కళాంజలి

అక్షరం అజరామరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్లాది గోపాలకృష్ణ ఐదుసార్లు నంది అవార్డు గ్రహీత. వీరు ప్రఖ్యాత నటుడు, దర్శకుడు, సాంకేతిక నిపుణుడు, మేకప్ ఆర్టిస్టు. 1992 నుండి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా, నాటక రంగంలో అధ్యాపకుడిగా పని చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరు కళలలో ఎంతో సాధించిన నిండు కుండ. బంగారు కొండ. ఎన్నో అవార్డులు పొందారు. ఎన్నో సన్మానాలు పొందారు. అయినా వీరి మాట సున్నితం. మనసు నవనీతం. వీరితో ముఖాముఖి ఇలా జరిగింది.
ప్రశ్న: మీ బాల్యం గురించి..
జ: నేను విజయవాడ గాంధీనగర్‌లో మల్లాది సుబ్బారావు, జయలక్ష్మి దంపతులకు జన్మించాను. అక్కడే ఎస్‌కెపివివి హైస్కూల్‌లో చదువుకున్నాను. నాన్నగారు గుంటూరు బదిలీ అయ్యాక, నేను అక్కడి మాజేటి గురవయ్య హైస్కూల్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సి పాసయ్యాను. మళ్లీ విజయవాడకు రావడం, మా ఇంటి పక్కనే రేడియో అన్నయ్య ఏడిద కామేశ్వరరావు ఉండేవారు. వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. పిల్లల చేత నాటకాలు రిహార్సల్స్ చేయిస్తూ వారిని ప్రోత్సహించారు. నాకు రేడియో నాటికలో వేషం ఇచ్చారు. ఇక అప్పటి నుండీ నా కళా ప్రయాణం కొనసాగింది.
ప్ర: మీకు జీవితంలో బాగా గుర్తుండిపోయన జ్ఞాపకాలు..?
జ: ప్రతి అనుభూతి మనసుకు హత్తుకుపోయిందే. ప్రతి అనుభవం మధురస్మృతే! అప్పటి భారత ప్రధాని నెహ్రూగారు విజయవాడ రేడియో స్టేషన్‌కి వచ్చారు. నేను అన్నయ్యగారితో నెహ్రూగారిని కలిశాను. నెహ్రూ గారు నా చెయ్యి పట్టుకుని మెట్లు ఎక్కడం, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభూతి. అలాగే రేడియో నాటకంలో నేను వత్సరాజుగా నటించాను. నా వెనుక నేను వీణ వాయిస్తున్న సన్నివేశంలో, వీణా వాద్యానికి ప్రఖ్యాతి పొందిన కంభంపాటి అక్కాజీరావుగారు వీణ వాయించడం నా మనసుపై చెరగని ముద్ర వేసింది. ప్రఖ్యాత హరికథ కళాకారులు ములుకుట్ల సదాశివ శాస్ర్తీగారితో కలిసి ఒక సంస్కృత నాటకంలో నటించాను. ఆ రోజుల్లో నాకు ఐదు రూపాయల పారితోషికం ఇచ్చారు.
ప్ర: మీరు ఎంతోమంది ప్రఖ్యాత నటులతో పాటు నటించారు కదా?
జ: నటన పట్ల ఎప్పుడూ ఒక తపన, కోరిక ఉంది. జంధ్యాల, నేనూ క్లాస్‌మేట్స్‌మి. పారుపల్లి రంగనాథ్, ఎం.వి.రఘ, విన్నకోట విజయరాం, విన్నకోట రామన్న పంతులు, రామచంద్ర కాశ్యప, సి.రామ్మోహనరావు, కూచిమంచి కుటుంబరావు, నండూరి సుబ్బారావు, కోకా సంజీవరావు, పేరి కామేశ్వరరావు, వీరభద్రరావు, మస్తాన్‌రావు, కె.ఆర్.నాయుడు, లింగరాయశర్మ, ఎం.వి.రమణ, వాసుదేవమూర్తి, ఎం.మురళీమోహన్, ఎం.వి.దాస్, శివరామిరెడ్డి, తెనాలి ఉమ (అన్నపూర్ణ), బృంద మదన్‌మోహన్, కృష్ణారావు, రాఘవ, అడివి శంకర్రావు, గరికపాటి ఉదయభాను, కబీర్‌దాసు, నారాయణ, ప్రసాద్‌బాబు, గుండు హన్మంతరావు, సీతారాం, సంజీవి, ఐ.ఆర్.రాములు, ఫణిరాం, ప్రభాకర్, పిళ్లా ప్రసాద్, పూల ప్రసాద్.. ఇలా ఎంతోమంది నా సహనటులు. మహానటుడు సరస్వతి రామారావుగారితో నేను నటించడం ఒక మధురస్మృతి.
ప్ర: మద్రాస్ సినీ రంగంతో మీకున్న అనుబంధం గురించి..
జ: 1978లో జంధ్యాల నన్ను మద్రాస్ తీసుకెళ్లాడు. అప్పటికే నా మిత్రుడు ఎం.వి.రఘు విజయా, వాహినీ స్టూడియోలలో పని చేస్తున్నాడు. ఆ రోజుల్లో రవీంద్ర ఆర్ట్స్ (తమ్మారెడ్డిగారు) ప్రొడక్షన్ మేనేజర్లలో ఒకడిగా నేను పని చేశాను. ఒక సమయంలో ఎన్టీఆర్‌గారు నటిస్తున్న సినిమాలకి పని చేశాను. అది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఆ తరువాత 1981లో విజయవాడ వచ్చేశాను.
ప్ర: ఆంధ్రప్రదేశ్ నాటక విద్యా సంస్థలో మీ ప్రవేశం ఎలా జరిగింది?
జ: నా స్నేహితుడు మదన్‌మోహన్ పేపరులో ఒక ప్రకటన చూపించాడు. ఆంధ్రప్రదేశ్ నాటక విద్యా సంస్థ ఇంకా నట మండలి వారు ఎ.ఆర్.కృష్ణగారి నేతృత్వంలో, అభినయం అంటే ఇష్టం ఉన్నవారు అప్లై చేయమని ప్రకటన అది. నేను సెలెక్ట్ అయ్యాను ఇంటర్వ్యూలో. నెలకి రూ.300 ఇస్తున్నట్లు లెటర్ కూడా వచ్చింది. కానీ నా దగ్గర డబ్బు లేదు. నా మిత్రులందరూ కలిసి రూ.116 కలెక్ట్ చేసి నాకు ఇచ్చారు. 4.1.82న క్లాసులు మొదలయ్యాయి. మొదటి నెల రోడ్ల మీద పడుకుని, పంపునీళ్లు తాగి కష్టపడి చదువుకున్నాను. నా ఉపాధ్యాయులంతా ఎంతో గొప్పవారు. ఎ.ఆర్.కృష్ణ, దేవదాస్ కనకాల, లక్ష్మీ దేవదాస్, టి.ఆర్.అడబాల, మద్దెల పంచనాథం, ఎం.ఎన్.శర్మ, చాట్ల, పి.ఎస్.ఆర్. అప్పారావు, బి.కృష్ణమూర్తి, వరంగల్ సుబ్రహ్మణ్యం గారలు మాకు పాఠాలు చెప్పారు. అంత గొప్పవారి వద్ద నేను నేర్చుకోవడం ఒక అదృష్టం.
ప్ర: మేకప్ ఎప్పుడు, ఎలా నేర్చుకోవడం మొదలుపెట్టారు?
జ: ఎ.ఆర్.కృష్ణగారు మేకప్ నేర్చుకోమని ఆదేశించారు. గురువుగారు అడబాల గారు కూడా చెప్పారు. దాంతో మేకప్ నేర్చుకొన్నాను. ఆ తరువాత అడబాలగారు రైల్వేకి తిరిగి వెళ్లిపోయిన పరిస్థితుల్లో ఆయన సూచనతో, ఎఆర్‌కె గారు నన్ను సబ్‌స్టిట్యూట్‌గా పెట్టుకున్నారు. ఎక్కడ చదువుకున్నానో, అక్కడే ఉద్యోగం దొరికిందంటే దేవుడి ఆశీస్సులు, గురువుల ఆశీర్వాదం వల్లనే.
ప్ర: మీరు పొందిన అవార్డులు..
జ: మేకప్‌కి గాను నంది అవార్డు 5సార్లు వచ్చింది. బెస్ట్ మేకప్ ఆర్టిస్టుగా ఎన్నోసార్లు అవార్డులు అందుకున్నాను. బిహెచ్‌ఇఎల్ సౌత్ సెంట్రల్ రైల్వే పోటీలు, లలిత కళాసమితి, ఎ.వి.కె. ఫౌండేషన్, ద్రాక్షారామం పోటీలు, నరసరావుపేట రంగస్థలి, అభినయ పొనుగుపాడు, కోన ప్రభాకరరావు నాటక పరిషత్ బాపట్ల మొదలగు ఎన్నో సంస్థలు, పోటీలలో నాకు ఉత్తమ మేకప్ ఆర్టిస్టుగా అవార్డులు వచ్చాయి. దూరదర్శన్ ఇంకా ఆకాశవాణిలో నేను ‘బి’ గ్రేడ్ ఆర్టిస్టుని. నిజం చెప్పాలంటే ప్రేక్షకుల ఆదరణే నాకు గొప్ప అవార్డు. ఎంతోమంది గొప్ప కళాకారులతో కలిసి నటించడం, ఎంతోమందికి మేకప్ వేయడం నిజమైన రివార్డు. ఒక కళాకారుడికి ఇంతకంటె ఇంకేం కావాలి? 2003లో యుఎస్‌ఏకి శ్రీనాథుడు వేయడానికి వెళ్లాము. అది గొప్ప అనుభవం. అమెరికన్లు పంక్చుయాలిటీకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. టైం వేస్ట్ చేయరు. చెప్పిన సమయానికి గడియ ముందుగానే వస్తారు. నాకు చాలా నచ్చిన విషయం అది.
ప్ర: మీరు నిర్వహించిన వర్క్ షాపుల గురించి చెప్తారా?
జ: 1985 - బాల నాట్య ప్రశిక్షణ శిబిరం - జవహర్ బాలభవన్ - 30 రోజులు. 1985 - ఏప్రిల్ 27 - మే 3 - లిటిల్ థియేటర్. 1990 - అక్టోబర్ - నవంబర్ - యువ కళావాహిని. 1999 - 18 - 20 మే. బిపిఎల్ ఎంప్లారుూస్ కమిటీ. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారి ఆధ్వర్యంలో ఎన్నో చేశాను. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎన్నో వర్క్‌షాపులు నిర్వహించాను. అక్కినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ యాక్టింగ్ వారి ఆధ్వర్యంలో, పాండిచ్చేరి విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో, నాటక రంగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెమినార్లు నిర్వహించాను. పత్ర సమర్పణ చేశాను. నంది టీవీ అవార్డుల కమిటీలో జ్యూరీ మెంబర్‌గా ఉన్నాను. ఆకాశవాణి, యువవాణి నన్ను జడ్జిగా పిలిచారు.
ప్ర: ఎన్ని పత్రికలకు వ్యాసాలు అందించారు...?
జ: ‘తెలుగు నాటకులం’ రంగస్థల కళ మాసపత్రిక వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మేకప్ మీద ఎన్నో వ్యాసాలు ప్రచురించారు. స్థానం నరసింహారావుగారి మీద, గురజాడ అప్పారావుగారి మీద వ్యాసాలు అందించాను. తెలుగు భారతిలో వ్యాసాలు వచ్చాయి. అక్షరం పదిలం. పది కాలాలపాటు ఉండిపోతుంది.
ప్ర: జమునగారితో నటించిన అనుభవాన్ని గురించి చెప్తారా?
జ: ఆమె గొప్ప కళాకారిణి. ‘శ్రీకృష్ణ తులాభారం’లో జమునగారు సత్యభామగా, సుందర రామకృష్ణగారు శ్రీకృష్ణుడు, నేను వసంతకుడిగా దేశం మొత్తం ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాము. అన్నీ గొప్ప అనుభవాలు. ఎన్నో మధురస్మృతులు!

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి