కథ

పంచాంగ శ్రవణం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగాది పర్వదినం సందర్భంగా... జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య పట్టణంలోని కళాక్షేత్రంలో కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పానకాలరావు ముఖ్య అతిథి.
ఉదయం పది గంటలకు పుర ప్రముఖులందరూ కళాక్షేత్రం చేరుకున్నారు. నగర ఎంఎల్‌ఏ, ఎంపి, జిల్లా పరిషత్ చైర్మన్, కలెక్టర్‌తో మంత్రిగారు విచ్చేశారు. ఉగాది పచ్చడి రుచి చూశారు. ముఖ్యులందరినీ వేదిక మీదికి ఆహ్వానించారు. వేదికనలంకరించిన పెద్దలు పుష్పగుచ్ఛాలు అందుకున్నారు.
నాదస్వరం - వేదపఠనం పూర్తయ్యాయి.
వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
మంత్రిగారు ఉగాది సందేశం వినిపించారు.
‘అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్న పంచాంగ శ్రవణం మరి కొద్ది క్షణాల్లో’ మైకులో ఎనౌన్స్‌మెంట్ వినపడింది.
సభికులు హర్షధ్వానాలు చేశారు.
జ్యోతిష రత్న, వాస్తు శిఖామణి రామశాస్ర్తీగారు మైకు అందుకున్నారు. పచ్చని పసిమి ఛాయలో మెరిసిపోతున్నారాయన. మోముపై చిరునవ్వే వారి అలంకారం. శ్రావ్యమైన కంఠం అదనపు ఆకర్షణ.
రామశాస్ర్తీగారు.. ‘శుక్లాంబరధరం..’ అంటూ వినాయకుని ప్రార్థించారు. విష్ణుమూర్తిని, సదాశివుని శ్లోకాలతో అర్చించారు. సరస్వతీ దేవిని, లక్ష్మీదేవిని స్తుతించారు.
‘పంచాంగం’ అంటే అర్థం చెప్పి ‘పంచాంగ శ్రవణం’ ప్రాముఖ్యతని విశదీకరించి రాశుల వారీగా ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు తెలియజేశారు. రాశి ఫలాలు వివరంగా చెప్పారు.
జిల్లాలో రాబోయే సంవత్సర కాలంలో వర్షాకాలంలో వర్షాలు బాగా కురుస్తాయనీ, జిల్లా సస్యశ్యామలమవుతుందని వాక్రుచ్చారు. వేసవిలో వడగాడ్పులూ - శీతాకాలంలో చలిగాలులూ తప్పవన్నారు.
అటు పిమ్మట చిరునవ్వులు చిందిస్తూ వేదికపై ఆశీనులైన కలెక్టర్ గారికి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాల నిస్తుందనీ, వ్యయంకన్నా ఆదాయమే అధికమని గుంభనంగా సెలవిచ్చారు.
చివరగా మంత్రిగారి వైపు చూస్తూ, మంత్రి పానకాల రావుగారికి ఆరు నెలల్లో శుక్ర మహాదశ మొదలవుతుందని, సంవత్సరాంతానికి వారు ఇంతకన్న పెద్ద పదవి నలంకరిస్తారని ఘంటాపథంగా నొక్కి వక్కాణించారు. మంత్రిగారికి రాష్ట్రంలో ఎదురుండదని, ముందున్నది యోగ కాలమని, రాష్ట్రం వారి సవలో తరించిపోతుందని వాక్రుచ్చారు.
సభికులు, మంత్రిగారి అభిమానులు చప్పట్లు కొట్టారు. మంత్రిగారు ప్రశంసాపూర్వకంగా శాస్ర్తీగారి వైపు చూశారు.
చివరగా రామశాస్ర్తీగారిని ఘనంగా సన్మానించారు. తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
మంత్రిగారు అర్జంటు పనుందని నిష్క్రమించారు.
వారితోపాటే ఆఫీసర్లూ వేదిక దిగారు.
* * *
హాలు బయటకు వచ్చిన శాస్ర్తీగారు మోటార్ బైకు దగ్గరకు వెళ్లారు.
వారి సంచి పట్టుకుని శిష్యుడు రవిశర్మ వారి ననుసరించాడు.
‘ఏమిటి గురువుగారూ... ఉగాది నాడు ఉదయమే ఇన్ని అబద్ధాలు చెప్పారు... ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రమని, వ్యవసాయం ఫలదాయకం కాదని, రైతులు అప్పుల పాలవుతారని నిన్ననేగా లెక్కలు వేశాం. ఈ మంత్రిగారికి వారం రోజుల్లో పదవీ గండం ఉందని తమరు నిన్న సెలవిచ్చారు. ఈ రోజు ఇలా మాట మార్చారేమిటీ.. నాకంతా అయోమయంగా ఉంది’ అడిగాడు శిష్యుడు బుర్ర గోక్కుంటూ.
‘చూడు రవీ... నీకు శాస్త్రం తెలుసు కాని లౌక్యం తెలియదోయ్. ఇలాంటి సభల్లో అందరూ ఆనందించే విషయాలే చెప్పాలి.. మంత్రిగారి పదవి వారం రోజుల్లో ఊడుతుందని వేదిక మీద చెప్పాననుకో.. మంత్రిగారి అనుచరులు మనల్ని ఉతికి ఆరేస్తారు..’ అని శిష్యుడికి విశదీకరించి ‘పదపద... అవతల ప్రతిపక్ష పార్టీ జిల్లా ఆఫీసులో పంచాంగ శ్రవణానికి సమయమవుతోంది’ అంటూ బైక్ స్టార్ట్ చేశారు.
ఆ రోజు సాయంకాలం ముఖ్యమంత్రిగారు తన ముఖ్య అనుచరులతో సమావేశమై పార్టీ విషయాలు చర్చిస్తున్నారు. పార్టీలో అసమ్మతిని రూపుమాపే పథకానికి రూపకల్పన జరుగుతోంది.
జిల్లాల వారీగా పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు.
ఒక నమ్మినబంటు.. ‘సార్.. ఈ రోజు మా జిల్లాలో పంచాంగం శ్రవణం చెప్పిన శాస్ర్తీగారు మంత్రి పానకాలరావును ముందు ముందు ఇంతకన్న పెద్ద పదవులు వరిస్తాయని చెప్పారు. మంత్రి పదవికన్న పెద్ద పదవి అంటే...’ అంటూ ముఖ్యమంత్రికి విన్నవించాడు.
ముఖ్యమంత్రి ఆలోచనలో పడ్డాడు.
‘నిజమే.. ఈ పానకాలరావు స్వంత గ్రూపు తయారుచేసుకుని తన బలం పెంచుకున్నట్టు సమాచారం ఉంది. ఉపేక్షిస్తే లాభం లేదు... రాజకీయంగా ఎదగకుండా కట్టడి చేయాలి..’ అనుకున్నాడు.
ముఖ్యమంత్రి సన్నిహితులతో రహస్య సమాలోచనలు చేశాడు.
పార్టీలో అసమ్మతిని అణచడానికి మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయం తీసుకున్నాడు.
కులాలు, ప్రాంతాల వారీగా ఎంఎల్‌ఏలను విభజించి, కూడికలు, తీసివేతలు లెక్కలు వేసి.. కొత్తగా ఆరుగురిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని, ఇద్దరిని మంత్రివర్గం నుండి తప్పించి పార్టీ పదవులు కట్టబెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించాడు. మరో రెండు రోజుల్లో మంత్రి వర్గం పునర్ వ్యవస్థీకరించబడింది. తొలగించబడిన మంత్రుల్లో పానకాలరావు మొదటివాడు.
* * *
వార్త విన్న రవిశర్మ గురువుగారి పాదాల మీద పడ్డాడు. గురువుగారు చిరునవ్వుతో శిష్యుడిని ఆశీర్వదించాడు.
‘రవిశర్మా.. ఇక్కడితో ఈ కథ ముగిసిపోలేదు. నా నోటి మాట నిజం కాకుండా పోదు... మరో ఆరు నెలల్లో పానకాలరావు దశ తిరగబోతోంది. జరగబోయేది జాగ్రత్తగా గమనించు..’ చెప్పారు రామశాస్ర్తీ.
* * *
మంత్రి పదవి పోయాక పానకాలరావు తన అనుచరులతో రాజకీయ భవిష్యత్తు గురించి సుదీర్ఘంగా చర్చించాడు.
పగ, ప్రతీకారంతో రగిలిపోయాడు. అర్ధాంతరంగా మంత్రివర్గం నుండి తొలగించిన ముఖ్యమంత్రి మీద కక్ష తీర్చుకోవాలని పథకాలు రచించాడు.
ముఖ్యమంత్రి వ్యతిరేకుల్ని కూడగట్టాడు. మంత్రి పదవులు రాక అసంతృప్తులైన ప్రజా ప్రతినిధులను చేరదీశాడు.
ముఖ్యమంత్రి అవినీతిపై ‘నోట్’ తయారుచేసి తనకు సపోర్టిస్తున్న ఇరవై నాలుగ్గంటల వార్తా చానెల్‌కు ఆ వివరాలు అందించాడు.
* * *
రెండు రోజుల తరువాత...
ఆ వార్తా చానెల్ ‘బ్రేకింగ్ న్యూస్’లో ముఖ్యమంత్రి అవినీతి బాగోతం అంటూ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. మాజీ మంత్రి పానకాల రావు పేరు బయటపడకుండా జాగ్రత్త పడింది.
మరునాడుదయం అన్ని పేపర్లలో పతాక శీర్షికలలో ‘ముఖ్యమంత్రి అవినీతి బాగోతం’ వార్తలు వెలువడ్డాయి.
ఉలిక్కిపడిన ముఖ్యమంత్రి ఉక్కిరిబిక్కిరయ్యాడు. కోపంతో చిందులు తొక్కాడు.
తానే తప్పూ చేయలేదని కావాలంటే సిబిఐ చేత ఎంక్వయిరీ చేయించుకోమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరాడు.
ప్రతిపక్షాలు రాస్తారోకోలు.. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ కుట్ర వెనకాల పానకాలరావు హస్తముందని వేగులు ముఖ్యమంత్రికి నివేదించారు. పానకాలరావుని సంతృప్తిపరిస్తే ప్రస్తుతానికి సమస్య నీరుగారుతుందని ముఖ్యమంత్రి సన్నిహితులు సలహా ఇచ్చారు.
* * *
రెండు రోజులు బెట్టు చూపిన ముఖ్యమంత్రి పానకాలరావుతో సఖ్యత చేసుకోవడమే మంచిదనే నిర్ణయానికొచ్చాడు. ముఖ్యమంత్రి పంపిన శ్రేయోభిలాషులు పానకాలరావును ముఖ్యమంత్రిని కలవమని సలహా ఇచ్చారు. ఒక రోజంతా సహచరులచేత బ్రతిమాలించుకుని చివరకు ముఖ్యమంత్రిని కలిశాడు పానకాలరావు.
మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకుంటానని అభయమిచ్చాడు ముఖ్యమంత్రి.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు పానకాలరావు. రెండేళ్లలో ఎలక్షన్లు.. మళ్లీ ఖర్చు.. పార్టీ నెగ్గుతుందో లేదో సందేహం... ఈ పరిస్థితుల్లో రాజ్యసభ ‘సేఫ్’ అనుకున్నాడు పానకాలరావు. తనకు రాజ్యసభ సీటు కావాలని, కేంద్రంలో మంత్రి పదవి చేపట్టాలన్నది తన చిరకాల వాంఛ అని, సహకరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాడు పానకాలరావు.
‘హమ్మయ్య.. మంచి కోరికే.. వీడు కేంద్రానికి వెడితే రాష్ట్రంలో తలనొప్పి తగ్గుతుంది’ మనసులో అనుకున్నాడు ముఖ్యమంత్రి.
కాస్సేపు తర్జనభర్జనలయ్యాక పానకాలరావు కోరిక తీర్చడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చాడు ముఖ్యమంత్రి.
మరో ఆరు నెలల్లో తన పలుకుబడి నుపయోగించి పానకాలరావుని రాజ్యసభకు గెలిపించి, కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించగలిగాడు ముఖ్యమంత్రి.
కేంద్రంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఉగాది నాటి పంచాంగ శ్రవణం కళ్లకు కట్టినట్టు కనపడింది పానకాలరావుకి.
రాష్ట్రానికి తిరిగి వెళ్లగానే రామశాస్ర్తీకి ఘన సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాడు కేంద్ర మంత్రి పానకాలరావు.
* * *
‘మీ వాక్కు వేదవాక్కు.. బ్రహ్మ వాక్కు.. తిరుగుండదు’ అంటూ గురువుగారి పాదాలకు మ్రొక్కాడు శిష్యుడు రవిశర్మ.
‘అంతా దైవేచ్ఛ..’ చిరునవ్వుతో రామశాస్ర్తీ.
*

ఇంద్రగంటి నరసింహమూర్తి
ఇం.టి.నెం: 66-5-12, అశోక్‌నగర్, కాకినాడ-533003
తూ.గో.జిల్లా. మొబైల్: 9959352900

- ఇంద్రగంటి నరసింహమూర్తి