ఈ వారం కథ

నిర్ణయం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్.. ఎక్కడి వస్తువులు అక్కడ నీట్‌గా సర్దివున్నాయి. కిటికీలకు, ద్వారాలకు లేత నీలిరంగు డిజైన్‌లో కర్టెన్స్ వేలాడుతున్నాయి. ఓ పక్కగా అమర్చబడిన అక్వేరియంలో రంగు రంగుల చేపలు చురుగ్గా కదులుతున్నాయి. అది మధ్యగా సీలింగ్‌కు వేళ్లాడుతూన్న చిన్న షాండ్లియర్ గదికే ఓ కొత్త అందాన్ని తెస్తోంది. అక్కడ ప్రతి వస్తువూ గది అందాన్ని మరింతగా పెంచుతున్నాయి. ఆ ఒక్క గదే కాదు ఇల్లంతా చక్కగా.. ప్లాన్డ్‌గా.. తీర్చిదిద్దినట్టుగా వుంది. జాహ్నవి ఆలోచిస్తోంది.. ఇంటిని పరిశుభ్రంగా.. అందంగా... ఆర్టిస్టిగ్గా వుంచుకోవడం తనకు మొదట్నుంచీ అలవాటు. ఏ మాత్రం ఇల్లు చిందర వందరగా వున్నా తను అస్సలు భరించలేదు. కానీ జీవితం? అది మాత్రం ఎందుకలా లేదు? అస్తవ్యస్తంగా.. అనాసక్తిగా.. ఎప్పుడేమవుతుందో అన్నట్టు!?
నీటి తాకిడికి పడవ ఊగుతున్నట్టుగా ఆమె మనసులో భావాలు ఊగిసలాడుతున్నాయి. ‘్ఫస్ట్ స్టెప్’ పేరు బాగుంది. అంజలి చెప్పిన ప్రోగ్రాం కూడా బాగుంది. ఫస్ట్ స్టెప్ అనే స్వచ్ఛంద సంస్థ ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. దాని ప్రకారం కొంతమంది వలంటీర్లు ఓ బస్తీకి అంటే ఓ స్లమ్ ఏరియాకి వెళ్లి వారం పాటు కార్యక్రమాలు చేయాల్సి వుంటుంది. ముఖ్యంగా అక్కడివారికి పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం, వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించడం, మరుగుదొడ్ల ఆవశ్యకత గురించి తెలియజేసి దానికి ప్రభుత్వసాయం ఏ విధంగా పొందాలో చెప్పి వారిని ఆ దిశగా ప్రోత్సహించడం, అలాగే వాడల్లో చెత్తని ఎక్కడికక్కడ చెత్త కుండీలు ఏర్పాటుచేసుకొని అందులోనే వేసేలా చేయడం. మళ్లీ ఆ చెత్తను డంప్ చేసే విధంగా స్థానిక మున్సిపాలిటీ ఆఫీసులో చెప్పి చేయించుకోవడం.. ఇలాంటివన్నీ చిన్న చిన్న మీటింగులు నిర్వహించడం ద్వారా సాధించాలి. దానికి అవసరమైన సపోర్టును, ఒక రోజు శిక్షణను ఫస్ట్‌స్టెప్ ఇస్తుంది. అత్యవసరమైన చిన్న చిన్న పనులు అంటే చెత్తకుండీలను ఏర్పాటుచేయడం, కాలువల రిపేర్లు, అవసరమైన చోట మొక్కలు నాటించడం, విటమిన్, ఐరన్ మాత్రలను సప్లై చెయ్యడం లాంటివి వలంటీర్లు ఇచ్చే నివేదికను బట్టి సంస్థే స్వంత ఖర్చుతో చేస్తుంది.
అంతేకాకుండా అక్కడ అక్షరజ్ఞానం కలిగిన యువతీయువకులకు ప్రభుత్వ పథకాలను ఏ విధంగా పొందాలో, ఏ ఆఫీసులో ఏ పనవుతుందో వివరంగా తెలిపే శిక్షణ ఇచ్చి వారిని ఆ బస్తీ బాగోగులు చూసుకునే వారిగా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా వలటీర్లు చెయ్యాల్సి వుంటుంది. ఆసక్తివున్నవారెవరైనా ఫస్ట్ స్టెప్‌లో వలంటీర్లుగా నమోదు చేయించుకోవచ్చు. ప్రోగ్రాం అయ్యాక జరిగే రివిజన్ మీటింగ్‌లో ఫస్ట్ స్టెప్ వలంటీర్లకి సర్ట్ఫికెట్‌తో పాటు జ్ఞాపికను కూడా అందజేస్తారు. ఇదంతా కేవలం ఆసక్తితోనూ, సామాజిక సేవగానూ భావించి చెయ్యాలి. నిజానికి అలాంటి వాళ్ళతో ఎంతో కొంత సహాయపడ్డామనే సంతృప్తే మనకొచ్చే అసలైన రివార్డు.
జాహ్నవికి ఈ కార్యక్రమానికి వెళ్దామనే వుంది. తమ నగరం వెలుపల బస్తీలోనే ఈసారి కార్యక్రమం వుంది. దానికి అంజలి వెళ్తోంది. తనను కూడా రమ్మంది. వారం రోజులు సెలవులంటే తను పనిచేసే ఆఫీసులో కష్టమే కానీ ఇందులో ఒక వెసులుబాటు వుంది. ఫస్ట్‌స్టెప్ నిర్వహించే ప్రోగాంకి వలంటీర్లుగా వెళ్ళే వాళ్ళకి చాలా సంస్థలు తమ వంతు సహాయంగా అన్నట్లు వారం రోజులు సెలవు మంజూరు చేస్తున్నాయి. అంజలి ఆఫీసులో కూడా అలాగే ఇచ్చారు. తను కూడా అడిగి చూస్తే సరి.. ఆ విధంగా సెలవు మంజూరైతే ఓ వారం పాటు సామాజిక సేవా కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశంతో పాటు రొటీన్ లైఫ్ నుంచి కాస్త బైటపడే వెసులుబాటు కూడా దొరుకుతుంది.. ఈ రకంగా ఆలోచించాక జాహ్నవి మరుసటి రోజే బాస్‌ను సెలవు గురించి అడగాలని నిశ్చయించుకుంది.
భర్తకి ఈ విషయం చెప్దామా.. లేక శెలవు శాంక్షనై నిజంగా వెళ్తామని ఫిక్సయ్యాక చెప్దామా అనుకుంది. చెప్పినా అతడి రియాక్షన్ ఏమిటో తనకు తెలీంది కాదు.. ఏమనుకున్నా మొత్తానికి ఆ రాత్రి శరత్‌కి ఫస్ట్‌స్టెప్ గురించి చెప్పింది జాహ్నవి.
శరత్ నవ్వాడు. ‘‘్భష్.. ఉద్యోగం చేస్తూ ఇంట్లో నన్నుద్ధరిస్తున్నది చాలక ఇంక అలగా జనాలను కూడా ఉద్ధరించడానికి బైల్దేరావన్నమాట..’’ అన్నాడు. జాహ్నవికి చివుక్కుమంది.. భర్త సంగతి తనకు తెలీంది కాదు గానీ మరీ ఇలా అంటాడనుకోలేదు.
మరుసటి రోజు ఆఫీసులో బాస్‌కి ఆ ప్రోగ్రాం గురించి చెప్పి శెలవు అడిగింది. అతడికి కూడా ఫస్ట్ స్టెప్ గురించి తెలుసు. వారం రోజులు శెలవు ఇవ్వగలను కానీ రూల్స్ ప్రకారం ఆ శెలవు నీ ఎరన్డ్ లీవు ఎకౌంట్ నుంచి కట్ అవుతుంది అన్నాడు. ఆ విషయాన్ని జాహ్నవికి తెలీంది కాదు. సంతోషంగా అంగీకరించింది.
రాత్రి పక్కమీదకు చేరాక జాహ్నవికి నిద్రరాలేదు. పక్కనే శరత్ హాయిగా గురకలు తీస్తూ పడుకుని వున్నాడు.
జాహ్నవి ఆలోచిస్తోంది. అసలు తను దేనినుంచి రిలీఫ్ కోరుకుంటోంది? రొటీన్ లైఫ్ నుంచా? అదొక్కటే కాదు.. తనకి జీవితమే అంతకంతకూ భారమైపోతోంది. పెళ్లయి రెండు సంవత్సరాలైంది. పిల్లలు పుట్టకుండా ఇంతవరకూ జాగ్రత్తపడ్డారు. మనవణ్ణో, మనవరాల్నో ఇంకెప్పుడు ఇస్తావు అంటోంది అమ్మ. కానీ తనకే భయం వేస్తోంది. పిల్లల్ని కనడానికి కాదు. అసలు తన భవిష్యత్ ముందు ముందు ఎలా వుంటుందో అని! మొదట్లో శరత్ బాగానే వుండేవాడు. పెళ్లయిన సంవత్సరం తరువాత ఒకసారి అన్నాడు.. ‘‘నా జీతంతో ఇద్దరం బ్రతకొచ్చు.. నువ్వింక ఉద్యోగం మానేయ్.. మనం పిల్లలకోసం ఆలోచించే ముందే నువ్వు ఉద్యోగం మానేస్తే బెటరని నా అభిప్రాయం.’’
జాహ్నవి ఆ మాటల్ని లైట్‌గా తీసుకుంది. ‘‘ఆలూ లేదు.. చూలు లేదు.. అన్నట్టు ఎప్పుడో పుట్టబోయే పిల్లల కోసం ఇప్పణ్ణుంచి ఉద్యోగం మానేయడమేమిటి? అయినా పిల్లల్ని కంటున్న వాళ్ళందరూ ఉద్యోగాలు మానేస్తున్నారా?’’ అంది.
శరత్ అప్పటికేమీ మాట్లాడలేదు.. కానీ తర్వాత్తర్వాత అతడి అసలు ఉద్దేశమేమిటో ఆమెకు అర్థమయ్యింది. ఒకసారి ఇన్స్‌పెక్షన్ టైమ్‌లో ఆఫీసులో బాగా లేటయి ఇంటికి వెళ్ళడానికి బస్సులు దొరకవేమో అనుకుంటున్నప్పుడు కొలీగ్ డ్రాప్ చేస్తానన్నాడు. తను అతడి బండిమీద కూర్చుని వచ్చేసింది. ఇంటి ముందు బండి దిగడం అతడు బాల్కనీలో నుంచి చూశాడు.
‘‘నీకు అంతగా బస్సులు దొరకవనుకుంటే నాకు ఫోన్ చేస్తే నేనే బండి తీసుకుని వచ్చేవాణ్ణిగా..’’ అసహనంగా అన్నాడు.
‘‘నాకంత ఆలోచన రాలేదండీ.. అతడు డ్రాప్ చేస్తానంటే ఆ టైమ్‌లో ఇంకేమీ ఆలోచించలేదు.. ఎలాగో తొందరగా ఇంటికి చేరుకుంటే చాలు అని చెప్పి వచ్చేశాను..’’ మామూలుగానే చెప్పింది.
‘‘అవునవును.. అతడు డ్రాప్ చేస్తానంటే ఇంకేమీ ఆలోచించలేదు నువ్వు..’’ అతడి గొంతులో వ్యంగ్యం స్పష్టంగా ధ్వనించింది.
జాహ్నవికి అప్పుడప్పుడే అతడి తత్త్వం అర్థమవసాగింది. అంతకుముందు కూడా ‘‘మీ ఆఫీసులో ఎంతమంది వుంటారు? జెంట్స్ స్ట్ఫా ఎంతమంది? వాళ్ళ సంగతులేమిటి?’’ లాంటి ప్రశ్నలు అడిగినా తను కేజువల్‌గానే తీసుకుని సమాధానం చెప్పింది తప్ప అతడి ఆలోచనలు ఎటువైపు సాగుతున్నాయో అర్థం చేసుకోలేకపోయింది.
తర్వాత్తర్వాత టార్చర్ మొదలైంది. అతడెంత అనుమానప్పురుగో ఆమెకి స్పష్టంగా అర్థమయ్యింది. ఇద్దరిమధ్య దూరం పెరిగిపోయింది. అతడి మాటలు చాలాసార్లు ముల్లు గుచ్చినట్టు బాధించేవి. ‘‘అయినా నేను మానేయమంటే ఎందుకు మానేస్తావ్..? అక్కడ నీ కొలీగ్స్ అందరినీ ఒకేసారి వొదిలేసుకోవడమంటే కష్టమే కదా..’’ అనేవాడు.
జాహ్నవి ఒక నిశ్చయానికి వచ్చేసింది.. ఏమైతే అదే కానీ.. తను మాత్రం ఉద్యోగం వదులుకోదు. తనీ వుద్యోగం మానేసినా అతడి జీతం తమ ఇద్దరికీ సరిపోవచ్చు గానీ ఇది జీతానికి సంబంధించిన సమస్య కాదు. జీవితానికి సంబంధించిన సమస్య!
ఫస్ట్‌స్టెప్ ప్రోగ్రాం మొదలయ్యింది. అక్కడ ఎలా మెగాలి.. ఏ విధంగా వ్యవహరించాలి.. అనే విషయాలతో ఒక రోజు శిక్షణ కూడా పూర్తయింది. మరుసటి రోజు ఉదయం పదిమంది బృందం బస్తీకి వెళ్లారు. మొదటిరోజు అక్కడ సమస్యలు గుర్తించడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అలాంటి స్లమ్ ఏరియాలో ఎన్ని సమస్యలు ఉండాలో అన్నీ అక్కడున్నాయి. పూడుకుపోయిన కాలువలు, రోడ్ల మధ్యనుంచి పారుతున్న మురుగునీరు, ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, అపరిశుభ్రత తాండవిస్తున్న పరిసరాలు, మనుషులు.. అంతేకాక పొగతాగడం, మద్యం సేవించడం అక్కడ చాలా సాధారణ విషయంలా కనిపించింది. ఆ రోజుకి అక్కడ సమస్యలేమిటో తెలుసుకున్నాక మరుసటి రోజు వాళ్ళతో ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో ఆలోచించుకున్నారు.
మరుసటి రోజు బృంద సభ్యులకు బస్తీవాసుల్ని సమావేశపరచి ఏదైనా విషయం మాట్లాడాటమే పెద్ద సమస్య అయింది. ఎందుకంటే ఎవరికీ వినే ఓపిక గానీ తీరిక గానీ లేదు. ఉదయానే్న ఇంట్లో పనులన్నీ ముగించుకుని కూలి పనికో, చిన్న చిన్న కంపెనీల్లో పనులకో వెళ్లిపోయేవాళ్ళే ఎక్కువ. ఇంటి దగ్గర ఉండిపోయేవాళ్ళలో అధిక శాతం ముసలివాళ్ళు. కొంతమంది చిన్న పిల్లల తల్లులు, వికలాంగులు కూడా ఇంటి దగ్గర కనిపించారు. ఇంటింటికి వెళ్లి ఒక్కొక్క కుటుంబాన్నీ కలవడం సాగించారు బృంద సభ్యులు. తర్వాత సాయంత్రం సమావేశాలకి జనం హాజరుకావడం మొదలైంది.
జాహ్నవికి అక్కడ కనిపించింది పార్వతి. ఎప్పుడూ ఏదో ఒకటి గల గలా మాట్లాడుతూ ఏ విషయంమీద అనుమానమొచ్చినా వెంటనే అడిగేస్తూ చాలా హుషారుగా వుంది. జాహ్నవిని ఆమె బాగా ఆకట్టుకుంది. పార్వతిలో ఏదో ప్రత్యేకత వుందనిపించింది. నల్లని ఛాయ అయినా ఎప్పుడూ నవ్వు మొహంతో వుండటంవల్ల ఆమెలో తెలియని ఆకర్షణ వుట్టిపడేది. బృంద సభ్యులకు తన ఇంటినుంచి టీ తెచ్చి ఇచ్చేది. ఆమెని చూస్తూంటే జాహ్నవికి ఒక్కోసారి కలవరంగా అనిపించేది. ఆ కలవరం ఎందుకో మొదట్లో అర్థంకాకపోయినా తర్వాత్తర్వాత అదేమిటో ఆమెకి అవగాహనలోకి వచ్చింది. నవ్వు.. అవును.. పార్వతి స్వచ్ఛమైన నవ్వు తనని కలవరపరుస్తోంది. అలాంటి నవ్వు తన నుంచి దూరమై ఎంతకాలమైందా అని ఆలోచించుకునేలా చేస్తోంది. అయినా పార్వతికి కుటుంబపరమైన సమస్యలేమీ లేకపోయి వుండొచ్చు.. అందుకే అలాంటి స్వచ్ఛమైన నవ్వు ఆమెకి ఆభరణంలా వుంది. జీవితం సమస్యల సవాల్ విసురుతూ వున్నప్పుడు అలాంటి నవ్వు ఎక్కణ్ణించి వస్తుంది..? అని సమాధానపడింది జాహ్నవి.
కార్యక్రమం మొదయ్యాక నాలుగో రోజున పార్వతి ఇంటికి వెళ్లింది జాహ్నవి. పక్కనే అంజలి కూడా వుంది. పార్వతి వుంటున్న ఇల్లు, ఆ పరిసరాలు చూసేసరికి జాహ్నవికి రోత కలిగింది. ఎదురుగా మట్టిరోడ్డుకి అవతల పెద్ద మురుగ్గుంట వుంది.. పక్కనే పందులు.. పార్వతి నాలుగేళ్ల బాబు కూడా ఆ మట్టిలోనే ఆడుతున్నాడు. ఆమె వుంటున్న రేకుల ఇల్లు కూడా అపరిశుభ్రంగా వుంది. ఓ పక్క పాత బట్టల మూట కాబోలు పడి వుంది.. ఎక్కడి వస్తువులక్కడే చిందరవందరగా వున్నాయి. ఇంట్లోకి పెద్దగా వెలుతురు కూడా రాకపోవడంవల్ల కనుచీకటిగా అనిపిస్తోంది. ఓ పక్కగా కట్టెలపొయ్యి మండుతోంది. ఇంటిముందు చిన్న దడిలాగా కట్టి వుంది. అది వాళ్ల బాత్‌రూమ్ అని చెప్పింది పార్వతి.
‘‘ఇంత అపరిశుభ్రంగా వున్న వాతావరణంలో ఎలా వుంటుందో ఆమె..’’ అనుకుంది జాహ్నవి. ‘‘ఇంటిని, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే వ్యాధుల బారిన పడే అవకాశం వుంది.. ఇంటిముందూ.. ఇంట్లో కూడా ఒకలాగే వుంది.. ఇలా అయితే కష్టం..’’ అంటూ పార్వతికి క్లాస్ తీసుకుంది.
‘‘అలాగేలెండమ్మగారూ.. అక్కడ మీటింగులో కూడా ఈ ఇసయాలే సెప్తున్నారు గందా.. అయినా మేం రాటుకీ పోటుకీ తట్టుకునేవోళ్లం లెండి.. అంత బేగి మా దగ్గరికి రోగాల్రావు’’ తేలిగ్గా అనేసింది పార్వతి.
ఇద్దరికీ టీ పెట్టి ఇచ్చిందామె. జాహ్నవికి ఆ వాతావరణంలో పార్వతి ఇచ్చిన టీ తాగడానికి కూడా ఇబ్బందిగా అనిపించింది. కానీ ఆమె నొచ్చుకుం
టుందని
భావించి బలవంతంగా తాగింది.
తర్వాత ఆ మాటా ఈమాటా చెప్తూ పార్వతి తన కాపురం సంగతి కూడా చెప్పింది. భర్త ఏదో కంపెనీలో పనిచేస్తాడట. రోజూ సాయంత్రం ఫుల్‌గా తాగేసి రావడం అతడి అలవాటు. అలా వచ్చి పార్వతిని కొట్టడం కూడా అతడికి అలవాటే. లేనిపోని సంబంధాలంటగట్టి బూతులు తిడుతూ మరీ తంతాడట. తెచ్చిన జీతం చాలామట్టుకు వాడి తాగుడుకే సరిపోతుంది. ఈమె కూడా కూలి పనికిపోయి డబ్బులు తెస్తుందట. పిల్లాణ్ణి చూసేవారెవరూ లేక తన కూడా తీసుకుపోతుందట. చాలాసార్లు ఈమె దగ్గర డబ్బులు కూడా లాక్కుంటాడట మొగుడు.. ఇవ్వనంటే తన్ని మరీ లాక్కుపోతాడట.
‘‘సచ్చినోడు సంపుకుతినేత్తన్నాడమ్మా.. ఈడినేటి సెయ్యాలో అరదం కాకండా వుంది..’’ అంది పార్వతి. ఆమె మాటల్లో బాధకన్నా చిరాకు, కోపం మాత్రమే ఎక్కువుంది.
జహ్నవికి ఆశ్చర్యంగా అనిపించింది. ఇన్ని కష్టాలున్నా పార్వతిలో ఆ ఛాయలేమీ కనిపించట్లేదు. అదెలా సాధ్యమో ఆమెకి అర్థంకాలేదు.
‘‘ఇన్ని కష్టాలు పెట్టుకుని పార్వతి అంత స్వచ్ఛంగా ఎలా నవ్వగలుగుతోంది?’’ తిరిగి వెళ్తున్నప్పుడు అంజలిని అడిగింది జాహ్నవి.
‘‘ఇక్కడవాళ్ళకి ఇవన్నీ సర్వసాధారణం.. చాలామంది బతుకులిలాగే వుంటాయ్.. అందుకే పార్వతికి ఇది మరీ అంత కష్టం కలిగించే విషయం కాలేకపోయింది..’’ అంది అంజలి.
చూస్తూండగానే వారం రోజుల ఫస్ట్‌స్టెప్ కార్యక్రమాలు ముగిశాయి. జాహ్నవి మళ్లీ రొటీన్ జీవితంలో పడింది. వారం రోజులపాటు బస్తీవాళ్లతో గడిపిన అనుభవాలు ఆమెకి బ్రతకడానికి మరింత ధైర్యాన్నిచ్చాయి.
రెండు నెలలు గడిచాయి. శరత్‌లో శాడిజం మరింత పెరిగింది. ఉద్యోగం మానేయమని వేధింపులు ఎక్కువయ్యాయి. శాంతంగా, సహనంగా అతడికి నచ్చచెప్పాలని చూసిన జాహ్నవి ప్రయత్నాలు వమ్మవుతున్నాయి. ఏం చెయ్యాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో పడింది ఆమె.
ఆరోజు బజార్లో నడుస్తూ వెళుతూ ఉంటే కనపడింది పార్వతి. ఎదురుగా వస్తున్న జాహ్నవిని చూడగానే ఆమె మొహం చాటంతయ్యింది.
అదే స్వచ్ఛమైన నవ్వు మొహంతో ‘‘బాగున్నారా అమ్మగారూ..’’ అంటూ పలకరించింది.
‘‘బానే వున్నాను గానీ నీ సంగతేమిటి.? ఏవంటున్నాడు నీ మొగుడు? ఇంకా కొడుతూనే వున్నాడా?’’ అడిగింది.
‘‘ఆడి సంగతి ఇంక నాకెందుకమ్మగారూ.. ఆణ్ణి వొగ్గేసినాను గదా..’’
జాహ్నవి షాకయింది.. ‘‘ఏంటి మీ ఆయన్ని వొదిలేశావా? అంటే విడాకులిచ్చావా?’’ అడిగింది.
‘‘అలాటిదే అనుకోండమ్మా.. పక్కీదిలోనే ఎంకట్రావని వున్నాడు లెండి.. పాపం పెళ్లయిన ఐదేళ్ళకే పెళ్లాం జబ్బు చేసి సచ్చిపోయింది. నా మీద ఆడికి మనసు. ఎప్పణ్ణుంచో అడుగుతానే వున్నాడు.. ఎంతకాలం ఆడితో నరకం పడతావు? పిల్లాణ్ణి తీసుకొచ్చి నా దగ్గరికొచ్చెయ్యి.. పువ్వుల్లో పెట్టి సూసుకుంతాను అని. చాన్నాళ్లబట్టి మనసులో లజ్జుగుజ్జులు పడతున్నాను. ఇటు జూస్తే ఈ సచ్చినోడితో తంటా ఎక్కువైపోయింది. అంతకంతకీ రెచ్చిపోతన్నాడు. ఇకనుండబట్టలేక తెగదెంపులు చేసుకున్నాను. ఆ సచ్చినోడు ఎలా పోతే నాకేటి? ఇప్పుడు నా బతుకేదో నాది. ఎంకట్రావు మంచోడమ్మా.. బగవంతుడి దయవల్ల ఇప్పుడే ఇబ్బందీ నేదు..’’ చెప్పింది పార్వతి.
‘‘అదేంటీ.. ఇంత సులువుగా ఇదంతా జరిగిపోయిందా..? నీ మొగుడేమీ అనే్లదా..? మీ బస్తీలో ఎవరూ ఏమీ అనే్లదా?’’ జాహ్నవికి ఇంకా ఆశ్చర్యంగానే వుంది.
‘‘ఆ సన్నాసోడు ననే్నం సేత్తాడమ్మా? ఎంకట్రావుకీ నాకూ రంకు అంటగట్టాడు. బగవంతుడి సాచ్చి.. అంతకుముంది ఎన్నోసార్లు ఎంకట్రావు నన్నొచ్చెయ్యమని అడగడం నిజవేగానీ అంతకుమించి మా మద్దిన ఏం లేదమ్మా.. నానెళ్లిపోనాక పెద్దల దగ్గిర తగువెట్టాడు సచ్చినోడు. నాను ఆడిదగ్గర వుండలేనంటే ఆళ్లు మాత్రం ఏటి సేస్తారు? ఆడి సంగతి ఆళ్లకి మాత్రం తెలీదా ఏటి? పిల్లాణ్ణి నాకు కాకండా సెయ్యాలని సూశాడు. కానీ పెద్దలు మాత్రం పిల్లడు తల్లి దగ్గరే వుండలాని సెప్పారు..’
జాహ్నవి ఏం మాట్లాడాలో తెలీక పార్వతి వంకే చూస్తూండిపోయింది. లేచిపోవడం అనే విషయాన్ని పార్వతి చాలా తేలికగా సహజంగా చెప్పేసింది. తను చేసిన దాంట్లో తప్పేమీ లేదన్న ధీమా ఆ అణువణువులో కనబడుతోంది.
జాహ్నవికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. అవును.. పార్వతి చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఇల్లు శుభ్రంగా వుంచుకోలేదని తను ఆమెకి క్లాస్ తీసుకుంది. ఇంటి విషయంలో ఎలా వున్నా తన జీవితంలో చేరిన మురికిని పార్వతి సమూలంగా కడిగిపారేసింది. మళ్లీ సరికొత్త జీవితాన్ని పొందగలిగింది. తానేం చేస్తోంది? ఇంటిని పద్ధతిగా వుంచుకోవడం వరకూ సరే గాని జీవితం విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమయిపోతోంది. ఆర్థిక స్వాతంత్య్రం వున్నా భర్త నుంచి విడిపోయే ధైర్యం చెయ్యలేక.. ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో.. తల్లిదండ్రులు ఏమంటారో, సమాజం ఎలా చూస్తుందో అన్న భయంతో బ్రతికేస్తోంది. ఈ తేడా దేనివల్ల వచ్చింది? పార్వతి చుట్టూ వుండే మనుషులు వేరు.. ఆమె జీవన విధానం వేరు.. ఇవన్నీ అక్కడ పెద్ద విషయాలు కావు. తను బ్రతుకుతున్న సమాజం, జీవన విధానం వేరు.. విడాకులు ఇవ్వడం, తీసుకోవడం ఇక్కడ చిన్న విషయం కాదు.. పార్వతిని మొదట తాను చాలా జాలితో చూసింది. ఏ విధంగా చూసినా ఆమె జీవితం దయనీమయైన పరిస్థితుల్లో వున్నట్లుగా అనుకొంది. తను ఆమెకన్నా ఎంతో ఎత్తులో వున్నట్లుగా భావించుకొంది. కానీ ఇప్పుడలా అనిపించడంలేదు. పార్వతికన్నా తను ఎన్నో మెట్లు దిగువనే వుండిపోయింది. తను పెరిగిన వాతావరణం, తను బ్రతుకుతున్న సమాజం తనను ముందుకు వెళ్ళనీయకుండా చేస్తున్నాయా? ఇలా ఎంతకాలం? జాహ్నవి ఆలోచనలు ఎంతకీ తెగడంలేదు. *

-ఎం.రమేష్‌కుమార్