ఆవిడను శాంతపరచసాగాడు.. మా ఆవిడ నుంచి ఏ సమాధానం లేదు.. పైగా అటు తిరిగి పడుకొంది.
‘‘పోనే్లరా! నువ్వేం బాధపడకు!.. మీ అమ్మకు బాగా కోపం వచ్చినట్టుంది.. అయినా మీ అమ్మ సంగతి తెలిసిందేగా.. తను కోపంలో వుండగా ఏమీ మాట్లాడదు.. తరువాత ఎప్పుడో నెమ్మదిగా మాట్లాడుతుంది.. నువ్వెళ్ళి చదువుకో’’ అంటూ మా అబ్బాయిని బయటకు పంపించి భార్య సరోజ వైపు చూశాను.. తను గోడకేసి ఎటో చూస్తోంది.. ‘సరోజా!’ అంటూ దగ్గరకొచ్చి ఒంటిమీద చెయ్యి వేయబోయాను.. దిగ్గున లేచి మంచం దిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది.
‘‘అబ్బో!.. పెళ్ళాం భద్రకాళిలా వుంది.. ఇప్పుడు కదిలిస్తే ప్రమాదమే’’ అనుకుంటూ హాల్లోకి వచ్చాను..
రాజా చదువుకుంటున్నాడు.. బెడ్‌రూంలోకి వెళ్లి లైటు వేసి, డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి తయారై ఇవతలకి వచ్చాను.. ఎదురుగా... ఎదురుగా గది గుమ్మం ముందు గరిటతో మా ఆవిడ కనిపించింది.. ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాను.. సడెన్‌గా గుర్తుకొచ్చింది.. గదిలో నేను ఫేను, లైటు ఆఫ్ చెయ్యలేదని... వెంటనే స్విచ్ ఆఫ్ చేసి వచ్చి గుమ్మం వైపు చూశా!.. మా ఆవిడ అక్కడలేదు.
‘‘ఒకటికి రెండు నిముషాలలో లైటో, ఫేనో ఆఫ్ చెయ్యకుంటే ఏమవుతుంది.. కొంపలేం మునిగిపోవు కదా!.. ఆ రెండు నిముషాల్లో ఎన్ని యూనిట్ల కరెంటు ఖర్చైపోతుంది?.. అయినా కరెంటు బిల్లు కట్టేవాణ్ని నేనే కదా!’’ అని నాలో నేను అనుకుంటూ హాల్లోకి వచ్చి కూర్చున్నాను. మా ఆవిడ మీద నాకు కాస్త కోపంగానే వుంది.. మా యింటికి సంబంధించిన విషయాలే కాకుండా పక్కింటి వారి దుబారా గురించి కూడా మాట్లాడి వారిని దుయ్యబడుతూ వుంటుంది.
ఏవండీ!.. పక్కింటి వనజగారు మొన్న ఇంట్లో స్విచ్‌లు తీయకుండా అలాగే వూరెళ్లిపోయారు.. ఎదురింటి బ్యూటీషియన్ అదేనండి ఆ రాధగారు.. ఏం చేసిందో తెలుసా?.. స్టౌమీద పాలు పెట్టి మరచిపోయి ఆలాగే బజారెళ్లిపోయింది. పాలు ఇగిరిపోయి, గినె్న మాడిపోయి, ఇల్లంతా ఒకటే పొగలు. పక్క వాటా వాళ్ళు వెంటనే ఆవిడకు ఫోన్ చెయ్యబట్టి వెంటనే ఆ రాధగారు ఆటోలో వెనక్కు వచ్చి, వాచ్‌మాన్ సహాయంతో నీళ్ళు కుమ్మరించి ఇల్లంతా ఒక కొలిక్కి తెచ్చారు.. పైగా ఆవిడ సింకులో నీళ్ళ టాప్ కూడా తిప్పేసి వెళ్లిపోయిందిట! ఎంత గ్యాసు వేస్టు, ఎన్ని నీళ్ళు వేస్టు! వనజగారింట్లో ఎంత కరెంటు వేస్టు!’’ అంటున్న మా ఆవిడ ఫ్లాష్‌బ్యాకు సంగతులనుండి బయటపడి ఎదురుగానున్న పేపరు తిరగెయ్యసాగాను..
‘‘పవర్‌కట్’’ అన్న హెడ్‌లైన్ చూసి మేటరు చదివాను.
‘‘రేపటినుండి విద్యుత్ కోత అమలు!.. పట్టణాలలో రోజూ నాలుగు గంటలు, పల్లెల్లో ఎనిమిది గంటలు వుంటుంది. విద్యుదుత్పత్తి కేంద్రాలలో ఉత్పాదన తగ్గినందున కోత అనివార్యం అన్నది దాని సారాంశం..! ఈ వార్త మా ఆవిడ చదివిందంటే కరెంటు నాలుగు గంటలు ఆదా అవుతున్నందుకు ఎంత పొంగిపోతుందో! అని ఆలోచిస్తుండగా ఏదో చప్పుడైంది.. చూస్తే డైనింగ్ టేబిలుపై మా ఆవిడ కంచం పెడుతూ కనిపించింది... ‘‘ఇక భోంచేసి ఆఫీసుకు బయలుదేరాలన్నమాట’’.. లేచి అటుగా నడిచాను.
మా ఆవిడకు ‘సారీ’ చెప్పి, కాస్త అనునయంగా మాట్లాడి, బుజ్జగించి.. నా భోజనం కానిచ్చి ఆఫీసుకు బయలుదేరాను.
ఆఫీసు చేరుకొని మా సెక్షన్‌కొచ్చాను.. జూనియర్ అసిస్టెంటు రవీందర్ తల వంచుకుని ఏదో రాసుకుంటూ కనిపించాడు.. నేను ఆ సెక్షన్ సూపరింటెండెంటుని... నా క్రింద పదిమంది పనిచేస్తున్నారు.. సెక్షన్ బోసిగా వుంది..
‘‘రవీందర్!.. మిగతా వాళ్ళందరూ ఏరి?’’ అని అడిగాను.
‘‘ఇప్పుడే చాయ్ త్రాగడానికి కేంటిన్‌కి వెళ్ళారు సార్!’’ అన్నాడు రవీందర్.
సెక్షన్‌లో పట్టపగలే ఆరు ట్యూబులైట్లు, నాలుగు ఫ్యాన్లు గిరగిర తిరుగుతున్నాయి.. నేను నా సీట్లో కూర్చుని సర్దుకుంటుండగా తక్కిన స్ట్ఫా ఏదో మాట్లాడుకుంటూ లోనికి వచ్చారు.. నన్ను చూసి ‘నమస్తే సార్’ అంటూ విష్ చేశారు.
‘‘నమస్తే.. నమస్తే!’’
చాయ్ త్రాగారా? ... ‘‘తాగాం సార్!.. మీకు కూడా చాయ్ ఫ్లాస్కులో తీసుకొచ్చాం!’’.. నాకు కప్పులో టీ పోసి ఇచ్చాడు అటెండరు మల్లేశు..
నేను కూడా టీ త్రాగి పనిలో పడ్డాను.
ఇంతలో మా విభాగానికి ఒక సర్క్యులర్ వచ్చింది.. ఎవరో సెంట్రల్ గవర్నమెంటు ఎనర్జి డిపార్టుమెంటువారు ఈ రోజు ఆఫీసులో లంచ్ విరామ సమయంలో, పవర్ ఎలా సేవ్ చెయ్యాలి అన్న అంశంమీద ఉపన్యాసం ఇస్తారుట.. అందర్ని మీటింగ్ హాలుకు వచ్చి హాజరుకావాల్సిందిగా ఆదేశాలిచ్చారు.
ఒంటిగంటకు మీటింగు హాలులో మా డైరెక్టరుగారు, కేంద్ర ఎనర్జీ డిపార్టుమెంటు నుండి వచ్చిన ఇద్దరు అధికారులు, మరో ఇద్దరు మా డిపార్టుమెంటు అధికారులు వేదికమీద వున్నారు. మీటింగు మొదలైంది.. కేంద్ర అధికారులు కార్యాలయాలో ఎలా విద్యుత్తు ఆదా చేయాలో వివరించారు.. తక్కువ విద్యుత్తు ఉపయోగించి ఎక్కువ కాంతి ఇచ్చే బల్బులు వాడాలని, కంప్యూటర్లకు, ఏసిలకు ఎలాంటి స్టెబిలైజర్సు వాడాలో, స్విచ్‌లు ఎలాంటివి వుండాలో, మెయిన్ కనెక్షన్‌కు వైర్లు ఎలాంటివి వాడాలో చెప్పారు.. కరెంటు, నీరు రెండూ కూడా గొప్ప ఎనర్జీలనీ.. వాటిని పొదుపుగా వాడుకుంటూ ఆదా చేసుకోవాలని.. వాటిని వృధా చెయ్యకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిమీదా వుందని.. ఎంతో అద్భుతంగా వారు చెప్పుకొస్తున్నారు.. వారి మాటలు వింటున్న నాకు.. ఎదురుగా మా ఆవిడే నిలబడి మాట్లాడుతున్నట్టనిపించింది.
ఎనర్జీ డిపార్టుమెంటువారు అంతా చెప్పి తాము మా ఆఫీసుకు సంబంధించి తయారుచేసిన రిపోర్టు మాకందించి వెళ్లిపోయారు. డైరెక్టరుగారు నన్ను తన చాంబరుకు పిలిచి ‘‘చూడండి రావుగారూ! .. ఈ సబ్జెక్టు మీకు ఇస్తున్నాను.. మన ఆఫీసులో కరెంటు, వాటరు ఎలా ఆదా చెయ్యాలో సూచించే ఓ ప్రణాళిక తయారుచేసి నాకివ్వండి’’ అంటూ ఆ రిపోర్టు నాకందించారు.. ‘‘ప్లీజ్ పుటప్ ఇమ్మిడియెట్లీ!’’ అన్నారు..
‘‘యస్సార్!’’ అంటూ ఆ ఫైలు అందుకొని కరెంటు సేవింగు గురించి ఆలోచించుకుంటూ మా సెక్షనుకు వచ్చాను.
సెక్షనులో ఓ మూలగా నున్న టేబిలు మీద జూనియర్ అసిస్టెంటు రవీందర్, టైపిస్టు
బాలాజీ భోజనం చేస్తున్నారు. తలపైకెత్తి చూశాను.. ఆరు ట్యూబులైట్లు వెలుగుతున్నాయి, నాలుగు ఫ్యాన్లు స్పీడుగా తిరుగుతున్నాయి.
‘‘బాలాజీ!.. మీ ఇద్దరు టిఫిను తినడానికి ఇన్ని ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు అవసరమా?’’ అన్నాను కాస్త కోపంగా.
వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు.. వెంటనే బాలాజీ లేచి ‘‘బాషా, రాజు, మల్లేశు ఫ్యాన్స్ బంద్ చెయ్యకుండా లంచ్‌కు వెళ్లిపోయారు సార్!’’ అంటూ గబగబా వచ్చి అదనంగా వృధాగా వెలుగుతున్న ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేశాడు.
‘‘అయినా పట్టపగలు ఈ లైట్లెందుకు రవీందర్!’’ అని అడిగా.
‘‘నా సీటు దగ్గర లైటింగు తక్కువగా ఉంది సార్’’ అన్నాడు.
‘‘అలాగైతే నీ సీటును కాస్త ఆ కిటికీ దగ్గరగా జరుపుకో’’ అన్నా.
‘‘అలాగే సార్’’ అన్నాడు రవీందర్..
ఈ లెక్కన అన్ని విభాగాలలో రోజూ ఎంత కరెంటు వేస్టు’’ అని ఆలోచిస్తున్న నాకు మా ఆవిడన్న మాటలు గురుతొచ్చాయి.
‘‘ఏవండీ!.. మీరు నిన్న రాత్రి బాత్‌రూంలో లైట్ ఆఫ్ చెయ్యకుండా వచ్చి పడుకున్నారు.. కాస్త గుర్తుపెట్టుకోండి బాబూ! కరెంటు బిల్లు కట్టేది మీరే... కాని వృధా ఎందుకు?’’ అని అంటున్న మా ఆవిడ మిధ్యాబింబం నా ఎదుటనుండి అదృశ్యమైంది.
‘‘పాపం! మా ఆవిడ!.. యింటి గురించి తానెంతగానో తాపత్రయపడుతుంది. వేస్టేజీ అసలు సహించదు.. ఏదో ఒక రూపాయి ఆదా చెయ్యలనుకుంటుంది. ముఖ్యంగా కరెంటు, వాటరు..’’
నూట ఇరవై కోట్లు దాటిన మన దేశంలో, ఒక్కొక్కడూ ఒక్కొక్క యూనిట్ వేస్ట్ చేసినా ఎన్నో కోట్ల యూనిట్ల విద్యుత్ వృధా.. దీంతో ఎండాకాలం రావడానికి ముందే కరెంటు కోత ఏర్పడుతుంది. అప్పుడు పక్క రాష్ట్రాల నుండి విద్యుత్ అదనంగా అధిక మొత్తం చెల్లించి కొనుగోలు చెయ్యాల్సి వస్తుంది. రాష్ట్రంలో కరంటు ఛార్జీలు పెరుగుతాయి.. ప్రజలు తిట్టుకుంటారు. ప్రతిపక్షాలు దుయ్యబట్టి, ధర్నాలు చేస్తాయి.. ఇలా ఒకదానికొకటి లింకు.. వీధుల్లో పట్టపగలు కూడా వెలుగుతున్న విద్యుద్దీపాలు, నడిరోడ్లపై పారే మంచినీరు, కార్యాలయాల్లో అనవసరంగా వెలుగుతున్న దీపాలు, తిరుగుతున్న పంకాలు, సింకులు, బాత్‌రూంలు, టాయ్‌లెట్లలో లీకీజీలు.. ఎక్కడ చూసినా అంతా వృధా.. వృధా! ఏది ఆదా!.. వీటి గురించి తీవ్రంగా ఆలోచించి సంబందించినవారు బాధ్యతగా చర్యలు తీసుకొంటే కరెంటు, నీటి కొరతలను కొంతైనా అరికట్టవచ్చు.
ఆలోచిస్తూ టేబులు మీద వున్న కేంద్రం వారి సూచనల ఫైలు తీసుకొని క్షుణ్ణంగా చదివి.. కరెంటు, నీరు ఆదా గురించి ఒక చక్కటి నివేదికను తయారుచేసి డైరెక్టరుగారి టేబిల్‌మీద వుంచి బయటకు వచ్చాను... నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. ఆఫీసులో అధికారి మాటలు వినాలి! ఇంట్లో ఇల్లాలి మాటలు వినాలి.. అప్పుడే ఇంటా బయటా శాంతి! ప్రశాంతి.. అనుకున్నా. మా ఆవిడ గుర్తొచ్చింది. తనకు ఫోన్ చేశా!
‘‘ఏమోయ్! ఒక సర్‌ప్రైజ్! ఇంటికొచ్చి చెబుతా...’’ అంటూ ఫోన్ కట్ చేశా! వెళుతూ.. వెళుతూ దారిలో కొన్ని స్వీట్లు, మొన్న బజారుకెళ్లినపుడు ఓ షాపులో తను ఇష్టపడిన చీర కొనుక్కొని ఇల్లు చేరుకున్నాను.

-ఎన్.రఘు రామమూర్తి * రచయిత సెల్ నెం:9490796399