కళాంజలి

అద్భుతం.. అలేఖ్య అభినయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా
పంచ కన్యాః స్మరేన్నిత్యం మహాపాతక నాశినః
అర్థం: అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరీ అనే ఈ పంచ కన్యలను ఎల్లప్పుడూ స్మరించుకుంటే మహా పాపాలు నాశనమవుతాయి.
మండోదరి మహా పతివ్రత. రావణుడి పట్టమహిషి. ఇంద్రజిత్తు, అతికాయుడు, అక్షయ కుమారుడు అనే మహా వీరులకు తల్లి. ఆమె తల్లిగా, గృహిణిగా, తన భర్తకు శృంగారమూర్తిగా, తన ప్రజలకు మహారాణిగా ఎన్నో బాధ్యతలు వహించింది. సీతను శ్రీరామునికి ఇచ్చివేయమని, తన భర్తకు ఎంత చెప్పినా, అది చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు అయింది. మండోదరి మహాసాధ్వి, పతివ్రత. ఆమె సతీత్వం యొక్క మహిమ దేశకాల పరిస్థితులను అధిగమించి, త్రికాలా బాధితమైనది. వేల సంవత్సరాలుగా మండోదరి పాతివ్రత్యం గురించి కథలు చెప్పుకుంటున్నారు. ఆచార్య అలేఖ్య పుంజాల ‘మండోదరి’ నృత్య రూపకం ప్రదర్శించారు.
ఆచార్య డా. అలేఖ్య పుంజాల - ప్రఖ్యాత నర్తకి, గురువు, పరిశోధకురాలు, మార్గదర్శి. వీరు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తొలి మహిళా రిజిస్ట్రార్. ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ‘ఉత్తమ ఉపాధ్యాయ’ పురస్కారం ఇచ్చి గౌరవించింది.
గౌరవాలు..
డా. అలేఖ్య 2002లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది విశిష్ట పురస్కారం, ఆం.ప్ర. ప్రభుత్వం వారిచే 2003లో హంస పురస్కారం, 2009లో ప్రతిభ రాజీవ్ పురస్కారం, 2012లో సంగీత నాటక అకాడెమీ అవార్డు.. ఇలా ఎన్నో గౌరవాలు పొందారు. 2017లో సిద్దేంద్ర యోగి నర్తన పురస్కారం లభించింది.
అలేఖ్య దేశ విదేశాలలో పర్యటించి అనేక ప్రదర్శనలిచ్చారు. యుకె, యుఎస్‌ఎ, సిరియా, అబుదాబి, దుబాయి, మస్కట్, ఖతార్, లెబనాన్, బెహరన్, సిప్రస్, పోలాండ్, టర్కీ, బల్గేరియా, మారిషస్ మొదలగు దేశాల్లో ప్రదర్శనలిచ్చి కళాసేవ చేస్తున్నారు.
అతి ప్రతిష్ఠాత్మకమైన హరిదాస్ సమారోహ్, కాళిదాస్ మహోత్సవ్, సూర్య ఫెస్టివల్, ఖజురహో, నిషాగంధి, నాట్యాంజలి, సిద్దేంద్ర యోగి, పరంగత్, కళాక్షేత్ర, నృత్య సమ్మేళన్, మారిషస్, విశ్వరూప, ఇలా ఎన్నో ప్రముఖ డాన్స్ ఫెస్టివల్స్‌లో నృత్యం చేశారు.
‘మండోదరి’ నృత్య రూపకం చేయటానికి గల కారణం ఏమిటి? మండోదరి ఎందుకు నచ్చింది? అని అడిగినప్పుడు - మండోదరిలోని సహృదయత, సానుభూతి నచ్చిందని అంటారు వీరు. కళాకారుడు కళ వేరు కాదు. కళ అంతఃప్రాణం, కళాకారుడు బహిఃప్రాణం. ప్రతి కళాకారుడు తన అస్తిత్వాన్ని తన కళాసృష్టిలో పొందుపరుస్తాడు. దేనితో ఏకమై లీనమై తాదాత్మ్యం చెందుతాడో అదే ఒక కళాకారుడు మళ్లీ మళ్లీ సృష్టిస్తాడు. అలేఖ్య సహృదయత, సానుభూతిగల మనిషి. అందుకే ఆవిడ చేసే నృత్య రూపకాలు ధైర్యం, స్థైర్యం, శక్తి, సహృదయత కలిగిన స్ర్తిలపై ఆధారపడినవి. ఇదివరకు అలిమేలుమంగ, గౌరి, పార్వతి, లకుమ, మందాకిని, దుర్గ, శశిరేఖ, ఆండాళ్, ద్రౌపది, రాధ, రుద్రమదేవి.. ఇలా ఎన్నో శక్తి పుత్రికలు, స్ర్తిలకు ఆదర్శం, ఉత్తేజాన్ని కలిగించే నాయికలకు ప్రాణం పోసి మన కళ్ల ముందు నిలిపారు. ఇప్పుడు మండోదరి నృత్య రూపకల్పన చేసి, దర్శకత్వం చేసి, మండోదరిగా తన బృందంతో ప్రదర్శించారు.
ఆ సందర్భంగా అలేఖ్యతో ముఖాముఖి-
ప్ర: మండోదరి పాత్ర ఎందుకు చేయాలనిపించింది?
జ: నాకు ముందు నుండీ ఇతిహాసాలు, పురాణ పాత్రలు అంటే తృష్ణ. ఇందులో కొన్ని పాత్రలు చెరగని ముద్ర వేశాయి, సమాజంపైనా, నా మీద కూడా. ఈ పాత్రల విలువలు తెలుసుకొని, వాటి శక్తిని గ్రహించి, వాటిని ప్రేక్షకులకు అందజేయాలని నా కోరిక. మండోదరి ఒక శక్తిగుండం లాంటిది. తన భర్త వేరొక స్ర్తిని అపహరించాడు. ఆ సీతపై ఆమెకు జాలి, సానుభూతి. అదే భర్తపై ప్రేమ, అనురాగం. తల్లిగా, ప్రేయసిగా, మహారాణిగా, ఎన్నో బాధ్యతలు వహించింది. మండోదరి పాత్ర చేయాలని ఎప్పటి నుండో అనుకున్నాను. ఇప్పటిదాకా మండోదరి గురించి నృత్య రూపకాలు ఎవరూ చేయలేదు. నేను మొట్టమొదటిగా నృత్య రూపకం చేస్తున్నాను. ఇది ఎంతో సంతోషాన్నిస్తోంది. నేను మండోదరిగా, రావణాసురుడిగా డా.చింతా రవిబాలకృష్ణ.. ఇంకా ఎంతోమంది తొమ్మిది నెలలుగా టీం వర్క్‌తో ఇది నేడు సఫలమైంది.
ప్ర: మీరు స్ర్తి ప్రధాన నృత్య రూపకాలు ముందు కూడా చేశారు కదా.
జ: కార్యేషు దాసీ కరణేషు మంత్రీ
భోజ్యేషు మాతా శయనేషు రంభా
రూపేషు లక్ష్మీ క్షమయాధరిత్రీ
షట్ ధర్మయుక్తా కులధర్మపత్నీ
అంటారు. ఒక ఉత్తమ స్ర్తి అయిన ధర్మపత్ని - ఇల్లాలు ఎన్నో రకాలుగా ఇంటిని, భర్తను, పిల్లలను కాపాడుకుంటుంది. ఆదర్శమయిన స్ర్తిలపై ఎన్నో నృత్య రూపకాలు చేశాను. ఇప్పుడు మండోదరి. గతంలో ద్రౌపది, నాయకి, రుద్రమ చేశాను.
ప్ర: ఐతిహాసిక నృత్య రూపకాలు చేయటంలో సాధక బాధకాలు, కష్టసుఖాలు ఏమిటి?
జ: పెద్దగా కష్టాలు లేవు. కొన్ని వేల సంవత్సరాల కింది రామాయణ పాత్రను ప్రేక్షకుల ముందు జీవం పోశాను. అద ప్రేక్షకులకు దగ్గరవడం కత్తిమీద సాము. ఏ నృత్య రూపకానికయినా కథకే ప్రాధాన్యత.
ప్ర: కథా నేపథ్యం సింహళ దేశం కదా! ఎలా దాన్ని గ్రహించారు? ఎలా చిత్రీకరించారు?
జ: ఆహార్యంలో తేడా చూపించాము. కేరళకు దగ్గరగా భౌగోళికంగా సింహళ దేశం ఉంది. అందుకే ఆహార్యం కేరళ వేషము, దుస్తులు, కొంచెం దగ్గరగా ఉండేటట్లు చేశాము. వేల సంవత్సరాల క్రితం ఇతివృత్తం ఇప్పుడు చేస్తున్నాము. చేసేవారు, చూసేవారు నచ్చాలి, మెచ్చాలి. అప్పుడే ఈ ప్రయత్నం ఫలిస్తుంది.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి