ఈ వారం కథ

బొడ్డుతాడు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది.
‘ఎక్కడెక్కడికో వెళ్లాలి, ఎవరి దాహార్తినో తీర్చాలి’- అని కంకణం కట్టుకున్నదాన్లా ఉరవళ్ళతో పరుగులు పెడుతోంది.
దిగులుగా భయంగా నదీపాయ వంకే చూస్తూ కూర్చుంది ఎల్లవ్వ.
ప్రవాహ వేగం ఆమె గుండెల్లో సుడిగుండాలు సృష్టిస్తోంది.
దీనంగా చూసింది. కనికరించమని ప్రార్థిస్తూ చూసింది. చేతులూ జోడించింది.
కృష్ణమ్మ వడీ వేగం కించిత్తు కూడా తగ్గలేదు.
గుండెల్లో గుబులు పెరుగుతోంటే గాఢంగా నిట్టూర్చి లేచింది. ఆశగా మరోసారి నది వంక చూసి వెనుదిరిగింది.
పెళ్ళై ఈ లంకలోకి మెట్టేక ఎన్నిసార్లు- ఎన్ని వందల సార్లు ఈ నదిని దాటలేదు? అన్నిసార్లూ మోకాలి లోతువరకూ ఉండి దారిచ్చింది. వర్షాకాలంలో కొన్ని రోజులు తప్ప ఎన్నడూ అద్దరికెళ్ళడానికి ఇబ్బంది పెట్టలేదు.
మరెంచేతో వారం పది రోజుల్నుంచి కసితో బుసలుకొడుతూ ప్రవహిస్తోంది. ఇదిగో ఈ పొద్దు తగ్గుతుంది, రేపు తగ్గుతుంది అని ఎదురుచూస్తోంటే రోజులు తరిగిపోతున్నాయి తప్ప ‘పోటు’ తగ్గడంలేదు.
భారంగా అడుగులేస్తూ ఎత్తుగా ఉన్న పొట్టవంక చూసుకొంది. ఆప్యాయంగా నిమురుకుంది. విచిత్రానుభూతికి లోనైంది. తల్లిని కాబోతున్నానన్న గర్వం ఆమె అణువణువులోనూ మెరిసింది. ‘నా చిన్ని కొండ. నా పేణం’ అనుకుంటూ మురిసిపోయింది.
పెళ్లికి ముందు బాళప్ప అడిగిన ప్రశ్న గుర్తొచ్చింది. ఆమె పెదాలమీద అపురూపమైన చిరునవ్వు కదిలింది.
ఆలోచనలు అయిదేళ్ళు వెనక్కెళ్ళాయి.
ఎల్లవ్వ కూలి పని ముగించుకుని పెద్ద పెద్ద అడుగులేస్తూ నడుస్తోంది. త్వరగా ఇంటికెళ్లాలని ఎంతో ఆరాటపడుతోంది. అవాళ లంక నుంచి ఆమెని చూడటానికి పెళ్లి వారొస్తారని తల్లి చెప్పింది. వాళ్ళొచ్చేలోగా ఇంటికెళ్ళిపోవాలని ఆ తొందర.
ఆమెకి పెళ్లి చేయాలని ఏడాదినుంచి ఇంట్లో ప్రయత్నాలు చేస్తున్నారు. వారిది కూలీ నాలీ చేసుకునే కుటుంబం. రెక్కలే ఆధారం. చూసిన సంబంధాలూ అలాంటివే. అయినా గొంతెమ్మ కోర్కెలు కోరారు. అంతెత్తుకి ఎగరలేక నిస్సహాయంగా ఉండిపోయారు.
మూడ్రోజుల క్రితం లంకవాళ్ళు కబురంపారు. వాళ్ళంతట వాళ్ళే అడిగారు గనుక ‘డబ్బాశ’ ఉండదని ఇంటిల్లిపాదీ ఆశపడుతున్నారు. ఎందుకో ఎల్లవ్వకి కూడా ఈ సంబంధం ఖాయమవుతుందని నమ్మకంగా ఉంది. దయ చూడమని ‘తెలిసిన’దేవుళ్లందరికీ మొక్కింది.
అల్లంత దూరాన చేతులు కట్టుకుని చెట్టుకి జేరబడి నిలబడి ఉన్నాడో యువకుడు. తనవంకే- కాదు తననే చూస్తున్నాడు.
ఎల్లవ్వ గుండె ఝల్లుమంది.
చూపులు వాలిపోయాయి. అడుగులు తడబడుతున్నాయి.
అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఓరకంట చూసింది.
కండలు తిరిగి ఉన్నాడు. నల్లగా ఉన్నాడు. మొహం కళగా వుంది. ముత్యాల వాన కురిసినట్టు నవ్వుతున్నాడు. చూపులు సూదంటురాయిలా లాగుతున్నాయి!
కలవరపడింది. నోటి తడారిపోయింది. గబగబా అతడ్ని దాటి వెళ్ళాలనుకుంది. కాళ్ళు బొత్తిగా సహకరించలేదు.
‘‘ఎల్లవ్వా!’’
ఆ పిలుపుకోసమే ఎదురుచూస్తున్నట్టు కాళ్ళాగిపోయాయి.
‘‘నాకు పిల్లల్ని కనిస్తవా?’’
అదిరిపడింది. చురుగ్గా చూసింది. అతడి కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి. అయినా పెళ్లికాని అమ్మాయితో ఇలాగా మాట్లాట్టం? అది కూడా కనిపించీ కనిపించగానే? పైగా మొదటి మాటగా!
ఆమె మనస్సు ‘చేదు’గా అవబోయే ఎందుకో మధ్యలోనే ఆగిపోయింది. ‘పనిలో సాయం వొచ్చేందుకు బిడ్డలు కావాల్నె. ఒకో బిడ్డా ఒకో రెక్క. ఇద్దరు సాల్లే. సెప్పు. వూ.. అంటే ఇప్పుడే తాళిగట్టేత్తా’’.
‘‘మాకాడ రూపాయల్లేవు..’’
‘‘నువ్వే మాలచ్చివ్వి. రూపాయలెందుకు?’’
సిగ్గు ముంచుకురాగా తలాడించింది.
‘‘లంకలో కాపురముండాలె. వానా వరదా పామూ పురుగూ ఏవైనా రావొచ్చు. బెదరకూడదు...’’
‘‘నాకు భయం లేదు..’’’
‘‘నదిలో దిగెళ్ళాలి, రావాలి...’’
‘‘నాకు ఈత వచ్చు’’
‘‘‘పనీ పాటా జెయ్యాలే...’’’
‘‘రెక్కల్ని ముడుచుకోను..’’
‘‘నీ దాయి నచ్చినాది. ఇంటికొత్తా ఫో..’’
మరి వారం తిరక్కుండానే ఎల్లవ్వకీ బాళప్పకీ పెళ్ళయ్యింది.
మొగుడి చేయి పట్టుకుని నడుము లోతు వున్న కృష్ణానది పాయ దాటి వెళ్ళి లంకలో అడుగుపెట్టింది. అదో ద్వీప గ్రామం. అక్కడ దాదాపు అయిదొందల ఎకరాల సాగుంది. వాటి యజమానులెవరూ అక్కడుండరు. సమీప ఊళ్ళల్లో టౌన్లల్లో వుంటారు.
ఆ భూమిని దున్ని నారు వేసి సాగు చెయ్యడానికి సుమారు వంద కూలీల కుటుంబాలున్నాయక్కడ. లంక మధ్యలో చిన్న చిన్న గుడిసెలేసుకునుంటున్నారు. అక్కడేమీ సరుకులు దొరకవు. ఏం కావాలన్నా నది దాటి అద్దరికి వెళ్ళాల్సిందే. వారానికో పది రోజులకో ఓసారి వెళ్లి కావాల్సినవన్నీ కొని తెచ్చుకుంటారు.
ఎల్లవ్వని అత్తమామలూ ఇరుగుపొరుగూ సాదరంగా ఆహ్వానించారు.
వారి అభిమానం చూసి కరిగిపోయింది. తన అదృష్టానికి పొంగిపోయింది.
‘‘లచ్చనంగా ఉంది. ఏడాది తిరిగేసరికల్లా పండంటి బిడ్డనెత్తుకుంటాది’’ అన్నారొకరు.
సిగ్గుల మొగ్గ అయ్యిందామె.
‘‘మీ సోద్దెం సంతకెల్ల. మెడ నిండేక ఒడి నిండదేంటే’’ కసిరింది అత్త.
వాళ్ళింకేదో అనబోతోంటే, ‘‘ఉండండే మీ దిష్టే తగిలేట్టుంది..’’ అంటూ ఇంత ఉప్పు దిష్టి తీసేసింది.
అత్తింట జీవితం ఎల్లవ్వకెంతో బావుంది. మొగుడు ‘ముద్దు’గా చూసుకుంటున్నాడు. అత్తమామలు ‘కూతుర్లా’ ఆదరిస్తున్నారు. పనీ పాటా తేలిగ్గా ఉంది. పచ్చని పాదులూ కాయగూర్ల మొక్కలూ వరిచేలూ ఆమెకెంతో నచ్చాయి. నీటికి లోటులేదు. పక్కనే కృష్ణమ్మ ఉండనే ఉంది. కష్టానికి తగ్గ ఫలసాయం దక్కుతోంది.
దేనికీ లోటు లేకుండా చీకూ చింతా లేకుండా ఎంతో హాయిగా ఆనందంగా గడిచిపోతోంది.
‘ఇదిగో ఈనెల ఖచ్చితంగా బయటవ్వను’ అనుకుంటూ ఎదురుచూస్తోంది ఎల్లవ్వ. తీపి కబురుకోసం ఇంటిల్లిపాదీ ఆత్రంగా చూస్తున్నారు.
నెలలు సంవత్సరాలయ్యాయి. ఆమె కడుపు పండలేదు.
గుండెలు బ్రద్దలు చేసేంత వేదనతో ఊగిపోయింది ఎల్లవ్వ. చెట్టుకీ పుట్టకీ గ్రామ దేవతకీ ఇలవేల్పుకీ అద్దరినున్న దేవుళ్ళందరికీ పేరు పేరునా మొక్కింది.
కరుణించమని కన్నీటితో అర్థించింది.
అర్థరాత్రి లేచి మోకాళ్ళలో తలదూర్చి ఏడుస్తోంటే, ‘దయిర్నం ఉందన్నావ్. ఇదేం పనే పిచ్చి ఎల్లవ్వా’’ అని మందలించేవాడు బాళప్ప.
తనకి కొండంత ధైర్యం ఉంది. కానదిప్పుడు జారిపోయింది. ఆ ముక్క చెప్పలేక మొగడి గుండెల్లో తలదాచుకుని బావురుమంది.
కృష్ణమ్మని పూజించమని ఓ ముసలామె సలహా ఇచ్చింది.
ఇంట్లో వాళ్ళు పెదవి విరిచారు, కాని ఎల్లవ్వ సిద్ధపడింది. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. ఎవరైతేనేం కరుణించి కోరిక తీర్చాలంతే!
పొద్దుటే పసుపు కుంకుమ తీసుకుని నదికెళ్లింది. మూడుసార్లు మునిగి లేచింది. పసుపూ కుంకుమా అర్పించింది. నది నీళ్ళు మూడు దోసిళ్ళు తీసుకుని తిరిగి నదిలోకే వదలి దణ్ణం పెట్టుకుంది. తన కడుపున కాయ కాసేలా దీవించమని వేడుకుంది.
గంభీరంగా ఉన్న నదిని చూసి అభయమిచ్చినట్టు పొంగిపోయింది.
చిత్రంగా ఆ మరుసటి నెలే నెలతప్పింది.
పట్టరాని ఆనందం ఆ కుటుంబాన్ని- కాదు కాదు ఆ చిన్ని గ్రామాన్ని చుట్టేసింది. అభినందనలు వెల్లువెత్తాయి.
అలాగే ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. పొలం పనికి రావద్దన్నాడు బాళప్ప. బుగ్గులు నొక్కుకున్నారు కొందరు. నవ్వేరింకొందరు. వేళాకోళం పట్టించారు మరికొందరు.
మొగుడూ పెళ్ళాలు ఒకరివంక ఒకరు గర్వంగా చూసుకున్నారు. ఆపైన జంట గువ్వల్లా ఒకరి గుండెల్లో ఒదిగిపోయారు.
అద్దరికెళ్లి ఆసుపత్రిలో చూపించుకుంది ఎల్లవ్వ. బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉందన్నారు. పొంగిపోయింది.
ఏం తినాలనుంటే అది పెదవి దాటకుండానే తెచ్చిపెడుతున్నాడు భర్త.
‘‘నన్ను అయ్యని సేత్తున్నావ్. ఈనామిత్తాను. ఏం కావాలో సెప్పే ఎల్లవ్వా’’ ఒక రోజు అడిగాడు బాళప్ప.
నవ్వింది. ఆ నవ్వు ఎంత అపురూపంగా ఉందంటే గబుక్కునతడు ఆమెని ముద్దుపెట్టేసుకున్నాడు.
‘‘సెప్పవే. సీర కావాల్నా, శవులక్కావాల్నా, శేతులకు గాజులు కావాల్నా?’’
‘‘అన్నీ వున్న మారాణిని’’ గర్భంవంక గర్వంగా చూస్తూ అంది.
‘‘మట్టిగాజులూ తాడు సూత్రవూ తప్ప ఏవున్నాయే. వీసమెత్తు బంగారం కొనలేదు’’ బాధపడ్డాడు.
‘‘నా బంగారం నా వజ్రం నా ఆస్తి పాస్తి అన్నీ ఇదిగో ఇక్కడ బద్రంగున్నయ్’’ అంది పొట్టని చూపిస్తూ.
మురిసిపోయాడు. పొట్టమీద ముద్దుపెట్టుకున్నాడు. విజేతలా నవ్వింది.
కడుపులోని బిడ్డ కదలికలు ఎక్కువయ్యాయి. తీయని అనుభూతుల్ని మూటగట్టుకోవడమే కాదు మొగుడికీ పంచింది. ఏదో ఒక అజ్ఞాత రసానుభూతి ఆ దంపతుల నిలువెల్లా ప్రాకింది. పులకించిపోయారు. ఆనందానికి అవధులు పూర్తిగా చెరిగిపోయాయి.
నెల రోజుల క్రితం భార్యాభర్తలిద్దరూ ఆసుపత్రికెళ్లారు.
డాక్టరమ్మ ఏవో లెక్కలు కట్టింది. ఫలానా వారంలో పురుడు వస్తుందని చెప్పింది. గడువుకి ఒక వారం ముందుగానే వచ్చి ఆసుపత్రిలో చేరమని మరీ మరీ చెప్పింది.
అందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. డబ్బూ సమకూర్చుకున్నారు.
ఊహించని విధంగా మహారాష్టల్రో అధిక వర్షాలు కురియడంతో అల్మట్టి నిండిపోయింది. గేట్లు ఎత్తేశారు.
ఉరుకులు పరుగులమీద నీరు వచ్చి పడింది. అమాంతం కృష్ణమ్మ ఉద్ధృతి పెరిగింది. ఆ దీవి చుట్టూ బలమైన నీటి దడి కట్టేసింది.
ఎల్లవ్వ కళ్ళల్లోంచి నీరు ఉప్పెనై ఉరికింది. ఇంకో రెండ్రోజుల్లో అద్దరికెళ్లి ఆసుపత్రిలో చేరాల్సి ఉంది!
‘ఊరుకోయే పిల్లా. రెండ్రోజుల్లో నీరు తీసేత్తదిలే. ఎన్నిమార్లు సూడలే’’ అంది అత్త.
అయినా ఏవో భయాలు వెంటాడుతూండటంతో రోజూ వచ్చి నదీ ప్రవాహాన్ని చూస్తోంది. రాలేనప్పుడు నదివైపు నుంచి ఎవరొచ్చినా, ‘‘అన్నా! నీళ్ళేవైనా తగ్గినాయా’’ అని అడుగుతోంది.
అదంతా గుర్తుచేసుకున్నదల్లా భారంగా నిశ్వసించింది. మరి ఒంట్లో శక్తి లేనట్టు కాస్సేపు ఆగి ఆయాసం తీర్చుకుంది.
నడవలేక నడుస్తూ వచ్చిన కోడల్ని చూసి అత్త కోప్పడింది.
‘‘ఎందుకే రోజూ కాళ్ళీడ్చుకుంటూ నదికాడికెల్తావ్. నాల్రోజులు పోతే అదే తగ్గుద్దిలే..’’
‘‘తగ్గదు’’ తల అడ్డంగా ఊపుతూ అంది. కన్నీళ్ళు జలజలా రాలిపడ్డాయి.
బుగ్గలు నొక్కుకుందామె. ‘‘ఇదెక్కడి సోద్యమే తల్లీ. ఇక్కడెవరూ పురుడు పోసేటోళ్ళు లేనట్టు ఆ ఏడుపులేంటి. మావంతా ఇక్కడ పోసుకోలేదా పిల్లల్ని కనలేదా!’’
‘‘ఏవైనా అయిపోద్దేవోనని భయవేమో’’ ఒకామె చిన్నగా నవ్వింది.
ఎల్లవ్వ మాట్లాడలేదు. మరి నాల్రోజులు గడిచిపోయాయి. నది వడీ వేగం తగ్గలేదు. ఆమెలో ఆందోళన ఆరాటం క్షణ క్షణానికీ అధికమవసాగాయి.
‘‘నది దాటి ఆసుపత్రికి పోతా’’ తలొంచుకుని చెప్పినా మాట దృఢంగా వచ్చింది.
ఎలాంటి సందిగ్ధంగాని సంకోచంగాని వ్యాకులతగాని ఆమెలో ఏ కోశానా లేవు.
అత్త నోట మాట పడిపోగా గుడప్పగించి చూస్తుండిపోయింది.
మొగుడికీ అదేమాట చెప్పింది.
‘‘నీకేవైనా పిచ్చా ఎర్రా. నది ఎంత ఉగ్గరంగా ఉందో సూస్తున్నావు. దిగితే నేనే కొట్టుకుపోంతాను. ఇంక నెలలు నిండిన నువ్వేం దాటగలవే పిచ్చిదానా!’’
‘‘డాక్టరమ్మ సెప్పిన గడువుదాటిపోనాది. నావెల్తాను..’’ మంకుపట్టు పట్టింది.
ఊరూ వాడా వచ్చి నచ్చచెప్పారు. వూహూ- ఆమె చెవికెక్కలేదు. భయం, బెదురు ఆమె వంక తొంగి చూట్టానికి భయపడ్డాయి.
ఆమెది పిచ్చి నిర్ణయమంటూ ఎవరెంతగా చెప్పినా మరెంతగా నిరుత్సాహపరచాలని చూసినా ఆమె మనస్సు మార్చుకోలేదు. పంతం వీడలేదు. పట్టుదల మరింత బిగిసింది.
‘‘ఇక్కడ పురుడు పోసుకుంటే చచ్చిపోతానని భయమేమో’’ ఒకమ్మాయి నవ్వగా కయ్‌మని కరిచేసింది అత్త. ‘‘బిడ్డని కనడవంటే సచ్చి బతకడవేనే. నువ్వు నీళ్ళోసుకున్నాక తెలుత్తాది’’.
‘‘మీకు దండం పెడతా. అడ్డుకోవద్దు’’ అంది ఎల్లవ్వ.
‘‘సరే. ఎలా రాసుంటే అలా జరుగుద్ది’’ అనుకుని కడకి అంగీకరించారంతా.
నదిలో నీళ్ళు నడుములోతు ఉన్నప్పుడు నది దాటడానికి ఆ ద్వీపవాసులు నడుముకు పెద్ద సొర బూరలు కట్టుకుంటారు.
ఇప్పుడు లోతెక్కువగా ఉంది. వడివడిగా ప్రవహిస్తోంది.
అయినా సరే వాటి సాయంతో నది దాటాలని నిర్ణయించుకుంది ఎల్లవ్వ.
బాళప్ప ఇన్ని పెద్ద పెద్ద సొరబూరలు తెచ్చి ఆమె నడుముకి కట్టాడు. ప్రవాహ ఒడిని ఒడుపుగా ఎలా అధిగమించాలో వివరించాడు.
ఊరు ఊరంతా తరలిరాగా కృష్ణానది ఒడ్డుకెళ్ళింది ఎల్లవ్వ.
అత్తమావలకీ భర్తకీ ఊరి జనానికీ నమస్కరించింది. పిమ్మట ‘‘నాకింత దారియ్యి కృష్ణమ్మ తల్లీ’’ అని మొక్కింది.
నిండు గర్భిణి ‘ఏటి’కి ఎదురీదబోతోంటే భయాందోళనలతో చూశారు. సహానుభూతితో చూస్తూ నిలబడ్డారంతా.
ఎల్లవ్వ నదిలోకి దిగింది. ప్రవాహ వేగం అధికంగా ఉంది. ఆమెని త్రోసేస్తోంది. తట్టుకోవడం కష్టంగా ఉంది. అయినా మొండిగా లోలోపలికెళ్ళింది.
‘‘నేనొత్తన్నా..’’ గబుక్కున నదిలోకి దిగబోయాడు బాళప్ప. తల్లీ తండ్రీ బలవంతాన ఆపేరు. ఒట్టు పెట్టుకున్నారు. నిస్సహాయంగా కన్నీళ్ళ తెరలోంచి చూస్తూండిపోయాడు. అతడికి ఎల్లవ్వ ఆత్మవిశ్వాసపు బావుటాలా కన్పిస్తోంది!
ఎల్లవ్వ ముందుకి మున్ముందుకి సాగిపోతోంది. లోతు ఎక్కువగా ఉంది. కాళ్ళకు నేల అందటంలేదు. సత్తువంతా ఉపయోగించి ఈదసాగింది.
ఆయాసం కమ్ముతోంది. నది సవాలు విసురుతోంది. అయినా అధైర్యాన్ని దరిచేరనివ్వలేదు.
నరనరంలోని శక్తిని కూడదీసుకుని రెక్కల్ని చాచి కాళ్ళతో నీటిని త్రోస్తూ ముందుకి సాగిపోతోంది. అద్దరి తప్ప మరింకేమీ ఆమెకి కన్పించటంలేదు.
వెన్నులో కటిలో శూలాలతో గుచ్చినట్టు నొప్పిగా ఉంది. అంతకంతకూ నొప్పి బాధ అధికమవుతున్నాయి.
పంటి బిగువున ఆ బాధల్ని భరిస్తూ లేని శక్తిని తెచ్చుకుంటూ ఎలాగైనా గమ్యం చేరాలన్న దృఢదీక్షతో ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రవాహవేగానికి ఎదురు తిరిగి మొత్తానికి ఎలాగైతేనేం ఒడ్డుకు చేరింది.
చెప్పలేనంత సంబరం చుట్టెయ్యగా ఆనందోద్వేగంతో ఊగిపోయింది. కడుపుని తడిమి చూసుకుంది. బిడ్డ క్షేమంగా ఉన్నాడన్న నమ్మకం చిక్కింది. కన్నీరు పొంగి వచ్చింది. ఏడ్చేసింది మరుక్షణం నవ్వింది. కన్నీళ్ళు ధారగా కారుతూనే ఉన్నాయి.
‘‘కన్నతల్లిలా కాపాడినావు తల్లీ’’ అనుకుంటూ చేతులు జోడించి కృష్ణమ్మకు దణ్ణం పెట్టుకుంది.
కృష్ణమ్మ సిగ్గుపడింది. ఆపైన ఆమెముందు చిన్నబోయింది!
గంటకుపైగా ఈదేసరికి ఆమె కాళ్ళూ చేతులూ తేలిపోతున్నాయి. నిస్త్రాణగా ఉంది. సొమ్మసిల్లిపోయినట్టు పడుకుండిపోయింది.
అలా ఎంతసేపుండిపోయిందో ఆమెకు తెలీదు. వెన్నుమీద ఎవరో చరిచినట్టు కాగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది.
‘తాత్సారం చెయ్యకూడదు. వెళ్లాలి, ఆసుపత్రికెళ్లాలి’ అనుకుంటూ లేచింది.
దగ్గర దగ్గర కిలోమీటరు దూరం వెళ్లాలి. నడవటం కష్టంగా ఉంది. నడుము గుంజుతోంది. ఆయాసపడుతూనే అడుగువేస్తూ ఆగుతూ మళ్లీ భారంగా అడుగులేస్తోంది.
సర్వ దేవుళ్ళనూ ప్రార్థిస్తూ ఒగురుస్తూ వెళ్లి ఆసుపత్రి మెట్లమీద కూలబడిపోయింది.
ఆసుపత్రి సిబ్బంది పరుగున వచ్చి లోపలికి తీసుకెళ్ళారు. ఎంతో నీరసంగా ఉంది. ఒగురుస్తోంది. బీపీ, కళ్ళు మూతలు పడుతున్నాయి. శరీర ఉష్ణోగ్రతా బాగా తగ్గాయి.
డాక్టరమ్మ కంగారుపడింది. గబగబా ఉపచారాలు చేసింది.
‘‘ఎందుకింత సాహసం చేశావ్? ఏటికి ఎదురీదే స్థితిలో ఉన్నావనుకున్నావా? నీకేమైనా అయితే?!’ డాక్టరమ్మ చనువుగా కోప్పడింది.
నవ్వింది ఎల్లవ్వ. ‘‘నా బిడ్డ సల్లగా ఉంది కదా?’’
‘‘నిక్షేపంలా ఉంది గాని ఎందుకిలాంటి పనికి పూనుకున్నావ్?’’
కళ్ళు మూసుకుంది తప్ప జవాబివ్వలేదు.
రెట్టించి అడగ్గా మెల్లగా చెప్పింది. ‘‘నేనేమైనా పర్లే. బిడ్డని కన్నాక సచ్చినా ఫర్లేదనుకున్నా’’.
‘‘మీ అత్తింటివాళ్ళకోసమా?’’
‘‘వుహూ.. నామీద కొండంత ధయిర్నంతో నమ్మకంతో నా కడుపున పడింది బిడ్డ. వాడిని ఎలాగైనా బూమీద పడెయ్యాల. అది బతికి బట్టకడితేశాన!’’ ఎల్లవ్వ కళ్ళనిండా ఆనందబాష్పాలు!
నిర్ఘాంతబోయి చూసింది డాక్టరమ్మ.
ఎల్లవ్వ సృష్టికి మూలమైన మహాశక్తి స్వరూపంలా కనిపిస్తోంటే అంది- ‘‘నీ ధైర్యమే నీకు శ్రీరామరక్ష. పండంటి బిడ్డకి జన్మనిస్తావు’’
కాస్సేపటికే పురుటి నొప్పులు మొదలయ్యాయి.
మరో గంటకు బిడ్డ కేర్‌మంది. అది ఆ తల్లి చెవులకు అమృతపు సోనల్లా అన్పించాయి. ఆమె పెదాలమీద గర్వంతో కూడిన చిరునగవు కదిలింది.
సృష్టిలో ఎవరూ ఎప్పుడూ చూడనంత అపురూపంగా ఉందా నవ్వు! *

రచయిత సెల్ నెం:9849061668

-సింహప్రసాద్