కళాంజలి

అభంగ మృదంగ తరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేముగంటి శ్రీ్ధరాచార్య ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు. ఘటం, కంజీర, మోర్సింగ్, కోలు, చండి, తబలా మొదలగు ఎన్నో వాయిద్యాలతోపాటు మృదంగం కూడా వాయిస్తారు. 12వేలకు పైగా దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చారు. ప్రఖ్యాత డాన్స్ ఫెస్టివల్స్‌లో ఎంతో మంది ప్రఖ్యాత నర్తకుల ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఫుల్‌టైమ్ సంగీత విద్వాంసునిగా అవక ముందు హైదరాబాద్ పాతబస్తీలో గుడిలో అర్చకునిగా ఉండేవారు. కళ కూడా పూజే! దేవునికి నైవేద్యంతోపాటు కళని సమర్పిస్తాం కదా అంటారు. వీరితో ముఖాముఖి..
ప్ర: మీరు ఎన్ని డాన్స్ ఫెస్టివల్స్‌లో మృదంగం వాయించారు?
జ: ఖజురహో ఫెస్టివల్‌లో 20 సార్లు, కోణార్క్‌లో 20 సార్లు, పూణెలో నాలుగు సార్లు, సవాయి గంధర్వలో 3సార్లు, నిషాగంధిలో 15సార్లు, ముద్రలో 10సార్లు, కేరళలో అన్ని ఫెస్టివల్స్‌లోనూ మృదంగం వాయించాను. సూర్యలో 25సార్లు. ముఖ్యంగా కూచిపూడి ప్రదర్శనలకే ప్రాధాన్యత నిస్తాను. భరతనాట్యం ప్రదర్శనలకు తక్కువ.
ప్ర: మీరు ఏయే దేశాల్లో ప్రదర్శనలిచ్చారు?
జ: భగవంతుడి దయ! 1999లో ఐసిసిఆర్ ద్వారా బంగ్లాదేశ్ వెళ్లా. 2007లో జపాన్, 2008లో జపాన్, కొరియా, 2009లో మెక్సికో, అరూచా, సౌత్ ఆఫ్రికా, వెనిజులా, 2010లో ఇటలీ, గ్రీస్, మారిషస్, 2011లో కెనడా, 2013లో మారిషస్, 2015లో కోస్టారికా, పెరూ, 2017లో టర్క్‌మెనిస్తాన్ వంటి దేశాల్లో ప్రదర్శనలిచ్చాను.
ప్ర: మీ ప్రస్థానం ఎలా సాగింది?
జ: మా తల్లిదండ్రులు వేముగంటి కమల, వేంకటాచార్య. నేను 7.12.1978న హైదరాబాద్‌లో జన్మించాను. పాతబస్తీ గౌలిపురాలో పెరిగాను. ప్రస్తుతం సైదాబాద్‌లో ఉంటున్నాం. నాకు ఆలిండియా రేడియోలో ‘బి’ గ్రేడ్ ఉంది. మృదంగంలో డిప్లొమా పాసయ్యాను. 1986లో ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు కె.సుదర్శనాచార్య గారి వద్ద నేర్చుకోవడం మొదలు పెట్టి, గురుకుల పద్ధతిలో నేర్చుకున్నాను. తరువాత వారి కుమారుడు రాజగోపాలాచార్య గారి వద్ద కూడా. మా అన్నయ్య శ్రీనివాసాచార్య కూడా వయొలిన్ నేర్చుకున్నారు. నేను ముఖ్యంగా నృత్య ప్రదర్శనలు అందులో కూచిపూడివే ఎక్కువగా ప్రదర్శిస్తూంటాను. దాదాపు 12 వేల ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇచ్చాను. సంగీత కచేరీలలో కూడా అప్పుడప్పుడూ మృదంగం వాయిస్తూంటాను.
ప్ర: కళాకారుడిగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?
జ: మొదట్లో చాలా కష్టపడ్డాను. ఒక అవకాశం రావడం కోసం ఎన్నాళ్లో ఎదురుచూడాల్సి వస్తుంది. పేరు రావడానికి సమయం పడుతుంది. ఆ రోజుల్లో నేను, నా మిత్రుడు రేణుకా ప్రసాద్ సైకిల్ మీద వెళ్లేవాళ్లం. మేమిద్దరం ఒకే గురువు వద్ద నేర్చుకున్నాం. చిన్ననాటి స్నేహితులం. 50 రూపాయలకు, 100 రూపాయలకు ప్రదర్శనలిచ్చిన రోజులున్నాయి. ఒక ప్రదర్శనకి, పదిరోజులు రిహార్సల్స్ చేసాను. ఆఖరికి ప్రదర్శనలో నన్ను తీసివేసి వేరేవారిని పెట్టుకున్నారు. రవీంద్రభారతిలో ఎప్పుడైనా ప్రదర్శన ఇస్తానా అనిపించేది. ఇప్పుడు రవీంద్రభారతిలో వేల ప్రదర్శనలిచ్చాను. ఇప్పుడు సీడీల మీద చాలామంది చేస్తున్నారు. అయినా నాకు సమస్య లేదు. మొదట్లో కష్టపడ్డాను. ఇప్పుడు కళాకారుడిగా పేరు వచ్చింది. అంతా మా గురువుగారి దయ. కళ ఎంత ముఖ్యమో వ్యక్తిత్వం అంతే ముఖ్యం. ఏ వివాదం లేకుండా నవ్వుతూ కలుపుగోలుగా ఉంటాను. అది చాలా ముఖ్యం.
ప్ర: ఏయే కళాకారులతో ప్రదర్శనలిచ్చారు?
జ: ఇవాళ ఒక కళాకారుడిగా నేను నిలబడ్డానంటే ఎంతోమంది ప్రోత్సాహం వల్లనే. డా.ఉమా రామారావుగారు, పద్మభూషణ్ స్వప్నసుందరి, ఆచార్య డా.అలేఖ్య పుంజాల, పద్మశ్రీ ఆనంద శంకర్, పద్మశ్రీ శోభానాయుడు, పద్మశ్రీ జయరామారావు, దీపికారెడ్డిగారు.. హైదరాబాద్‌లో దాదాపు అందరు కళాకారులతో ప్రదర్శనలిచ్చాను.
ప్రశ్న: మీరు బాగా గుర్తు పెట్టుకున్న ప్రదర్శన?
జ: అన్ని ప్రదర్శనలు మనస్సుకు హత్తుకుపోయినవే. మద్రాస్‌లో నారద గానసభలో పద్మభూషణ్ స్వప్నసుందరి గారితో కలిసి ఇచ్చిన ప్రదర్శన. అప్పుడు ప్రేక్షకులలో భక్తవత్సలం, కుణ్ణక్కుడి వైద్యనాథన్ ఉండి, నన్ను ఎంతో అభినందించారు. 2008లో సౌత్ ఆఫ్రికాలో స్వాతి సోమనాథ్ గారితో ప్రదర్శన. అప్పుడు అక్కడ మన్మోహన్‌సింగ్ గారు ఉన్నారు. వారి సమక్షంలో నేను ప్రదర్శన ఇవ్వడం తీయటి అనుభూతి.
ప్ర: ప్రాక్టీస్ ఎలా చేసేవారు?
జ: చిన్నప్పుడు రోజూ మూడు గంటలపాటు ప్రాక్టీస్ చేసేవాడిని. పొద్దున్న 6-7 గురువుగారి వద్ద నేర్చుకునేవాడిని. షంషేర్‌గంజ్, పాతబస్తీలో శివుడి ఆలయంలో, హనుమంతుడి గుడి, వేంకటేశ్వర స్వామి గుడి, నవగ్రహాలు ఉన్నాయి. నేను హనుమంతుని ఆలయంలో అర్చకుడిగా ఉండేవాడిని. 9-12 పూజలు అయిపోయాక, అభ్యాసం చేస్తూండేవాడిని.
ప్ర: గౌరవ పురస్కారాలు?
జ: యాదగిరిగుట్ట యాదాద్రి ఆస్థాన విద్వాంసుడిని 1993 నుండి. ఉత్తమ ఉపపక్క వాద్య బిరుదు వచ్చింది.
ప్ర: మీరు ఇచ్చే సందేశం?
జ: కష్టపడి కళ నేర్చుకోవాలి. అభ్యాసం చేయాలి. కళ వల్ల మానసిక ఉన్నతి, శాంతి, ప్రేమ పెరుగుతాయి. కళాసేవ చేయడం భగవంతుడికి పూజ చేయటమే.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి