కళాంజలి

‘ఆహా..’ అన్పించేది ఆహార్యమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆంగికం భువనం యశ్య వాచికం సర్వ వాఙ్మయం/ ఆహార్యం చంద్ర తారాదితం వందే సాత్త్వికం శివం’
శివుడికి భువనములే అంగములు, అతనికి వాఙ్మయం ఈ శబ్దకోశము. చంద్రుడూ తారలే శివుడికి ఆహార్యం. అట్టి శివునికి నమస్కరిస్తున్నా..
నృత్యానికి, నాటకానికి, జానపద కళలకు ఆహార్యం ఎంతో ముఖ్యమైనది. ముఖానికి చక్కగా రంగులు వేసుకుని, కళ్లు పెద్దవిగా కనిపించేలా చేసుకుని, లేని అందాన్ని కూడా మేకప్‌తో తెచ్చుకోవచ్చు. ప్రదర్శనని బట్టి, దుస్తులు, ఆభరణాలు, మేకప్ ఉంటాయి. శివుడు, విష్ణువు, శ్రీరాముడు వంటి పౌరాణిక పాత్రలకి ఆహార్యం ఒక విధంగా ఉంటుంది. శ్రీకృష్ణ దేవరాయలు, శివాజీ మొదలగు పాత్రలకి ఒక విధంగా ఉంటుంది. సాంఘిక పాత్రలకి ఒకలా. ఈ విధంగా పాత్రకి ఔచిత్యంగా, వయస్సును, నాయకుడు, నాయిక లేదా ఏ పాత్రకి ఎలా మేకప్ చేసుకోవాలో అన్నీ బాగా చూసుకుంటే ప్రదర్శన రక్తి కడుతుంది. పేరు పొందిన ఆదర్శ డ్రెస్ ప్యాలెస్ గురించి, శ్రీనివాస్‌గారి గురించి తెలుసుకుందాం.
ప్రశ్న: ఆదర్శ డ్రెస్ ప్యాలెస్ ఎలా స్థాపించారు?
జ: మా నాన్నగారు తిరుమల శేషాచార్యులు గారు. వికారాబాద్‌లో శ్రీకృష్ణ తులాభారం నాటక ప్రదర్శనకు ఎంతో ఉత్సాహంగా వెళ్లారు. అయితే, ఆ సమయంలో భారీ వర్షం వల్ల గుంటూరు నుండి అవసరమైన వస్త్రాలు, మేకప్ కిట్స్ అందలేదు. దాంతో ప్రదర్శన కేన్సిల్ అయింది. వెంటనే మా నాన్నగారు మద్రాసు వెళ్లి, కొన్ని నాటకాలకు అవసరమైన వస్త్రాలు, సామాగ్రి కొన్నారు. కాచిగూడాలో అప్పటికే స్థాపించిన ‘ఆదర్శ నాట్య కళాపరిషత్’లో - ఆదర్శ డ్రెస్ ప్యాలెస్‌ను పెట్టారు. అప్పటి నుండీ తెలంగాణ మొత్తం నాటకాలకు మా వస్త్రాలు తీసుకునేవారు. ఆదర్శ డ్రెస్ ప్యాలెస్ 1954లో స్థాపించారు. ఈ సంస్థ 64 ఏళ్లుగా ఎంతో కళాసేవ చేసింది. ఆ తరువాత గుంటూరు లేదా తమిళనాడు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మన హైదరాబాద్, మన తెలంగాణలో అందుబాటులో మేకప్ కిట్స్, వస్త్రాలు అన్నీ సరఫరా చేస్తూనే ఉన్నాం.
ప్ర: మీ నాన్నగారు తెలంగాణ పద్య నాటక పితామహుడు అంటారు...
జ: అవును. మా నాన్నగారికి నాటకాలంటే ప్రాణం. ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వం తెలుగువారి కళలు ప్రదర్శన చేయడానికి వీలు లేకుండా ఆంక్షలు పెట్టింది. అయినా వారి కన్నుగప్పి, మా నాన్నగారు నాటకాలు వేస్తూండేవారు. వృత్తిపరంగా వారు లెక్చరర్. నాన్నగారు ఆదర్శ డ్రెస్ ప్యాలెస్ పెట్టిన తర్వాత ఇతర నాటక కళాకారులు, నాట్యానికి అవసరమైన ఆభరణాలు, దుస్తులను నర్తక నర్తకీమణులు ఇక్కడి నుండే తీసుకోవడం మొదలుపెట్టారు.
ప్ర: మీ కుటుంబమంతా దీనికే అంకితమైపోయింది కదా..
జ: నాన్నగారికి కళలు - ముఖ్యంగా నాటకాలంటే ప్రాణం. శ్రీకృష్ణ రాయబారం, శ్రీకృష్ణ తులాభారం నాటకాలకు ఎంతో ప్రసిద్ధి పొందారు. నాన్నగారి తర్వాత మా ఆన్నయ్య పార్థ సారథి ఆదర్శ డ్రెస్ ప్యాలెస్ చూసుకునేవారు. నేను ఎంబిఏ చేసి దుబాయిలో చాలా ఏళ్లు పని చేశాను. నాన్నగారు పోయాక నేను భారతదేశం వచ్చాను. అన్నయ్య కూడా పెద్దవాళ్లయ్యారు. నేనే అప్పటి నుండి మా షాపు బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
ప్ర: దుబాయిలో మీ అనుభవాల గురించి చెప్పండి....
జ: దుబాయిలో నేను సేల్స్ మేనేజర్‌గా చేసేవాడిని. అక్కడ రసమయి తెలుగు అసోసియేషన్‌కు కల్చరల్ సెక్రటరీగా పని చేశాను. నాకు నాటకం, నాట్యం అంటే ఎంతో ఇష్టం.
ప్ర: మీరు ఏమేం సప్లై చేస్తారు?
జ: మా షాపులో జడ నుండీ గజ్జెల దాకా, గదల నుండీ బాణాల దాకా అన్నీ ఇస్తాము. పాత్రోచితంగా దుస్తులు చాలా ముఖ్యం. భారతం, రామాయణంలోని పాత్రలకు కావలసిన ఆహార్యం మా దగ్గర ఉంది. భారతీయ సంప్రదాయ నృత్యాలన్నిటికీ మేం దుస్తులు, నగలు, మేకప్ అన్నీ ఇస్తాం. కొంతమంది ఇక్కడికి వచ్చి మేకప్ చేయించుకుంటారు. లేదా మా వాళ్లే ప్రదర్శనకు వెళ్లి మేకప్, స్టేజీ అలంకరణ, ఆహార్యం అన్నీ సహాయం చేస్తారు. మాకు వెబ్‌సైట్ కూడా ఉంది. అందులో ఆన్‌లైన్ ఆర్డర్ తీసుకోవచ్చు.
ప్ర: విదేశాలకు కూడా పంపిస్తారా?
జ: ఆదర్శ డ్రెస్ ప్యాలెస్ పేరుతో మా వెబ్‌సైట్‌లో కళాకారులు వస్త్రాలు, ఆభరణాలు ఆర్డర్ చేసుకోవచ్చు. అమెరికా, ఆస్ట్రేలియా, స్వీడన్ వంటి దేశాలకు మేం వస్త్రాలు, ఆభరణాలు కొరియర్ ద్వారా పంపిస్తాం.
ప్ర: మీరు ఎలాంటి పాత్రలకి దుస్తులు, ఆభరణాలు సప్లై చేస్తారు?
జ: చారిత్రక నాటకాలు, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, జానపద నృత్యాలు, సంప్రదాయ నృత్యాలు - ఈ విధంగా నాట్యం, నాటకం రెంటిలో సందర్భోచితంగా దుస్తులు, ఆభరణాలు మా వద్ద తీసుకోవచ్చు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, మునులు, దేవతలు, రాజులు, రాణులు మొదలగు పాత్రలకు దుస్తులు, బాణాలు, గదలు, పూలదండలు, కిరీటాలు, నగలు అన్నీ తీసుకుంటారు. వివేకానందుడు మొదలగు ప్రముఖ వ్యక్తుల దుస్తులు తీసుకుంటారు. చెంచు, కోయ, లంబాడీ, జానపద నృత్యాలకి దుస్తులు, ఆభరణాలు తీసుకుంటారు. నాట్య ప్రదర్శనలు, నాటకాలు, స్కూలు వార్షిక దినోత్సవం కోసం మా మేకప్ సదుపాయాలను వినియోగించుకోవచ్చు.
ప్ర: మీరు ఏయే నృత్యాలకి దుస్తులు, ఆభరణాలు ఇస్తారు?
జ: కూచిపూడి, భరతనాట్యం, మోహినీ ఆట్టం, కథక్, కథాకళి, ఒడిస్సీ, మణిపురి, సత్రియా మొదలగు అన్ని సంప్రదాయ నృత్యాలకు దుస్తులు, ఆభరణాలు మా వద్ద దొరుకుతాయి. దేశవ్యాప్తంగా, విదేశాలకు కూడా కొరియర్ ద్వారా పంపిస్తాం. జానపద నృత్యాలకు సరేసరి! భాంగ్రా, బంజారా, లంబాడీ, కోయ, చెంచు, కష్మీరీ, గుజరాతీ దాండియా, నాగా, రాజస్థానీ, అస్సామీ, జాలరి నృత్యం మొదలగు అన్నింటికి మా వద్ద దుస్తులు, ఆభరణాలు దొరుకుతాయి.
ప్ర: గవర్నర్‌గారి మనవరాలికి భరతనాట్యం డ్రెస్ ఇచ్చారట కదా?
జ: అవును. ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌గారి మనవరాలికి మేం భరతనాట్యం డ్రెస్, ఇంకా ఆభరణాలు సప్లై చేశాము. అది ఒక మధురస్మృతి.
--------------------------------------------------------------
*ఆదర్శ ట్రస్ట్ ప్యాలెస్ అధిపతి శ్రీ తిరుమల శ్రీనివాస్‌గారు ఆంధ్రభూమి దినపత్రికకు ఇంటర్వ్యూ అందించిన కొన్ని గంటలకే హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఏప్రిల్ 16న సోమవారం కన్నుమూశారు. వారి ఆత్మకు శాంతి కలుగుగాక. -సంపాదకుడు
-------------------------------