ఈ వారం కథ

హద్దు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరుగులాంటి నడకతో ఆయాసపడుతూ బ్యాంకు బ్రాంచ్‌లోకి అడుగుపెట్టిన సబ్ మానేజర్ మూర్తి.. ఓవైపు కొలీగ్స్‌కి విష్ చేస్తూ.. చీఫ్ కాబిన్‌వైపు ఓ లుక్కేసి... బాస్ దృష్టిలో పడకపోవటతో, ‘‘హమ్మయ్యా.. ఫైవ్ మినిట్స్ లేట్ అయినా యముడి దృష్టిలో పళ్ళేదు’’ అనుకుంటూ హడావుడిగా వెళ్లి తన సీట్లో కూర్చోబోతుండగా.. మందలిస్తూన్నట్టు వినిపించిందో గొంతు..
‘‘ఏంట్రా.. మూర్తీ!.. ఎన్నిసార్లు చెప్పినా.. ఒక్క రోజు కూడా ముందుగా తెమిలి ఆఫీస్‌కి టైంకి రాలేకపోతున్నావు. రోజూ లేటే?’’
ఉలిక్కిపడ్డాడు మూర్తి! ఆ మాటలు అంటూన్న వ్యక్తి వైపు అదురుపాటుతో చూశాడు!!.. పెద్దగా అందరికీ వినపడేలా ‘‘ఏంట్రా’’ అంటూ సంబోధిస్తూ అంటూన్న గొంతు తన క్రింది ఆఫీసర్ మాలతిది.
మాలతి గొంతులో.. సబ్ మేనేజర్‌ని ఉద్దేశించి ‘ఏంట్రా’ అని పెద్దగా ధ్వనించిన సంబోధనకి పని మొదలుపెట్టబోతున్న స్ట్ఫా అంతా ఉలిక్కిపడి.. ఆవిడ వైపుఆశ్చర్యంగా చూశారు.
‘‘కమ్ ఎగైన్.. ఏమన్నారూ?’’ మూర్తి కూడా మాలతి పలకరింపులో తేడా గమనించి, షాక్‌ని, ఉలికిపాటుని అణచుకుంటూ.. కొంచెం ముందుకు వంగి నూతిలోంచి వస్తూన్న స్వరంతో అడిగాడు.
‘‘ఏం లేదు.. ఇవాళ కూడా ఆఫీస్‌కి లేటేనా!? అన్నాను.. అంతేరా’’ జవాబు చెప్పింది మాలతి ఎటువంటి తొట్రుపాటూ లేకుండా.. అతి చనువుగా.
‘‘ఏమిటా సంబోధన!? నేను.. మీ కొలీగ్‌ని, అందులోనూ పై అధికారిని. మీ ఇంటి నౌకరుని కాదు’’... ఎర్రబడ్డ మొహంతో అన్నాడు మూర్తి గొంతు పెంచి.
‘‘నౌకర్ల దాకా ఎందుకు? మన స్వీపర్, టాయిలెట్ క్లీనర్ కూడా నేను అలా పిలిస్తే వూరుకోరు.. కదూ?’’ నవ్వింది మాలతి.
‘‘మరి..?’’ నొసలు ముడిచి అడిగాడు మూర్తి.
‘‘అంతలా ఆశ్చర్యపోతున్నావెందుకు!? నువ్వేగా అలా పిలిచే హక్కు నాకు ఇచ్చింది?’’
‘‘హక్కా? నేను ఇచ్చానా?’’ కందిపోయింది మూర్తి మొహం.
‘‘యస్.. హండ్రెడ్ పెర్సెంట్ నువ్వేరా బాబూ’’.. అల్లరిగా నవ్వింది మాలతి.
చేస్తున్న పని ఆపి స్ట్ఫా, కౌంటర్ల ముందు నిల్చున్న కొందరు కస్టమర్లు, కుతూహలంగా వీళ్ళ వాగ్వివాదాన్ని ఆసక్తిగా చూడడం గమనించి, అసహనంగా కాబిన్‌లోంచి బయటికివచ్చాడు చీఫ్.
‘‘కస్టమర్స్ వెయిట్ చేస్తుంటే, ఏమిటీ మీ డిస్కషన్? పని కానివ్వండి’’ అనేసి, తిరిగి కాబిన్‌లోకి వెళ్లిపోయాడు.
చేతులు యాంత్రికంగా సంతకాలు పెడుతున్నా మూర్తి మెదడు మాత్రం పని చెయ్యటానికి మొరాయిస్తోంది. అందరూ వినేలా ‘రా’, ‘ఏంట్రా’ అంటూ మాలతి సంబోధించడం అతన్ని విపరీతంగా అసహనానికి గురిచేస్తోంది...
లంచ్ టైం అయ్యింది.
సెక్యూరిటీ మెయిన్ గ్రిల్ లాక్ చేసి ‘లంచ్ టైం’ బోర్డ్ తగిలించగానే.. డైనింగ్ టేబుల్ దగ్గర చేరారు స్ట్ఫాంతా. సబ్ మేనేజర్ మూర్తి కూడా మటామటలాడే ముఖంతో వచ్చి కూర్చున్నాడు. అక్కడా వదిలిపెట్టలేదు మాలతి. ‘‘ఇవాళ మీ ఆవిడ లంచ్‌కి ఏం స్పెషల్ పెట్టిందిరా మూర్తీ?’’ పెద్ద గొంతుతో అడిగింది. పొద్దుటి సరదా ఆమె గొంతులో ఇంకా సజీవంగానే వుంది.
పొద్దుటినుంచీ తనని ప్రిక్ చేస్తున్న మాలతి ప్రవర్తన.. కడుపులో ఆకలి మంట కూడా కరకరలాడుతుంటే.. ‘తిండి తిన్నాక నీ పని పడతాను’ అని పళ్ళు నూరుతూ మనసులో తిట్టుకుంటూ ముభావంగా జవాబిచ్చాడు మూర్తి ‘‘చపాతీ.. కూర!’’.. ‘అన్నీ మీకు చెప్పాలా?’ అన్నట్లుంది చూపు.
‘‘పెరుగన్నం పెట్టలేదా!? నువ్వేం పాతికేళ్ళ పడుచువాడివా? మిడిల్ ఏజ్‌లోకి వచ్చావు. ఎసిడిటీ నుంచీ రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవద్దాని? మొగుడిపట్ల ఆపాటి శ్రద్ధ లేకపోతే ఎలారా మీ ఆవిడకి? రేపటినుంచీ మర్చిపోవద్దని గట్టిగా చెప్పు. లేదా ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు. నేను చెబుతాను’’.
ఎప్పుడూ గంభీరంగా, హుందాగా, క్లుప్తంగా ‘టు ది పాయింట్’ మటుకే మాట్లాడే మాలతి, ఇవాళ వింతగా ప్రవర్తించటం.. మూర్తికే కాదు స్ట్ఫా అందరికీ చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అటెండర్‌లని, స్వీపర్లనీ కూడా మర్యాదగా ట్రీట్ చేసే మాలతి.. పై అధికారి, తనకంటే వయసులో రెండేళ్ళు పెద్ద అయిన మూర్తిమీదికి ఏకవచన ప్రయోగంతోపాటు వ్యంగ్య మాటల దండయాత్ర ఎందుకు చేస్తోందో ఎవ్వరికీ అంతుపట్టట్లేదు..
గబగబా కతికి, విసురుగా వచ్చి ఓ కుర్చీ లాక్కుని మాలతి పక్కన కూర్చున్నాడు మూర్తి. ‘‘పొద్దున్నుంచీ చూస్తున్నా.. పోనీ కదా అని ఊరుకుంటుంటే మరీ పెచ్చుమీరిపోతున్నారు. ఏవనుకుంటున్నారు మీరు? బొత్తిగా మంచీ మర్యాదా లేకుండా, సీనియర్‌ని, మీ ఏజ్ గ్రూప్‌లో మగవాడిని పట్టుకుని ‘ఏరా’ అంటూ సంబోధించటానికి మీకెంత ధైర్యం? స్ర్తి అన్న జెండర్ ముసుగులో.. ఏం పేలినా చెల్లుతుందని ధీమానా? మైండ్ యు.. ఐ డోంట్ టోలరేట్. మీ అసభ్య ప్రవర్తనకి సంజాయిషీతోబాటు క్షమాపణ చెప్తారా? చీఫ్‌కి కంప్లైంట్ చెయ్యమంటారా?’’ తర్జనితో బెదిరిస్తూ అన్నాడు.
అమాయకంగా ముఖం పెట్టి ‘‘అదేంటి మూర్తీ.. నీ అంతట నువ్వే నాకు అలా పిలిచే అధికారం కట్టబెట్టి ఇప్పుడు ఇలా బెదిరిస్తావేంట్రా!?’’.. నిష్ఠూరంగా అంది మాలతి.
‘‘నానె్సన్స్.. మళ్లీ అదే వాగుడు! అరేయ్.. ఒరేయ్ అని పిలిచే అధికారం.. నేను.. మీకు.. నాకంటే వయసులో చిన్నదైన ఓ లేడీ సబార్డినేట్‌కి, ఓ పరాయి ఆడదానికి కట్టబెట్టటమేంటి? నాకింకా అంతటి ఖర్మ పట్టలేదు’’ ఆవేశంతో భగ్గుమంటూ అరిచాడు మూర్తి.
మూర్తి అరుపు విని సీట్లోంచి లేచిన చీఫ్ కాబిన్ డోర్ తెరిచి.. ‘‘ఏమిటి గొడవ?’’ అన్నాడు.
‘‘చెప్పమంటావా?’’ కళ్ళు పెద్దవి చేసి ఉరుముతూ.. తల ఎగరేసాడు మూర్తి.
మూర్తి బెదిరింపుకి కించిత్తు కూడా తొణకలేదు మాలతి. ‘‘తప్పకుండా’’ అంది.
చెప్పబోతున్న మూర్తిని ఆపి.. ‘‘ఇక్కడ కాదు’’.. అంటూ ఆ ఇద్దరినీ, ఇంకా ఇతర స్ట్ఫానీ తన కాబిన్‌లోకి పిలిచాడు చీఫ్. అందరికీ కుర్చీలు తెచ్చివేసాడు అటెండర్.
అందరికీ టీలు తెప్పించి వాతావరణాన్ని చల్లబరిచి, విషయంలోకి వచ్చాడు చీఫ్.
‘‘పొద్దుటినుంచీ మాలతి అన్‌కల్చర్డ్‌గా ప్రవర్తిస్తున్నారు సర్.. సభ్యతా సంస్కారం మరిచి నన్ను ‘ఏరా..’ అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ అవమానిస్తున్నారు సర్’’ కంప్లైంట్ చేశాడు మూర్తి. మాలతి అలా ప్రవర్తించిందంటే నమ్మలేని చీఫ్.. మూర్తి కంప్లైంట్‌కి సమాధానం కోసం మాలతి వైపు చూసాడు. ఆమెలో ఎటువంటి క్రొత్త భావాలూ లేవు. పైగా తేలిగ్గా నవ్వింది కూడా.
‘‘అలా పిలిచే అధికారం మూర్తి తనంతట తనే నాకిచ్చాడు సర్.. స్వయంగా తన నోటితో చెప్పాడు. లేకపోతే.. నేనెందుకు అంత చనువు తీసుకుంటాను?’’ అమాయకంగా అంది.
మూర్తిలో కోపం తన్నుకొచ్చింది. ‘‘నెవ్వర్.. పరాయివాళ్ళకి.. అందునా కొలీగ్స్‌కి.. నేనెప్పుడూ అంత చనువు ఇవ్వను’’ అన్నాడు రోషంగా.
‘‘అరె!.. నువ్వే.. నువ్వే.. ఆ అధికారాన్ని నాకు ఇచ్చావంటే నమ్మవేం?’’.. నిబ్బరంగా అన్నది మాలతి. మొహంలో నవ్వు చెక్కుచెదరటంలేదు.
‘‘ఆ మాట పదే పదే మీరు చెప్పటం కాదు.. సాక్ష్యం ఉందా?’’ ఆవేశంగా అరిచాడు మూర్తి.
‘‘చెప్పండి మాలతీ, మీ మాటలకి సాక్ష్యం ఉందా?’’ చీఫ్ కూడా అడిగాడు.
‘‘నిన్న నాతో కలిసి లంచ్ చేసిన ఫ్రెండ్స్ సాక్ష్యం ఉంది సర్’’ వినయంగా అంది మాలతి.
మాలతి మాటలకి కొలీగ్స్ అంతా కూడా ఆశ్చర్యపోయారు..
తెల్లబోయి చూస్తున్నారు బొమ్మల్లా...
కానీ మాలతి అబద్ధం చెప్పదన్న నమ్మకం వుంది వాళ్లకి.
‘‘అబద్ధం..’’ అరిచాడు మూర్తి.
‘‘మీరు పెర్మిషన్ ఇస్తే.. నేను గుర్తుచేస్తాను సర్..’’ అంది మాలతి.
చీఫ్ తల ఊపాడు చిన్నగా.. తనూ ఆశ్చర్యపోతూనే..
‘‘డియర్ కొలీగ్స్! నిన్న లంచ్ టైంలో మన కబుర్లలో ఏవేం టాపిక్స్ మాట్లాడుకున్నాం?’’.. కొలీగ్స్‌కేసి తిరిగి ప్రశ్నించింది మాలతి.
‘బోలెడు మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నామంటే ఏం చెప్పాలి?!’ ఆలోచనలో పడ్డ కొలీగ్స్‌కి క్రమేపీ జ్ఞాపకం వచ్చింది. ‘‘ఆ.. గుర్తుకొచ్చింది. పిల్లల టాపిక్ వచ్చింది. మాలతికి పిల్లలు లేరు. పిల్లలు లేరన్న బాధ వయసుతోపాటు పెరుగుతుందనీ, ఏదైనా అనాధాశ్రమం నుంచీ ఎవరినైనా తెచ్చుకుని పెంచుకుంటే, ఆ లోటు తిరి రిలీఫ్ పొందచ్చని సలహా ఇచ్చాం’’ అంటుండగానే.. ఈ రోజు మాలతి వింత ప్రవర్తనకి కారణం తెలిసిపోయింది ఆ అందరికీ.
‘‘ఆ తర్వాత?’’.. గంభీరంగా అంది మాలతి.
చీఫ్ కేసి తిరిగి చెప్పింది ఆ కొలీగ్- ‘‘దూరంనుంచి మా మాటలు వింటున్న మూర్తిగారు కల్పించుకున్నారు. ‘‘మిడిల్ ఏజ్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఆనాధాశ్రమం నుంచీ ఏ చిన్నపిల్లాడినో, పిల్లనో తెచ్చి పెంచుకుని రోగాలూ, చదువులూ అంటూ వాళ్ళతో ఏం అవస్థలు, తిప్పలు పడతారు? చక్కగా మరో ఆలోచన లేకుండా నన్ను పెంచుకోండి మేడం.. నిక్షేపంగా రెడీమేడ్ మనవలతో సహా చెట్టంత కొడుకూ, కోడలూ వస్తారు. మీ జీవితం హాయిగా గడిచిపోతుంది అన్నారు’’. చెబుతున్న ఆ కొలీగ్ గొంతు రుద్ధమయింది.
‘‘ఏదో నవ్వించాలని మాటవరసకి హాస్యంగా అన్నాను. జోక్‌కే ఇంత రాద్ధాంతమా?’’ దబాయింపుగా అనబోయిన మూర్తి గొంతు పేలవంగా ధ్వనించింది.
‘‘నేనూ అంతే సర్. ఆయన్ని కొడుగ్గా అంగీకరించే ముందు కొన్నాళ్లు తల్లిగా నేను ఆ అధికారాన్ని ఉపయోగించుకుంటే ఇద్దరికీ చక్కగా అలవాటు అవుతుందని అలా పిలిచాను సర్.. అంతే..’’. నెమ్మదిగా, స్పష్టంగా తన ప్రవర్తనకి కారణం చెప్పింది మాలతి. కానీ ఆమె గొంతులో సన్నని బాధ.
అక్కడ కొంతసేపు నిశ్శబ్దం తాండవించింది.
తేరుకుంటున్న అందరి చూపులూ మూర్తిపైనే. అందరి కళ్ళల్లో పలుకుతున్న భావం.. క్రమేపీ మూర్తికి అర్థం అయ్యింది.. వాళ్ళ స్పందన బాణంలా సూటిగా దూసుకుపోయి మూర్తి గుండెల్లో లోతుగా గుచ్చుకుంటోంది. అతని తల నెమ్మదిగా వాలింది.
‘‘హాస్యం ఎప్పుడూ సున్నితంగా మృదువుగా, ఆహ్లాదంగా గిలిగింతలు పెట్టాలి. సెన్సిటివ్ మేటర్స్‌లో ‘హద్దు’ దాటితే.. హాస్యం... వికటించి.. అపహాస్యమై.. అసహ్యాన్ని కలిగిస్తుంది. మనం విసిరిన రాయి మనకే తగిలి మన తలే బొప్పికడుతుంది’’.
వాలిన తలతో వౌనంగా కూర్చున్న మూర్తి నెమ్మదిగా లేచి నిల్చున్నాడు. అందరూ రెప్పవాల్చకుండా అతనికేసే చూస్తున్నారు.
‘‘ఐయాం సారీ మాలతీ మేడం.. నన్ను క్షమించండి..’’ అనేసి, మొహం చెల్లక గబగబా కాబిన్లోంచి బయటకు వెళ్లిపోయాడు.
కర్చ్ఫీతో కళ్ళు అద్దుకుంటున్న మాలతి భుజం మీద చెయ్యి వేసింది ఓ కొలీగ్. *

-శ్రీమతి రాఘవ.టి.
రచయత సెల్ నెం:9849745233

-శ్రీమతి రాఘవ.టి.